Sunday, November 18, 2018

ప్రేమ ఉన్నచోటే భగవంతుడు


ప్రేమ ఉన్నచోటే భగవంతుడు



సాహితీమిత్రులారా!

ఈ అనువాద కథను ఆస్వాదించండి............

శ్మశానంలో కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్నాడు మార్టిన్. ఎదురుగా ఇన్నాళ్ళూ తనతో సావాసం చేసిన అర్ధాంగి మృతదేహాన్ని పూడ్చిపెడుతున్నారు. ఇది ఎన్నోసారి శ్మశానానికి రావడం? ఇంతకు ముందు పురిటిలో పోయిన పిల్లలు, కాస్త ఎదిగిన పిల్లలు పోతే వాళ్లనీ సమాధి చేయడానికి మార్టిన్ భార్యని ఓదారుస్తూ తీసుకొచ్చేవాడు. మరి ఇప్పుడో? తనకి పిల్లలని కనిచ్చిన ఆ భార్యే పోయింది. మిగిలినది ఈ మూడేళ్ల అభం శుభం తెలియని కుర్రాడు. రేప్పొద్దున్న వీడు ఆకలేసి అమ్మా అని ఏడిస్తే తాను ఊరుకోబెట్టగలడా?

కూడా వచ్చినవాళ్ళలో ఎవరో మార్టిన్ భుజం మీద చెయ్యేసి ఇంక వెళ్దాం అన్నట్టూ ముందుకి తోసేడు మెల్లిగా. ఒక్కసారి కల చెదిరిపోయినట్టు కుర్రాడి చేయి పట్టుకుని గోరీలు దాటుకుంటూ బయటకొచ్చేడు. ఆశ చావక మళ్ళీ ఓ సారి వెనక్కి చూసేడు. ఖాళీ అయిన శ్మశానంలో గోరీలు వెక్కిరిస్తూ కనిపించాయ్. పోయినవాళ్ళు తిరిగివచ్చిన దాఖలాలు లేవు కదా జీవితంలో? బరువెక్కిన హృదయంతో బయటకి నడిచేడు.

భార్య పోయిన తర్వాత చాలా రోజులు ఆలోచించేడు మార్టిన్, కుర్రాణ్ణి తన దగ్గిరే ఉంచుకోవడమా లేకపోతే ఎవరో ఆడదిక్కు ఉన్న బంధువుల ఇంటికి పంపడమా అనేది. మూడేళ్ల కుర్రాడు తట్టుకోగలడా? వీడెలాగోలా తట్టుకున్నా బంధువులు సరిగ్గా చూడకపోతే? గుండె రాయి చేసుకుని తానే సాకడం మొదలుపెట్టేడు. మొదట్లో అంతా ఖంగాళీ అయిన జీవితం దార్లో పడడం ప్రారంభించగానే యజమాని దగ్గిరకెళ్ళి చెప్పేడు, ఈ చిన్నపిల్లాడితో పనిలోకి రావడం కష్టంగా ఉందనీ, వేరు దారిలేక ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఓ దుకాణం ప్రారంభించాలని ఉందనీను. మార్టిన్ పడే అవస్థలన్నీ చూసినాయనే కనక యజమాని వెంఠనే ఒప్పుకున్నాడు.

అదిగో అలాగే ఉద్యోగం మానేశాక, ఇంట్లో చెప్పులు మరమ్మత్తు చేసే దుకాణం ప్రారంభించేడు మార్టిన్. తనకి కావాల్సింది డబ్బు కాదు ఇప్పుడు, కుర్రాణ్ణి కాస్త పెద్దయ్యేదాకా, వాడి కాళ్ళమీడ వాడు నిలబడే దాకా పెంచగలిగితే అదే చాలు. తర్వాత ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. రోజులు గడుస్తూంటే చేతికందిరాబోయే కుర్రాణ్ణి తల్చుకుంటూ దుకాణంలో అన్యమనస్కంగా పని చేస్తున్నాడు మార్టిన్. ఒక్క నాలుగేళ్ళలో – ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ అడిగితే తనకో కావాల్సిన పనిముట్టు అందించే కుర్రాడు – స్వంతంగా పని నేర్చుకోవడం కుదరొచ్చు. ఈ నాలుగేళ్ళనగా ఎంత? చటుక్కున గడిచిపోవూ?

మార్టిన్ ఆశలమీద చన్నీళ్ళు జల్లుతూ ఓ రోజు కుర్రాడు జబ్బు పడ్డాడు. మంటల్లో పెట్టినట్టూ పెద్ద ఎత్తున జ్వరం. వారం రోజులు కళ్ళలో వత్తులేసుకుని మార్టిన్ దగ్గిరుండి సేవ చేసేడు కానీ వాడికి నూకలు చెల్లిపోయేయి. వాడి శవాన్ని తీసుకుని మళ్ళీ శ్మశానికొచ్చేడు మార్టిన్. వెళ్ళే దారిలో, ఇంటికొచ్చే దారిలో ఏ విధంగా తాను చావచ్చో అన్నీ ఆలోచించున్నాడు. ఎందుకింక బతకడం? తనకి పుట్టిన పిల్లలెవరూ బతకలేదు. ఓ సారి పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనీ ఇంత చిత్రవధ అనుభవించాక తనకి మళ్ళీ పెళ్ళికి కోరికా ఓపికా లేవు. జీవితంలో తనకి తెల్సిన ఎవరికీ ఇలా జరిగినట్టు లేదు. తనకి చావే శరణ్యం.

ఇంటికొచ్చిన మార్టిన్ అన్నింటినీ వదిలేసి వైరాగ్యంలో పడ్డాడు. అంతకుముందు ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేవడానికీ, తిండి తినడానికీ కూడా వెగటే. దేవుడి గురించి విన్నదీ కన్నదీ అంతా కట్టుకధే అనే అనుమానం మొదలైంది. దేవుడనే వాడుంటే ఇలా చేస్తాడా? వయసైపోతున్న తనని వదిలేసి చిన్నకుర్రాణ్ణి తీసుకెళ్ళిపోయేడు. చర్చ్‌లో ప్రతీవారం పాస్టర్ భగవంతుడికి అపారమైన కరుణ ఉందని అంటాడే! మరి కళ్లముందటే ఇలాంటివి జరుగుతూంటే ఎలా నమ్మడం?

ఓ రోజు మార్టిన్ ఇలాగే తనలో తాను గొణుక్కుంటూంటే తలుపు చప్పుడైంది. తన దగ్గిరకొచ్చే బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరూ లేరే? వచ్చింది ఎవరా అని ఆశ్చర్యపోతూ తలుపుతీసేడు మార్టిన్. ఎదురుగా తన స్వంత ఊరివాడు, ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం కల్సిన సాధువు; ఎక్కడికో వెళ్తూ రాత్రి ఇంట్లో ఉండనిస్తాడేమో అని కనుక్కోడానికొచ్చేడు. అందరూ పోయాక ఇల్లు ఎలాగా బావురుమంటోంది కనక మార్టిన్ ఆయన్ని లోపలకి ఆహ్వానించేడు. సాటిమనిషిని కలిసి ఎన్నాళ్లయిందో కదా అనుకుంటూ.

ఆ రోజు రాత్రి మనసులో ఆక్రోశాన్ని వెళ్ళగక్కేడు మార్టిన్.

“నాకు బతకాలని లేదు. ఎన్ని రోజుల్నుంచి చావాలనుకుంటున్నానో దేవుడికెరుక. నేను బ్రతికి ప్రయోజనం ఏమిటో, నా చిన్న పిల్లలూ భార్యా పోవడం, ఈ వయసులో వాళ్ళు పోయి నేను బతికుండడం అర్ధం పర్ధంలేని తలా తోకా లేని చిక్కుప్రశ్నలా ఉంది జీవితం. భగవంతుడనే వాడుంటే జీవితం ఇంత దరిద్రంగా ఉంటుందా? మీకు తెలిస్తే నా జీవితం ఎలా అంతం చేసుకోవాలో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి…”

“నీకలా అనడానికి అధికారం లేదు మార్టిన్. భగంతుడనే వాడొకడున్నాడని నువ్వు ఒప్పుకున్నట్టైతే ఆయనిష్టం వచ్చినట్టు నువ్వు అంగీకరించాలి తప్ప ఇలా చావొస్తే బాగుణ్ణనుకోవడం శరణాగతి కింద రాదు…” మార్టిన్ మాటలకి అడ్డొస్తూ చెప్పేడు సాధువు.

సాధువింకేదో చెప్పబోతూంటే మార్టిన్ అన్నాడు, “జీవితం ఇలా అయ్యేక ఇంకా ఏం చూసుకుని బతకమంటారు?”

“అలా కాదే. మనిష్టం వచ్చినట్టూ ప్రపంచం ఎప్పుడూ ఉండదు. భగవంతుడి ఇష్టం. ఆయనెలా ఉంచాలనుకుంటాడో అలాగే జరుగుతుంది కాదూ? నీ పిల్లలూ భార్యా పోయి నువ్వు బతికి ఉండాలని ఆయననుకున్నాడు. ఆ ప్రకారమే జరుగుతుంది కానీ నీ ఇష్టం ఎక్కడ ఇందులో? భగవల్లీలని అర్ధం చేసుకోవడం మహామహులకే సాధ్యం కానిది మనకెలా అర్ధం అవుతుంది?”

“నేనెందుకు బతికి ఉండాలి మరి?”

“దేవుడి కోసం మార్టిన్. నీకు ఆయన జీవితాన్నిచ్చేడు. ఎందుకిచ్చాడు ఎందుకిలా అవుతోందని అడగడం మానేసి దేవుడి కోసం జీవించడం నేర్చున్నప్పుడు నీకు తెలిసొస్తుంది. అప్పుడు అసలు కోపాలూ, ఆక్రోశాలూ, ఏడుపులూ ఏమీ ఉండవు. అంతా సాఫీగా జరిగిపోతూన్నట్టూ మనకి అర్ధమౌతుంది.”

మార్టిన్ చాలాసేపటిదాకా మాట్లడలేకపోయేడు. కాసేపటికి మెల్లిగా నోరు తెరిచి అడిగేడు.

“దేవుడికోసం బ్రతకడం అనేది వినడం ఇదే మొదటిసారి. నేను దేవుడికోసం బతకాలంటే ఏం చేయాలి? అసలు దేవుడికోసం బ్రతకడం ఎలా?”

“దేవుడి కోసం బతకడం ఎలా అనేది సువార్తలో చెప్పేరు కదా? అదే యొహోవా జీవితంలో చేసి మనకి చూపించాడు. నువ్వు చదవగలవా? అలా అయితే సువార్త చదవడం మొదలుపెట్టు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. యొహోవా చెప్పినదే అందులో ఉంది.”

ఏదో ఆశ్చర్యకరమైన విషయం విన్నట్టూ ఈ మాటలు మార్టిన్ హృదయంలో హత్తుకుపోయేయి. ఏట్లో కొట్టుకుపోతూ మునిగిపోతున్నవాడికి తేలడానికో ఆధారం దొరికినట్టైంది.

మర్నాడు సాధువు తన దారిన వెళ్ళాక మార్టిన్ సువార్త పుస్తకం తెచ్చుకుని చదవడం మొదలుపెట్టేడు. మొదట్లో వారానికో సారి చదవడం మొదలుపెట్టిన మార్టిన్ తన పనంతా అయిపోయాకా చేసేది ఏమీ లేనప్పుడు పుస్తకం తీసేవాడు. తర్వాత అదే అలవాటై రోజు చదవడం మొదలైంది. రోజులు గడికోద్దీ “పరమేశ్వరా అంతా నీ ఇష్టం. అంతా నీ ఇష్టమే” అనే స్థితిలోకి జారుకోవడం తో పాటు మెల్లిగా హృదయం తేలికవడం తెలుస్తోంది మార్టిన్‌కి. ఇప్పుడు సువార్త పుస్తకం లేకపోతే మార్టిన్ లేడు.

కాలం గడుస్తూంటే మార్టిన్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మునపటి రోజుల్లో అయితే ఎప్పుడో అలా బయటకెళ్ళి టీ తాగివచ్చేవాడు. స్నేహితులంతగా బలవంతం చేస్తే ఓ గ్లాస్ వోడ్కా వద్దనేవాడూ కాదు కాని ఇప్పుడంతా మారిపోయింది జీవితం. పొద్దున్నే చెప్పుల మరమ్మత్తు పనో ఏదో ఉంటే చేయడం. ఏ మాత్రం సందు ఖాళీ దొరికినా సువార్త పుస్తకం ముందేసుకుని చదివిందే మళ్ళీ చదవడం, చదివే కొద్ది అది ఎక్కువ అర్ధమవ్వడం. ఎంత అర్ధమైతే అంత సంతోషంగా తాను ఉండడమూను.

ఓ రోజు రాత్రి సువార్త చదివినది బాగా గుర్తుండిపోయింది. ఓ చెంప మీద కొట్టినవాడికి రెండో చెంప కూడా ఆదరంగా చూపించు. నీ చొక్కా అడిగినవాడికి నీ పై కోటు కూడా ఇవ్వు. ప్రపంచం నీకేం చేయాలనుకుంటున్నావో అదే నువ్వు ప్రపంచానికి చేయడానికి సిద్ధంగా ఉండు సుమా. నన్ను భగవంతుడా, ఈశ్వరా అని పిలవడం దేనికీ నేను చెప్పినట్టు చేయనప్పుడు? నన్ను మనసా వాచా కర్మణా ఆచరించేవాడు మంచి పునాదుల మీద ఇల్లు కట్టుకున్నవాడే. లేకపోతే మీరు కట్టిన ఇల్లు ఒక్క చిన్న వరదలో పూర్తిగా కొట్టుకుపోయి ధ్వంసం అవుతుంది.

“ఇంతకీ నేను కట్టుకున్న ఇల్లు, నా నమ్మకాలు మంచి పునాదులమీద ఉన్నవేనా?” మార్టిన్ ఆ రోజు నిద్రపోతూ అనుకున్నాడు. ఎంతాలోచించినా తేల్చుకోలేక కన్నీళ్ళతో నిద్రలోకి జారుకున్నాడు.

మర్నాడు పనిచేస్తున్నంతసేపూ మార్టిన్ మనసు మాత్రం మూలుగుతూనే ఉంది, నా పునాదులెలా ఉన్నాయ్ అనుకుంటూ. ఆ రోజు పుస్తకం తీస్తే మొదట వచ్చినది చదవడం సాగించేడు. యొహోవా సైమన్ తో చెప్తున్నాడు: నేను నీ ఇంటికొస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళేనా ఇచ్చావు కాదు. కానీ ఈవిడ చూడు. కన్నీళ్ళతో నా పాదాలు కడిగి తన జుట్టుతో తుడిచింది. కందిపోతాయేమో అని నూనె రాసిపెట్టింది కూడా…

ఇది చదివేక మార్టిన్ ఏడుస్తూ కూలబడిపోయేడు, “ఈ సైమన్ నా లాంటి పనికిరాని అర్భకుడే బాబోలు. సొంతానికే అన్నీ అని ఆలోచించుకునే రకం. పిల్లికి బిచ్చం పెట్టని నా బతుకూ ఒక బతుకేనా?”

రాత్రి మగతనిద్రలో కల. ఎవరో పిలుస్తున్నారు, “మార్టిన్, మార్టిన్!” అంటూ.

“ఎవరది?”

కాసేపు నిశ్శబ్దం తర్వాత ప్రస్ఫుటంగా వినిపించింది. “మార్టిన్, రేపు. నేను నీ ఇంటికొస్తున్నా. అప్రమత్తంగా చూస్తూ ఉండు సుమా!”

తటాలున లేచి కూర్చున్నాడు మార్టిన్. కలా నిజమో అర్ధం కాలేదు చాలా సేపు. కళ్ళు నులుపుకుని చుట్టూ చూసేడు. ఎవరూ లేరు. తెల్లవారే దాకా కలత నిద్రతో గడిపేక లేచి టీ కాచడానికి పొయ్యి వెలిగించేడు. రాత్రి కల గుర్తొచ్చింది. చాలాసేపు తర్జనభర్జనలు పడ్డాక తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు.

“ఏదో పగటి కల కాబోలు. ఒక్కోసారి నిజం అనిపిస్తూ ఉండొచ్చు. ఇంతకుముందో సారి ఇలా జరిగినట్టే గుర్తు.”

పని మొదలు పెడుతూ వీలున్నప్పుడల్లా బయటకి చూడ్డం మొదలుపెట్టేడు మార్టిన్. ఎప్పుడూ వచ్చే పోయే జనాల చెప్పుల కేసి మాత్రం చూసే మార్టిన్ కల మాటిమాటికీ గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ముఖాలకేసి కూడా చూస్తున్నాడు. తెలుసున్న ఇద్దరు ముగ్గురు వెళ్ళేక అప్పుడొచ్చేడు స్టెఫాన్ పడిన మంచు ఊడవడానికి. మట్టికొట్టుకుపోయిన పాత బూట్లు వేసుకుని, ముసలితనంలో కూడా పనిచేయవల్సి వచ్చినందుకు తిట్టుకుంటూ మంచు ఊడవడం మొదలెట్టేడు.

మార్టిన్ స్టెఫాన్ కేసి మార్చి మార్చి చూసేడు. రెండు నిముషాలయ్యేక నవ్వొచ్చింది మార్టిన్‌కి. “నాకు వయసైపోయేకొద్దీ పిచ్చెక్కుతోందేమో. లేకపోతే స్టెఫాన్ వస్తే రాత్రి కల గుర్తు పెట్టుకుని యొహోవా వచ్చాడనుకోడం దేనికీ?”

మళ్ళీ పనిలో పడి అరగంట తర్వాత మార్టిన్ బయటకి చూసేడు. స్టెఫాన్ మంచు ఊడుస్తూ నీరసం వచ్చింది కాబోలు కూర్చున్నాడు అరుగు మీద. ఈ వయసులో ఆయన పని చేయడానికి వళ్ళు సహకరించడం లేదని తెలుస్తూనే ఉంది. స్టెఫాన్ కేసి చూస్తున్న మార్టిన్‌కి ఒక్కసారి, అయ్యో పాపం! అనిపించి తలుపు తీసి బయటకెళ్ళి చెప్పేడు.

“స్టెఫాన్! ఓ సారి ఇలా లోపలికి వచ్చి టీ తాగు. కాస్త చేతులూ కాళ్ళు వెచ్చబడే దాకా ఇలా లోపలకొచ్చి కూర్చో.”

“రక్షించావయ్యా. ప్రాణాలు పోతున్నాయనుకో చలిలో!” లోపలకొచ్చి కాళ్లకున్న మంచు విదిలుస్తూ చెప్పేడు స్టెఫాన్.

వేడి, వేడి టీ తాగాక గ్లాసు కిందపెట్టేయబోతుంటే, ఇంకో కప్పు తాగు మొహమాటం లేకుండా, అని మార్టిన్ చెప్పేడు. మాటల్లో మార్టిన్ మాటి మాటికీ కిటికీలోంచి బయటకి చూస్తూండడం చూసి స్టెఫాన్ అడిగేడు.

“ఎవరైనా రావాలా మీ ఇంటికి, ఈ రోజున అలా చూస్తున్నావు?”

మార్టిన్ సిగ్గుపడిపోయేడు, “నిజానికి ఏం చెప్పాలో తెలియదు,” అంటూ తనకి రాత్రి వచ్చిన కల గురించి చెప్పేడు. దానితో బాటే అన్నాడు.

“నీకు తెల్సు కదా, వినే ఉంటావ్ యొహొవా ఈ ప్రపంచంలో భగవంతుడి అవతారంగా ఎలా పుట్టాడో? అవన్నీ చదువుతూంటే ఈ కల వచ్చింది రాత్రి. నిజానికి అది కలో, నిజంగా ఆ మాటలు వినిపించాయో చెప్పలేననుకో.”

“అవును నేనూ విన్నాను యొహొవా గురించి కానీ నీ అంత జ్ఞానం నాకు లేదు, నేను చదువున్నవాణ్ణి కాదు.”

గ్లాసు మీద గ్లాసు టీ తాగుతూ మాటల్లో తనకి ఇంతకాలం జరిగినవీ, సువార్త పుస్తకం చదవడం ఎలా మొదలు పెట్టినదీ అది తనని ఎంత ప్రభావితం చేస్తున్నదీ ఏకరువు పెట్టేడు మార్టిన్. వయసులో ఎన్నో ఆటుపోట్లు తిన్న స్టెఫాన్ అన్నీ విని కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని వెళ్లడానికి లేస్తూ చెప్పేడు.

“నువ్వు అదృష్టవంతుడివి మార్టిన్. ఈ వయసులోనైనా భగవంతుడి గురించి కాస్తో కూస్తో తెల్సుకోగల్గుతున్నావ్. మాకు అదీ లేదు. నువ్విచ్చిన టీ నా ప్రాణాలు నిలిపిందీ రోజున!”

“ఫర్వాలేదులే. మళ్ళీ ఎప్పుడైనా రావాలనుకుంటే సంకోచించకుండా తలుపు తట్టి లోపలకి రా. నాకు ఇప్పుడు ఈ పుస్తకం చదవడం కంటే వేరే పనేం లేదు.”

ఆయనటు వెళ్ళగానే మళ్ళీ కిటికీ లోంచి చూడ్డం మొదలుపెట్టేడు. ఏదో చేతుల్తో పని చేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా ఇంకా రాత్రి వచ్చిన కలమీదే ఉంది. మరో ఇద్దరు ఇంటి పక్కనుంచి వెళ్ళాక తర్వాతో మనిషి ఏదో అమ్ముతూ మార్టిన్ ఇంటిని దాటిపోయేడు. మార్టిన్ చూసుకోలేదు కాని ఎవరో ఇంటి పక్కనే నిలుచునున్నట్టుంది. పరీక్షగా చూస్తే ఎవరో ఒకావిడ చంటిపిల్లనెత్తుకుని చలిలో వణుకుతోంది. ఒక్క ఉదుటున వెళ్ళి తలుపు తీసేడు.

“ఇదేమిటమ్మా అలా చలిలో నుంచున్నావ్? ఈ వాతావరణంలో అలా నుంచుంటే ప్రాణాలు దక్కుతాయా? ఇలా రా లోపలకి!”

ముక్కూ మొహం తెలియని ఎవరో తలుపు తీసి లోపలకి రమ్మనడం చూసి ఆవిడ ఆశ్చర్యపోయినట్టుంది. లోపలకి వద్దామా వద్దా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతుంటే మార్టిన్ ఆవిణ్ణి లోపలకి తీసుకొచ్చేడు. వెచ్చగా ఉన్న చోట కూర్చోబెట్టి చెప్పేడు.

“అలా కూర్చో, ఇది నీ ఇల్లే అనుకో. ఇంట్లో నేనొక్కణ్ణేలే. నీకు నచ్చిన చోట కూర్చుని పిల్లకి పాలు ఇచ్చుకో. అలా పాపని చలిలో ఎంతసేపణ్ణుంచి పట్టుకుని నించున్నావక్కడ?”

లోపలకొచ్చినావిడ దాదాపు ఏడుపు కంఠంతో చెప్పింది, “పొద్దున్న నుంచీ నేను ఏమీ తినలేదు, ఇంక పాలెక్కణ్ణుంచి వస్తాయి?”

“అవునా అయితే పాపని ఇలా ఇచ్చి ఇది తిను ముందు,” ఇంట్లో ఉన్న రొట్టే అవీ తెచ్చి ఆవిడ దగ్గిరగా పెట్టి అన్నాడు మార్టిన్, “నేను పిల్లా పాపా ఉన్నవాణ్ణే ఒకప్పుడు. నువ్వు తింటూంటే పాప ఏడవకుండా చూడగలనులే!”

ఆవిడ తింటూంటే మార్టిన్ పాపని అక్కడే మంచం మీద పడుకోబెట్టి నవ్వించడానికి ప్రయత్నం చేసేడు. వచ్చినావిడ తింటూ మధ్య మధ్యలో తన కధ చెప్పడం మొదలు పెట్టింది.

“మా ఆయన సైన్యంలో పని చేసేవాడు. ఎనిమిది నెలల క్రితం ఎక్కడికో పంపించేరు. అప్పటునుంచి ఆయనెక్కడున్నాడో దేవుడికెరుక. అద్దె ఇంట్లో మూణ్ణెల్ల క్రితం వరకూ ఉండేవాళ్ళం. ఈ పాప పుట్టేక అక్కడ కుదరదు పొమ్మన్నారు. ఈ లోపుల ఇంకొకావిడ తన దగ్గిర ఉండనిస్తానంది కానీ నిన్న చెప్పడం ప్రకారం ఇంకో వారం దాకా కుదరదని. ఈవిడ ఇంటికీ నా ఇంటికీ చాలా దూరం. ఈ చలిలో ఏం చేయాలో ఎవరి దగ్గిరకెళ్ళాలో పాలుపోకుండా ఉంది.”

ఈ సారి మార్టిన్ ఆవిడ కేసి చూసేడు పరీక్షగా. కట్టుకున్న బట్టలు ఈ వాతావరణానికి సరిపడేవి కాదని తెలుస్తూనే ఉంది. ఈ మంచులో అసలు ఈ బట్టల్తో ఎలా బతుకుతోందో?

“ఇంతకన్నా మంచి బట్టల్లేవా చలికి?”

“ఎలా ఉంటాయ్? నిన్ననే ఉన్న ఒక్క శాలువా తాకట్టుపెట్టేను తిండి కోసం.”

తినడం పూర్తి చేశాక పాపని తీసుకుని పాలిస్తూంటే మార్టిన్ ఇంట్లోకి వెళ్ళి వెతికేడు ఈ వచ్చినావిడకి సరిపోయే చలి దుస్తులకోసం. కనపడిన ఒక కోటూ మిగతా బట్టలూ బయటకి తీసి ఇచ్చేక ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది.

“నువ్వు ఎవరో దేవుడు పంపించిన దూతవి కాబోలు. నువ్వే కనక మమ్మల్ని లోపలకి పిలవకపోతే ఈ పాటికి ప్రాణాలు పోయి ఉండేవి మాకు.”

మార్టిన్ ఆవిడక్కూడా తనకొచ్చిన కలా ఆ రోజు తానెందుకు కిటికీలోంచి చూసేడో, ఆవిడెలా కనిపించిందో చెప్పి చివరకి అన్నాడు.

“నిన్న రాత్రి ఆ కలే కనక రాకపోయి ఉంటే నేనసలు బయటకి చూసేవాణ్ణే కాదు. మనజీవితంలో జరిగేవన్నీ భగవత్ప్రేరితాలే అనడానికింతకన్నా ఋజువు ఏం కావాలి?”

“ఎవరేం చెప్పగలం. ఇలా మీరు నాకు కనిపించినట్టే మీకు యొహోవా కనిపించొచ్చు. ఏదీ కాదనడానికిలేదు.” మార్టిన్ కథంతా విన్నాక వచ్చినావిడ అంది.

ఆవిడ వెళ్లడానికి లేస్తూంటే మార్టిన్ కాసిని డబ్బులు ఆవిడ చేతికిస్తూ చెప్పేడు, “ఈ డబ్బులు తీసుకుని ఆ తాకట్టు విడిపించుకో. భగవంతుడిమ్మన్నాడనుకో, వద్దనకు.” ఆవిడ డబ్బులు తీసుకుని వంగి వంగి సలాములు చేస్తూ పిల్లనెత్తుకుని నడుస్తూ బయట పడే మంచులో కలిసిపోయింది.

పనిలో పడి కాస్త తేలికపడ్డాక అప్పుడప్పుడూ మార్టిన్ కిటికీలోంచి చూస్తూనే ఉన్నాడు ఎవరైనా వస్తారేమోనని. ఊళ్ళో తెలిసినవాళ్ళిద్దరు, ఇంకో ముగ్గురు ముక్కూ మొహం తెలియని వాళ్ళూ వెళ్ళేక ఒక ముసలావిడ ఆపిల్ పళ్ళు అమ్ముకుంటూ తట్టనెత్తుకుని రావడం కనిపించింది. ఆ వెనకనే ఓ పదేళ్ళ కుర్రాడు ఆవిణ్ణి వెంబడిస్తూ వస్తున్నాడు. ఏం జరుగుతుందా అని మార్టిన్ కుతూహలంగా చూడబోయేడు. తటాలున కుర్రాడు తట్టలోంచి ఓ పండు లాక్కోవడం చూస్తూనే ముసలావిడ ఒక్క ఉదుటున కుర్రాడి చేయి పట్టేసుకుంది. తట్ట కింద పెట్టి వాడి జుట్టు లాగుతూ నాలుగు తగిలించబోయేసరికి మార్టిన్ కంగారుగా లేచి తన కళ్లజోడు పడిపోతున్నా చూసుకోకుండా బయటకి పరుగెట్టేడు.

కొట్టబోయే ముసలావిణ్ణీ, గింజుకుంటున్న కుర్రాణ్ణీ విడిపించాక ఇద్దర్నీ తనంట్లోకి తీసుకొచ్చి చెప్పేడు మార్టిన్ ముసలావిడతో.

“ఒక్క ఏపిల్ తీయబోయనందుకేనా అంత చచ్చేటట్టు కొట్టబోయేరు?”

“దొంగతనం చేసినందుకయ్యా, ఒక్క ఏపిల్ కాదు లెఖ్ఖ. ఇప్పుడిలా దొంగతనం చేసేవాడు రేప్పొద్దున్న మరోటీ, మరోటి చేయడూ?”

“పోనీయమ్మా, ఆ ఏపిల్ ఖరీదు నేనిస్తాను కానీ, కుర్రాడికి ఆకలేస్తోదేమో. ఈ సారికి వదిలేయండి”

“వదిలేయడమా? పోలీసులకి అప్పగించి వళ్ళు తూట్లు పడేలాగ కొడితేగానీ వీళ్ళకి బుద్ధిరాదు.”

“ఒక్క ఏపిల్ దొంగతనానికే వళ్ళు తూట్లుపడేలాగ ఈ పదేళ్ల కుర్రాణ్ణి కొట్టించాలంటే పెద్దాళ్ళమైన మనం రోజూ చేసే పాపాలకీ, మోసాలకీ ఎంతటి శిక్ష పడాలంటారు?”

ముసలావిడ ఏమీ మాట్లాడలేదు. ఈ లోపున కుర్రాడు పెద్ద గొంతుకతో అరిచేడు, “అసలు నేను ఏపిల్ ముట్టుకోలేదే? నన్నెందుకు కొడుతున్నారు?”

“నువ్వు ఏపిల్ తీయడం నేను చూసేను ఇక్కడ్నుంచి. పిచ్చి కబుర్లూ అబద్ధాలూ కట్టిపెట్టి ఈ మామ్మకి క్షమాపణ చెప్పకపోతే ఈవిడ చెప్పినట్టూ నేనే నిన్ను పోలిసుల దగ్గిరకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది!” మార్టిన్ కుర్రాడికేసి చూసి చెప్పేడు.

దొరికిపోయిన దొంగతనం బయటపడగానే కుర్రాడు మొహం మాడ్చుకున్నాడు. ముసలావిడ అంది పెద్ద గొంతుతో, “నేను చెప్పాను కదా? ఇలాంటి వెధవలందర్నీ…”

ఇంకా ఏదో అనబోతూంటే మార్టిన్ ఆవిణ్ణి వారించేడు. “ఊరుకోమ్మా, ఆ ఏపిల్ కుర్రాడికిచ్చేయి. నీకు ఆ ఏపిల్ డబ్బులు నేనిస్తాను కానీ ఇంక అక్కడితో వదిలేయి మరి.”

కోపతాపాలు చల్లబడ్డాక ముసలావిడ మార్టిన్ ఇచ్చిన తట్ట ఎత్తబోతూంటే కుర్రాడు ముందుకొచ్చి అన్నాడు.

“అలా ఏపిల్ దొంగతనం చేసినందుకు క్షమించు, నువ్వు వెళ్ళేవైపుకే నేనూ వెళ్తున్నాను. కావాలిస్తే కొంచెం సాయం చేస్తా తట్ట మోయడానికి.” ముసలావిడ ఒప్పుకుంది. ఇద్దరికీ సయోధ్య కుదిరినందుకు మార్టిన్ నవ్వుకున్నాడు.
కుర్రాడూ ముసలావిడా మార్టిన్‌ని వదిలి వెళ్ళేసరికి దాదాపు సాయంత్రం అవ్వొచ్చింది. లేచి ఇంట్లో దీపం వెలిగించేడు మార్టిన్. అప్పటిదాకా పనిచేసిన చోట ఉన్న తోలు ముక్కలూ, దారాలు చెత్తా చెదారం అంతా శుభ్రం చేసి వచ్చాక సువార్త పుస్తకం తెరిచేడు మార్టిన్. క్రితం రోజు చదివి వదిలేసిన చోట నుంచి మొదలుపెడదామని తీయబోయేడు కానీ తీసేటప్పుడు మరో చోట తెరుచుకుంది పుస్తకం. పుస్తకం ఇలా తియ్యడం ఎవరిదో అడుగుల చప్పుడు వినపడడం ఒకేసారి జరిగేయి. తన వెనక చీకట్లో ఎవరో నడిచినట్టైంది. చటుక్కున తలతిప్పి వెనక్కి చుసేడు. ఎవరూ లేరు.

తిరిగి పుస్తకం తీయబోయే సరికి మళ్ళీ అడుగుల చప్పుడు వినిపించింది. ఈ సారి మార్టిన్ బిగ్గరగా అరిచేడు “ఎవరదీ?”

మార్టిన్ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టూ వినిపించింది. “మార్టిన్, నన్ను గుర్తు పట్టావా?”

“ఎవరక్కడా?” అని పరీక్షగా చూసేసరికి మూడు స్పష్టమైన మానవాకారాలు మాట్లాడుతూ కనిపించేయి మార్టిన్‌కి.

“నేనే!” అంటూ చీకట్లో ఓ మూలనుంచి స్టెఫాన్ బయటకొచ్చి వేగంగా రెండో మూలలోకి అదృశ్యమైపోయేడు.

“ఇదీ నేనే!” అంటూ రెండో మానకావారం నడుస్తూంటే ఆవిణ్ణి మార్టిన్ గుర్తు పట్టేడు. ఈవిడ పొద్దున్న చంటిపిల్లతో ఇంటిముందు నిలుచున్నావిడ! చేతిలో పిల్ల మనోహరంగా నవ్వుతూంటే వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూంది.

మూడో ఆకారం ఏపిల్ పళ్ళు అమ్ముకునే ముసలావిడా, ఆవిడ కూడా ఉన్న పదేళ్ళ పిల్లాడూను. వాళ్ళు కనిపించినంతలో “ఇది కూడా నేనే!” అని ఓ అదృశ్య కంఠం మార్టిన్‌కి వినిపించింది.

ఒక్కసారి కళ్ళు తిరిగినట్టయింది మార్టిన్‌కి. కలలో కనపడినట్టూ యొహోవా వస్తాడనుకుంటే మరెవరో వచ్చాడనుకున్నాడు తాను రోజంతా. వీళ్ల రూపంలో ఆయనే వచ్చాడన్నమాట. మనసులో సంతోషం పొంగుతూండగా పుస్తకం చదవడం మొదలుపెట్టేడు.

నాకు ఆకలేసినప్పుడు నువ్వు ఆహారమిచ్చావు. దాహమేసినపుడు తాగడానికిచ్చావు. నాకెవరూ దిక్కులేనప్పుడు నన్ను నీదగ్గిరకి తీసుకున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా తోటి మానవులకి ఏం చేశావో అది నాకు చేసినట్టే.

ఒక్కసారి మబ్బులు విడిపోయి స్వచ్చమైన వెల్తురు వచ్చినట్టయింది. క్రితం రోజు కల నిజమైందనీ ఆ రోజు నిజంగానే భగవంతుడు తనింటికొచ్చాడనీ, అదృష్టం కొద్దీ తాను ఆయన్ని మనసారా లోపలకి ఆహ్వానించాడనీ అర్ధమైంది.
-----------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, మూలం: లియో టాల్‌స్టాయ్,
(మూలం: Where love is, God is, 1885.)
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment