Thursday, November 15, 2018

తమాషా దేఖో - 3 (కథ)


తమాషా దేఖో - 3 (కథ)




సాహితీమిత్రులారా!


తమాషాదేఖో మూడవ కథను ఆస్వాదించండి............

(క్రితం భాగం కథ వర్ధమాన హోంబిల్డర్‌ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం చూస్తున్న నాగేశ్వరిి, ఆమె భర్త గోపాలరావు, వాళ్ళ బావగారు రవణరావు గారింట్లో ఉంటారు. గోపాలరావు కి ఆంధ్రాలో “అసలైన మనుషుల” జీవితాన్ని కళ్ళారా గమనించాలని కోరిక. అలా కృష్ణతో డంగలా దగ్గరకి వెళ్తారు గోపాలరావు, అతనికి పరిచితుడైన రాఘవరావు. రాఘవరావు కవి కూడా. అక్కడ ఆంజనేయవిగ్రహం దగ్గర సిందూరం బొట్టు పెట్టుకోవాలంటాడు కృష్ణ. రాఘవరావుకి అది నచ్చదు. ఇక చదవండి.)

ఆది (పక్కనున్న పిట్టగోడ మీంచి వంగి)

గురూ…..గురూ……….

(లోపల్నుండి ఒక ముసిలాయన తొంగి చూసి)

అప్పల ఎవులూ? ఎవుల్రా ఆది బాబూ….

ఆది ఒకసుట్టిలాగ రండి…వీరు చిందూరం లేకుంటా వొచ్చెస్తాఁవంటన్నారు….

(ఒక ముసలాయన లోపల్నుండి పైకొచ్చి గోడకి వున్న కన్నంలోంచి వంగి డంగలా లోకి వస్తాడు. వస్తాదు. దళసరి ఎర్ర ఫ్రేం కళ్ళద్దాలు, తువ్వాలు కప్పుకుని ఎర్రటి పట్టు పంచ లుంగీ లాగ కట్టు కుని వుంటాడు. గోపాల రావు అతన్ని చూసి దండం పెడతాడు.)

అప్పల (సందేహంగా) ఎవులూ….?

ఆది (రాఘవ రావుని చూపించి) వీరు చిందూర బొట్టు లేకుంట నోపలకొచ్చెస్తామంటన్నారు….

అప్ప ఏం నాన్న…. స్వామి చిందూరానికి తప్పేటున్నాది…? అందుట్లోను ఇవాల మంగల వారం…..ఇవాల్ట నియమాలా?! మా తండ్రి గారూ, కోడి
రామ్మూర్తి నాయుడి గారి నాటి డంగల! భక్తి లేకుంటా విద్య రాదు కదు తండ్రి?! నియమంగా వున్న వోడికే వ్యాయామ విద్య. (అనుమానంగా) తమరేటి క్రిష్టీన్సా ….?

రాఘ క్రిష్టియన్స్‌ కాదండీ మేం స్టేట్స్‌ నుండొచ్చేం…

అప్ప శేఠ్‌ గారా…..మరేఁవయితె…హనుమాన్‌ జీ కా ప్రనామ్‌ కరో??

గోపా శేఠ్జీ కాదండీ.. స్టేట్స్‌…అమెరికా నుండొచ్చేఁవు…….

అప్ప (సంబరంగా) అలాగా…! మా శిష్యులు అమిరికా లోనా వున్నారు! కోట్ని ప్రకాశరావనీసి ఎరుగుదువా..? మీ లాగే ఎర్రగా ఉంతాడు….సౌత్‌ జోన్‌
సాంపియన్‌ కింద మూడు సుట్లూ గెలిసేడు….ఇక్కడే వుంటే ఆలిండియా చాంపియనయ్యేవోడు….మా శిష్యులెవులొచ్చినా ఈ నాటికీ స్వామి చిందూరము
లేకుంటా రారు……కోట్నోల కుర్ర వాడు…నీనంటె గొప్ప బక్తి…(కప్పుకున్న టర్కీ టవల్‌ చూపించి) ఇదా ఈ తువ్వాల ఆయినే తెచ్చేడు… ఎరుగుదువా?

గోపా లేదండీ తెలీదు…

రాఘ (కొంచెం నవుతాలుగా) ఆయనెవరో తెలీదండీ..మేం క్రిష్టియన్స్‌ కాదు…(క్రిష్ణతో చెప్తున్నట్టు) నియోప్రొగ్రెసివిష్స్ట్‌ అని విన్నారా? పోస్ట్‌ మోడర్న్‌ నియోప్రొగ్రెసివిజం……?

ఆది గురువు గారికి ఇంగ్లీష్‌ తెల్దు సార్‌ !

రాఘ ఆధునికానంతర నవాభ్యుదయ వాదం. ఈ ఆచారాలూ మూఢ నమ్మకాలూ లేకుండా మనిషిని మనిషిగా గౌరవించే మానవత్వ పరమయిన భావజాలం కోసం కృషి చేసే దిశగా సాగే ఉద్యమం……..

అప్ప (ప్రశ్నార్ధకంగా, మళ్ళీ రాఘవ రావుతో) ఏటి వూరికే సూణ్ణానికొచ్చేరా…? క్రిష్టీన్సయితే నేమి నాకు ఎనపయి తొమ్మిది సంవత్సరాలు. డాకియార్డ్‌ లోన కలాసిగా చేరి కలాసి గానే రిటారయిపోయేను. నాకు తొమ్మిదేళ్ళ ప్రాయము నాడు స్మిత్‌ దొర గారు మా నాన్నగారికి రాయించిచ్చిన డంగలా ఇది. తమ దయవల్ల ఎందరో శిష్యులకి దేహ విద్య నేర్పించేను నాన్న. తురకోలున్నారు పంజాబీ వోలున్నారు రెల్లోలున్నారు… ఇదా (క్రిష్ణని చూపించి) …. బ్రేమ్మర్లున్నారు…. ఎవులికయినా నియమం వొకటే…..తొన్నాడు పూజ లేని విద్య తొర్రి విద్య! గురువు లేని విద్య గుడ్డి విద్య!!…..లంగోటీ లేకుంట దండీలు తీస్తే ఆరోగ్యానికి మంచిది కాదు సంతాన భంగం ఆయుక్షీనం…..

గోపా మా రాఘవకి అదో నియమం అనుక్కోండి…….బొట్టూ అదీ పాత పద్ధతులు కదా ఇష్టం వుండవు……..నాకు పరవాలేదు…ఇదుగో (చిన్న బొట్టు తీసి పెట్టుకుంటాడు) సరేనా….

అప్ప (అయిష్టంగానే) అలాగయితే లోపటకొచ్చి కూర్చోండి బాబూ…..కసరత్తులు మాత్రం చెయ్యొద్దు…దండీలు బరువులు ముట్టుకోవొద్దు….అన్నానని ఏటనుకోకండి… (రమ్మని సైగ చేసి పాకవైపు నడుస్తాడు. వెనగ్గా గోపాల్‌, రాఘవ వెళ్తారు.)

రాఘ కసరత్తు చెయ్యడానికి రాలేదు లెండి….ఊరికే చూడ్డానికొచ్చేఁవు….

(క్రిష్ణ, ఆది బాబు పాక గది లోకి వెళ్తారు. )

గోపా (చిన్నగా) చూడు ఆయనికి తొంభయ్యేళ్ళుట….కమ్మెచ్చులాగున్నాడు… ఒక్క వెంట్రుకైనా నెరవ లేదు……

రాఘ వూఁ….పాపం వీళ్ళకేం సోషల్‌ సెక్యూరిటీయా, 401k ప్లానా! poor fellow… …..ఇలాటి వాళ్ళకోసం వృద్ధ ఇళ్ళు పెడితే బావుంటుంది……ఏం చెయ్యడానికీ ముందు ప్రజల్లో చైతన్యం రావాలి……భావ చైతన్యం రావాలంటే ఒకటి ఎడ్యుకేషన్‌ రెండు లిటరేచర్‌ ఈ రెండూ తప్ప వేరే సొల్యూషన్‌ లేదు…..భావ చైతన్యం రానంత కాలం ఈ ఆంజనేయుళ్ళవీ అలాగే మనం ఇలాగే….

గోపా ఇతను పెద్దగా చదువుకునుండడులే! అడిగేవంటే ఆంజనేయుడే నా ఫోరోవన్‌ కే ప్లాన్‌ అనేటట్టున్నాడు….!

అప్ప (వంగి పాక లోకి నడుస్తూ) సూడ్డానికొచేరా? రండిలాగ రండి…..(గోడ మీద ఫొటోలు చూపించి) ఇదుగో మా నాన్నగారు…..కోడి రామ్మూర్తి గారి కాణ్ణించి పతకం అందుకుంటున్నాడు….ఇదా..ఇది మా నాన్న బర్మా ఫౌజులో వున్నప్పుడు పుటో…..ఇది నీను నార్తు సౌతు ట్రోఫీ గెలిచినప్పుడిది…ఇది ఇంట్రా మ్యూరల్సు….వీరు రామలాల్‌ ప్రభువు వారు…..వీరి కాడే మా తండ్రి గారు హిమాలయాల్లోన యోగ విద్య నేర్చుకున్నారు…..

రాఘ (వెయిట్స్‌ చేసే బల్ల మీద కూర్చుని) ఏఁవండి గురువు గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను……

అప్ప అడుగు నాన్నా ఒకటేటి మీ ఇష్టాఁవొచ్చినన్ని అడగండి….

రాఘ మీ నెలసరి ఆదాయం ఎంత….?

అప్ప గవరమెంటు వారి పించను నెలకి పదకొండువందలిరవై రూపాయలు…

రాఘ మీ ఫేమిలీ మెంబర్సెంతమంది…..?

అప్ప మా యావిడీ నేనూ మేఁవిద్దరమే నాన్న

రాఘ పిల్లల్లేరా?

అప్ప ఎందుకు లేరు పిల్లలు పెద్దోలయిపోయి ఎవుల మానాన్నాలు తలుకో దుక్కెలిపోయేరు…

మాకిద్దరు మొగ బిడ్డలు ఇద్దరాడ బిడ్డలు….

రాఘ వాళ్ళేం చేస్తున్నారు…

అప్ప మా పెద్ద వోడు డాకియార్డ్‌ లోనే ఫోర్మేను. రెండోవోడు లాలా గూడా సంటింగ్‌ యార్డ్‌ లోన వెల్డరు….మా పెద్ద పిల్ల మొగుడు మా మేనల్లుడే ఈ వూరే ఇచ్చేఁవు..మా రెండో దాయి అత్తవారు నేరళ్ళ వలస.

రాఘ మరి పెద్ద వాళ్ళయిపోయేరు మీ పిల్లల దగ్గిరికి వెళ్ళి ఉండాలని లేదా?

అప్ప పిల్లలకాడి కెల్లి కూకుంటే డంగలా ఎవులు చూస్తారు…..మా నాన్నకి లేక లేక నీను పుట్టేను. మాయమ్మోలు సంతానం లేదని ఏడుస్తుంటె స్వామి కల్లోకొచ్చి ‘ నా పేరు మీద డంగలా పెడతావా పెట్టవా ‘ అనీసి నిలదీసేడు. స్వామి దయవల్ల నీను పుట్టేను….. ఇదే మా ఇల్లు ఇదే స్వామి గుడి….విన్నావా? పిల్లలకాడికెందుకు…….ఒకల చెప్పు చేతల్లోన మనమెందుకుండాల? మా శిష్యులున్నారు కారా? మాయాదిబాబు, మా క్రిష్ణ, మా జాని….ఆ యాదిబాబున్నాడు చూసేవా…మా పెరటిదుక్కు ఆడికి టైలరు బడ్డీ తీయించేను…….కొడుక్కంటే ఎక్కువగా కనిపెట్టుకోనుంతాడు…..ఈ యేడే ఆడి పెళ్లి……విన్నావా!

(జానీ ఎడ్విన్‌ ప్రవేశం. పొట్టిగా చలాకీగా ఉంటాడు. దూకుడుగా కేకేసుకుంటూ…………)

జానీ ఆదిబాబ్‌..! ఆద్స్‌…? ఒరే వోర ఆది కపూర్‌……..?? (కొత్త మనుషుల్ని చూసి తగ్గిపోతాడు.)

ఆది (వెయిట్స్‌ దించకుండానే) ఏటి జానీ…ఇక్కడ వెయిట్స్‌ రూములున్నాము ఇలాగొచ్చీ…

జానీ (లోనికెళ్ళి రహస్యంగా) ఎవర్రాళ్ళు?

ఆది క్రిష్ణతోటొచ్చేరు..అమిరికా వోలు! వుట్టినే….సూణ్ణానికి…..

జానీ గురువు గారేటి క్లాస్‌ పీకుతన్నాడు…..(గురువు దగ్గిరకెళ్ళి నాటకీయంగా) నమస్కారం గురువు గారు….జై వీరాంజనేయం……

అప్ప (నవ్వి) సిరంజీవి సతాయుస్షు దీర్గాయుస్షు మార్కండాయుష్మాన్‌ భవా……(దర్పంగా) ఇక్కడికెందుకొచ్చేవు ఎల్లి దండీలు తియ్యి….

(గోడ పక్కనుండి కేక) ఏఁవిండీ? ఏఁవిండీ?! హారతి! హారతీ!!

అప్ప నీను పూజలో వున్నాను హారతికెల్లాల! తమరిష్టఁవొచ్చినంత సేపు కూకోండి. కసరత్తులు మాత్రం చెయ్యక…..! (గోడ కన్నం లోంచి దూరి ఇంట్లోకి వెళిపోతాడు.)

ఆది (వెయిట్స్‌ చేస్తూనే రాఘవ కేసి తిరిగి) అదుగో సూడండి నామాటబద్ధఁవయితె… జానీ గాడు బొట్టెట్టుకున్నాడా లేదా?

జానీ (అవకాశం తీసుకుని రాఘవ కేసి చెయ్యి చాపి) హలో! అయామ్‌ జానీ….. జానీ ఎడ్విన్‌!

(ఇద్దరితో షేక్‌ హేండ్‌ చేస్తాడు)

గోపా హలో అండీ! (ఆది బాబుతో) నువ్వు అబద్ధఁవాడేవని ఆయనన్నాడా?

ఆది (వెయిట్‌ ఎత్తడానికి గస పోసుకుంటూ) కాదు ఆడికి బొట్టూ లంగోటున్నాయో లేదో చూసుకోండీ! మీకు లంగోట్లు కావాలంటె చెప్పండి నా బడ్డీలో కొత్తక్కుట్టినవున్నాయి…ఫోర్‌ రుపీసు?!

రాఘ (చనువుగా) ఇదుగో లంగోటీలు గింగోటీలొద్దూ ఆ చేసిన కసరత్తు చాలు గానీ ఇలా రావై నీతోటి మాట్లాడాలి….

ఆది (వెయిట్స్‌ దింపి లేచి కూర్చుంటాడు) ఏటి? చెప్పండి…?

గోపా నీ పెళ్ళిట?

ఆది (తెల్లబోయి) మీకెవుల్చెప్పేరు……(క్రిష్ణతో) నువ్వు చెప్పేవా?

జానీ (అల్లరిగా) ఆడు కాదురా నీను! (కళ్ళెగరేసి) పెళ్ళి సంగతి……..మీ మామోల కూతుర్తోటి లపక్‌ లపక్‌ సంగతి…. ముడసర్లోవ చెర్లోన బోటు విహారం సంగతి……ఆళ్ళకన్నీ చెప్పీసేను………..అన్నీ!

ఆది నువ్వెప్పుడు చెప్పేవు? (కంగారుగా) జానీ మీకు ముందే తెలుసేటండి??

రాఘ లేదులేవై! మీ గురువు గారు చెప్పేరు……. పెళ్ళెప్పుడు?

ఆది ఈ ఇరయ్యెనిమిదిన సార్‌! ( గూట్లోంచి పెళ్ళి కార్డ్‌ , పెన్ను తెచ్చి, ఒక కార్డ్‌ మీద రాసి క్రిష్ణకిచ్చి) ఇదా కార్డు! తప్పకుంట రావాలి!

జానీ క్రిష్ణగాడ్ని పిలుస్తావురా నన్నెందుకు పిలుస్తావు. నేనేటి…… I am just a poor photographer…..

ఆది (కోపంగా) మాయక్కోలు మీ ఇంటికొచ్చి పిలుస్తారన్నానా?

రాఘ (వినోదంగా) మాకో? (క్రిష్ణ చేతిలోంచి కార్డ్‌ తీసుకుని చూసి)…… నల్ల మారమ్మ గుడి వద్ద, పాత బస్టేండ్‌……ఎక్కడీ కళ్యాణ మండపం ………?

ఆది కళ్యాన మంటపం కాస్సార్‌ మారమ్మ గుడి కాడే మా మాఁవోలిల్లు….అక్కడే పందిరి, అక్కడే డిన్నర….!

క్రిష్ణ (గోపాల్‌తో చిన్నగా) ఆదిబాబు పెళ్ళి కొస్తే మీరనుకున్నట్టుగే ఉంటాది సార్‌..?!

గోపా (ఇబ్బందిగా) కాని….. How’s that possible…? We hardly met him…!

క్రిష్ణ వీరిద్దరికీ కార్స్డియ్యి…

ఆది (అనుమానంగా) ఈలకా?!

క్రిష్ణ (చిన్నగా) ఇవ్వు పరవాలేదు….వీళ్ళకి మన పెళ్ళిళ్ళూ అవీ అంటే ఇష్టం……

ఆది (ఇంకో రెండు కార్స్డ్‌ తెచ్చి) పేర్లు సెప్పండి సార్‌ ?

గోపా నా పేరు గోపాల రావు. ఇతని పేరు రాఘవా ఆర్‌ నీలం

ఆది (క్రిష్ణతో) ఇదా..నువ్వు రాసిచ్చీ! (క్రిష్ణ పేర్లు రాసి ఇస్తాడు).

ఆది (సిగ్గుగా) నా పెల్లి సార్‌! ఈ ఇరయ్యెనిమిదిన….తమరిద్దరు తప్పకుంట రావాల….

రాఘ ఊఁ ఊఁ…తప్పకుండానూ….! ఇదుగో మరయితే (బేగ్‌ లోంచి ఒక కార్డ్‌ తీసి క్రిష్ణ చేతిలో పెట్టి) ఇదుగో…మా అన్నూ ఫస్ట్‌ బర్త్‌ డే పార్టీ. తాజ్‌ రెసిడెన్సీలో! మీ ముగ్గురికీ ఇదే కార్డు. (ఆదిబాబుని అనుకరిస్తూ) ‘ తప్పకుంట ‘ రావాల, ఓకే?

క్రిష్ణ థేంక్యూ సార్‌ (కార్డ్‌ చదువుతూ) chy. Anishvin Makarand Neelam! First Birthday Celebration…..Kalimga Ball Room, Taj Residency………

జానీ (కార్డ్‌ మీద ఫొటో చూసి) బాబు బలే బుజ్జిగున్నాడు సార్‌…! అనిష్విన్‌…..! Thats a nice name! (క్రిష్ణతో) అంటే ఏంట్రా?

క్రిష్ణ ఏమో…విష్ణుమూర్తి పేరేమో?!

రాఘ అలాటిదే ఏదో! Its a nice sounding name…No?! మా ఆవిడ సెలక్షను…! (ఆదితో) ఇంతకీ అసల్సంగతి చెప్పేవు కాదు?!

ఆది ఏటండి?

రాఘ నువ్వు ఎంత వరుకు చదువుకున్నావు?

ఆది ఎనిమిది…

రాఘ మరి మీ (చేతిలో పెళ్ళి కార్డు చూసి) శైలజ? తనెంతవరుకు చదువుకుంది…

ఆది మెట్రిక్‌ కట్టింది….

రాఘ నీ కంటే ఎక్కువ చదువుకుంది…నిన్ను డామినేట్‌ చేసెస్తుందోయ్‌..

ఆది అంటె…నీను ఎనిమిదిలో వుండగా మా ఫాదరు పోయేడు సార్‌ మరి కుటంబరం నడాల బడ్డీ ఎవుల్చూస్తారనీసి ఎడ్యుకేసన డిస్కంటిన్యం చేస్సి నీనూ టైలరింగు లోకి దిగిపోయేను………మా శైల్జా అలాట దాయి కాస్సార్‌!

జానీ ఆల మామోళ్ళ డాటర్‌ సార్‌ ! ఇష్క్‌ ఇష్కు! పొట్టోడలాగున్నాడనా….అమ్మో!!

రాఘ అంత గట్టోడివా? ఏదీ…ఈ కార్డు మీద శ్లోకం చదవగలవా…?

ఆది జానక్య..కమలా..మలాంజ….లి…పుటే…..యా పద్మ…….రాగాయితా…..లేద్సార్‌…మర్సిపోయేను….(సిగ్గుగా కార్డ్‌ పడెస్తాడు)

గోపా పెళ్ళి చేస్కుంటున్నావు.. నీకు రాబడి బాగానే ఉంటుందా….?

ఆది అంటే పరవాలేదు సార్‌.. పండుగుల్లో బాగుంటాది…..సోషల వెల్పేర్‌ వాల్లకి తలగడాలు సంచీలు కాంట్రాక్టున్నాది……

రాఘ నెలకెంతొస్తుంది……?

ఆది కర్చులు పోను రెండువేలయిదొందలు ఇలాగొస్తాదండి….మెట్రిక్కడితే ఏటున్నాది సార్‌…?

గోపా రెండు వేల్తోటి ఇద్దరు గెటాన్‌ అయిపోగలరా?

ఆది మరలాగే సార్‌! మా మాఁవే ఇల్లు తీస్తానన్నాడు సార్‌..

క్రిష్ణ లూనా కొన్నాడు సార్‌! లూనా….ఇరవయ్‌ వేలు డౌరీ…..

రాఘ కట్నం తీసుకుంటున్నావా? లవ్‌ మేరేజ్‌ గావోలు?

ఆది (సిగ్గుగా) మరలాగే సార్‌..

రాఘ (రెట్టించి) ఏంటలాగే..?

ఆది మరేదో వొకటి చూడాల కస్సార్‌! మా యమ్మేం బలవంతం సెయ్యలేదు. ఆలే ఇస్తాఁవన్నారు….మరి రోజులెలాగున్నాయో ఆ పెకారం ఇరవయ్యిస్తాను ఇంతకంటివ్వలేనన్నాడు…….మా యమ్మ మా యక్క మేఁవేం బలవంతం సెయ్యలేదు………..

రాఘ వాళ్ళు బలవంతం చేసేరా లేదా అన్నది కాదు ఇక్కడ ఇస్యూ. As a responsible young man… నీలో చైతన్యం ఉండాలా ఒద్దా? అసలు పెళ్ళంటే ఏంటి? స్త్రీ పురుషులిద్దరూ సమానమైన ప్రాతిపదిక మీద ఏ విధమైన అణచివేతలకూ తావు లేకుండా ఏర్పాటు కావలసిన మానవ సంబంధం. అవునా?! మరలాటప్పుడు ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవించలేకుండా సంతలో పశువుని అమ్మినట్టు పురుషుడు తనని తానే అమ్ముకొనే ఈ విధానం ఏంటి?

ఆది (తల దించుకుని) అంటే…మరలాగే సార్‌!

రాఘ ఈరోజు నువ్వు ఇరవై తీసుకుంటున్నావు రేప్పొద్దున్న నీకు పిల్లలు పుడతారు వా….

(గోపాల్‌ రాఘవని ఇంక ఊరుకో బావుండదు అన్నట్టు గిల్లుతాడు.)

రాఘ (ఆగిపోయి) ఇది నీ ఒక్కడితో ఆర్య్గూ చేస్తే తేలేది కాదులే. పెళ్ళి చేసుకుంటున్నావ్‌! ప్రయోజకుడివవుతున్నావ్‌……ఈ విషయాలూ ఆలోచించాలి! …ఆలోచిస్తూ పోతే ఆ క్రమంలో అవగాహన పెరుగుతుంది. అవగాహనా రాహిత్యమే జీవిత సౌఖ్యానికి మొదటి చివరి ఆటంకం…..(క్రిష్ణతో) నేనన్నది కాదు చిసూ గారి కొటేషన్‌ ! (గోపాల్‌ కేసి తిరిగి)ఊఁ…ఇంకెళ్దాఁవా?! కాఫీ తాగెళ్దాం రండి….

గోపా (వాచీ చూసుకుని) ఇప్పట్నుంచి హొటల్స్‌ తీస్తారా?

జానీ మాలక్ష్మి బడ్డీలో పెసరట్లేయించమంటారా?

గోపా ఎక్కడ?

జానీ ఇక్కడేనండీ! పెరటి తిన్న….రండి!

(డంగలా వెనక వీధిలో కాకా హోటల్‌. మాలక్ష్మి పొయ్యి ముందు నిలబడి పెసరట్లు పోస్తుంటుంది. వాళ్ళాయన బీడీ కాలుస్తూ పీట మీద కూర్చుని ఒక చేత్తో పిండి రుబ్బుతూ, మధ్య మధ్య టీ పొయ్యిలోకి గాలి పంపు తిప్పుతుంటాడు. ఒకాయన సుమారు అరవయ్యేళ్ళ మనిషి Times of India మడిచి చేతిలో పట్టుకుని బల్ల మీద కూర్చుని గాల్లోకి ఎగురుతున్న నిప్పు రవ్వల్ని తదేకంగా చూస్తుంటాడు. టెన్నిస్‌ ప్లేయర్స్‌ లాగ తెల్లటి టీ షర్ట్‌ నిక్కరు షూస్‌ వేసుకుని తెల్లటి జుట్టు కొంచెం పొడుగ్గా పెంచుకుని ఉంటాడు. నలుగురూ పాకలోకి వంగి దూరి బెంచీ మీద కూర్చుంటారు. రాఘవ గోపాల్‌ అతన్నీ పాకనీ మార్చి మార్చి పరిశీలనగా చూస్తుంటారు)

మాల (జానీతో) నాలుగిమ్మన్నారా?

జానీ ఊఁ….. నాలుగివ్వు! నాకు బటర్‌ రోష్ట్‌….పెసలెయ్యక!

మాల అలాగేనండి. కాపీలు ఇందండి…..

క్రిష్ణ (కాఫీ తాగుతూ, ఆరోపణగా) ఆదిబాబు దేవాంతకుడు! ట్వంటీ తౌజండ్‌ లో లూనా, టీవీ కొన్నాడు సార్‌!

రాఘ అదేలే! లూనా టీవీ ఇవనే కాదు….వస్తు ప్రపంచంలోని మార్పులన్నీ పరాయీకరణతో మనిషి సల్పే నిరంతర పోరాటానికి చిహ్నాలే….సరళా దేవి వ్యాసాలు చదివావా…?

క్రిష్ణ చదివేను సార్‌! మీకు నాన్‌ ఫిక్షన్‌ అంటే ఇష్టమా?

రాఘ ఊఁ. ఏం…నీకో?

క్రిష్ణ (జెంటిల్‌గా ధ్వనించే గొంతుతో) చదువుతాను సార్‌ కానీ….. I think I am primarily a poet than an essayist! సిద్ధాంత పరమైన వైరుధ్యాల మధ్య అనుభూతిని దూరం చేసుకోలేని క్షణాల్లో మనిషి వ్యాసం కంటే, కధ కంటే, నవల కంటే కవితనే కోరుకుంటాడు……

రాఘ (కాఫీ చప్పరిస్తూ, ఇష్టంగా) అరే! ఏఁవన్నావూ….సిద్ధాంత వైరుధ్యాల మధ్య…..అనుభూతి…? ఉహుహూఁ….అట్లా కాదు. సిద్ధాంత
ప్రాతిపదికను శాశ్వతీకరించుకుంటూనే అనుభూతుల ఆకర్షణను అధిగమించి అనుకంప దిశగా భావాల్ని మళ్ళించ గలిగినప్పుడే రచయితకైనా కవికైనా ఎడాలసెన్స్‌ నుండి విముక్తి లభించేది……!

గోపా అన్నట్టు నీకు చెప్పేలేదు…ఇతను ఊకా గారి మేనల్లుడు!

రాఘ అయ్య బాబోయ్‌ ? కధార్ధ జీవన వ్యధార్త శిల్పి ఊకా?! Really? Vow! I’m impressed! మన కళా కిరీటం ప్రోజెక్ట్‌కి ఇతన్ని రీజినల్‌ ఇన్‌ చార్జ్‌ గా వేసుకుంటే బావుంటుంది……..

క్రిష్ణ ( వినయంగా నవ్వుతాడు.) ఎడాలసెన్స్‌ నుండి ఎడల్ట్‌హుడ్‌ వైపు చేసే ప్రయాణం కంటే క్లిష్టమైన ప్రయాణాలు లేవూ…..ఐతే ఈ సత్యాన్ని గ్రహించటానికి ఒక జీవిత కాలం చాలదంటాడు చిసూ……!

రాఘ అట్లా అన్న చిసూవే సత్యాన్ని దర్శించేందుకు క్షణ కాలం చాలదా! సాహితీ స్నేహాల చలివేంద్రలలో సేదదీరి సాగిపో శతృవుకు అభివాదన చేస్తో మృత్యువును అవహేళన చేస్తో అనీ అన్నాడుగా! తనని తాను కాంట్రడిక్ట్‌ చేసుకోలేని వాడు మహా కవి కాలేడు. నేనూ చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో నీలాగే అనుభూతి మత్తులో బీచ్‌ ఒడ్డున వెన్నెల రాత్రుల్లో తిలక్‌ కవితలు చదువుకుంటూ తిరిగినవాణ్ణే…! ఊఁ…..? అయితే ఇవాళ్టి ఇరవయ్యొకటో శతాబ్దపు సంక్లిష్టతలకి సమాధానం దొరికేది అనుభూతిలో కాదు! అనుకంపలోనే…..! అనుకంప లేని అనుభూతి జీవం లేని శరీరం లాంటిది. ఏమంటావ్‌….?

జానీ అనుకంపా? అంటే ఏంటండి….?

గోపా అంటే..అంటే ఎంపథీ….

క్రిష్ణ (నెమ్మదిగా) ఐతే……వైయక్తికమైన భావజాలానికీ సామూహికమైన భావజాలానికీ ఐక్యతని సాధించుకునే విశ్వ ప్రయత్నంలో కవి అనుభూతి స్నాతుడు కానిదే అనుకంపకు చేరువ కాలేడనిపిస్తుంది. మిమ్మల్ని కాంట్రడిక్ట్‌ చెయ్యాలని కాదు. ఇది…..నా వినయ పూర్వకమైన ఆశంస. అంతే!!

జానీ నిజమే సార్‌ నాక్కూడా అనిపిస్తుంటుంది…………..ఎప్పుడైనా అలాగ ఒక్కణ్ణే కూచున్నప్పుడు ….(అనుకోకుండా కూర్చున్న పెద్దాయనతో
చూపు కలిసి, మాట ఆపి ఆశ్చర్యంగా) రుద్రా గారు? రుద్రా గారూ……?

రుద్ర (కళ్ళ చివర్లంట చూస్తూ నవ్వి) O Hello Johnny….! So you remeber………

గోపా ఓహో? ఈయన నీకు ముందే తెలుసా?

జానీ ఆల్‌ ఐ నో ఈజ్‌ దట్‌ హీ ఈజ్‌ రుద్రా గారు. ఎప్పుడైనా ఆర్నెల్లకోసారి డంగలా కొస్తారండి….(చిన్నగా) ఇంగ్లండ్లోనో ఎక్కడో ఉంటారండీ…ఎప్పుడో ఆర్నెల్లకో ఏడాదికో ఇక్కడికొస్తుంటారు…..

రాఘ (చెయ్యి చాచి) Hi! I am Raghava…..Dr. Raghava R. Neelam. This is prof. Gopal. We’re visiting from the States…… (ఆగి మళ్ళీ, ఆసక్తి దాచుకోలేనట్టు) You seem very keen on our discussion…..?

రుద్ర (చెయ్యి అందుకుని) O Hi..I am Rudramurthy…..from Burma colony…… (కళ్ళద్దాల్లోంచి క్రిష్ణ కేసి చూసి) Quite a talkative young man you have here…!

క్రిష్ణ (తత్తర పడి) ఏంటండీ…?

రుద్ర I’ve been listening to you! Quite an impressive orator you are. Glib talker, eh?! ఆదిబాబు గురించా మాటాడుతున్నావు? Why don’t you do him the favor of inviting here….? Poor chap…he can’t even defend himself now?

క్రిష్ణ (కంగారుగా) అబ్బే…..ఆదిబాబు హారతికెళ్ళేడండి !?

గోపా ఆదిబాబు తెల్సా మీకూ…..?

రుద్ర తెలుసండీ…. I know this whole gang.. (క్రిష్ణతో) Tell me now, I’m just curious. Where did you learn to talk like that…..?

క్రిష్ణ అంటే… I just know..

రుద్ర What do you know? (వంగి ఆకాశంకేసి చూపించి) Do you know that the sky is blue?

క్రిష్ణ (అయోమయంగా) ఊఁ!

రుద్ర నీకెలా తెల్సు….?

క్రిష్ణ తెలుసంతే…!

రుద్ర No! You know that its blue because your grandmother first told you so.

గోపా ఏదైనా అంతే కదండి.

రుద్ర (క్రిష్ణతో) మరి నువ్వు ఆడే ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు…ఊఁ?

క్రిష్ణ (ధైర్యం తెచ్చుకుని) భావాలని అక్షరాలుగా అనుభూతుల్ని మాటలుగా మలచుకోవటం ఒకరు నేర్పించాలేంటండీ………..

రుద్ర You must have picked it up in some books, some discussions………talking to somebody like yourself. And you come here and parrot what you learned ……..

రాఘ And whats wrong with that? Don’t you use references in scientific research??

క్రిష్ణ అవునండి! What is wrong with that?

రుద్ర (కటువుగా) Everything!

గోపా (లేచి) రండి వెళ్దాం రండి……రండి! (లేచి బయటికి నడుస్తుండగా)

రుద్ర (క్రిష్ణతో) Listen. All I am trying to point out is that all this knowledge you are so proud of flaunting isn’t worth a tinker’s damn!

(జానీ నవ్వాపుకోలేక ముందుగా పెద్దగా నవ్వుకుంటూ పైకొచ్చెస్తాడు.)

జానీ (ఇంకా నవ్వుతూనే) అడ్డంగ బుక్కైపోయేవేట్రా? రుద్రా దగ్గిరా…..

క్రిష్ణ (కోపంగా) నువ్వు ముయ్యిబే!

గోపా (ఆసక్తిగా) ఎవరు జానీ ఈయన?

జానీ ఈయన ఇంగ్లండ్‌ నుండో ఇటలీ నుండో ఆర్నెల్లకీ అలాగొస్తారండి! బర్మా కోలనీలో కారుపెంటరప్పారావు కార్ఖానా పక్కన ఒగ్గదిలో దిగుతాడు సార్‌ ఒకొక్క సారి ఫ్రెండ్లీగానే ఉంటాడు….!! తిక్కలోడు సార్‌! ఇదివరుకోసారీ రవిగాడ్నిలాగే తగులుకున్నాడు. (క్రిష్ణతో) రవిగాణ్ణడిగినా మంగవేణి నడిగినా ఈయన సంగతంతా చెప్పెస్తారు…………

క్రిష్ణ (ఆ సంగతి ఇష్టం లేనట్టు) మనం సహృదయతతో సౌమ్యంగా ప్రవర్తిస్తుంటే ఎవరెన్ని అన్నా ఆ మాటలేం చెయ్యలేవు….

గోపా ఎవరు రవీ, మంగవేణీ?

జానీ రవి గాడు మా ఫ్రెండే సార్‌! మంగవేణీ డౌరీ డెత్స్‌ ఏక్టివిష్టు. క్రిష్ణాల ఫేమిలీ ఫ్రెండ్సే! (చికాగ్గా ఉన్న క్రిష్ణతో) ఏంటి మేన్‌ టూ మచ్చేస్తన్నావ్‌? రుద్రా సంగతి నీక్కొత్తేంటి?

క్రిష్ణ ఎంత ఇగ్నోర్‌ చేద్దాఁవన్నా అయింది కాదురా….సందు చూసి తగులుకున్నాడు….! (రాఘవతో) మీరు ఆయన్ని అడక్కుండా ఉండవల్సింది సార్‌!

రాఘ ఏమో! తిక్క మనిషని నాకేం తెల్సు…..!

జానీ ఫర్గెటిట్‌ ఎండ్‌ బీ హేపీ! మోర్నింగ్‌ షో కెల్దాఁవా?

రాఘ ఏంటి మోర్నింగ్‌ షో?

జానీ అచ్చికొప్పు రాగంగళ్‌…!

క్రిష్ణ (కోపంగా) ముయ్యిబే నీ యబా…..! నేను సైటు మీదికెళ్ళాలి.

జానీ ఉట్నే అన్నాన్రా! మా పెదనాన్నని హాస్పటల్లో జాయిన్‌ చేసేరు. నీనెళ్ళాల. సీ యూ సార్‌

(జానీ డంగలా కేసి, మిగిలిన ముగ్గురూ కారు కేసీ నడుస్తారు.)

మూడవ స్థలం

(క్రిష్ణ మోహన్‌ వాళ్ళ ఇల్లు)

క్రిష్ణ అమ్మా! అమ్మూ!! కాఫీ చుక్‌ గీఫీ చుక్‌ పెట్‌ గిట్‌…

(కేక వేస్తూ మెట్లు దిగుతూ రామజోగి) క్రిమో? ఒరే క్రిమోగా?!

క్రిష్ణ (నాన్నని చూసి) ఓహో? చింతాడ నుండి ఫస్ట్‌ బస్సుకి రావడము జరిగినదా ప్రభో?

(వంటింట్లోంచి గంట వాయిస్తూ ఒక ముసలావిడ గొంతుక)

ప్రాణాయిస్వాహా… అపానాయిస్వాహా…ఉదానాయిస్వాహా…వ్యానాయిస్వాహా…సమానాయిస్వాహా….. గుంప సోఁవేశ్వరుడా తండ్రీ…… మాగ్గైరీ పార్వద్దేవమ్మా తల్లీ … సీతారాఁవుల వారూ తండ్రీ……..గంగై మంగళ తరంగై…!

క్రిష్ణ ఓహో పెద మామ్మ కూడా వొచ్చిందీ… సహేంద్ర తక్షకాయ స్వాహా…!

(రామజోగి ప్రవేశం. చేతిలో న్యూస్‌ పేపర్‌ ఉంటుంది. తలంతా నెరిసిపోయి ఉంటుంది.)

రామ (తీవ్రంగా) ఏఁవిరా క్రిమో నువ్వు కళా వీధిలో దమయంతీ వాళ్ళింటికెళ్ళేవా?

క్రిష్ణ (తెల్లబోయి) వెళ్ళేనూ….?

(అమోఘ రత్నం కాఫీలు పళ్ళెంలో పెట్టుకుని, నెమ్మదిగా) అయ్యో! వాళ్ళు సాని వాళ్ళు నాన్నా! అక్కడికెందుకెళ్ళేవూ?

రామ మా జేయీ తొవలో కనిపించి చెప్పేడు మీ వాడ్నక్కడ చూసేను జాగర్తని…చెప్పు? వెళ్ళేవా లేదా?

అమో ఇష్షు! కేకలెయ్యకండి…..నెమ్మది. ఏఁవిరా నువ్వు కళా వీధిలోకి వెళ్ళేవా?

క్రిష్ణ ఏమో జన మాఁవయ్య గారు ఆవిడ రమ్మందని చెప్తే వెళ్ళేను. నాకేం తెల్సు……రెండు ప్లాట్స్‌ తీసుకుని అడ్వాన్స్‌ కూడా ఇచ్చింది….

రామ నువ్విలాటి వెధవ్వేషాలు వేసేవంటే చింతాడ రానే రాకూ! తెలిసిందా? సంసార్లకి జాగాలమ్మితే చాలదా సాన్లక్కూడా అమ్మాలా యూస్‌ లెస్‌ ఫెలో?!

క్రిష్ణ అబ్బా నెమ్మదిగా మాట్లాడండి…నాకు తెలీదన్నానా? ఆవిడ సాందని నాకేం తెలుసు. జన మాఁవయ్య చెప్తే…

రామ (పెద్దగా) ఆ జనా ఒకడు, వుమనైజర్‌ దొంగ మాదర్చోత్‌! వాడా నీకు మెంటరు…….

గోపా (కర్టెన్లోంచి తొంగి లోపలికి చూసి) ఏయ్‌ క్రిష్ణ మోహన్‌! ఏఁవయ్యింది… Is everything alright?

రామ (ఆవేశంగా ముందు గదిలోకి దూసుకొచ్చి) మీరు పెద్దవాళ్ళు అమెరికాలో హయర్‌ ఎడ్యుకేషనదీ చేసేరుట మీరు చెప్పండీ. దిస్‌ బోయ్‌…మై సన్‌….హీ ఈజ్‌ సెల్లింగ్‌ రియలెస్టేట్‌ టు ఏ..ఏ..(చెప్పలేక తడబడి) …..షీ ఇజ్‌ దీ మోస్ట్‌ ఇండీసెంట్‌ కరప్ట్‌ వుమన్‌ ఇందీ టౌన్‌ చింతాడా వేర్‌ అయ్‌ వర్క్‌… చెప్పండి. ఇదే అమెరికాలో ఇంగ్లండ్‌ లో అయితే సివియర్‌ పనిష్మెంట్‌ ఇస్తారా లేదా? యూ ప్లీజ్‌ అడ్వైజ్‌ హిమ్‌.!? ఊఁ…??

గోపా అలాక్కాదు ఆవేశపడకండి ముందితను ఏం చేసేడో కనుక్కోండి….!

క్రిష్ణ (అవమానంతో ఉడికిపోతూ) వాళ్ళ దగ్గిరికెందుకూ వాళ్ళు మా ఫ్రెండ్సు. తగువు మనుషులు కారు. ఇంట్లోకి రండి…..

(కోటీశ్వర్రావు బనీను, లుంగీ, తువ్వాల్తో మొహం తుడుచుకుంటూ వచ్చి)

కోటి (గోపాల్‌ తో) హలో సార్‌! నమస్తే! మీరుండండి మాఁవయ్య గారూ…నాకన్నీ తెల్సు కదా నేనే వెళ్ళమని చెప్పేను….డబ్బుకి సాని డబ్బూ సంసారి డబ్బూ అని లేదు కదా ఆవిడికి కావాలని కొనుక్కుంటోంది. రిజిష్ట్రేషన్‌ చేసి ఆవిడి కాయితాలావిడికిచ్చేస్తే అయిపోయింది…దీనికింత రాద్ధాంతఁవెందుకూ…..

రామ ఎందుకా? పోలాలమావాస్య నాడు మా జేయీ ఎదురుకుండా మంగలి షాపులో కూర్చుని వీడు లోపలికెళ్ళడం చూసేట్ట! వీడు సాయంత్రం ఏడింటికెళ్ళి రాత్రి తొమ్మిదిన్నరకి బయిటికొచ్చేట్ట….

కోటి ఏం వై నిజఁవేనా?

క్రిష్ణ నిజఁవే మీ జేయీని నేనూ చూసేను. అవేళ గాలీ వానా వొచ్చి కరంటు పోయింది. ఆవిడ నేను ఏం చెప్పకుండానే ‘ నాకు ముసిలి కాలంలో చుట్టూ మొక్కలేసుకుని ఇల్లు కట్టుకోని రామా క్రిష్ణా అనుకుంటూ ఉండాలనుంది. నువ్వు జనా గారి చేత జాగా తీయించేవుట. నాకూ కావాలి చూపిస్తావా ‘ అంది.

రాఘ (ఆసక్తిగా) నువ్వేంటన్నావు……?

క్రిష్ణ నేనేంటన్నాను…..గండి గుండంలో జాగాలున్నాయి. తీసుకోమన్నాను. జన మాఁవయ్య గారి దగ్గరయితే ఒద్దన్నాది. అయితే గంగి వలసలో తీసుకోమన్నాను. చెప్పిందంతా విని ‘ నా కష్టార్జితం డబ్బు కదా. నీ మాట విని ఎందుకు తీసుకోవాలీ? నువ్వెవడివో కూడా నాకు తెలీదూ ‘ అంది.

కోటి ఎడ్వాన్సిచ్చింది మరీ?

క్రిష్ణ ఇప్పుడు తీసుకుంటే ముందుకి బోల్డు ధరొస్తుంది….అయామ్‌ లైక్‌ యువర్‌ సన్‌ అనుక్కోండి అన్నాను. అంటే ఉన్నట్టుండి నా చేతులు రెండూ పట్టుకుని భోరుమని ఏడ్చీసింది. ‘ నాకు బిడ్డ సంచీ తీసీసేరు. నాకింక పిల్లలు పుట్టరు…..నాకు పిల్లడ్ని కన్నంత అదృష్టం కూడానా….నువ్వు అంత మాటన్నావు……అదే చాలు ….. ‘ అని. చీకట్లో ఎడ్వాన్సివ్వకూడదు కరంటొచ్చేవరుకూ ఆగమంటే ఆవిడ కొట్టిన సుత్తంతా వింటూ కూచున్నాను …….

కోటి అంతే కదా! నెమ్మదిగా రిజిష్ట్రేషనయిపోయే వరుకూ ఊరుకో. (మామగారితో) తెలీక వెళ్ళేడండీ. ఇహమీదట వెళ్ళకు..తెలిసిందా? బేలన్స్‌ తీసుకోడానికి కాఁవస్తే ఈ సారి నేను వెళ్తాను….

అమో నువ్వూ వొద్దూ వాడూ వొద్దూ మనిషి వాడ్ని పంపించి నేను తెప్పిస్తాను.

రాఘ (రామజోగితో) ఈ పాటి దానికి ఎందుకండీ ఆవేశం? మీ వాడు ఇంకా నయం ఎక్కడికెళ్తునాడో ఏం చేస్తునాడో అడిగితే చెప్తున్నాడు . అమెరికాలో అయితే పిల్లల పెర్సనల్‌ మేటర్సేం మీరు అడగడానికే వీల్లేదు……

రామ (నమ్మకం లేనట్టు) ఏదో అలాగ వెనకేసుకొస్తారు ఇటీజ్‌ దీ మోష్ట్‌ ఎడ్యుకేటెడ్‌ సొసైటీ……వీడు సరిగ్గా చదువుకుంటే అమెరికా తోలెస్తాఁవండీ అక్కడికెళ్ళేనా బావుపడతాడు…..

అమో (గోపాల్‌ తో, రాఘవతో చెప్తున్నట్టు) అదిగో అదేదో అది చూడండి! అమిరికా తోలిస్తే ఈ బావా ఈ తిరుగుళ్ళూ అన్నీ బంద్‌! అక్కడ మనుషులేఁవిటిలాగ మంచులో పెట్టి తీసిన ఏపిలీసు పళ్ళలాగ! మా అప్ప గారి మనవలు అక్కడే ఉన్నారండీ….ఇయావూలో ఉన్నారు. మహా సత్యఁవైన దేశంట. అందుకే కదు నాన్నా మరి ఆ అష్ట లక్ష్మీ తాండవం………..

రాఘ ఇయావూ కాదండీ…అయోవా!

రామ అయోవా! అయోవా!! అక్కడంతా మోష్ట్‌ ఎడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. దొడ్లు తుడిచీ వాడు కూడా కార్లో వొచ్చి దొడ్డి తుడిచీసి పోతాట్ట. ఇక్కడా…..? ఎన్టీఆరన్నాడు కదా…..వాళ్ళ రోడ్లు మన బెడ్రూమ్స్‌ కంటే నున్నగా సుబ్భరంగా ఉంటాయనీ….

గోపా ఇప్పుడిక్కడేం చెడిపోయేడండి మీ వాడు….

అమో ఆయనుట్టినే అలా అంటారండీ…మా క్రిష్ణకేఁవీ జన ముద్దైన పిల్లడు……

క్రిష్ణ (ఏడుపు గొంతుతోటి) నా ముద్దు మండినట్టే ఉంది. అక్కడ రుద్రా గారు తగులుకున్నాడు…ఇక్కడీయనా!

కోటి (సాధికారంగా) మాఁయ్‌ గారూ! ఎవ్విరి థింగీజ్‌ ఆల్రైట్‌! మీరు లోపటి కెళ్ళండి. అత్తయ్‌ గారూ! మీరు కాఫీ టిఫిన్లేవో ఉన్నాయా లేదా? (రాఘవ తోటి) సారీ సార్‌! లాష్ట్‌ టైము మిమ్మల్ని చూడ్డం పళ్ళేదు, అయ్‌ లెఫ్టే మెసేజి విత్‌ యువర్‌ మిస్సెస్‌ గారు. జాగాలు చూడ్డాని కెప్పుడెళ్దాఁవండి?

రాఘ ముందు మా ఫాదరిన్లాని మీటవ్వాలండీ. ఆయన కోసం……మా కోసం కాదు!

కోటి ఐ సీ! అచ్ఛచ్ఛా! సరే ఆ రకంగా చేద్దాఁవండి. ఫష్ట్‌ లెటజ్‌ మీట్‌ యువర్‌ ఫాదరిన్లా ఎండ్‌ ఎక్స్‌ప్లెయిన్‌ దీ సిట్యువేషన్‌! (అనుమానంగా) మీకూ స్లమ్సవీ అంటే ఇష్టఁవా ఏటండి?

గోపా (నవ్వి) అతనికే నా కంటే ఎక్కువిష్టం…..

కోటి (క్రిష్ణతో) స్లమ్స్‌ కాదు కానీ ఒకసారలాగ సర్దాగా మన సైటు మీదికి తీసుకెళ్ళు. ఏం?

నాలుగవ స్థలం.

(బర్మా కోలనీలో ఒక ఇల్లు కడుతున్న సైటు. ఇటుకల గోడలు సగం లేచిన ఇల్లు.

ముత్యాలు మేస్త్రి TVS50 మీద కూర్చుని పనివాళ్ళని అదమాయిస్తుంటాడు. క్రిష్ణ రాజ్‌ దూత్‌ మీద కూర్చుని ఉంటాడు. గోపాల్‌ రాఘవ దూరం నుండి ఇళ్ళన్నీ పరిశీలించి చూస్తూ వస్తుంటారు.)

ముత్తేలు సూత్తావేటబ్బాయ్‌ సూత్తావేటీ? గలాయించూ….సూత్తూ కూకుంటే పన్లవుతాయేటీ?

తాతబాబు (సున్నం కలుపుతూ, కోపం నటిస్తూ) ఎవులు కూకున్నారు మేస్త్రీ? (క్రిష్ణని చూపించి) కూకుంటే డబ్బులిస్తాడా ఆ బాబు?

రాములమ్మ (నలభయ్యేళ్ళ మనిషి. ముక్కుకి, చెవులకి తమ్ములు వేలాడుతుంటాయి. నేత చీర జాకట్టు లేకుండా తొడుక్కుని ఉంటుంది. పచ్చటి చేతుల నిండా పచ్చ బొట్లు వేసి ఉంటాయి. చుట్ట నోట్లోంచి తియ్యకుండానే) బాబు శానా మంచివాడు. బాబునేటనక!!

ఎల్లమ్మ (ఏభయ్యేళ్ళ మనిషి. ముక్కుకి, చెవులకి తమ్ములు వేలాడుతుంటాయి. నేత చీర జాకట్టు లేకుండా తొడుక్కుని ఉంటుంది. కొప్పు ముడిచి పెట్టుకుంటుంది. చేతులకీ కాళ్ళకీ వెండి కడియాలు ఉంటాయి) ఎర్రిబేపి కరిసీసి సచ్చిపోనాడు గానీ నేపోతె నా కొడుకు నీయంతుంటాడు కాడా? బాబూ క్రిష్ణ బాబు…..! (నిష్టూరం నటిస్తూ మీదికొచ్చి) ఏవీ టీలన్నావు కాఫీలన్నావు టిపినీలన్నావు?? ఎల్లమ్మా ఎదవ ముండా నీయంత మంచిదాయి నేదు పునాదులు సల్లగేయిస్తే నీకూ రాఁవులమ్మకీ కోకలు కొంతానన్నావు బాబూ….?

(అల్లరిగా మీది మీదికొచ్చి గాజుల చేతులు ముఖం మీద గలగల్లాడిస్తూ పాడుతుంది)

అంతన్నావింతన్నావురో గంగరాజు

ముంత మాఁవిడి పళ్ళన్నావురా…….(వెనక కొత్త మనుషులు రావడం చూసి సిగ్గుగా ఆపేస్తుంది)

గోపా (కంగారుగా) అయ్యో ఆపకాపకు పాడు……పాడమ్మా ….పాడు..

ఎల్ల (తాతబాబు సున్నం కలపడం ఆపి గమేళా మీద తాపీతొ తడుతూ దరువులు వేస్తుండగా…దబాయింపుగా పాడుతుంది)

అంతన్నావింతన్నావురో గంగరాజు
ముంత మాఁవిడి పళ్ళన్నావురా…….
ఎలక బళ్ళు ఎడ్లన్నావురో గంగరాజు
సిలక వంటి పిల్లన్నావురా…………
అంతన్నావింతన్నావురో గంగరాజు
సింత సిగురు కూరన్నావురా……
పలక రాయి మేడన్నావుర్రో గంగరాజు
నెలకి రెండు కోళన్నావురా…….
అంతన్నావింతన్నావురో గంగరాజు
మంతనాలికి రమ్మన్నావురా……….
మచ్చ లేని పిల్లన్నావురో గంగరాజు
ఇచ్చ రూపాయిందన్నావురా……….
అంతన్నావింతన్నావురో గంగరాజు
ముంత మాఁవిడి పళ్ళన్నావురా…….

గోపా (ఏడిపిస్తున్నట్టు) ఏం క్రిష్ణ మోహన్‌ అలాగన్నావా ఆవిడితోటి…?

రాఘ అనే ఉంటాడు….అనకుండా ఎందుకు పాడుతుందీ? అంత మంచి పాట పాడింది…..టిఫినేంటి…… you should buy her lunch!

క్రిష్ణ అబ్బే! లేద్సార్‌..ఎల్లమ్మ ఇగటాలలాగున్నాయి! (తాతబాబుకి సైగ చేసి పిల్చి డబ్బులిచ్చి) ఎళ్ళీ….

తాత ఊఁ….

క్రిష్ణ ఎళ్ళి….పదకొండు కాఫీలు….ఎనిమిది టిఫిన్లు పట్రా! వీరికీ నాకూ స్పెషల్‌ కాఫీలు చెప్పు! (గోపాల్‌తో) కాఫీలు రప్పించక పోతే నా
బడ్డెక్కలాగెస్తుంది…..

గోపా (మెచ్చికోలుగా ఎల్లమ్మని చూస్తూ) ఎంత బాగా పాడిందో….!

రాఘ ఇక్కడ వినేసి ఊరుకోడం కాదు! అట్లాంటి ఫోక్‌ సాంగ్స్‌ కాల గర్భంలో కలిసి పోకుండా కాపాడుకోవాలి. ఇంగ్లీష్‌ లోకీ ఫ్రెంచ్‌ లోకీ అన్ని వరల్డ్‌ లేంగ్వేజెస్‌ లోకీ ట్రాన్స్‌ లేషన్స్‌ చేయించి మన జానపద సాహిత్యం అంతర్జాతీయ స్థాయిగా ఖ్యాతి పొందే లాగ చూడాలి!

క్రిష్ణ ఇదేంటండి…ఇంకెన్నొచ్చో! ఒక రోజు వానొచ్చి వాచిమేను పాకలో టిక్కడిపోయేఁవు. దానికొచ్చిన పాట్లన్నీ పాడీసింది. (సంస్కార పూర్వకంగా గొంతు పెట్టి) ఇటువంటి ఫోక్‌ సాంగ్స్‌ ఇంగ్లీష్‌ లోకి ట్రాన్స్‌ లేషన్స్‌ చేయ్యడానికి ట్రై చేస్తుంటాను సార్‌!

రాఘ వూఁ…? ఏదీ ఏవేనా చేసేవా?

క్రిష్ణ ఊఁ! ట్రై చేసేనండి.. (ఏక్సెంట్‌ పెట్టి)

you said this much, you said that much, O Ganga Raj…..

Mangoes the size of a pot you said!

Rats pull my cart, you said O Ganga Raj……..

I am pretty as a parrot, you said!

                                                                                                                                       (ఇంకా ఉంది)
-----------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment