Sunday, March 18, 2018

బ్రహ్మపురాణం


బ్రహ్మపురాణం




సాహితీమిత్రులారా!




అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మపురాణం. 
విష్ణుపారమ్యం కలది విశేషించి కృష్ణగాథలు ఉన్నది.
బ్రహ్మకల్పంలో ప్రవర్తితమైన రాజస పురాణం ఇది.
ఋషులకు బ్రహ్మ చెప్పినట్లుంది. ఇందులో 5 సర్గలు,
పదివేల శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణ ప్రశస్తి 
ఇతరపురాణాల్లో ఎక్కువగా కనబడుతుంది.

        ఇందులో మొదట బ్రహ్మ సృష్టిక్రమం, వర్ణన,
రాక్షస, దేవతా వంశాల, సూర్యచంద్ర వంశాల విస్తృత
వర్ణన ఉన్నాయి. ప్రతిసర్గంలో దక్షప్రజాపతితో సృష్టి
ప్రారంభం కావడం, దక్షుడు అదేపనిగా సృష్టి చేస్తూండగా,
ఆ సృష్టికి కావలసినంత స్థలం వున్నదో లేదో తెలుసుకొమ్మని
నారదుడు ఉపదేశించడం, దక్షుని కుమార్తెలు భూవిస్తృతిని
తెలుసుకొని రావడానికి పోయి తిరిగి రాకపోవడం చెప్పబడింది.
సూర్యవంశ వర్ణన సందర్భంలో సగరకుమారులు యాగాశ్వాన్ని
వెదకుతూ ముని ఆగ్రహానికి గురుయై భస్మంకావడం అనే కథలో
ఆ ఆరువది వేల మందిలో నలుగురైదుగురు ముని అనుగ్రహం 
పొంది చావు తప్పించుకొని వారే యాగాశ్వాన్ని తిరిగి చెచ్చారని
ఈ పురాణం చెబుతుంది. భగీరథుడు తపస్సు చేసి గంగను 
భూమిపైకి తేవడం కూడా వర్ణితమైంది ఇందులో.

         చంద్రవంశ గాథా ప్రారంభంలో చంద్రుడు అత్రిమహర్షి
కుమారుడై పుట్టి చంద్రవంశాన్ని విస్తంరింపచేసినట్లుంది. ఆ తరువాత
రుద్రమహాత్మ్యవర్ణన ప్రసక్తం కాగా పార్వతీ పరమేశ్వరుల వివాహం 
వర్ణింపబడింది. గౌరి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను
ప్రేమించినట్లు చెప్పాడని, గౌరి శివుని తన తండ్రితో కలిసి 
మాట్లాడమని కోరిందని, శివుడు హిమవంతుని వద్దకుపోగా ఆయన
తన కుమార్తెకు స్వయంవరం చాటిస్తాడని కథనం. తిరిగి గౌరి వద్దకు 
పోయి మావంటి పేదలు స్వయంవర సభలోకి ఎట్లా రాగలరని అడగగా 
గౌరి శివుని మెడలో అప్పటి కప్పుడే పూలమాలవేసిందట. స్వయంవరంలో 
శివుడు శిశురూపంలో గౌరి అంకతలంపై క్రీడించగా, గౌరి ఆ శిశువు మెడలో 
స్వయంవరమాల ఉంచింది. దేవతలు అందుకు కోపించి యుద్ధం 
చేయబోయి ఓడిపోయారు. చివరకు నిజం తెలుసుకొని వారు శివుని స్తుతించారు.

                    తరువాతి కథ జగన్నాథక్షేత్రం()పూరి)లో వెలసిన
జగన్నాథ, బలరామ, సుభద్రామూర్తుల ఆవిర్భావంతో సంబంధించిన
ఇంద్రద్యుమ్న చరిత్రం. శ్రీకృష్ణచరిత్రం కూడా విపులంగా వర్ణించబడింది.  
భాగవత కథాంశాలకంటె ఇందులోని కథాంశాలు భిన్నంగా ఉన్నాయి.

                    ఇందులోని ఒక విశేషాంశం దశావతారకథనం. అగ్నీధ్ర రాజవృత్తాంతం 
మాయ అంటే ఏమిటో నిరూపించి,  దానిని నిరాసం(తిరస్కరం) చేయటానికి 
యోగాభ్యాస ఆవశ్యకతను నిరూపించి  ఆ సందర్భంలో సాంఖ్యయోగాన్ని వివరించటం జరిగింది. ప్రసక్తానుప్రసక్తంగా అక్షరాక్షర స్వరూపనిరూపణం, విద్యావిద్యా మహిమ స్వరూపనిరూపణం చేయబడ్డాయి. ఆ తరువాత సర్వపురాణాలకు సామాన్యమైన 
తీర్థవర్ణనలు, ద్వీప, వర్ష వర్ణనలు ఉన్నాయి. పురూరవ చక్రవర్తి పూర్వజన్మ 
వృత్తాంతం ఒక ప్రత్యేక గాథగా ఉంది. ఈ పురాణాన్ని జనమంచి శేషాద్రి శర్మ(1892-1950)
గారు పద్యానువాదం చేశారు. వెంకట పార్వతీశ్వరకవులు కూడా నడకుదుటి వీరరాజుతో 
కలిసి మరో అనువాదం చేశారు.

No comments:

Post a Comment