Thursday, May 11, 2017

గతి నింపలరెన్ బళి దృగ్విలాసమై


గతి నింపలరెన్ బళి దృగ్విలాసమై




సాహితీమిత్రులారా!



రోసనూరు వేంకటపతి కృత
విష్ణుమాయా విలాసములోని
ఈ పద్యం చూడండి-

విష్ణులోకంలో ఒక తిన్నెమీద మోహినిగా బంతి ఆడుతూ
శివుడికి పునర్దర్శనమిస్తాడు శ్రీహరి. పైకి ఎగిరిన బంతిని
చేత్తో పట్టుకోవడానికి ఆ వగలాడి మోహిని ఎగిరింది. అలా
ఎగిరిన ఆమె మేను బైరిడేగలాగా చూడడానికి చూపరులకు
కనువిందు చేసింది.
ఆ సందర్భములోని పద్యం ఇది చూడండి-

ఎగసిన బంతిఁజేనొడియ నీ వగలాఁడి చెలంగఁ బొంగు మే
నొగి యల బైరిడేగవలె నుండెడి గుత్తపు గుబ్బ లప్పుడా
మొగమున కొక్కమై నెగయు ముచ్చట చన్గవ జక్కవల్వడి
న్నెగిరి చనంగఁబోవుగతి నింపలరెన్ బళి దృగ్విలాసమై
                                                                                   (విష్ణుమాయా విలాసము - 3- 32)

ఆమె ఎగిరినపుడు గుత్తపు గుబ్బలుకూడ ఒక్కసారిగా
ముఖంవైపు ఎగిరి పడ్డాయి. ఆ ముచ్చట ఎలా ఉందంటే
వక్షోజాలు చక్రవాక పక్షులుకాబట్టి సహజంగానే అవి ఎగిరి
వెళ్ళిపోతున్నాయా అన్నట్లు ఇంపు గొలిపాయి. బళిబళీ
మొత్తంమీద ఆ యువతి చూపరులకు
ఒక దృగ్విలాసంమయ్యింది - అని భావం

ఇందులో కవి వర్ణన కంటికి కట్టినట్లు
ఎంతచక్కగా ఉందో కదా

No comments:

Post a Comment