Thursday, June 28, 2018

విద్వాన్ విశ్వం ఆధునికస్వరం


విద్వాన్ విశ్వం ఆధునికస్వరం




సాహితీమిత్రులారా!

కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు – ఒక సరికొత్త పాటను వినిపించిన కవి విద్వాన్ విశ్వం. పద్యానికి ఆధునికస్వరాన్ని యివ్వడంతో పాటుగా, పాటని కావ్యంగా మలిచిన చాలా కొద్దిమంది కవులలో ఆయనొకరు. పాటనీ పద్యాన్నీ జమిలిగా నేత నేసి, అటు పల్లెపాటలోని అమాయకత్వమూ యిటు మార్గకవిత్వంలోని ప్రౌఢత్వమూ సరిపాళ్ళలో జత చేసి, రాయలసీమ కన్నీటిపాటను పెన్నేటిపాటగా ఆయన మలిచిన తీరు అపూర్వం. మనిషి ఆశపోతుతనానికి నాశనమవుతున్న ప్రకృతిదృశ్యాన్నీ, అస్తవ్యస్తమవుతున్న సాంఘికజీవనాన్నీ, నిర్మలమైన ప్రేమతో పెనవేసుకొన్న ఒక నిరుపేదజంట జీవితనేపథ్యంగా చిత్రించిన కావ్యం పెన్నేటిపాట. ఈ కవే పేర్కొన్నట్టు, యీ పాట మొదలుండునే కాని తుదిలేని బాట.

విశ్వంగారి కవితలో నన్ను బాగా ఆకట్టుకొన్న అంశం అందులోని ధ్వని. సంస్కృత ప్రాకృత సాహిత్యాలలో ఆయనకున్న విశేష పరిజ్ఞానం దీనికి కారణం కావచ్చు. ఎంతటి వాస్తవికవర్ణన చేసినా అందులో ఒకానొక ధ్వని చటుక్కున పాఠకుడి మనసును మెలిపెట్టి ఆ వర్ణించే విషయాన్ని బలంగా హత్తుకునేట్టు చేస్తుంది. పేదల దయనీయస్థితి అయినా, ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరయినా, ఉన్నవాళ్ళ దాష్టీకమయినా, స్వచ్ఛమైన దాంపత్యంలోని అనురాగమైనా – ఆ చిత్రణ ధ్వనిమార్గంలో సాగుతుంది. ఊరిలోనున్న ఒకే ఒక సంపన్న భవనాన్ని వర్ణిస్తూ అది ఊరెల్ల మ్రింగి ఉబ్బినట్లున్నది అంటారు. అది కొందరి దృష్టిలో ఎడారిలోని ఒయాసిస్సు కావచ్చు కానీ పేదలకు వట్టి ఎండమావి. పెన్నేటిపాటలో విశ్వంగారి కవితావిశ్వరూపాన్ని చూడాలంటే ఆ కావ్యాన్నంతటినీ పరిశీలించాలి. ప్రస్తుతానికి, రెండు పూర్తిగా భిన్నమైన అంశాలని ఆయన చిత్రించిన తీరుని మాత్రం పరిచయం చేస్తాను.

ఉ. ఎద్దులబండినెక్కి పయనించుచు నుండగ ధూళి రేగి, ఆ
     పొద్దును మూసివేయగనె పో! సురవైరులు లేచివచ్చి, రా
     యెద్దుల తోకలం గలుగు నింతటి మారుతమంత వీచినన్
     దద్దయు ప్రొద్దుదోచె పిశితాశనులంతట పారిపోవరే!

పూర్వకావ్యాలలో కనిపించే వర్ణనలకి అనుకరణగా అనిపించే యీ పద్యం నిజానికి ఒక పేరడీ! ఈ కావ్యంలోని నిరుపేద జంట రంగన్న – గంగమ్మ. రంగన్న తండ్రి నారపరెడ్డి ఒకప్పుడు ఊరిలో పెద్ద మోతుబరి, పట్టాదారు. అయితే అతని చేతికి ఎముక లేదు! సన్నకారు రైతులకీ, పేదసాదలకీ, ఊరి దేవాలయానికే కాకుండా, తన చుట్టూ చేరే భజనపరులకి కూడా అడిగినది లేదనక దానాలు చేస్తూ, ఉన్న ఆస్తినంతా హారతికర్పూరం చేసేస్తాడు. అలాంటి అపరదానకర్ణుడైన నారపరెడ్డిని కీర్తించే వాళ్ళకి కొదవేముంటుంది! పూర్వం రాజులనూ జమీందారులనూ ధనవంతులనూ కీర్తిస్తూ కవులు చెప్పే పద్యాలను, వాటి సంఖ్యను బట్టి, పంచరత్నాలనో నవరత్నాలనో అనేవారు. బట్ట లచ్చుమయ్య, బండారు బసవయ్య అనే యిద్దరు, నారపరెడ్డిని కీర్తిస్తూ పంచరత్నాలను బట్టీ పట్టి (అంటే అవి వాళ్ళ స్వంతం కావన్నమాట!) అతని ముందు చదువుతారు. అలా చదివిన పంచతర్నాలలో ఇది ఒక పద్యం. పూర్వకాల వర్ణనల్లో ఎక్కువగా కనిపించే ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అలంకారాలతో నిండిన చమత్కారభరితమైన పద్యం.

నారపరెడ్డి ఎడ్లబండిని ఎంత వేగంగా తోలగలడో ఈ పద్యంలో కవి ధ్వనింపజేశాడు. నారపరెడ్డి ఎడ్లబండిని తోలుతూ ఉంటే ఉవ్వెత్తుగా దుమ్ము రేగుతోంది. ఆ ధూళి ఎంతగా రేగుతోంది అంటే, అది ఏకంగా సూర్యుడినే (పొద్దు అంటే సూర్యుడు) మూసేసిందట! అలా ఎప్పుడయితే సూర్యుణ్ణి దుమ్ము కమ్మేసిందో, లోకమంతా చీకట్లు కమ్ముకున్నాయి. రాత్రయిపోయిందనుకొని సురవైరులు (అంటే రాక్షసులు – రాక్షసులు నిశాచరులు కదా!) లేచి వచ్చారు. అయితే అంతలోనే ఆ ఎద్దుల తోకలు ఊగే వేగానికి, చిన్నగా వీచే గాలి సైతం ఝంఝామారుతంగా మారి ధూళిమేఘాలను చెల్లాచెదరు చేస్తోంది. సూర్యుడు మళ్ళీ ప్రకాశించగానే ఆ పిశితాశనులు (పిశిత + అశనులు – మాంసభక్షకులు) పారిపోతున్నారు!

చాలా తమాషా అయిన ఊహ కదా! యుద్ధసైన్యాన్ని వర్ణించే సందర్భంలో దాని ఆర్భాటాన్ని చిత్రించేందుకూ, ముఖ్యంగా దౌడు తీసే గుఱ్ఱాల వేగాన్ని స్ఫురింపజేసేందుకూ, అక్కడ రేగే పెంధూళిని చిత్రచిత్రాలుగా వర్ణించడం పూర్వకవి సంప్రదాయం. గోగణాన్ని అపహరించుకుపోయే కౌరవసైన్యాన్ని వర్ణిస్తూ, ఆ సమయంలో రేగిన ధూళిని అభినవ జలధర శ్యామంబు లగునెడ లాకు జొంపంబుల ననుకరింప అంటూ అద్భుతమైన సీసంలో వర్ణిస్తారు తిక్కనగారు. రకరకాలుగా రేగిన ధూళి ఒక పెద్ద ఉద్యానవనం భువినుండి దివికి ఎగురుతున్నట్లుందని ఆ పద్యం వర్ణిస్తుంది. అలాగే పోతన, యుద్ధరంగంలో భీష్ముని పైకి ఉరికి వచ్చే శ్రీకృష్ణుని ముఖం హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై ఉన్నదని వర్ణిస్తారు. అంటే గుఱ్ఱపుడెక్కలకి రేగిన ధూళి కృష్ణుని ముంగురులపై అట్టకట్టిందని! ప్రబంధ కాలానికి వచ్చేసరికి కృతిభర్తల శౌర్యపరాక్రమాలను వర్ణించే క్రమంలో యిలాంటి వర్ణన చేయడం ఆనవాయితీ అయ్యింది. పెద్దనగారు రాయల పరాక్రమాన్ని వర్ణిస్తూ, రాయల సైన్యాల ధాటికి రేగిన ఎఱ్ఱని దుమారాలవల్ల చీకట్లు కమ్మితే, వాటిని చూసి శత్రురాజుల స్త్రీజనం ఎఱ్ఱని చీకట్లేమిటని ఆశ్చర్యపోయారని వర్ణిస్తారు. అలాగే ముక్కు తిమ్మన షష్ఠ్యంతాలలో రాయలను త్వరితాధరితానిలవాజి నటత్ఖురజోరురజోభర గూఢ రవిస్ఫురణా! అని సంబోధిస్తాడు. అంటే – వాయువేగాన్ని మించి పరుగులుపెట్టే గుఱ్ఱపు డెక్కలనుండి రేగి కమ్ముకొనే ధూళిచేత కప్పివేయబడిన సూర్యుడు కలవాడా! అని!

సరిగ్గా ఇలాంటి సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, వాటిల్లో ఉండే అతిశయాన్ని ఒక్కింత వెక్కిరిస్తూ రచించిన మంచి పేరడీ పద్యం ఇది. ప్రబంధాలలో గుఱ్ఱాలిక్కడ ఎడ్లుగా మారాయి. రాజు రెడ్డయ్యాడు. ఈ పద్యంలో ఉన్న వెటకారమంతా ‘ఇంతటి మారుతమంత వీచినన్’ అనడంలో ఉంది. ‘మూసివేయగనె పో!’ అనడంలో ఉంది. పేరడీకి యిలాంటి వ్యంగ్యమే ఆయువుపట్టు. ఇది భాషలోని కాకువు తెలిసిన కవి మాత్రమే చేయగల రచన. చాలా ఉద్వేగభరితంగా సాగే కావ్యంలో తళుక్కున మెరిసే యిలాంటి సున్నితమైన పరిహాసం కావ్యాన్ని మనోహరం చేస్తుంది.

విశ్వంగారి కవిత్వంలో ఇదొక చిన్న పార్శ్వం మాత్రమే! అలతి అలతి పదాలలో గాఢమైన అనుభూతిని ధ్వనింపజేయడం అతని కవిత్వంలో మరొక గొప్ప అంశం. రంగన్న- గంగమ్మల మధ్యనున్న అనురాగాన్ని వర్ణించే యీ పద్యాలు దీనికి చక్కని మచ్చుతునకలు:

ఇన్ని యిడుములు నీకోసమే భరించు
చుంటినని ఆతడనడు; నీ సుఖము కొఱకె
బ్రదుకుచుంటి నటం చామె పలుక దెపుడు;
మాటలేటికి మనసులో మరులు పొరల?

అతని యడుగుల చప్పుడే ఆమె మొగము
నింత విప్పార్చు, మాట రవంత విన్న
జాలు కన్నులలో వసంతాలు విరియు,
చూచెనా యిక నిలువెల్ల చొక్కిపోవు

ఈ పద్యాలకు వ్యాఖ్యానం అవరసం లేదు. పద్యాన్ని యింత సునాయాసంగా పలికించిన కొద్దిమంది ఆధునిక కవులలో విశ్వంగారు ఒకరు. విద్వాన్ విశ్వంగారి సాహిత్యకృషి చాలా విస్తృతమైనది. పత్రికాసంపాదకత్వము, వాటిలో శీర్షికల నిర్వహణ, కావ్య కథా నాటక రచన, సంస్కృత ప్రాకృత కావ్యాల అనువాదము, వైదికసారస్వత అనువాదము – ఇలా బహుముఖీనమైన సాహిత్యసేవ చేశారు. సంస్కృత, ప్రాకృత, ద్రవిడ సాహిత్యాలలోంచి ఆణిముత్యాలని ఎంచి, తెనిగించి, సంకలించిన భారతీయ కవితాకల్పకం తెలుగువాళ్ళకి ఆయన అందించిన అపూర్వ అపురూపకానుక!

పెన్నేటిపాటలో రంగన్న పాటని వర్ణిస్తూ చెప్పిన యీ పద్యం, విశ్వంగారి కవిత్వానికి కూడా చక్కగా అన్వయిస్తుంది!

వాని తియ్యని గొంతుక లోనలోన
తీవ సాగుచునున్న దుద్వేగ రవము
వాని చిక్కని గుండియ లోనలోన
పూవు పూయుచునున్న దుద్బుద్ధ రసము!
---------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment