Saturday, June 30, 2018

కత్తి పడవలు(కథ)


కత్తి పడవలు(కథ)



సాహితీమిత్రులారా!


వానెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళోకొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల్ని చూస్తా, మద్దె మద్దెన పక్కనున్న బాచి గాడితో, ఎనక బెంచీ రాంబాబు గాడితో గుసగుసలాడతా వుంటే “నిన్న సైకిలు మీంచి పడ్డప్పుడు మీ మామ నిన్నిడుసుకున్నాడంటగా” అంటూ రామాంజనీలు గాడు ఎనక బెంచీ లోంచి, ఎకసెక్కంగా గిల్లి మరీ అడిగాడు.

“అరేయ్‌ పొట్టోడా…నన్నెవడిడుసుకుంటాడు. నాకేవన్నా దెబ్బల్తగిలాయా పాడా. సైకిలేండిలొంకర్లు పోయిందని, మడ్డుగార్రేక్కు సొట్ట పడిందని మా మావేడుస్తా వుంటే, డొక్కు సైకిల్తెచ్చి నాకిచ్చినందుకు మమ్మా నాన్న మా మావనే తెగిడుసుకున్నారు”

నేనట్లా చెబుతుండగానే, మా సైన్సయ్యవారు “పొట్ట పొడిస్తే అక్షరమ్ముక్కలేదు…గాడిద…పాఠం చెబుతుంటే ఒకటే మాటలు…పక్కచూపులు. పైగా వినేవాళ్ళను చెడగొట్టడం. పీరీడు అయ్యే వరకు బెంచీ ఎక్కి నిల్చో”అనొక్క ఉరుమురిమారు.

బెంచీ ఎక్కడం మనకేమీ కొత్త కాదు గానీ, మబ్బులు కనిపించవనే బెంగ.
పొలాలకవతల నుంచి దుమ్ము రేపుకొస్తూ గాలి వాన.
స్కూలొదిలిపెట్టాక ఇళ్ళకు పరిగెత్తే మూడో క్లాసు పిల్లల్లాగున్నాయి మబ్బులు.
గాలికి కిటికీ తలుపులు అప్పుడే నిద్రలేచిన కోడి పుంజు రెక్కల్లా టపటపా కొట్టుకుంటున్నాయి.

“బెంచీ ఎక్కించినా నీకు సిగ్గులేదురా…”అని, రామాంజనీలును కిటికీ తలుపులు మూసేయమని చెప్పారు మేష్టరుగారు.

తలుపులందక వాడెగురుతా వుంటే కిటికీ రెక్కలు దొరికినట్టే దొరికి తప్పించుకుని టపటప కొట్టుకుంటుంటే, పొట్టోడు జారిపోతున్న చడ్డీని ఒక చేత్తో పైకెగలాక్కుంటూ అదాటున ఎగురుతా వుంటే భలే నవ్వొచ్చింది. నేనుగానీ వాడి పక్కనుంటే, గబుక్కున వాడి చడ్డీని కిందకు లాగేసుందును.

మేష్టరు గారు పాఠం చెబుతూ, మిగతా పిల్లలు పాఠం వింటూ రామాంజనీలు ఎవ్వారం ఎవ్వరూ చూడ్డంలేదని, “కిటికీ నేనెయ్యనా మేస్టారు” అంటే పక్కన ఉరుము లేని పిడుగు పడ్డట్టు ఒక్కసారిగా అందరూ నావైపు చూసి, క్రిష్నాష్టమప్పుడు వుట్టి కొట్టడానికెగిరినట్టు ఎగురుతున్న పొట్టోడిని చూసి ముందు మేష్టరు గారు, తర్వాత నేను, మిగిలిన మా క్లాసు పిల్లలు ఒహటే నవ్వులు. ఆఖర్న రామాంజనీలు-అందరూ తన్ను చూసి నవ్వుతున్నారని తెలిసి, సిగ్గుతో వంకర్లు పోతూ నవ్వేశాడు.

గాలి ఇంకాస్త పెరిగి, చినుకులు పరిగెత్తుకుంటూ మా క్లాసు లోకి రాబోయి, మేష్టరు గారిని చూసి అడక్కుండా లోపలికొస్తే బాగోదని తటపటాయించి, తొంగి తొంగి చూస్తుండేసరికి కిటికీ దగ్గరగా బెంచీల చివర్లలో కూచున్న వాళ్ళంతా…కొంచెం కొంచెంగా జరుక్కుంటూ బల్ల రెండో కొసన కూచున్న వాళ్ళను నెట్టడం, వాళ్ళు కాళ్ళను నేలకు తన్ని పెట్టి, కిటికీ వైపు వాళ్ళను కిటికీ వైపుకే తిరిగి నెట్టడం… క్లాసురూమంతా వాన నీళ్ళలో కాయితప్పడవలా వూగుతోంది.

వానలో చప్పగా తడుస్తున్న గంటను, క్లాసు రూము పైకప్పును, ఎదురుగా వున్న మమ్మల్ని, చేతికున్న వాచీని మార్చి మార్చి చూసుకుని “గోల చేయకుండా కూర్చోండి. లెక్కల మాష్టరొచ్చే వరకు బయటకెవరన్నా కదిలారా వానలో గోడకుర్చీ వేయిస్తానని”చెప్పి సైన్సయ్యవారెళ్ళిపోయారు.

పైకప్పు కన్నాల్లోంచి బొట్లు బొట్లుగా పడుతున్న వాన నీళ్ళను దోసిళ్ళలో పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళం చల్లుకుంటా ఉంటే, పొట్టోడు బల్లెక్కి కిటికీ తలుపులు బార్లా తెరిచేశాడు. కొంతమందిమి కిటికీ దగ్గరకెళ్ళిపోయి, నీళ్ళనాపాటున పట్టుకుని చల్లుకోవడం మొదలెట్టాం. ముందు బెంచీల్లో కూచున్న వాళ్ళు నోటు బుక్కుల్లోంచీ మద్య పేజీలు చింపుకుని పడవలు చేసుకుంటున్నారు. ఎనక బెంచీల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా అరుస్తున్నారు.

ప్యూను సీనివాసులు నెత్తి మీద మూడు మడతల గోనెపట్టా కప్పుకుని పరుగెత్తుకెళ్ళిపోయి ఇంటి బెల్లు కొట్టేశాడు.

‘జైహిందో’ అనుకుంటూ అందరం ఇళ్ళకు ఒహటే పరుగు.

తొందర తొందరగా ఎల్లిపోయి మా ఇంటి ముందు సైడుకాలవలో పడవలొదిలి, మిగిలిన పడవల్ని తుక్కురేగ్గొట్టాలని నేనందరికంటే ముందు ఉరుకుతా ఉంటే – బాచి గాడు, రాంబాబు నా వెనకాతలే పరిగెత్తారు.

వానలో జుట్టు తడిస్తే జలుబొస్తుందని, జలుబుతో జొరమొస్తుందనీ అమ్మా నాన్న కంగారు పడతారని నా భయం. మొన్నొకరోజు మా మామ సైకిలు తొక్కుతూ, నడిరోడ్డు మీద ాామ్మని పడితే సైకిలేండిలు వొంగి పోయిందని, మడ్డుగారుకు సొట్టపడిందని మామ నన్ను తిడతా వుంటే – నేను రోడ్డు మీద పడ్డప్పుడు, నా పక్క నుంచీ ట్రాక్టరెళ్ళిందని తెలిసి ‘సైకిలేండిలు ఇరిగిపోతే పొయ్యింది లెద్దు. పిల్లోడికేమీ కాలేదు. లేచినేల మంచిదైందని’ ఇంటెల్లపాదీ నన్ను చూసి అనందించారు. మరిప్పుడు జుట్టు తడుపుకుని, వొల్లంతా నాన్చుకుని జలుబు తెచ్చేసుకొంటే అంతా దుఃఖమైపోరూ – సంకలో పుస్తకాలు తప్పించి చుట్టూ తల మీద  కప్పుకోడానికేదీ కనిపించలేదు. తడిసిన చొక్కాలోంచి నీళ్ళు చిన్నగా పుస్తకాలకు కూడా అంటుతున్నై.

రాంబాబు మైనం కాగితం పుస్తకాల సంచీని, బాచి గాడేమో రేకు పుస్తకాల పెట్టెను నెత్తి మీదెట్టుకుని అలుపు తీర్చుకుంటా నడుస్తుంటే, తల మీద పుస్తకాలెట్టుకుని నేనూ వాళ్ళ పక్కనే నడుస్తున్నా.

రోడ్డులన్నీ నీళ్ళలో దాక్కున్నాయి.
సైడు కాల్వల్లోని వాన్నీళ్ళు పొంగి, మా పడవల కోసం తొంగి తొంగి చూస్తున్నాయి.
ఎక్కడెక్కడి మబ్బులో పడవల పందేలు చూడ్డానికి గుంపులు గుంపులుగా కూడి మా వూరి మీదకొస్తున్నాయి.

ఉరుమొచ్చినప్పుడల్లా ‘అర్జున… అర్జునా’ అనుకుంటూ, గాలి గట్టిగా కొట్టినప్పుడు వొంటికంటుకు పోయిన టెర్లిన్‌చొక్కా చలి పెడుతుంటే గజగజ వొణుక్కుంటూ ఇంకాస్త తడిసి ముద్దై ఇంటికి చేరేసరికి, మా ఇంటి ముందటి చుట్టిళ్ళు తలంటు పోసుకుని సాంబ్రాణి పొగేసుకుంటున్నట్టనిపించింది. వసారా చూరులోంచి పడుతున్న వాన నీటి కింద బొక్కెనలు, బిందెలూ పెట్టి, పంచలో మంచాలేసుక్కూర్చుని, వీధిలోకి దిగులుగా చూస్తున్నారు అమ్మా నాన్న. వానొస్తె పన్లోకెల్లే పన్లేదని హాయిగా బొజ్జోక ఎందుకట్లా దిగులుగా కూర్చుంటారో!

“నన్ను చూడండోచ్‌… ఇంతోన పడ్డా జుట్టు తడవకుండా వొచ్చేసానోచ్‌” అని స్టయిల్‌ కొడ్తూ, తడిసిన పుస్తకాల్ని తెరిచి, పడవల్చేసుకోడానికి కాయితాల కోసమెతుకుతా వుంటే “ఓర్నీ బొక్కులన్నీ తడుపుకొచ్చేసావా… ఇయ్యన్నీ మల్లీ ఎట్టా కొంటాంరా” అని నాన్న, “గుడ్డలన్నీ తడుపుకుంటా రాకపోతే వాన తగ్గిందాక బల్లోనే కూచుని రావొచ్చుకదరా… ఇప్పుడేమి కడతావు … అయిగో నీ గుడ్డలన్నీ బయట తీగ మీద” అని అమ్మ … కొట్టినంత పన్చేసారు.

“నేను తడవలేదు… నా జుట్టు చూడండి”అంటూ ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా, తడిసిన పుస్తకాల్ని జాగరత్తగా చుట్టింటి పొయ్యి దగ్గర పొంతకానించి ఆరబెట్టి “జుట్టు తడిస్తే మొక్క మొలవ్వురా…జలుబొస్తే మాత్రేసుకోవొచ్చు. బొక్కులు తడిసి సిరిగి పోతే మల్లా ఏడ కొంటాంరా కొడకా…ఇట్టాగైతే నీకు చదువెట్లా వొస్తదిరా కొడకా”అంటూ నాన్న ఒకటే తిట్లు.

పడవ చేసుకోడానికి పొడి కాయితం దొరక్క నేనేడుస్తావుంటే, “జలుబని మూలిగినప్పుడు చెబ్తా నీ పని” అంటూ నా చొక్కా లాగు ఇప్పేసి చీరకొంగుతో అమ్మ తల తుడుస్తా వుంటే – కరెంటు స్థంభం పక్క పొగాకు బేర్నీ గోడ చాటునుంచీ రాంబాబు, బాచిగాడు, రామాంజనీలు జిల్లాయిలే అని ఎక్కిరిస్తా ‘కత్తి పడవల్చేసుకొచ్చాం…పందేనికి సై సై’ అంటూ ఒహటే సైగలు.
-----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment