Sunday, June 24, 2018

కవిరాజశిఖామణి కవిత్వశక్తి


కవిరాజశిఖామణి కవిత్వశక్తి




సాహితీమిత్రులారా!


ఉ. ఆ రుచిరాననాబ్జదరహాసవిలాసవికాసభాసినీ
    హారకరాతిభాతి నమలాంగశరీరతుషారదీప్తికాం
    తోరునగంబు సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి పొ
    ల్పారె హిమాచలంబు నమరాధిపవాహిని గప్పినట్టిదై

శ్రీనాథుడు హర్షనైషధాన్ని తెనిగిస్తూ, ప్రౌఢకవిత్వాన్ని ఆస్వాదించే ఓపిక లేనివారిని ఏమాత్రం మొహమాటం లేకుండా ‘సోమరిపోతులు’ అంటాడు. పైగా ‘లేజవరాలు చెక్కు గీటిన వసవల్చు బాలకుఁడు డెందమునం గలఁగంగ నేర్చునే’ అని సన్నాయినొక్కులు కూడా నొక్కుతాడు! సంస్కృతకావ్యాల ప్రభావంతో అలాంటి ప్రౌఢకవిత్వం మనకి తెలుగులో కూడా అవతరించింది. మరీ ప్రౌఢం కాకపోయినా, ప్రబంధాలలో వర్ణనలను అర్థం చేసుకొనేందుకు కొంత పాండిత్యం, పరిశ్రమ అవసరమవుతాయి. అలాంటి వర్ణనలకి నిలువెత్తు ఉదాహరణ పై పద్యం – ఆ విషయం పద్యం చదవగానే బోధపడిపోయి ఉంటుంది! ప్రబంధ వర్ణనల్లో సాధారణంగా కనిపించే మరొక అంశాన్ని కూడా ఈ పద్యం పరిపూర్ణంగా ప్రతిఫలిస్తోంది. అది అలంకారసాంద్రత. అంటే ఒకే పద్యంలో ఒకే విషయాన్ని అనేక అలంకారాలతో వర్ణించడం. నిజానికి ఈ రెండు అంశాలూ పరస్పరం సంబంధమున్నవే. ఒక విషయాన్ని వర్ణిస్తూ అలంకారాల సహాయంతో ఆకట్టుకొనేలా ఒక పద్యం అల్లాలంటే, అందులోని వాక్యనిర్మాణంలోనూ భాషలోనూ చాలా కుదింపు అవసరం అవుతుంది. ఆ కుదింపు పద్యాన్ని అర్థం చేసుకోడంలోని క్లిష్టతను పెంచుతుంది. ఈ పద్యంలో జరిగింది కూడా అదే. అయితే ఈ క్లిష్టత భాషలోనే తప్ప చెప్పే అంశంలో కాదు. కాస్తంత సాధన ఉంటే చాలు, తోవ సులువుగానే దొరుకుతుంది. ఆ తోవలో, అందులోని కవి కల్పనలని మన మనసులో చిత్రించుకుంటూ వెళితే ఒక అందమైన దృశ్యం సాక్షాత్కరిస్తుంది.

ఇది నన్నెచోడుడు రచించిన కుమారసంభవ కావ్యంలోని పద్యం. శివునికి తపోభంగమయ్యే ఘట్టం. పార్వతీదేవి కడకంటి చూపులతో కలిసి మరుని తూపులు శివుని మనసులో నాటుకున్నాయి. స్థాణువులో ఒక్కసారి కదలిక వచ్చింది. సర్వసంగపరిత్యాగిలో శృంగారం అంకురించింది. ఆ సమయంలో శివునిలో కలిగిన ఒక సాత్వికభావ విశేషాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఈ పద్యాన్ని అర్థం చేసుకోడానికి ఒక కిటుకుంది. భారతీయభాషలకి క్రియాపదం ఒక రకంగా ప్రాణమని చెప్పవచ్చు. ఆ గుట్టు పట్టుకుంటే తక్కిన పద్యాన్ని అర్థం చేసుకొనే మార్గం సుగమం అవుతుంది. ఈ పద్యంలో కనిపించే క్రియాపదాలు – పర్వి, పొల్పారె, కప్పినట్టిదై. ఇందులో కప్పినట్టిది ఐ, పర్వి అనే రెండు క్రియలూ అసమాపకక్రియలు. పొల్పారె అనేది వాక్యాన్ని పూర్తిచేసే సమాపకక్రియ. పొల్పారడం అంటే ఒప్పారడం, అందగించడం. ఒప్పారినది ఏది లేదా ఎవరు? అది తెలియాలంటే, దీనికి సంబంధించిన నామవాచకం కోసం వెతకాలి. తెలుగులో నామవాచకాలు ఎక్కువగా – డు, ము, వు, లు అనే ప్రత్యయాలతో అంతమవుతాయి. పూర్వభాషలో ము అనేది ంబు అనే రూపంలో కూడా ఉండేది (అసలు రూపం అదే). అంచేత అలాంటి పదాల కోసం చూస్తే కనిపించే పదాలు ఘర్మజలంబు, నగంబు. ఇందులో ఘర్మజలంబు పర్వి అని ఉంది కాబట్టి, పరచుకొన్నది ఘర్మజలము.

ఆ తరువాత, అందగించినది నగము. నగము అంటే పర్వతం. ఏమిటా పర్వతం? దాని ముందు ఒక పొడుగాటి సమాసం ఉంది. తెలుగు పద్యాలని అర్థం చేసుకోడానికి తెలియాల్సిన మరొక ముఖ్యమైన అంశం ద్రుతం. పూర్వభాషలో చాలా పదాలు ద్రుతాంతాలు, అంటే పదాల చివర నకార పొల్లు ఉంటుంది. వచ్చెన్, తెచ్చెన్, ప్రీతిన్, క్షితిన్ – ఇలా. ఆ ద్రుతం పక్క పదంలో మొదటి అక్షరంతో చేరుతుంది. ఒక వేళ పక్క పదం అచ్చుతో మొదలైతే, ఆ అచ్చుతో కలిసి నకారం వస్తుంది. అంచేత నకారంతో మొదలయ్యే పదాలని జాగ్రత్తగా పరిశీలించాలి, అది పదంలో సహజంగా ఉన్న నకారమా లేదా ద్రుతం కలిసి వచ్చిన నకారమా అని. ఈ సమాసం మొదట్లో నమలాంగశరీర అని ఉన్నది. నమల అన్నది సాధారణ వాడుకలో ఉన్న పదం కాదు. అంచేత అది అమల అయ్యుండాలి. ఇప్పుడు సమాసంలో ఒకో పదాన్ని విడగొట్టుకొని ప్రతిపదార్థం తెలుసుకోడమే! అమలాంగ, శరీర, తుషారదీప్తికాంత, ఉరు, నగంబు. తుషారదీప్తి అంటే చల్లని కాంతి కలవాడు, చంద్రుడు. తుషారదీప్తికాంత అంటే చంద్రకాంతశిల. అంటే చలువ(పాల)రాయి. ఉరు నగము అంటే పెద్ద పర్వతం. తుషారదీప్తికాంతోరునగంబు అంటే చలువరాతికొండ అన్నమాట. ఏమిటా చలువరాతికొండ? అమలాంగ శరీరం. అమలాంగుడు అంటే స్వచ్ఛమైన (తెల్లనైన) శరీరం కలవాడు అని, శివుడు. శివస్వరూపం తెల్లని కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అమలాంగ శరీరం – శివుని శరీరం. అంచేత, ఒప్పారినది ఏమిటయ్యా అంటే, శివుని శరీరమనే చలువరాతికొండ. ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలకి సమాధానాలు తక్కిన రెండు క్రియలు చెపుతున్నాయి. సమ్మదరసోత్కట ఘర్మజలంబు శివుని మేనిపై పరచుకొన్నది. సమ్మద, రస, ఉత్కట, ఘర్మజలం. ఘర్మజలం అనే పదం శ్రీశ్రీ పుణ్యమా అని చాలామందికి తెలిసే ఉంటుంది! చెమటనీరు. అధికమైన సంతోషరసమనే చెమటనీరు శివుని శరీరమంతటా వ్యాపించినదన్న మాట. ఒక స్థిరమైన భావం (స్థాయీభావం) రసంగా నిష్పన్నమయ్యే క్రమంలో, ఆ రసానికి ఆలంబన అయిన వారిలో కలిగే అసంకల్పిత స్పందనలను సాత్వికభావాలంటారు. అవి ఎనిమిది. అందులో స్వేదం ఒకటి. ప్రియురాలిపై రాగాతిశయం కలిగినప్పుడు శరీరం పులకించడంతో పాటుగా చెమరుస్తుంది కూడా! అయ్యవారి మేను అమ్మవారిపై కలిగిన ప్రేమాతిశయం కారణంగా చెమర్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే శివుని శరీరాన్ని చంద్రకాంతశిలాపర్వతంతో పోల్చడం దేనికి? కేవలం తెల్లదనం ఒక్కటే పోలికా? దీనికి సమాధానం పద్యం మొదటి పాదంలో దొరుకుతుంది.

ఆ రుచిరాననాబ్జదరహాసవిలాసవికాసభాసినీహారకరాతిభాతిన్

ఆ, రుచిర, ఆనన, అబ్జ, దరహాస, విలాస, వికాస, భాసి, నీహారకర, అతి, భాతిన్ అని పదవిభాగం. ఆ = ఆ పార్వతీదేవి యొక్క, రుచిర = కాంతివంతమైన, ఆనన = ముఖమనే, అబ్జ = చంద్రుని (అప్ అంటే నీరు, సముద్రం అని అర్థాలు. సముద్రం నుండి పుట్టాడు కాబట్టి చంద్రుడు అబ్జుడు), దరహాస = చిరునవ్వుల, విలాస = చక్కదనపు, వికాస = విప్పారిన, భాసి = వెలుగులనే, నిహారకర = చంద్రుని (చల్లని కిరణాలు కలిగినవాడు), అతి = గొప్ప, భాతిన్ = కాంతుల వలన. అంటే, అమ్మవారి ముఖచంద్రుడు కురిసే చిరునవ్వు వెన్నెలలు అక్కడంతటా వ్యాపించాయి. చంద్రకాంతికి చంద్రకాంతశిల కరుగుతుందని కవిసమయం. అంచేత పార్వతీదేవి ముఖచంద్రుడు కురిసే చిరునవ్వు వెన్నెలల వలన శివుని శరీరమనే చంద్రకాంతశిలాపర్వతం కరగడం మొదలుపెట్టిందన్న మాట. అదే అతని మేనిపై పరచుకొన్న చెమట! ఎన్ని అలంకారాలో చూడండి. పార్వతీదేవి మోము జాబిలి. ఆమె చిరునవ్వులు వెన్నెలలు. శివుని శరీరం చంద్రకాంతశిలాపర్వతం (శిల అంటే సరిపోదు, ఆయన దేహపరిమాణం కొండంత ఉంది!). దానిపై పరచుకొన్న చెమట సంతోషరసం. ఇంత చెప్పి కూడా కవికి సంతృప్తి కలగలేదు! పరమేశ్వరుని దేహాన్ని పాలరాతికొండతో చేసిన పోలిక కవికి పూర్తి తృప్తినిచ్చినట్టు లేదు. అతని ఊహలో ఆ దేహం మరింత ఘనంగా, గొప్పగా కనిపిస్తోంది. అంతటి ఉన్నతి ధ్వనించాలంటే ఇంకా ఉన్నతమైన ఉపమానం కావాలి. హిమగిరిపైనున్న ఆ మహేశ్వరుడు సాక్షాత్తూ ఆ హిమవత్పర్వతంలానే దర్శనమిచ్చాడు కవికి. హిమాచలం కూడా తెల్లని కాంతులతో మెరిసేదే కదా. మరి అతని మేన ప్రవహిస్తున్న ఘర్మజలమో? అది అమరవాహిని కాక ఇంకేమిటి కాగలదు! మహాదేవుని దేహం ‘హిమాచలంబున్ అమరాధిపవాహిని కప్పినట్టుగా’ ఉందన్న యింపైన ముక్తాయింపునిచ్చాడు.

ఇదే సందర్భంలో కాళిదాసు తన కుమారసంభవ కావ్యంలో శివునిలో కలిగిన చలనాన్ని ఒకే ఒక్క శ్లోకంలో ఒకే ఒక్క ఉపమానంతో వర్ణిస్తాడు.

హరస్తు కించిత్ పరిలుప్త ధైర్యః చంద్రోదయారంభ ఇవాంబురాశిః
ఉమాముఖే బింబఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని

పార్వతిని చూసిన శివుని స్థితి చంద్రోదయవేళలో సముద్రంలా అయ్యింది. కాస్తంత తగ్గిన ధైర్యంతో తన చూపులని బింబాధర అయిన ఉమ మోముపై ప్రసరింపజేశాడు. ఉపమానాలని ఆచితూచి ప్రయోగించడంలో కాళిదాసుని మించిన కవి ఎవరు! ఆయనకి వాల్మీకి మార్గదర్శి. అంచేత ఒకే ఒక్క ఉపమానంతో శివుని స్థితిని మనోజ్ఞంగా ధ్వనింపజేశాడు కాళిదాసు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యవిషయం ఒకటుంది. కాళిదాసు కుమారసంభవంలో శివుడు ఉదాత్తుడైన కావ్యనాయకుడు. అసలు మన్మథబాణం తనని తాకకుండానే మారుని భస్మం చేస్తాడు. శివునికి కలిగిన తపోభంగం చాలా స్వల్పమైనది – కించిత్ పరిలుప్త ధైర్యః. అది కూడా పార్వతీదేవిని చూడడం వల్ల తప్పిస్తే మన్మథబాణం వలన కాదు. ఆ తర్వాత కథలో కూడా విరహబాధను పొందినది పార్వతీదేవి కాని శివుడు కాదు. నన్నెచోడుని కుమారసంభవంలో శివుడు శృంగారరసానికి ఆలంబన అయిన ప్రబంధనాయకుడు. మన్మథబాణం ఇతన్ని తాకుతుంది. ఆ తర్వాత కథలో శివుడు కూడా పార్వతిలా విరహతాపాన్ని పొందుతాడు. అందువల్ల శివునిలో కలిగిన సాత్వికభావోదయాన్ని విశేషించి వర్ణించాడు నన్నెచోడుడు.

ఇంత చెప్పి కూడా నాకూ సంతృప్తి లేదు! ఒక కవిని కొద్దిగానైనా పరిచయం చేసుకోవాలంటే ఒక్క పద్యం సరిపోదు కదా. నన్నెచోడుని కవిత్వశక్తిలో ఆయనకున్న భాషాలంకార పాండిత్యాన్ని పైపద్యం ప్రదర్శిస్తోంది. అదొక్కటే కావ్యానికి గొప్పతనం చేకూర్చదు. హృదయాన్ని తాకే కవిత్వం కావాలి. అలాంటి ఒక పద్యాన్ని కూడా రుచి చూద్దాం:

అలమటసెడియొండె నిలువదు చిత్తంబు
        మూర్ఛిల్లి వెడబాసి పోవదొండె
నూఱట గొనియొండె నాఱదు శోకాగ్ని
        పొరిమాల గొని కాలిపోవదొండె
ఘర్మాశ్రుజలము లొక్కట కట్టుకొనవొండె
        బొడవంతయు గరంగిపోవ దొండె
బర్వు నిట్టూర్పులు పట్టున బడవొండె
        బొందిమ్ముగా బాసిపోవదొండె

నిట్టి కడలేని దుఃఖాబ్ధి బెట్టి ముంప
దలచియోకాక పోనీక బలిమి నాదు
ప్రాణ మొడలిలో నాకాశవాణి దెచ్చి
మగుడ జెఱబెట్టె నని రతి మఱుగుచుండె

ఒక చిత్రమైన సున్నితమైన మనఃస్థితిని ఎంతో సహజంగా నేర్పుగా గుండెని తాకేలా అక్షరీకరించిన గొప్ప పద్యం ఇది. శివుని కంటిమంటకు కాలిబూడిదయిన తన పతిని గూర్చి పరితపిస్తూ ప్రాణార్పణకి సిద్ధమవుతుంది రతి. ఆ సమయంలో పైనుంచి ఆకాశవాణి పలుకులు వినిస్తాయి, మన్మథుడు తిరిగి తనకి లభిస్తాడని అభయమిచ్చే మాటలు. ఆ మాటలతో రతి తన మరణప్రయత్నాన్ని విరమిస్తుంది. అప్పుడు రతి స్థితి ఎలా ఉంటుంది? ఊబిలో కూరుకుపోయే వ్యక్తికి తీగ దొరికినట్టుగా, ఒక సన్నని ఆశ. అయితే, తిరిగి పతిసాన్నిధ్యం పొందే వరకూ అది ఊగిసలాటే. నిరంతర సంఘర్షణ, సందిగ్ధత – ఆశనిరాశల మధ్య, జీవన్మరణాల మధ్య. ఆ అవస్థని ఎంతో సున్నితంగా, హృదయవిదారకంగా ఈ పద్యంలో చిత్రించాడు కవి.

ఈ పద్యమంతా రతి వేదనతో పలికే మాటలు. ఒండె అంటే ఆలా కాకపోతే ఇలా ఆయినా అని. రతి సందిగ్ధావస్థని ఈ చిన్న అచ్చతెనుగు మాటతో పద్యమంతా స్ఫురింపజేశాడు నన్నెచోడుడు. బాధను వీడి చిత్తం స్థిరంగా నిలవదు. పోనీ, తీవ్రమైన బాధతో మూర్ఛిల్లి పూర్తిగా విడిచిపెట్టయినా పోదు. దహిస్తున్న శోకాగ్ని ఆరనైనా ఆరదు. పోనీ పూర్తిగా నన్ను కాల్చేయనైనా కాల్చేయదు. దుఃఖంతో శ్రమతో పొంగుకు వచ్చే కన్నీరు, చెమట, ఆగనైనా ఆగవు. పోనీ నా శరీరం వాటిలో మునిగి కరగనైనా కరిగిపోదు. ఆయాసంతో పరుచుకొనే నిట్టూర్పులు ఒక పట్టున పట్టుబడవు. పోనీ చక్కగా శరీరాన్ని విడిచిపెట్టయినా పోవు. అదీ ఆమె దయనీయ పరిస్థితి! రతి పొందే నలుగుబాటులోని తీవ్రత ఎత్తుగీతిలో తారస్థాయి నందుకొంది. ఆమె అంటోంది కదా, ‘ఇలాంటి అంతులేని దుఃఖసముద్రంలో నన్ను ముంచడానికే ఆకాశవాణి ఎగిరిపోయే నా ప్రాణాలని బలవంతంగా తెచ్చిపెట్టి మళ్ళీ శరీరమనే ఖైదులో బంధించింది!’ అని. పాంచభౌతికమైన శరీరమూ మనసూ ప్రాణమూ విలవిలలాడిపోయే తీరు పద్యమంతా పరచుకొని రతి వేదనలోని తీవ్రత సహృదయ హృదయాలని గాఢంగా తాకక మానదు!

ఈ కావ్యపీఠికలో నన్నెచోడుడు కవిత్వాన్ని గురించి చెపుతూ, ‘హృదయాన్ని సూటిగా తాకి భేదించలేని బాణం ఒక బాణమేనా, కవిత్వం అసలు కవిత్వమేనా’ అంటాడు. ఈ కవిరాజశిఖామణి నేర్పుగల విలుకాడే!
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment