Tuesday, December 26, 2017

యతో భావః తతో రసః


యతో భావః తతో రసః




సాహితీమిత్రులారా!



రసం ఎలా పుడుతుందంటే
ఈ శ్లోకం చూడాల్సిందే
ఇది అభినయ దర్పణంలోనిది-

యతో హస్త స్తతో దృష్టిః
యతో దృష్ట స్తతో మనః
యతో మనః తతో భావో
యతో భావః తతో రసః

హస్తమున్నచోట దృష్టి ఉండాలి,
దృష్టి ఉన్నచోట మనసు లగ్నంకావాలి,
మనసు లగ్నమైనచోట భావం,
భావం ఉన్నచోట రసం తప్పక ఉంటాయి
-అని భావం
ప్రదర్శన కళలో ఇవి వర్తిస్తాయి.
అలాగే పాఠ్య (కేవలం చదివే) కావ్యానికి
కూడ వర్తిస్తాయి. ఇక్కడ హస్తమనేది కొన్ని
సంకేతాల సంపుటిని వ్యక్తం చేసే చిహ్నం.
చదువుకొనే కవితలో ఈ సంకేతాలను
పదచిత్రాలు తెలియ చేస్తాయి ఒక రకంగా
ఇవి కవిసమయాలు. పాత కవిసమయాల
స్థానంలో కొత్తవాటిని ఆధునికిలు సృష్టిస్తే
ఏ సంజ్ఞని దృష్టిలోకి తెచ్చుకోవాలన్నది
ముఖ్యం. అప్పుడు మనస్సు దానిమీదే
లగ్నమౌతుంది. భావరసాలు రెండూ
ఒకదాని తర్వాత ఒకటి నిష్పన్నమై
ఆనందం కలుగుతుంది. నిజమైన కవిత్వాన్ని
చదువుకొన్నా, విన్నా ఇది సిద్ధిస్తుంది.
భావహీనమైన రసం ఉండదు అలాగే
రసహీనమైన భావమూ ఉండదు.
అని నాట్యశాస్త్రం చెబుతున్నది.

ఈ ఉదాహరణ సూస్తే పై విషయం బోధపడుతుంది.
ఇది దేవులపల్లి వారి అన్వేషణ అనే ఖండకావ్యంలోనిది-
ఇది వచనంలా చదువుకొన్నా చిత్రాలు కనబడతాయి
చూడండి-

సన్నని యెల్గెత్తి జాలిగా నెవరినో
        అరయుమా! పిలుచుచున్నదియె యమున!
ప్రక్క నిర్జీవ ధావళ్యమ్ముతో నున్న 
        సికతా తలమ్ము గాంచితివె, దాని?
తుది మొదల్ లేదిదే త్రోవరుల్ త్రొక్కని
        యీదారినే పరువెత్తినాను
ఈ మొండి చేతులనెత్తి యీవనతరుల్
        శూన్య దృక్కుల దిశల్ చూచునయ్యొ
ఇచటనె యిచటనే యతడిచట నేను-
ఇచట నీ జావూ బొదరింట నేను -
ఈ కడిమి చెట్టు క్రింద ముమ్మీ యతండు -
సరిగ కన్నుల గట్టిన సరణి దోచు

ఈ పద్యంలోని కవితానర్తకి మొదటి సన్నని గొంతుకతో
జాలిగా పిలుస్తున్న యమునను కంఠంతో అనుకరిస్తున్నట్ట
నిపిస్తుంది. ఇసుక తిన్నెలను కళ్ళతో చూపెడుతుంది.
చెట్లు మొండి చేతులెత్తాయన్నప్పుడు తన చేతులు ఎత్తినట్టే
కనబడుతుంది. అవి శూన్య దృక్కులతో దిశలో చూస్తున్నావని
ఖాళీ చూపులతో ఇటూ, అటూ, అటూ ఇటూ చూస్తున్నట్టు
కనబడుతుంది. ఇదుగో తానక్కడ, నేనిక్కడ అని చోట్లు
మార్చి మార్చి చూపెట్టడం అలా చూపిస్తూ పాతదృశ్యాలు
తన కన్నులకు కట్టినట్టుందని చెబుతుంది.
నాయిక కన్నులకే కాదు పఠిత కన్నులకు కూడ కట్టినట్లు
చెప్పగలగడమే అభినేయార్థ ఖండకావ్యం.
ప్రదర్శనకళను పుణికి పుచ్చుకొంటే
రసభావాలు నిష్పన్నమౌతాయి.


No comments:

Post a Comment