Monday, March 16, 2020

కవి ఊహకు అందనిదేది?


కవి ఊహకు అందనిదేది?



సాహితీమిత్రులారా!

ఈనాడు మన వీఐపీలు ప్రధానంగా ముఖ్యమంత్రులు,
మంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధినేతలు
ఒకచోట అల్పాహారం మరోచోట భోజనం, ఇంకోచోట
పానీయం ఇలా స్వీకరిస్తూ వారి దినచర్య జరుగుతూ
ఉంటుంది. కానీ మన కవి పానకాలరాయకవి
తన మనసుకు ప్రబోధిస్తూ
విష్ణువును తలవమని చెబుతూ చెప్పిన పద్యం
తన మానస శతకంలో ఎలా మనరాజకీయ వీఐపీల
దినచర్యను శ్రీమహావిష్ణువుకు ఆపాదించారో గమనించండి -

తిరుమలలో ప్రభాత విధి తీరిచి, నీలగిరిన్ భుజించి, కే
సరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో
గురు రుచి ద్రావి రంగపురి కోమలితో పవళించునట్టి నా
సరసుని జేర నీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!


తిరుమలలో భక్తులు "శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతం" అని
నిద్ర లేపితే లేచి ప్రభాత విధులు తీర్చి,
నీలాచలంలో నైవేద్యం స్వీకరించి,
సింహాచలంలో గంధం పూసుకొని,
మంగళగిరిలో పానకం తాగి దాహం తీర్చుకొని,
శ్రీరంగంలో దేవేరితో రంగశాయి అయి పవళించే సరసుడైన
ఆ శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించే మనసా!

No comments:

Post a Comment