Sunday, July 1, 2018

పెనుగొండ స్మృతికావ్యం


పెనుగొండ స్మృతికావ్యం



సాహితీమిత్రులారా!


మ.
అదుగో పాతర లాడుచున్నయది సౌధాంతాల నిశ్శబ్ద, మ
ల్లదె మా కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్నీరుగానేడ్చుచు
న్నది, భాగ్యంబులుగాసెగట్టిన మహానందైక సారంబు నం
దుదయంబయ్యెన భాగ్యరేఖ! చెడెనయ్యోపూర్వసౌభాగ్యములు
మ.
కవులన్ బంగరు పల్లకీలనిడియుత్కంఠాప్తితో బండిత
స్తవముల్ మ్రోయగ రత్నకంకణ ఝణవ్యారంబుగా, నాత్మహ
స్తవిలాసమ్మున మోసి తెచ్చెనట నౌరా, సార్వభౌముండు – నే
డవలోకింపుము నీరవంబులయి శూన్యంబైన వీ మార్గముల్

ఈ పద్యాలున్న చిరుకబ్బం–కేవలం 122 పద్యాలది, వ్రాసేనాటికి ఏతత్కవి వయస్సు కేవలం 12 సంవత్సరాలేనట! పన్నెండేళ్ళ వయస్సులో ఒకట్రెండు పద్యాలు గిలకడం అంత గొప్ప ఏమీ కాకపోవచ్చుకాని చిరస్థాయి ఐన ఒక చారిత్రక స్మృతికావ్యాన్ని (ఆ కావ్యాన్ని అలా పిలవొచ్చనుకుంటాను) మనోహరంగా శిల్పించడం అసామాన్యులకూ, కారణజన్ములకూ మాత్రమే సాధ్యమయ్యే పని. ఆ దరిమిలా ఆ బాలుడు ఒక మహాకవిగా ఎదిగే క్రమంలో విద్వాన్ పరీక్షకు చదివేటప్పుడు తాను వ్రాసిన ఆ కావ్యమే తనకు పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడిందట. విచిత్రమైన ముచ్చట.

ఇంత చిక్కని కవిత్వం వ్రాసిన ఆ బాలుడు ఆ పిమ్మట 14భాషలలో ఘనిష్ఠమైన పరిచయము, చాలా భాషల్లో తలస్పర్శి ఐన పాండిత్యమూ సంపాదించి, తానెరిగిన భాషల్లోని అందాలను తెలుగులోకీ తెలుగు భాష సొగసులను అన్య భాషల్లోకీ అనువాద రూపంగా ఆదానప్రదానాలు నిర్వహించడమే కాకుండా, తెలుగులోనూ గొప్ప గ్రంథాలు వెలయించి ‘మహాకవి’గా అన్వర్థమైన బిరుదు పొంది, ఋషీకేశ్‌లో శివానంద మహర్షి అత్యంత ప్రశ్రయంతో ఇచ్చిన సరస్వతీపుత్ర అనే ఉపనామాన్ని తన సార్థక సాహిత్య యశోకాయానికి సహజసిద్ధ కవచంగా అలంకృతం చేసుకొని, పద్మశ్రీ పురస్కార విరాజమానులై, ఆంధ్ర సాహిత్య రంగ వేదిక మీద శివ తాండవం చేసిన ఆ శారదామూర్తి–ఇదేదో పెద్ద ఉత్కంఠ కలిగిస్తున్నట్టు ఇంకా నాన్చేదేముందిగాని–శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. పై పద్యాలున్న చిరుకబ్బం పెనుగొండ లక్ష్మి.

పుట్టపర్తివారికి విజయనగర కాలం నాటి సామ్రాజ్య వైభవమన్నా, ఆ రోజులనాటి సాహిత్య సౌభాగ్యమన్నా మిక్కిలి ఆసక్తి. కృష్ణరాయల కాలంనాటి ప్రజా జీవనమూ, సంస్కృతీ సంప్రదాయాల ఎడల ఆ ఆసక్తితోనే చక్కటి వ్యాసాలూ వ్రాశారు. చిన్నతనంలో పెనుగొండలో ఉన్నందువల్ల తనున్ననాటి పెనుగొండనూ ఆ నగరు ఒకనాడనుభవించిన సౌభాగ్యాన్ని బేరీజు వేసుకుంటూ, గుండెల్లో నింపుకున్న అపూర్వ వైభవపు జీర్ణ చిహ్నాలు నాదించే నిశ్శబ్ద చరిత్రకు చలించి, తన హృదయ కంపనలకు కావ్యరూపం ఇచ్చారు. ‘అనుభవించి పలవరించి’నందుననే ఆ పద్యాలు గొప్ప సూటిదనంతో పఠితల గుండెల్లోకి దూసుకెళతాయి.

తల్లికోట యుద్ధం జరిగి విజయనగర సామ్రాజ్యం నామమాత్రావశిష్టమై, హంపీ శిథిలాల కొంపగా మారిపొయ్యాక రాజధాని విజయనగరం నుంచి పెనుగొండకు మారింది. కృష్ణరాయలు బ్రతికున్నపుడే ఆయన సామ్రాజ్యం ఉచ్చదశలో ఉన్నప్పుడు కూడా పెనుగొండ రెండో రాజధాని స్థాయిలో వెలుగులు వెల్లార్చింది. ఎంత ఆపత్కాల రాజధాని ఐనా, ఎంత క్షీణిస్తున్న సామ్రాజ్యమైనా చాప చిరిగినా చదరంత కాకపోదుగదా! ఈనాటి పెనుగొండలోని కోట శిథిలాలూ సౌధాల ఆనవాళ్ళూ, రధ్యలూ ‘కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్ నీరుగానేడ్చే’ ఆ సన్నివేశం ఎంత హృదయస్పర్శిగా; వేదనను కవిత్వంగా తర్జుమా చేశాడో ఆ పసికవి. ‘భాగ్యంబులు గాసెకట్టిన మహానందైక సారం’లో ‘అభాగ్యరేఖ ఉదయించిన వైనం’ ‘చెడెనయ్యో పూర్వసౌభాగ్యముల్’ అంటూ ఎంత హృద్వేగభరితంగా కండ్లకు కట్టాడో! ‘కాసెకట్టడం’ ఎంత ముచ్చటైన పలుకుబడి!

తన చేతుల రత్నకంకణాలు పరస్పరం ఒరుసుకుంటూ ఝణత్కారాలు చేస్తుండగా కవులను తానే స్వయంగా బంగరు పల్లకీలో కూచోబెట్టి చుట్టూ కవిపండితులు స్తుతి పాఠాలు చదువుతుండగా చక్రవర్తి ఆ రాజవీధుల్లో మోసి తెచ్చాడట. ఆ అపూర్వ దృశ్యాన్ని గుండెలనిండా ఒడిసిపట్టుకొని ‘నేడవలోకింపుము, నీరవంబులయి శూన్యంబైనవీ మార్గముల్’ అని వాపోయినాడు కవి. పెనుగొండలోని మహళ్ళూ, రాజవీధులూ, కోటా, రణభూములూ, రామబురుజులూ, జీర్ణాలయాలూ, సమాధులూ అన్నిటినీ ఒక్కొక్కదాన్నే చూస్తూ ఆ శిల్పాలకు అచ్చెరువు చెందుతూ, ఒకనాటి మహావైభవానికి గుండెలు పొంగించుకుంటూ, నేటి దీన స్థితికి కన్నీళ్ళు రాల్చుకుంటూ–ఆ వాక్యాన్ని నిర్మించాడు.

ఉలిలొ తేనెలసొనలంజిలికి, యీ యొయ్యారి చిత్రించువే
ళల నాశిల్పికి గన్నుగొనలను ధారల్గట్టెనేమో జలం
బులు, జేదోయి చెమర్చియుండుననుకొందున్, భావనావేశ భం
గులు – పైపై చెలరేగ ముద్దుగొనియుండున్ ప్రేమవిభ్రాంతుడై!

అని ఆ శిల్పాల రామణీయతకు కతాన్నిలొనారయడానికి ప్రయత్నిస్తాడు. ‘ఎట్లు పైకెత్తిరో, ఏంగుగున్నలకైన తలదిమ్ముగొలుపు ఈ శిలల బరువు’ అంటూ ఆశ్చర్యపోతాడు. ‘మూల్మూలలన్ సాలీడుల్ తమ గూడులల్లుకొని సంసారంబు సాగించునౌరా! లీలాచణుడైన కాలపు కరాలన్ పాచికల్ లోకముల్’ అని నిట్టూరుస్తాడు.

పగతుర యెడంద నిప్పుకల్ రగులబెట్టి
యుదధి గర్భంబు సుడివడి హోరుమనగ
తెనుగు ఢంకాలు మ్రోగిన దివ్యభూమి
కనుము తమ్ముడా! జీర్ణంబు గగనమహలు!

-అంటూ తన ‘భావనావేశ భంగిమ’లను ప్రవహింపజేసుకుంటాడు.

విజయనగర శిథిలాల గురించి కొడాలి సుబ్బారావుగారు హంపీ క్షేత్రము అనే పేరుతో ఒక కావ్యం రచించారు. దానికీ మంచి ఆదరణ వచ్చింది. పెనుగొండ లక్ష్మి దానికన్న పదునైదు సంవత్సరముల ముందుది. ఒకరకంగా దానికి స్ఫూర్తి కూడా అయ్యుండవచ్చు.

పుటకు 3, 4 పద్యాలకన్నా ఎక్కువలేని కేవలం 36 పుటల పెనుగొండ లక్ష్మి కేవలం పరిమాణంలోనే చిన్నది. కవన పరిణాహంలో మిన్నది. ఇతిహాస జ్ఞాపకాల కిణాంకంగా దానికి ఆంధ్ర సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది.

ఎవడు వినకున్న మనకేకి ఏకతమున
గానమున్జేయుదము మన ఘనులకీర్తి
ఱేగియారామవీధి ఘూర్ణిల్లనిమ్ము
లేక కాలంపుటలల మూర్ఛిల్లనిమ్ము

-అనే ఆత్మప్రశ్రయంతో వ్రాసుకున్న కవికిశోరుని కబ్బం మరి!

పుట్టపర్తివారు సర్వతంత్ర స్వతంత్రమైన వ్యక్తిత్వం కలవారు. ఏదో ఒకచోట స్థిరంగా ఇమడలేదు. ఎవరి పెత్తనానికీ తలవొగ్గలేదు. ఢిల్లీలోనూ, కేరళలోనూ, ప్రొద్దుటూరులోనూ అనేక ఉద్యోగాలు చేశారు. ప్రతిచోటా రవ్వలు పండించారు. ఆశనిరాశలూ, రక్తివిరక్తులూ, అతిశయ వినమ్రతలూ–ఇలా ఒక వంద ధోరణుల కలగూరగంప ఆయన. ఐనా పెద్దలూ పిన్నలూ ఆయన్ను సమానంగా గౌరవించారు. ఒకనాడు ఢిల్లీ బజారులో ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే అకస్మాత్తుగా చూచిన అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు తన వాహన శ్రేణిని ఆపి, కారుదిగి పుట్టపర్తివారిని పలకరించి తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళారట.

1959-60లలో ఆంధ్రపత్రిక వీక్లీలో తెలుగు వెలుగులు అనే శీర్షికలో అప్పటి తెలుగు ప్రముఖుల పరిచయాలు చేశారు. ఒకే ఒక పేజీలో ఆ మహనీయుల మూర్తిమత్వాన్ని క్లుప్తంగా ఐనా సమగ్రంగా ఆవిష్కరించారు. ఆ శీర్షిక గొప్ప పాఠకాదరణ పొందింది. వాటిలో పుట్టపర్తివారిని గురించిన ఈ నాలుగు మాటలూ చూస్తే వారి వ్యక్తిత్వం బాగా అర్థమవుతుంది. ఆ వింగడింపు చాలా బాగుంటుందనిపించినందున ఇక్కడ ఉదహరిస్తున్నాను. ‘పట్టరాని ఆవేశం, పట్టిచూద్దామనే కావేషం, ఏ పిల్ల గాలి వీచినా కదలిపోయే మనసు, ఏ చల్లగాలి సోకినా వడలిపోయే దినుసు, మాట వినకపోతే మతి చలించేంత ఆగ్రహం, మాట వింటే కనకాభిషేకం చేసేటంత అనుగ్రహం, మూడు అంగల్లొ ముల్లోకాలు జయిద్దామన్న ఆశ, మానవమాత్రులం ఏమిటి సాధ్యమన్న నిరాశ, ధృవునికన్నా దృఢతరమైన భక్తి, దానికి ప్రతిధృవమైన విశృంఖల రక్తి, ఛీఛీ ఏమిటీ పాడులోకం అన్న విరక్తి, ఇదే కదా మన తరణోపాయానికి మెట్టు అన్న ఆసక్తి, మంత్రతంత్రాలపై మరులు, అధివాస్తవిక భావాల తెరలు, ఇంతవాణ్ణైనా జనం అడుగులకు మడుగులొత్తడం లేదే అన్న సంతాపం, ఆ! మనది ఎంతపాటి పాండిత్యంలే అన్న పశ్చాత్తాపం’– ఇలాంటి పరస్పర వైరుధ్యాల రాలే శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. ఉవ్వెత్తుగా లేచి సంఘర్షించుకునే ఈ వైరుధ్యాలే ఈయనను బహుభాషావేత్తగా తీర్చాయి. రచనలో బహుమార్గానుసారిగా మార్చాయి.

పుట్టపర్తివారు కవి మాత్రమే కాదు. గొప్ప విమర్శకులు. అనర్గళ వాగ్ధాటి కలిగిన మహావక్త. యాభై ఏళ్ళనాడు హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో ప్రాకృత సాహిత్యంలోని సొగసులను వారు నిరర్గళంగా వింగడిస్తూ ప్రసంగిస్తుంటే వినే అదృష్టపు జ్ఞాపకం ఈ వ్యాసకర్త మనసులో ఇంకా పచ్చగానే ఉంది.

పుట్టపర్తివారు దాదాపు 20 వేల ద్విపదలతో పండరి భాగవతం వ్రాశారు. జనప్రియ రామాయణం పేరుతో రామాయణం వ్రాశారటగాని అది అసంపూర్ణమనుకుంటాను. అగ్నివీణ, సాక్షాత్కారం లాంటి చిరు రచనలు వెలయించారు. ఇంకా అనేక రచనలు సృష్టించారు కాని…

ఏమానందము భూమితలమున – ఓహోహో
ఊహాతీతంబీయానందంబిలా తలంబున –
శివతాండవమట – శివలాస్యంబట’

-అంటూ

ధిమిధిమిద్ధ్వని సరిద్గిరి గర్భములు దూగ, నమిత
సంరంభ హాహాకారములు రేగ – ఆడెనమ్మా
శివుడు, పాడెనమ్మా భవుడు

-అంటూ శివతాండవాన్ని అపూర్వ సంగీత గేయ ఫణితితో వారు రూపుకట్టించిన తీరు ఆంధ్ర రసికులచేత పారవశ్య తాండవం చేయించింది. నృత్యానికి గూడా అమరిపోయి నభూతోనభవిష్యత్తన్నట్లు రచించిన గేయాలతో వారు రచించిన శివతాండవం అనే గేయ కావ్యం అపూర్వ ప్రశస్తి పొందింది. వారు ఏ సభలో పాల్గొన్నా, శ్రోతలు వారిచేత ఆ గేయాలు పాడించుకుని విని ముగ్ధులయ్యేవారు. పుట్టపర్తివారు అనగానే ముందు గుర్తొచ్చేది శివతాండవ కావ్యమే!

కారణాలు ఏవైనా అయ్యుండవచ్చుగాని వారి ప్రతిభకూ యోగ్యతకూ తగినంత గుర్తింపు రాలేదని, రావలసిన పురస్కారాలు అందలేదని, ప్రజానీకంలో ఒక వేదనతో కూడిన అభిప్రాయం వుంది. సాహిత్య రంగంలో కూడా సాహిత్యేతరమైన కారణాలు రాజ్యమేలుతున్న రోజులాయె. ఆ అభిప్రాయం సరికాదు అనుకోడం కూడా సరైనదో కాదో చెప్పడం సులభం కాదు.

తెలుగువారు మరిచిపోగూడని సాహితీమూర్తి శ్రీ పుట్టపర్తి. వారి పెనుగొండ లక్ష్మి ప్రతిపద్య సుందరమైన కావ్యం!
-----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment