Monday, July 2, 2018

రాజు – కవి – కావ్యం


రాజు – కవి – కావ్యం



సాహితీమిత్రులారా!


ఉ. ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందు తృణాగ్రలగ్న నీ
    రాకృతి వార్ధి యింకుట దశాస్యుని జంపుట మిథ్యగాదె వా
    ల్మీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు ర
    త్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరువెత్తినన్

నేనీ పద్యాన్ని మొదటిసారి ఒక చాటువుల పుస్తకంలో చదివాను. చదివిన వెంటనే ఒక గొప్ప విస్మయం. ఇలాంటి పద్యం మునుపెన్నడూ చదివింది లేదు! కవినీ కావ్యాన్నీ ఒక కొత్త కాంతిలో చూసినట్టుగా తోచింది. కవి గొప్పదనాన్ని గురించి, అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః మొదలైన ఉల్లేఖనాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలోని అంశం వేరు, ఈ పద్యంలోని విషయం వేరూను.

దీని అర్థం సులువే. ఈ పద్యంలో విశేషమైన ఉదాహరణతో ఒక సామాన్య విషయం ప్రతిపాదింపబడింది. ఇలా చేయడాన్ని ఆలంకారిక భాషలో అర్థాంతరన్యాసం అంటారు. ఇక్కడ ప్రతిపాదింపబడిన విషయం – కృతిలేని నరేశ్వరు వర్తనంబు ఆతడు మేరువెత్తినా రత్నాకరవేష్టితావని వినంబడదు – అంటే తన గురించి చెప్పే ఒక కావ్యం అంటూ లేకపోతే, రాజు చేసే ఏ కార్యమైనా, మేరుపర్వతం ఎత్తడమంతటి ఘనకార్యమే అయినా, అది సముద్రవలయితమైన ఈ భూమిపై వినపడదు, అని. దీనికి సమర్థనగా చూపించిన ఉదాహరణ రామాయణం. మహాసముద్రం సైతం భయంతో ఒక గడ్డిపోచ చివరన నీటిబిందువులా రాముని బాణపు చివరన ఇంకిపోయిన విషయము, పదితలల రావణుని రాముడు వధించిన విషయము, వాల్మీకి తన రామాయణ కావ్యంలో వర్ణించి చెప్పకపోయి ఉంటే మనకి తెలియకుండా మరుగున పడిపోయేవి కదా! ఇక్కడ మిథ్య అంటే అసత్యం అని కాదు, అసలవి తెలియకుండా పోయేవని.

కావ్యానికున్న ఒక అసామాన్య శక్తి ఇక్కడ సూచింపబడింది. ఒక కాలానికి చెందిన వ్యక్తిని, లేదా సంఘటనని, లేదా సామాజిక దృశ్యాన్నీ కాలాతీతం చేసే మార్మిక శక్తి అది! వ్యక్తిగా గతించినా ఒక పాత్రగా ఆ వ్యక్తిని అజరామరం చేసే మహత్తు కవి వాక్కులో ఉంది. అందుకే చరిత్ర చేయలేని పని కావ్యం చేస్తుంది. ఇదంతా ఈ పద్యం సూచిస్తోందా అంటే, జాగ్రత్తగా పరిశీలిస్తే అవుననే నాకు అనిపించింది. భూమికి రత్నాకరవేష్టితావని అన్న పదం ఎందుకు? అది భూమి వైశాల్యాన్ని చెపుతోంది. అంతటి విశాలమైన భూప్రపంచమంతటా ఒక వ్యక్తి చేసిన కార్యం విస్తరించాలంటే, అది ఎలా సాధ్యం? దాని వెంటనే ఉన్న క్రియాపదం దానికి సమాధానం. అది ‘వినపడాలి’. వినిపించాలి అంటే, నలుగురూ దాని గురించి మాట్లాడుకోవాలి. రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల పైన – అన్నారు జాషువా. ఆ రాజే కవి వాక్కుకి పాత్రుడయితే, అతను కూడా ప్రజల నాలుకలపై జీవిస్తాడు. అలా ఒకరి నుంచి మరొకరికీ, ఒక చోటు నుంచి మరొక చోటుకీ, ఒక తరం నుంచి మరో తరానికీ ఆతని కథ ‘వినిపిస్తూ’ ఉంటుంది. చరిత్ర ‘వ్రాయబడుతుంది’, కావ్యం ‘చెప్పబడుతుంది’. వ్రాతకి లేని వేగం మాటకి ఉంది. అందుకే వాల్మీకులు సెప్పకున్న అన్న ప్రయోగం. ఇక్కడ వాల్మీకులు అన్న మాట కూడా చాలా సొగసైన మాట. ఆ బహువచనం వాల్మీకిపై గౌరవాన్ని సూచిస్తునే, వాల్మీకి వంటి కవులు అనే అర్థాన్ని కూడా ధ్వనిస్తోంది. పైగా కవి వాక్కు ఎలా ఉంటుందో మొదటి రెండు పాదాలూ సూచిస్తున్నాయి. రాముడు సముద్రంపై వారధి కట్టి లంకకు వెళ్లెను, అని చెపితే అది వట్టి చరిత్ర అవుతుంది. అంతటి మహాసముద్రంపై రాముడు వారధి కట్టాడంటే, సముద్రం అతనికి వశమయినట్టే కదా. అది అతని బాణశక్తికి భయపడినట్టు వర్ణించడమే కాకుండా, తృణాగ్రలగ్న నిరాకృతి అనే పోలిక ద్వారా ఆ శక్తి, కథ వినే వారి మనసుల్లో శాశ్వతంగా ముద్రవేసేట్టుగా చేశాడు కవి. అదే కవిత్వంలో ఉన్న పటుత్వ మహత్వ సంపద! అలాగే, దశాస్యుని చంపుట అన్న మాట కూడాను. ఎవరో ఒక శత్రురాజునో, లేదా తన భార్యను అపహరించిన ఒక దుర్మార్గుడినో హతం చేశాడని చెపితే అందులో పస ఏముంటుంది? పదితలకాయలవాడు అంటే ఆతను ఎంత శక్తివంతుడో తెలుస్తుంది. అంతటి శక్తివంతుడిని ఎదుర్కొన్నాడంటే రామునికి మరెంత శక్తి ఉన్నదో వినేవాడు ఊహించుకోగలడు.

గగనం గగనాకారం సాగరం సాగరోపమం
రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ

అన్న కవి వాక్కు రామరావణ సంగ్రామ తీవ్రతని యుగాలు దాటినా చెక్కు చెదరకుండా మనకి అందిస్తోంది!

ఇంతకీ, యింత గొప్పగా కవి వాక్కులోని మాహాత్మ్యాన్ని వర్ణిస్తున్న యీ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరో మనకి తెలియదు. మొదటే చెప్పినట్టు, ఇది ఒక చాటువు. దీని మూలాన్ని వెతుకుతూ వెళితే, ఈ పద్యంలో మరొక కోణం కనిపించింది. ఆ వెతుకులాట కూడా ఆసక్తికరమైన ఒక ప్రయాణం! ఈ పద్యం చివరిసారిగా ప్రస్తావించబడిన గ్రంథం, కూచిమంచి తిమ్మకవి రచించిన సకలలక్షణసారసంగ్రహం. తిమ్మకవి కాలం పద్దెనిమిదవ శతాబ్దం. ఈ గ్రంథం తెలుగు భాష వ్యాకరణానికీ, ఛందస్సుకీ లక్షణాలని వివరిస్తూ, వాటికి అనువైన లక్ష్యాలను కూడా ఉదాహరించే గ్రంథం. స్వంత రచనగా కాకుండా, ఆ ఉదాహరణలను పూర్వకవుల పద్యాల నుండి చూపించాడు తిమ్మకవి. అలా చూపించిన ఉదాహరణల్లో, అఖండ యతికి ఉదాహరణగా యిచ్చిన పద్యం ఇది. ఈ పద్యం చివరిపాదంలో మొదటి అక్షరం త్నా. అయితే, రత్నాకర అన్న పదంలో రత్న+ఆకర అని సంధి జరిగింది. అలా పదంలో స్వరసంధి జరిగిన అక్షరం పాదాదిని ఉంటే సాధారణంగా సంధి జరగకముందున్న అచ్చుతో మాత్రమే యతి చెల్లుతుంది (అంటే, ఇక్కడ ఆ-కారం). కానీ యిక్కడ యతిస్థానంలో వినంబడు అన్న పదంలో నకారం ఉంది. కాబట్టి రత్నాకర పదాన్ని అఖండంగా తీసుకొని, త్నా అన్న అక్షరంలో ఉన్న నకారంతో యతి చెల్లించబడింది. ఇలాంటి యతినే అఖండ యతి అంటారు. ఉదాహరణ పద్యాలు ఇవ్వడంతో పాటుగా తిమ్మకవి చేసిన మరో మంచి పని, ఆ పద్యాలు ఏ కావ్యం లోనివో కూడా చెప్పడం. ఈ పద్యం భైరవుని శ్రీరంగమాహాత్మ్యం లోనిదని తిమ్మకవి పేర్కొన్నాడు. ఆ కావ్యాన్ని వెతికి పట్టుకొని చూస్తే తెలిసి వచ్చినది ఏమిటంటే, ఈ పద్యం అందులో లేదు! అయితే యిలాంటి అర్థమే వచ్చే మరొక పద్యం కనిపించింది. కావ్యవైశిష్ట్యాన్ని గురించి వర్ణించే పద్యం, కావ్య అవతారికలో ఉంది.

పుట్టకు, బుట్టికోమలికి, బుట్టిన ప్రాగవు లాదరించి చే
బట్టిన గాదె రాఘవనృపాలక ధర్మజ కీర్తి చంద్రికల్
నెట్టన సర్వలోకములు నిండిన విప్పుడు నిందు నందులన్
ముట్ట నఖర్వసర్వసుఖమూలము కావ్యమ వో తలంచినన్

కవిత్వపరంగా చూస్తే, మనం పైన చెప్పుకొన్న పద్యానికి యీ పద్యం సరితూగదు. అయితే యిందులో రామాయణంతో పాటుగా మహాభారతం కూడా ప్రస్తావించబడింది. పుట్టికోమలి అంటే పడవ నడిపే పడుచు, సత్యవతి. పుట్టకు పుట్టినవాడు వాల్మీకి అయితే పుట్టికోమలికి పుట్టినవాడు వ్యాసుడు. రామునికీ ధర్మరాజుకీ లోకంలో కీర్తి రావడానికి కారణం ఆ కవులే అంటున్నాడు భైరవకవి! అయితే యిక్కడొక తేడా మనం గమనించాలి. రాముని విషయం లోనూ ధర్మరాజు విషయం లోనూ ఆయా కావ్యాలు వారి గురించిన కథలు. కానీ భైరవకవి రచించిన కావ్యం కృతిభర్త చరిత్ర కాదు, శ్రీరంగనాథుని మహత్వం. రాజులు కృతిభర్తలుగా కావ్యాలని అంకితం తీసుకోవడం మనకి సర్వత్రా కనిపించే విషయమే. కృతి సప్తసంతానాలలో ఒకటిగా పేరు కూడా పొందింది. కావ్యాన్ని అంకితం తీసుకోవడం ద్వారా లభించే కీర్తి వేరు, స్వయంగా కావ్యనాయకునిగా రూపొందితే వచ్చే కీర్తి వేరూను. భైరవకవి కాలం సరిగ్గా తెలియదు కానీ ఈ పుస్తకాన్ని పరిష్కరించి ప్రచురించిన మానవల్లి రామకృష్ణకవిగారు, ఇతను పదహారవ శతాబ్దం లేదా దానికి కొంచెం ముందు ఉండవచ్చునని కొన్ని ఆధారాలతో పేర్కొన్నారు.

సరే, ఇంతకీ అసలు మన పద్యం ఈ కావ్యంలో లేదు. ఈ కావ్యపీఠికలో ఆ పద్యాన్ని గురించి ప్రస్తావిస్తూ మానవల్లివారు, లక్షణకారులు ఉదాహరించిన ఆకుల వృత్తి పద్యం, భైరవుని కావ్యంలో లేదని, భోజరాజవిభూషణం అనే నీతిగ్రంథంలో ఉన్నదనీ అన్నారు. అయితే, ఈ భోజరాజవిభూషణం అనే కావ్యం అలభ్యం! ఇక అన్వేషణ ఇక్కడితో ముగిసినట్టేనా అని అనుకొంటూ, భోజరాజవిభూషణం అన్న గ్రంథం గురించిన ప్రస్తావన ఇంకెక్కడయినా ఉన్నదేమో అని వెతికాను. ఆ వెతుకులాటలో మడికి సింగన సకలనీతిసమ్మతము కంటబడింది. ఇదికూడా మానవల్లివారు సంపాదించి ప్రకటించిన గ్రంథమే! ఇదొక సంకలన గ్రంథం. పూర్వ గ్రంథాలనుండి ఏర్చి కూర్చిన నీతి పద్యాల సంకలనం. ఇందులో సింగన ప్రస్తావించిన గ్రంథాల పట్టికలో భోజరాజవిభూషణం ఉంది. కానీ, అందులో పద్యాలేవీ ఈ సంకలనంలో లేవు! కాకపోతే వెతుకుతున్న పద్యం మాత్రం ఇందులో కనిపించింది. అది నీతిభూషణము అనే గ్రంథంలోని పద్యమని సింగన పేర్కొన్నాడు. బహుశా నీతిభూషణము బదులు రామకృష్ణకవిగారు భోజరాజవిభూషణం అని పొరపాటుగా చెప్పి ఉంటారు. అయితే, ఈ నీతిభూషణము కూడా అలభ్యమే! అదికూడా సకలనీతిసమ్మతము లాగానే సంకలన గ్రంథమే అయ్యుంటుంది. కాబట్టి ఈ పద్యం మూలమేమిటో తెలియదు. బహుశా చాటువే అయ్యుండవచ్చు. మడికి సింగన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు. అంచేత ఆ కాలానికే యీ పద్యం ప్రచారంలో ఉన్నదన్న మాట.

ప్రయాణం ఇక్కడికి వచ్చి ఆగింది. అయినా నాకు తృప్తి కలగలేదు. ఈ పద్యం చెపుతున్నది రాజచరిత్రని కావ్యంగా మలిచే విషయం. మనకి కావ్య రచనలో రెండు ప్రధాన ధోరణులు కనిపిస్తాయి. ఒకటి -ఆద్య సత్కథలను, అంటే పురాణాలలో ఉన్న కథలను (రామాయణ, భారతాలు కూడా పురాణ కథలే) చక్కని కావ్యాలుగా మలచడం. మరొకటి -కేవల కల్పనా కథలు, అంటే పూర్తిగా కవి స్వకపోలకల్పితాలయిన కథలతో కావ్యాలు రచించడం. ఎక్కువ భాగం కనిపించే కావ్యాలు మొదటి ధోరణికి చెందినవే. కళాపూర్ణోదయం వంటి కొన్ని కావ్యాలు రెండవ ధోరణిలో వచ్చినవి. అయితే, యీ పద్యం ప్రస్తావించినది మరొక మార్గం. అది చారిత్రకమైన ఒక రాజు చరిత్రను కావ్యంగా రూపొందించడం. ఇది తెలుగులో పదిహేనవ శతాబ్దం నుంచే కనిపిస్తోంది. అయితే ఆలాంటి కావ్యాలకు అంతగా ప్రసిద్ధి లేదు. మరి పదిహేనవ శతాబ్దానికే యిలాంటి పద్యమొకటి ప్రచారంలోకి ఎలా వచ్చి ఉంటుంది? సంస్కృతంలో రాజు చరిత్రను కావ్యంగా చెప్పే ధోరణి ఏడవ శతాబ్దానికి చెందిన బాణుని హర్షచరిత్ర నుంచీ కనిపిస్తోంది. అంచేత యీ పద్యానికి మూలం సంస్కృతంలో దొరుకుతుందేమో అని వెతికితే, చివరకు బిల్హణకవి రచించిన విక్రమాంకదేవచరిత్ర అనే కావ్యంలో కనిపించింది! బిల్హణుడు పదకొండవ శతాబ్దానికి చెందిన కాశ్మీరదేశ కవి. అతను దేశ సంచారం చేస్తూ చివరకు పశ్చిమ చాళుక్య రాజయిన విక్రమదేవుని కొలువులో విద్యాపతిగా చేరాడు. ఆ రాజు గురించిన కావ్యమే విక్రమాంకదేవచరిత్ర. బిల్హణుడు సంస్కృతకవి అయినప్పటికీ తెలుగువారికి బాగా పరిచయమే. అతని గురించిన కథ బిల్హణీయమనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. విక్రమాంకదేవచరిత్ర అవతారికలో కవి మహత్వాన్ని గురించిన రెండు శ్లోకాలు గమనించ దగ్గవి:

పృథ్వీపతేః సన్తి న యస్య పార్శ్వే కవీశ్వరాస్తస్య కుతో యశాంసి?
భూపాః కియన్తో న బభూవురుర్వ్యా జానాతి నామాపి న కోऽపి తేషామ్

లఙ్కాపతే సఙ్కుచితం యశో యత్ యత్ కీర్తిపాత్రం రఘురాజపుత్రమ్
స సర్వ ఏవాదికవైః ప్రభావో న కోపనీయాః కవయః క్షితీంద్రైః

ఈ శ్లోకాలకి కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి అనువాద పద్యాలు:

తమ కెలనన్ గవీశ్వరవితానము నిల్పగలేని ధారణీ
రమణుల కీర్తిసంతతులు రాజిలు నెట్టుల? రాజు లెందఱో
క్షమపయి దీప్తితో వెలసి కాలము దీఱ జనంగ లేదె! సం
భ్రమముననేని నట్టి నరపాలుర పేరు లెఱుంగ డెవ్వడున్

రావణుయశ మఱుటయు సీ
తావరుడు యశోర్హుడగుట తగ నిది సర్వం
బా వాల్మీకి ప్రభావమె
కావున గవులయెడ నలుగ రాదు నృపులకున్

ఈ శ్లోకాలలో కూడా రాజు కీర్తిమంతుడు కావాలంటే కవి సహాయం ఉండాలన్న భావము, రాముని యశస్సుకు వాల్మీకే కారణమన్న ఉదాహరణతో సమర్థన, స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అందువల్ల నీతిభూషణంలోని మన పద్యానికి యీ శ్లోకాలు స్ఫూర్తి అయ్యే అవకాశం ఉంది. బిల్హణుడు మరొక అడుగు ముందుకు వేసి, రావణుని కీర్తి హరించిపోవడం కూడా వాల్మీకి ప్రభావము చేతనే అని అన్నాడు. అంతకు ముందున్న రాజులు ఎంతమందో సరయిన కవి లభించక మరుగున పడిపోయారని కూడా అంటున్నాడు. పైగా, అందుకే రాజులు కవులకు కోపం రాకుండా చూసుకోవాలని హెచ్చరిక! బిల్హణుని కాలంలో రాజులు కవులపై ఏ రకంగా ఆధారపడేవారన్న అంశం యీ శ్లోకాలలో ప్రతిఫలిస్తోంది. తమాషా అయిన విషయం ఏమిటంటే యీ విక్రమాంకదేవచరిత్ర కావ్యంలో విక్రమదేవుని సాక్షాత్తూ శ్రీరామచంద్రునితో పోలుస్తాడు బిల్హణుడు. బిల్హణుని ఉద్ధతి కూడా కొంత కనిపిస్తుందీ శ్లోకాలలో. ఆ ఉద్ధతిని పరిహరించి, మరింత సొగసుగా తెలుగు చేసిన చాటుకవి ఎవరో మరి!

మరొక్క ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పి యీ వ్యాసాన్ని ముగిస్తాను. కవులకూ కవిత్వాభిమానులకూ చాలా ఆసక్తి కలిగించే, ఉపయోగపడే పుస్తకం ది సైటెడ్ సింగర్ (The Sighted Singer). ఆలెన్ గ్రాస్‌మన్ (Allen Grossman), మార్క్ హాలిడే (Mark Halliday) అనే యిద్దరు కవుల మధ్య కవిత్వాన్ని గురించి జరిగిన సుదీర్ఘ సంభాషణ. అందులో గ్రాస్‌మన్ పేర్కొన్న ఒక కవిత నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది.

Many heroes lived before Agamemnon
but they are all unweepable, overwhelmed
by the long night of oblivion
because they lacked a sacred bard.

ఇది క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన రోమన్ కవి హొరెస్ (Horace) చెప్పిన కవిత. ఆగమెమ్నాన్ (Agamemnon) గ్రీకు పురాణాలలో ప్రముఖుడైన రాజు. ట్రోజన్ యుద్ధంలో (Trojan war) గ్రీకు సైన్యాలని ఒకటి చేసిన వీరుడు. హోమర్ (Homer) రచించిన ఇలియడ్ (Iliad), ఆడెస్సీ (Odyssey) కావ్యాలలో ఇతని గురించి విస్తృత వర్ణన ఉంది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, హోమర్ చెప్పడం వల్లనే ఆతని పేరు ఇంత కాలం నిలిచున్నదని, ఆగమెమ్నాన్ ముందు ఎంతమంది వీరులు కావ్యానికి ఎక్కకపోవడం వలన కాలగర్భంలో కలిసిపోయారో అని అంటున్నాడు హొరెస్. హోమర్‌ని సేక్రెడ్ బార్డ్‌గా పేర్కొన్నాడు హొరెస్. సరిగ్గా మన పద్యంలో ఉన్న వాల్మీకి కూడా అదే కదా!
----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment