Friday, September 29, 2017

యోగము - అష్టాంగాలు


యోగము  - అష్టాంగాలు




సాహితీమిత్రులరా!



        యోగం అంటే చిత్తవృత్తిని అదుపులో పెట్టి మనోనిగ్రహాన్ని పొందడం అంటారు. దీన్నే యుగము అంటే రెండు, యుగళ గీతం అంటే ఇద్దరు కలిసి పాడటం లాగే యోగము అంటే రెండింటి సంయోగం అవి కూడా అనేకం జీవుడు దేవునిలో కలవడం అని,
మూలాధారం నుండి పుట్టిన శక్తి సహస్రారంలో కలవడం అని అంటుంటారు. దీన్ని సాధించటానికి చేసే 8 అంగాలను అష్టాంగములు అంటారు. 
        యోగాభ్యాసంలో  8 అంగాలనే 8 మెట్లు అని అంటారు.
అవి - 1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 
7. ధ్యాన, 8. సమాధి.

వీటిని ఒక్కొకదాన్ని గురించి గమనిద్దాం-
1. యమ -
   ఇది మొదయి మెట్టు. దీనిలో చేయవలసినవి ఐదు.
   1. అహింస, 2. అసత్యం ఆడకుండుట, 3. దొంగిలించకుండుట,
   4. బ్రహ్మచర్యం పాటించుట, 5. సాంఘిక జీవనం పాటిండం.

2. నియమ -
   ఇది రెండవ మెట్టు. దీనిలో 1. శుచి,శుభ్రత ఆహార విహార    
   పానీయాదులందు కలిగి ఉండటం. 2. నిత్య సంతోషిగా కాలం   
   గడపటం. 3. తపస్సు, 4. స్వాధ్యాయం, 5. ఈశ్వర ప్రణిధానం
   అనే ఐదింటిని పాటించడం. 
   అంటే ఆహార,విహార,పానీయాదులలో శరీరమానసిక శుభ్రత  
   పాటించడం.ఎవరికిగాని చెడు తలపకుండడం, ఇతరుల మనస్సు 
   నొప్పించకుండా నిత్యసంతోషిగా ఉన్నంతలో దురాశకు పోకుండా
   తృప్తి కలిగి ఉండడం, కోరికలను జయించి పరమాత్మలో చేయ 
   యత్నించడం.

3. ఆసన -
   యోగికి ఈ ఆసనాలు శరీరరోగ్యానికి, మనస్సు నిలకడకు  
   ఉపకరిస్తాయి. మనస్సు చంచలత్వాన్ని తొలగించి, మానసిక 
   స్థైర్యం నిలకడను కలిగిస్తాయి.

4. ప్రాణాయామ-
    మన (ఊపిరిని) శ్వాసక్రియను అదుపులో పెట్టుకోవడం
    ఇది పూరక(గాలిని పీల్చడం), రేచక(గాలిని వదలడం),
    కుంభక(పీల్చిన గాలిని కొంతసమయం నిలపడం) అనే 
    క్రియల ద్వారా క్రమబద్ధీకరించటం. వీటిని అనుభవజ్ఞులైన
    వారిద్వారా నేర్చుకోవాలి.

5. ప్రత్యాహార-
   పై శ్వాసక్రియలపై అధికారం లభింపజేసుకొని మనో నిగ్రహం 
   కలిగి భక్తియుక్తులతో కోరికల వేదనల నుంచి విముక్తి పొంది 
   ఇంద్రియ నిగ్రహుడై ఉండడం.

6. ధారణ -
   ప్రాణాయామ ప్రత్యాహారముల వలన శారీరకంగా ఆరోగ్యవంతుడైన
   తరువాత ఇంద్రియ నిగ్రహణం ఎప్పుడు అలవడునో అప్పుడు  
   ధారణ శక్తికి అనుగుణ్యుడవుతాడు. దాని వలన ఏకాగ్ర స్థితికి 
   చేరడానికి చంచలమై ఉండే మనసు నిశ్చలస్థితికి చేరుకోవడానికి  
   సిద్ధమౌతుంది. దీనిలోని మానసిక స్థితులు 5 అవి-
   1. క్షిప్త - పరిస్థితిలో మనసు ఆందోళన చెంది 
            సక్రమంగా ఉండనిస్థితి
   2. విక్షిప్తి - కోర్కెలు మితిమీరి మనసు వ్యాకులతకులోనై
             పరధ్యాంగా ఉండే స్తితి.
   3. మూఢ - మనసు భ్రమలో పడి అవివేకుడై ఉండు స్థితి.
   4. ఏకాగ్రత -మంచి గుణం కలిగి, దేనిని సాధించ దలుస్తాడో
               దానిని సాధించడానికి ప్రయత్నించే స్థితి.
   5. నిరుద్ధ - అహంకారాన్ని జయించి ఏ దానిని సాధించ 
              దలుస్తాడో దానియందే ఏకాగ్రత చేకూరే పరిస్థితి.
7. ధ్యానం -
   ధ్యాన ఫలితంగా మనసు ఇంద్రియాలు శ్వాసక్రియలు అన్ని పరమాత్మలో లయంకాగల స్థితి. ఇది ఏకాగ్రత నిరాటంకంగా జరిగే స్థితి. ఒక పెద్ద అనుభూతిలో విలీనమై ఉండే స్థితి.(దీనిలో అనుభూతి తప్ప మరే అనుభవ స్థితి ఉండదు)

8. సమాధి - 
   ఈ స్థితిలో నిద్రించేప్పుడు ఎంత విశ్రాంతి పొందగలడో అంతకు 
   మించిన విశ్రాంత స్థితి. ఇది ధ్యానం వలన కలిగే ఉచ్ఛమైన 
   స్థితి. అది ఒక అనిర్వచనీయమై ఉండే అమితానంద అనుభూత 
   స్థితి.

   యోగం సాధించడంలో వీటన్నిటి పాత్ర ఎంత ఉందో తెలుస్తున్నది
   అలాగే ఆసనాలను క్రమబద్ధంగా సురక్షితంగా అభ్యసించడం 
   అత్యవసరం.
    

No comments:

Post a Comment