Wednesday, September 13, 2017

పెద్దనగారి ప్రవరుడు - 1


పెద్దనగారి ప్రవరుడు - 1




సాహితీమిత్రులారా!



అల్లసాని పెద్దనగారి పేరు వినని తెలుగువారు
సాహితీప్రియులు ఉండరన్నది అతిశయోక్తికాదేమో
ఈయన శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని
అష్టదిగ్గజాలలో మొదటివాడుకూడా
ఈయన మనుచరిత్రలో అదేనండీ
స్వారోచిషమనుసంభవము అనే ప్రబంధంలో
సృష్టించిన ప్రవరుని గురించి ఇక్కడ చూద్దాం-
ప్రవరుఁడు అంటే నిఘంటువులో శ్రేష్ఠుడు, మేటి అని ఉన్నాయి.
అందుకే ప్రవరుని గుణాలను చాల చక్కనైన శ్రేష్ఠమైన గుణాలు
కలవానిగా తీర్చిదిద్దాడు పెద్దనగారు. ఆ గుణాలను పెద్దనగారి
పద్యాలలోనే చూద్దామా....

వరుణానదీ తీరంలో అరుణాస్పందం అనే ఊరు అందులో
నివసించే బాపడు ప్రవరుడు.

ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁడంబురుహ గర్భకులాభరణమ బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యుఁడలేఖ్య తనూవిలాసుఁడై
                                                                                                 (మనుచరిత్ర 1-51)
మన్మథునివలె, చంద్రునివలె, అందమైన
శరీరంకలవాడును, భాషలో రెండవ ఆదిశేషుడునూ అయి
సమస్త యాగాల్లోను, స్వచ్ఛమైన ధర్మకార్యాల్లోను,
దీక్ష ఆసక్తికలవాడు, బ్రాహ్మణజాతికి అలంకారమైనవాడు,
నిరంతరమూ వేదాధ్యయనమునందు ఆసక్తికలవాడు,
ప్రవరాఖ్యుడను పేరుకలవాడు ఆ పట్టణం(అరుణాస్పదాన్ని)
విడువక(ఎక్కడికీ వెళ్ళకుండా) ఉండేవాడు.

వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి
కాంక్ష సేయుజారకామినులకు
భోగబాహ్య మయ్యెఁ బూచినసంపెంగ
పొలుపు మధురాంగనలకుఁబోలె  - 52

తుమ్మెద అన్ని పూవులమీదా వాలుతుంది
ఒక్క సంపెంగ పూవుపై తప్ప దానిపై వాలెనా
చచ్చి వూరుకుంటుంది. తుమ్మెదలకు సంపెంగ
పనికిరానట్లే ఎంత అందగాడైనా ప్రవరాఖ్యుడు
జారవృత్తి లేనందున ఆ ఊరిలోని జారకామినులకు
పనిరానివాడైనాడు.

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడు నై కమనీయ కౌతుక
శ్రీనిధిఁ గూకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిద్మ సౌ
భ్యావహ యై భజింప సఖులై తలిదండ్రులు గూడి దేవి యున్
దేవరబోలె నుండి యిలు దీర్పఁగఁ గాపుర మొప్పు వానికిన్

అతడు ధనవంతుడై, తనకు ఈడుజోడైన భార్య సేవలు
చేస్తుండగా పడుచుదనంలోనే యజ్ఞంచేసి తల్లిదండ్రులు
ఇంటిలో సుఖులై ఇంటిని సర్దుతుండగా కాపురం చేస్తూ
ఉండినాడు.

No comments:

Post a Comment