Tuesday, August 29, 2017

మన భారతి కిండిక పద్యహారతుల్


మన భారతి కిండిక పద్యహారతుల్



సాహితీమిత్రులారా!

మన భాషఎంత గొప్పదో తెలిసి కూడ
ఆంగ్లభాషవైపు వెళ్ళడం చూచి
అలంకారం కోటంరాజుగారు
అలా వెళ్ళకండని తెలుగు భారతికి
హారతులివ్వండని చెబుతున్నాడు చూడండి-

తెనుగు పద్యంబు హృద్యంబు, తెన్గుపల్కు
తేనియల యూట, యమృతంపు తేటగాదె
ఎల్లవారల హృదయాల కొల్లగొనెడి
పరసువేదియ కద తెన్గుభాషయనగ

తెనుగు, తెలుంగు, యాంధ్రమని, తేరగ పల్కుట గాదు, నిత్యమున్
మనము స్వభాషకై హృదయమందున నెవ్విధి చింతజేసి నా
మనియెడు చర్చబూనిన, క్రంబున తోచు హుళక్కియంచు, జీ
వనమున తెన్గుసేవయె జవంబును, సత్త్వము, తేజ మీయదే

మన జాతియు, మన భాషయు
ఘనమైన చరిత్రగలవి గతకాలమునన్,
తెనుగును బ్రతికింపగ చిం
తన జేయుడు, మీరు తెనుగుదనమును నిల్పన్

ఇంతనరాని భాషయిది, యెంతగ జెప్పిన తీరబోదు, ఇం
తింత త్రివిక్రమత్వమున, ఏపు వహించి, మహోన్నతంబునై
ప్రాంతము లాక్రమించినది, ప్రాపు నొసంగిన నింతకింకయై
వింతలొనర్చు, సుంతయు వివేకము జూపుడు, భాషపెంపగున్

తెనుగు చదువుడు, చదివింప జనుల నడుమ
నడుముగట్టుడు, ఇంకముందు నడుపుడంచు
వేయబోకుడు పొలికేక, శ్రేయమొసగు
పద్ధతిని యాచరింపంగ భాష పెరుగు

అట్టితెనుంగువీడి, జనులందరు నాంగ్లపు మాయజిక్కగా
నెట్టుమనస్సు పుట్టినది, యియ్యది మాన్యతమంబు గాదు, ఎ
ప్పట్టుననైన, మీరలు అపార ముదంబున తెన్గుభాషకున్
పట్టముగట్టరండు, మన భారతి కిండిక పద్యహారతుల్

(పద్యప్రకాశం నుండి-)

No comments:

Post a Comment