Friday, January 31, 2020

కొత్తవరవడి


కొత్తవరవడి




సాహితీమిత్రులారా!

ఆరుద్రగారి కవిత ఆస్వాదించండి-

కవిత కోసమె నేను పుట్టాను
క్రాంతికోసము కలము పట్టాను
ఎండమావులు చెరిపి పండువెన్నెల నిలిపి
గుండెవాకిలి తలుపు తట్టాను

మందికోసము గుడిని కట్టాను
మమతలన్నీ ముడుపు కట్టాను
అగుపడని దైవం ఆరగించదు సుమ్ము
అందుకే అవి పంచిపెట్టాను

పంచవన్నెల చిలుక పట్టాను
పంజరంలో అదిమి పెట్టాను
పక్షిలా నాగుండె పరితపించుచు మండె
పంజరాలను పగులగొట్టాను

ముళ్ళలో ఒక పువ్వు చూశాను
మోజుపడి అది తుంచివేశాను
గుచ్చుకొన్నదా ముల్లు విచ్చుకొనదా పువ్వు
పూలుకోయుట విడిచి పెట్టాను

నీటిలో ఒక నీడ చూశాను
నీడకై గాలమ్ము వేశాను
చిక్కలేదొక మీను చిక్కుకున్నది నేను
చింపి వలలను పారవేశాను

మందికోసం నడుం కట్టాను
మంచి కోరుచు కేక పెట్టాను
మందుడొక్కడు లేచె మంచితనమును తూచె
మలుపుదారిని తేతు పట్టాను

అద్దమందున నిజము చూశాను
అద్దాని కై  దారికై వేశాను
అనుసరించిన జనత అలసిపోవుటచేత
మనసులో నిట్టార్చి వగచాను

నిన్ను నాలో కలుపుకొన్నాను 
నన్ను నేనే తెలుసుకున్నాను
కోర్కెనై వెలుగునై కొమరాల జిలుగునై 
కొత్తవరవడి మొదలు పెట్టాను.
(ఆరుద్ర రచనలు / కవితలు) 
(విపుల సంకలనం - 1985)

No comments:

Post a Comment