Saturday, December 14, 2019

ర-కారం


ర-కారం




సాహితీమిత్రులారా!

‘జుఁయ్, జుఁయ్’ అంటూ చెవుల మీద చప్పుడు. బలమైన వత్తిడితో తోసేస్తున్నట్టూ గుండెల మీద ఎవరో వేసిన దెబ్బతో వంట్లో సత్తువంతా పోయి గడ్డిపరకలా గాలిలో తేలిపోతున్నాడు. కొట్టినవాడెవరో తాను వేగంగా ఎగిరిపోతుంటే విజయగర్వంతో నవ్వడం, నెప్పి వల్ల తన మెదడు పనిచేయకపోవడం, భయంతో వెన్ను వణుకడం తెలుస్తోంది. ప్రాణం పోతోందా? తన తమ్ముడు ఇలాగేనా భయంతో చచ్చిపోయింది? లేకపోతే నిజంగా తగిలిన దెబ్బ రక్తం తోడేసి వాడి ప్రాణం తీసిందా?

చటుక్కున మెలుకువ వచ్చిన మారీచుడు చుట్టూ చూసేడు. హమ్మయ్య, ఇదంతా కలన్నమాట. తానింకా తన కుటీరంలోనే ఉన్నాడు. చావలేదు. విశ్వామిత్రుడి అక్క కౌశికి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తుంటే తాను చెట్టు మీదనుంచి ఆవిడ ముందు దూకి రక్తం ఎముకలూ అవీ విసిరి బెదిరిద్దామనుకున్నాడు కానీ ఆవిడ తనని అసలు పట్టించుకున్నదే కాదు. తర్వాత ఒకసారి యాగదీక్షలో కూర్చున్న విశ్వామిత్రుడు కోపం తెచ్చుకోడని ఆయన యాగం పాడుచేద్దామనుకుంటే జరిగినది తెల్సినదే. అసలీ మునులకీ, వాళ్ల కుటుంబంలో ఆడవారికీ రాక్షసులైన తమని చూసినా బెదరని ధైర్యం ఎలా వస్తుందో? ఈ విశ్వామిత్రుడి అక్క కౌశికి రోజూ శ్రీచక్రాన్ని పూజిస్తుందని తర్వాత తెల్సింది. వీళ్ళ ధైర్యం అంతా ఆ పూజల వల్ల కాదు కదా? ఎప్పుడో ఓరోజు రావణుడికి ఈ శ్రీచక్రం వల్లే కీడు అని ఎక్కడో విన్నాడు…

తన ఆలోచనలు ఎవరైనా గమనించారేమో అన్నట్టూ ఓసారి చుట్టూ చూశాడు మారీచుడు. తాను ఇలా ఆలోచిస్తున్నట్టూ రావణుడికి కానీ తెలిస్తే ప్రాణం తీస్తాడు. అయినా ఖర్మ కాకపోతే ఇటువంటి స్త్రీలోలుడైన రాజుకా ఊడిగం చేయాల్సి రావడం? విశ్వామిత్రుడు యాగంలో సహాయానికి ఈసారి ఎవరో కుర్రాళ్ళని తీసుకొచ్చాట్ట. ఆ మాట తెలిసి కూడా, ఈ కుర్రకుంకలు తమనేం చేస్తార్లే అని మీద పడబోయేరు. ఈ కుర్రాళ్ళెవరో కానీ రెండే రెండు బాణాలతో ముగించారు తమ కథ. ఒక బాణంతో సుబాహుడు పోతే తనకింకా నూకలు మిగిలాయి, ఆ రెండో బాణం ఛాతీమీద కొట్టి సముద్రంలో పారేసింది తనని. ఆ దెబ్బ కలలోకూడా మర్చిపోలేకపోతున్నాడు తాను. ఎప్పటి మాట! తల్లి తాటకీ, తానూ, సుబాహుడు ఎంత సంతోషంగా ఉండేవారో! ఏ జన్మలో చేసిన ఖర్మో కాకపోతే అగస్త్యమహాముని దగ్గిరకి వెళ్ళి ఆయన్ని ఏడిపించనేల? ఆయన శపించాక రావణుడి సహాయంతో జనస్థానంలో, ఈ అరణ్యాల్లో అధికారం దొరికింది. అలా రావణుడికి తాము ఋణపడి ఉన్నారు ఏం చెప్పినా చేయడానికి. సుబాహుడు పోయాక తనకి తెలిసొచ్చిన విషయాలు అనేకం.

తమని బాణాలతో కొట్టిన ఆ రాముడే కొద్ది రోజుల ముందు, తమ తల్లి తాటకిని కడతేర్చాడు. ఆ కుర్రాడు పినతల్లి కైక దగ్గిరే విలువిద్య అంతా నేర్చుకున్నాడనీ, ఆవిడ ఈ కుర్రాణ్ణి స్వంత తల్లికంటే ఎక్కువగా చూసుకుంటోందనీ తెలిసొచ్చింది. సవతితల్లి అంటేనే తన పిల్లలు కానివారిని రాచిరంపాన పెడుతుందని కదా లోకంలో అనుకునేది? ఇదో వింత అయితే, తన తల్లి తాటకిని చంపినందుకు విశ్వామిత్రుడు తన దగ్గిరున్న అస్త్రవిద్యనంతా ఈ రాముడికి ఉచితంగా ధారపోశాడు. ఈ కుర్రాడికెందుకో ఆ విలువిద్యంతా? రాక్షసరాజైన రావణుడి లాంటి వారికిస్తే ఉపయోగం కానీ బొడ్డూడని కుర్రాడికా అస్త్రవిద్య?!

భయంతో ఇక కంటిమీద కునుకు రాదని తెలిశాక లేచి కుటీరంలోంచి బయటకొచ్చాడు మారీచుడు. ఒకప్పుడైతే లేవగానే ఎవర్ని ఎలా చంపుదామా, ఏ యాగం ఎలా ధ్వంసం చేద్దామా అనే ఆలోచనల్తో సతమతమయ్యే మారీచుడిప్పుడు సాధువు. స్నానం చేసి, విభూదిరేఖలు పెట్టుకుని శివస్మరణ చేయడమే. ఉన్న ఇద్దరు ముగ్గురు అనుచరులూ ఏదో పెడితే, లేకపోతే తనకి ఏది దొరికితే అది తినడం. చావు భయం ఎంత పనిచేస్తుందీ జీవితాలకి! ఓ అనుచరుడొచ్చి చెప్పాడు, ‘రాత్రి రత్నాలతో పొదిగిన ఒక రథం ఇటువైపు రావడం…’

రాత్రి, రత్నం, రథం, రావడం. తర్వాత మనసులో మెదిలేది రుథిరం. ర-కారం మళ్ళీ వినిపిస్తోందే? ఆ వెంఠనే తనకి వద్దన్నా గుర్తుకొచ్చేది, ఏదైతే మర్చిపోదామనుకున్నాడో అదే పదం, అదే కుర్రాడు. రా…ము…డు. చెవుల వెంట జుఁయ్, జుఁయ్ అని బాణాలు దూసుకుపోతున్న చప్పుడు. ఛాతీ మీద తగిలిన మానవాస్త్రం వత్తిడి దెబ్బా, దాని తాలుకు నెప్పీ; వెన్నులో, కాళ్లలో సన్నటి వణుకు. మనసులో ఉన్న బెరుకు మొహంలో కనపడకుండా కప్పిపెట్టుకుంటూ అడిగేడు అనుచరుణ్ణి, “ఎవరా వచ్చినది?”

“రావణుడెటో వెళ్ళి వెనక్కి లంకానగరానికి తిరిగి వెళ్తున్నారని అనుకున్నాం. ఇక్కడ ఆగలేదు కానీ రథం ఈ దారిన వచ్చినప్పుడు మాకు మెలుకువ వచ్చి గమనించాం.”

కుటీరంలోకి వచ్చాక మళ్ళీ ఆలోచనలు. జరిగినదంతా గుర్తుకువస్తోంది మళ్ళీ మళ్ళీ. ఈ రాముడు తనని వదిలేలా లేడు… ఏ పినతల్లి అయితే రాముణ్ణి అత్యంత ఇష్టంగా చూసేదో ఆవిడే రాముణ్ణి పధ్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపించింది. ఆ రాముడి భార్య సీత ఆయన్ని వదలకుండా కూడా వచ్చింది. ఈ అడవిలో ఏం తింటుందో మరి. అన్నింటికన్నా వింత ఆయన తమ్ముడు స్వంత భార్యని ఇంట్లో వదిలేసి ఈయన కూడా వచ్చాడు అడవికి. పిచ్చివాడు కాకపోతే స్వంత భార్యకన్నా అన్న ఎక్కువా? ఏమిటో ఈ మానవుల ఆలోచనలు, అంతుబట్టవు. తన తల్లినీ తమ్ముణ్ణీ చంపినందుకు, తనకొచ్చిన మాయలతో వాళ్లకి కనబడకుండా వెళ్ళి ఆ రాముణ్ణి చంపేద్దామనుకున్నాడు. మరి తాను వచ్చినట్టు రాముడెలా గమనించాడో, ఒక్క చురకత్తి లాంటి బాణం సంధించాడు. దాని తాకిడికి తాను చచ్చిపోయాడనే అనుకున్నాడు. సరి సరి ఇంకా మరికొన్ని నూకలున్నాయి తనకి. ఇంక ఈ రాముడి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం అనవసరం. తనకి మరోసారి అటు వెళ్తే చావు తప్పదనేది తెలుస్తూనే ఉంది. నమో నమఃశివాయ, శివాయ, రామ, రామ, నమఃశివాయ… రామ, రామ.

ఇదెక్కడి గొడవ తన జీవితానికి? శివస్మరణ చేద్దామనుకునేలోపునే మనసులో రాముడు కదుల్తున్నాడు. ఎంత వద్దనుకున్నా వెన్ను వణికించే ఒకే ఒక పదం గుర్తుకొస్తోంది. రా… ము…డు. అగస్త్యులవారిని కలిశాక ఇలా దండకారణ్యంలో దిగాడట. మాట తప్పనివాడనీ, ఆఖరికి తాను వెళ్ళి శరణువేడినా అభయం ఇస్తాడనీ చెప్పుకోవడం తాను విన్నాడు. రాముడు అంత మంచివాడైతే తన తల్లినీ, తమ్ముణ్ణీ ఎందుకు చంపినట్టో?

అంతలోనే మారీచుడి అంతరాత్మ అరిచినట్టూ అంది లోపలనుంచి. ‘నువ్వూ నీ తమ్ముడూ యాగం ధ్వంసం చేయబోతూ చేసిన పనిని రాముడు అడ్డుకున్నాడు. రాముడి తప్పేమిటిందులో?’ ఉత్తరోత్తరా తనకి తెలిసివచ్చిన విషయాల ప్రకారం, రాముడు థర్మమూర్తి. తండ్రి మాట కోసం ఇలా వచ్చిన కుర్రాడికి దారిలో మునులందరూ ఏదో ధనుస్సో, ఖడ్గమో, అస్త్రమో ఇవ్వడం. ఇదంతా చూస్తే ఈ రాముడూ, సీతా, ఆ లక్ష్మణుడూ దండకారణ్యంలో రాక్షసులనందర్నీ చంపడానికి యముడు పంపిన దూతలే అనిపిస్తోందంటే అనిపించదూ మరి?

లంకలో రావణుడి చర్చలు సాగుతున్నై. రాముడి చేతిలో చావుదెబ్బ తిన్నాక ఆ అస్త్రవిద్యాపాటవం గురించి మారీచుడిచ్చిన సలహా గుర్తుంచుకుని తాను వెళ్ళకుండా జనస్థానంలో రాముణ్ణి ఓ కాపు కాయమని పంపించిన ఖర, దూషణ, త్రిశరులూ, వాళ్ల రాక్షస సేనా తుడిచిపెట్టుకుపోయేయి. శూర్పణఖ చెప్పడం ప్రకారం ఈ రాముడి విలువిద్య ఎక్కడా విన్నదీ కన్నదీ కాదు. బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో ఏమీ కనిపించదు. రాక్షస సేన అలా మట్టిలో పొర్లుతూ చావడం ఒకటే కనిపించేది. తానే యుధ్ధానికి వెళ్తే? ఓడిపోడు కదా? అసలే తనకి మానవులనుంచి అపాయం ఉందని అందరూ ఎరిగిందే. ఇదికాదు దారి, మరోటి ఏదో ఆలోచించాలి.

అకంపనుడు చెప్పేడు, “సీత లేకుండా రాముడు బతకలేడు. సీతని ఎలాగో ఒకలాగ మాయచేసి అపహరించుకొని తీసుకురా. తర్వాత నయానో భయానో ఆవిణ్ణి లోబర్చుకోవచ్చు. సీత ఒకసారి రావణ సామ్రాజ్యం చూడగానే మనసు మారి రాముణ్ణి వదిలేస్తుంది. ఆ తర్వాత రాముడు బతకడం అసంభవం.”

రావణుడికి సందేహం తీరక అడిగేడు. “అపహరించుకుని వచ్చాక సీత నన్ను తిరస్కరిస్తే?”

“రావణా, నువ్వు త్రిలోకాధిపతివి, నీ సామ్రాజ్యం, నీ కట్టుబడిలో ఉన్న నవగ్రహాలూ, నువ్వు యముణ్ణి జయించడం, కుబేరుడి దగ్గిరనుంచి పుష్పకం తేవడం అవీ విన్నాక కూడా నీకు లొంగని ఆడది ఈ త్రిలోకాల్లో ఉంటుందా?” నవ్వేడు అకంపనుడు.

“మరి సీతని తీసుకురాగల వాడెవరు?”

“మాయల్లో ఆరితేరిన మారీచుడే దీనికి తగినవాడు. ఏదో విధంగా మారీచుడు రాముణ్ణి కనక సీతకు దూరంగా తీసుకెళ్లగలిగితే, నువ్వు వాళ్ళుండే కుటీరం దగ్గిరకెళ్ళి సీతని ఎత్తుకొని రావచ్చును.”

ఆలోచన నచ్చిన రావణుడు మారీచుడి దగ్గిరకి బయల్దేరాడు.

“ఏమిలా వచ్చావు? లంకలో అంతా కులాసాయేనా?” అడిగేడు మారీచుడు.

“నువ్వేదో నాకు సహాయం చేస్తావనుకుని వచ్చాను. ‘రాముడి దగ్గిరకి వెళ్లకు, ఎవర్నో పంపించు’ అంటే ఖర, దూషణ, త్రిశరులని, వాళ్ల సేనలతో పంపించాను. ఒక్కడు మిగల్లేదు. జనస్థానం నుంచి దండకారణ్యం దాకా మనదే రాజ్యం. ఇప్పుడిక్కడో మానవుడు మన సైన్యాన్ని చంపుతూంటే నోరు మూసుకుని కూర్చోవడం ఎలా?”

కాసేపు నోటమ్మట మాట రాని మారీచుడు తేరుకుని చెప్పేడు, “క్రితంసారి వచ్చినప్పుడు చెప్పాను కదా, నువ్వు వెళ్ళినా రాముడు నిన్నీపాటికి యమలోకానికి పంపి ఉండేవాడు. విను రావణా! రాముడు ధర్మమూర్తి, నిష్కారణంగా ఎవర్నీ ఏమీ చేయడు. ఆయన ఈ దండకారణ్యం ప్రాంతాలలో ఉన్నన్నాళ్ళూ అసలు ఆయన్ని గమనించనట్టు ఉండు. వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతాడు. ఓ కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ భార్యా తమ్ములతో శాంతంగా ఉండేవాడిని రెచ్చకొట్టవద్దు. ఆయనకి కోపం వస్తే….”

“ఆపుతావా ఇంక? ఇంత పిరికివాడిలా ఎప్పుడు తయారయ్యేవు?” రావణుడు గర్జించాడు.

“…పిరికితనం కాదు, రెండుసార్లు చిటికెలో చావుదెబ్బ తిన్నాక చెప్తున్న మాట ఇది రావణా. ఆ దెబ్బ ఇప్పటికీ వెన్నులో చలి పుట్టిస్తోంది. ఇన్ని దేనికీ, అసలు శూర్పణఖ వల్ల వచ్చినదే ఈ అనర్థం. నీకన్నా పెద్దవాణ్ణి, నీ క్షేమం కోరి చెప్తున్నాను విను. శూర్పణఖ ముక్కూ చెవులూ కోసినా ఖర దూషణులని చంపినా రాముడు నిష్కారణంగా చేసినపని కాదు అది. నీకు లంకలో సుఖాలకి తక్కువలేదు; రాముడి మాట వద్దు మనకి…”

“స్వామిభక్తి పోయి శత్రువుని పొగుడుతున్నావే? నేను అన్నీ కనుక్కునే వచ్చాను. ఈ రాముడికి చేతనైతే పినతల్లినీ, తండ్రి, తమ్ముళ్ళనీ తరిమేసి రాజ్యం ఆక్రమించుకోడూ? పాపి, ధూర్తుడు, పిరికివాడు, తిండీ గుడ్డా లేకుండా అడవుల్లో తిరుగుతున్న రాముడి గురించేనా నువ్వు చెప్పేది? నేను రాజుని, నిన్నూ సుబాహుణ్ణీ తాటకినీ చేరదీయకపోతే మీ ముగ్గురూ ఏమై ఉండేవారు? రాముడు మనకి శత్రువు. వాడి భార్యని అపహరించడానికి నీ సహాయం కోసం వస్తే, ఏమిటి నీ ప్రేలాపన ఇంకా?”

రావణుడి కంఠంలో కోపం చూసి ఈ సారి మారీచుడికి నీరసం ఆవహించింది. తన సమయం ఆసన్నమైనట్టేనా? రావణుడు చేయబోయే ఈ పనివల్ల తన చావుతో మొదలై మొత్తం రాక్షసకులం సర్వనాశనం కాబోదు కదా? దాని బదులు తానొక్కడూ పోవడం మంచిది. మారీచుడి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతూంటే రావణుడి కంఠం వినిపించింది.

“ఏమైంది నీకు మారీచా, మాట్లాడవేం?”

మెల్లిగా నోరు విప్పాడు మారీచుడు.

“అడిగావు కనక చెప్తున్నాను విను రావణా!

సులభా పురుషారాజన్, సతతం ప్రియవాదినః
అప్రియస్యసచ పాథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభః

పక్కనుండే భజనపరులు కో అంటే కోటిమంది సులభంగా దొరుకుతారు. అయితే, నీ క్షేమం కోసం, నీకు నచ్చనివైనా అప్రియమైన విషయాలు చెప్పేవారు నీకు దొరకడం అసాధ్యం. ఒకవేళ దొరికినా నువ్వు వినలేవు. రావణా! చావు దగ్గిరకొచ్చినప్పుడు ఎవరేం చెప్పినా నచ్చదు మనకి. లేకపోతే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందిన నువ్వు ఇలా మాట్లాడగలవా? ఇన్నేళ్ళు నువ్వు ఏ మానవుడూ పైకి రాకుండా తొక్కిపెట్టి ఉంచావు కానీ అసలు రాముడి గురించి నువ్వూ నీ చారులూ గమనించినట్టే లేదు. రాముడు పిరికివాడా? ఎవరా చెప్పినది? నన్నూ, నా తల్లినీ, నా తమ్ముణ్ణీ చావగొట్టి వదిలాడు. నాకు నూకలు మిగిలి ఉన్నాయి కనక నేను బతికిపోయాను. నువ్వే చెప్తున్నావు కదా, ఖర, దూషణ, త్రిశరులని రాముడు ఒక్కడూ తేల్చిపారేశాడు. పిరికివాడైతే విల్లంబులు చేత్తో పట్టుకుని ఎదురొచ్చేవాడా దేవతలని జయించిన వీళ్ళకి? రాముడు పాపాచారుడా? ఆయన చేసిన పాపం ఒకటి చూపించగలవా? పినతల్లి ఎందుకు కోరిందో అసలు ఆవిడ అలా కోరడానిక్కారణం ఏమిటో అని ఆలోచించకుండా, ‘నువ్వు వనవాసం చేయాలి’ అంటే, ‘ఓ, అంతే కదా’ అంటూ రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకున్న రాముడు ధూర్తుడా? నీ రాక్షస ధర్మం రాముడికి ఆపాదించి రాముణ్ణి అటువంటి మాటలనకు. ప్రపంచం అనుకునేదేమిటో నీకు తెలియదులా ఉంది.

రామో విగ్రహాన్ థర్మః సాథు సత్యపరాక్రమః
రాజా సర్వస్యలోకస్య దేవానా మివవాసవః

ధర్మం పోత పోసిన విగ్రహమే రాముడు. సాధువూ, అసత్యం అనేది నోట్లోకి, మనసులోకి రానీయని వాడూను. పధ్నాలుగు లోకాలనీ ఏలడానికి సరైనవాడు. రాజ్యం రాజభోగాలు అన్నీ వదులుకుని వచ్చినవాడు. తనకి ఇలా అయినందుకు పినతల్లిని కానీ తండ్రిని కానీ నిందించినట్టు ఒక్కమాట వినలేదు నేను ఎవరినోటా. అటువంటి వాడు లుబ్దుడా, ధూర్తుడా? మరో విషయం చెప్తున్నాను విను. రాక్షస లోకం పైకి అనలేనిదీ, నీ వెనక చెప్పుకుంటున్నదీను. నీకు వేదవతి ఇచ్చిన శాపం, శ్రీచక్రం వల్ల రాబోయే ఉపద్రవం అన్నీ కలిసి నీ మరణానికి కారణం కాబోతున్నాయి. రాక్షస రాజువైన నువ్వు ఇటువంటి తుఛ్ఛమైన పనులు చేయవచ్చా? లంకకి పోయి సుఖంగా ఉండు…”

రావణుడి మొహంలో ఏమీ తేడా కనిపించకపోవడం చూసి మారీచుడు కొనసాగించాడు.

“… ఏకపత్నీవ్రతుడైన రాముడు అగ్నిహోత్రుడైతే ఆ మండే అగ్నిశిఖే ఆయన భార్య. దాన్ని ముట్టుకోవడం అంటే కావాలని చేతులు కాల్చుకోవడమే. అలా కాదు రాముడు పాపాచారుడే అనుకుంటే ఆయన భార్యని అపహరించడమే అనవసరం. అసలు పరాయి వాడి భార్యని అపహరించాలనే నీచమైన కోరిక పులస్త్యబ్రహ్మ వంశసంజాతుడవైన నీకెలా పుట్టిందో నా ఊహకి అందడం లేదు. నువ్వు చేయబోయే ఈ పని వల్ల రాముడికి కోపం వచ్చి మొత్తం రాక్షస సంహారానికి బీజం పడకుండా పరమేశ్వరుడు రక్షించాలి. నీకు ధైర్యం ఉంటే ఒక్కడివీ రాముణ్ణి యుద్ధానికి ఆహ్వానించు. ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే సీతని నీ దాన్నిగా చేసుకో. అసలంటూ నువ్వు బతికి బట్టకడితే…”

“మారీచా,” తనపేరు సార్థకం చేసుకుంటూ అరిచాడు రావణుడు, “నేను రాజుని. నువ్వు నా సేవకుడివి. నేను ఇక్కడకి వచ్చినది నిన్ను ఏం చేయాలో చెప్పడానికి, సలహా కోసం కాదు. నువ్వు ఎందుకు నోరుపారేసుకుంటున్నావో? రాజు చెప్పిన పని చేయకపోతే సేవకుడికి పడే శిక్ష తెలుసా?”

తన చావు దాదాపు ఖాయమైపోయినట్టూ తెలిసిన మారీచుడు చెప్పాడీసారి స్థిరంగా, “తెలుసు రావణా. నీ ఆజ్ఞ ధిక్కరిస్తే పడే శిక్ష మరణం. ఆ మరణానికి నేను రెండుసార్లు అతి చేరువలోకి వెళ్ళి వచ్చాను కనక నీకు ఆ గతి పట్టకుండా ఉండడం కోసం మరోసారి చెప్తున్నాను విను. నువ్వే కనక ఆ జానకిని అపహరించి లంకకి తీసుకెళ్ళగలిగితే ఆవిడే నీ పాలిట మృత్యుదేవత. ఆ సీత నిన్నూ, నీ రాక్షసకులాన్నీ సర్వనాశనం చేయడానికే పుట్టినట్టనిపిస్తోంది.”

“ఒక ఆడదా నన్ను నాశనం చేసేది?” రావణుడు నవ్వేడు.

“నువ్వు అపహరిద్దామనుకుంటున్న ఆ సీత నిన్నేమీ చేయలేకపోవచ్చు. కానీ అగ్నిహోత్రుడైన రాముడు నిన్ను సర్వనాశనం చేసి తీరుతాడు. నీకు మానవుల చేతిలో చావు రాసి పెట్టి ఉందని పరోక్షంగా అందరూ అనుకుంటున్నదే. రాముడి గురించి నీ అంచనాలూ, నువ్వు విన్నదీ తప్పు. నేను చెప్తున్నది స్వానుభవం, ఎవరి ద్వారానో విన్నది కాదు. రాముడి చేతిలో చావు దెబ్బలు తిన్నప్పటినుండీ నాకెలా ఉందో చెప్తున్నాను మరో సారి విను.

రకారాదీని నామాని రామత్రస్తస్య రావణః,
రత్నాని చ రథాశ్చైవ విత్రాణం జనయంతిమే.

రత్నం, రథం, రామ, రావణ అనే రకారంతో వచ్చే ఏ మాటా, పదం విన్నా నా వెన్ను వణుకుతోంది. మన వరకూ ఎందుకు, బలి, నముచి వంటి మన పూర్వుల వల్ల కూడా అధర్మం జరుగుతుంటే నిలబెట్టి వాళ్ల తల తీయగల సమర్థుడు రాముడు. ఇదంతా శూర్పణఖ కామోద్రేకం వల్ల వచ్చిన గొడవ. నా మాట విని, రాముడి వైపు వెళ్లవద్దు. నిప్పుగుండంలో పడే శలభాల్లాగా మాడిపోతాం.”

జేవురించిన మొహంతో రావణుడు అన్నాడు, “ఇదన్న మాట నిన్నూ, నీ తల్లినీ, సుబాహుణ్ణీ చేరదీసినందుకు నువ్వు విభూది రేఖలు పెట్టుకుని శతృవుని పొగుడుతూ నాకు నూరిపోసే పిరికిరసం, భేష్. ఇలా నువ్వు నా వెన్నులో పొడవడానికి తయారవుతున్నావనే విషయం నాకు ఇప్పటికైనా తెలిసివచ్చింది. ఇంతవరకూ వచ్చాక వెనక్కి తగ్గే ప్రసక్తిలేదు. సేవకుడివైన నువ్వు నేను చెప్పిన పని చేయవు కనక మరణదండనే నీ ఖాయం. లేదా నీకు మరణ భయమే కనక ఉంటే నేను చెప్పినట్టూ మాయలేడిగా బయల్దేరు. చిటికెలో అయిపోయే పనికి ఇంత రాద్ధాంతం అనవసరం. నేను సీతని ఎత్తుకుపోగానే నువ్వు మారీచుడిలా మారి మళ్ళీ వెనక్కి వచ్చేసి నీ శివస్మరణ చేసుకోవచ్చు.”

“ఎంత సులభంగా చెప్పావు రావణా! రామబాణం తగిలి నా ప్రాణం పోయినప్పుడు నీకు సంతోషం కాబోలు. అయినా నువ్వే చెప్పావు కదా, నీ ఆజ్ఞ ధిక్కరించి నీ చేతిలో చావడమో లేకపోతే లేడిలా మారి రాముడి చేతిలో చావడమో అనేదే నేను తేల్చుకోవాల్సినది. నాకు చావే తథ్యం అయితే ఇటువంటి తుఛ్ఛమైన ఆలోచనలు చేసే నీ చేతిలో చావడం కంటే ధర్మాత్ముడైన ఆ రాముడి చేతిలో చావడం మంచిది. నడు రాక్షసేశ్వరా, నడు పోదాం. కానీ నీతో ఆఖరి మాట చెప్పనియ్యి. నీ ప్రణాళిక ప్రకారం నేను లేడిలా మారి రాముణ్ణి దూరంగా తీసుకెళ్తాను. ఆ తర్వాత, ఇప్పటికే రెండుసార్లు కనికరించిన రామబాణం ఈ సారి నా ప్రాణాలు తీస్తుందనేది తధ్యం. తర్వాత ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ, నువ్వు పధ్నాలుగు లోకాల్లో సీతని ఎక్కడ దాచినా ఆ రాఘవుడు నిన్ను సింహం జింకని వేటాడినట్టూ వేటాడి చంపుతాడు. ఇందులో మరో దారుణమైన విషయం ఏమిటంటే నువ్వు రాక్షస రాజువి కనక ముందు నువ్వు యుద్ధానికి రాకుండా నీ అనుచరులని–నన్నూ, ఖర దూషణాదులనీ పణంగా పెట్టినట్టే, ఒక్కొక్కర్నీ పంపిస్తావు. దాంతో వాళ్ళందర్నీ యమలోకానికి పంపిస్తూ రాముడు చివరకి నీ సంగతి తేలుస్తాడు. విభీషణుడి వంటి ధర్మం తెలిసినవారు నీకు మంత్రులైనా నీ బుద్ధి ఇలా వికటించడం చూస్తే ఇదే నాకు తెలిసి వస్తోంది. నీ ఉప్పు తిన్నందుకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టుంది. నీ వల్ల మొత్తం రాక్షస కులం తుడిచిపెట్టుకు పోబోతోందనే ఒక్క బాధ తప్ప నా గురించి ఏ విచారమూ లేదు. నడు రావణా, నడు ఇప్పుడే పోదాం. రాబోయే చావుని అడ్డుకోవడం ఎంత తెలివి తక్కువతనం?”

“నేను బ్రహ్మ చేత వరాలు పొంది యముణ్ణి గెలిచి కైలాసం ఎత్తిన దశకంఠుడిని. ఎవరో నీచమానవుడు విల్లు పట్టుకుని రెండు బాణాలు వేయగానే బెదిరిపోయే మారీచుణ్ణి కాదు, నడు పోదాం. ఇప్పుడు నువ్వు సరైన స్వామి భక్తుడివి.” తన మాట నెగ్గినందుకు సంతోషంగా నవ్వుతూ రావణుడు లేచాడు. రకారంతో మొదలయ్యే ధర్మమూర్తి రూపం మనసులో మెదుల్తుండగా, నోటిలో ఆయన నామం వద్దనుకున్నా వస్తూంటే, మారీచుడు వణుకుతున్న కాళ్లతో రావణుడి వెంట నడిచేడు.

రాముడున్న కుటీరం వేపు వెళ్ళబోతూ మనసు మార్చుకుంటాడేమో అన్నట్టూ బంగారు లేడి రావణుడి కేసి చూసింది. రావణుడి మొహం సీతని అపహరించే దృశ్యం ఊహించుకుంటూ వెలిగిపోతోంది. ఇంక తానేం మాట్లాడినా అనవసరం. అయినా చివరి మాటగా చెప్పాడు మారీచుడు, “రావణా నిన్ను మళ్ళీ చూసే అవకాశం శూన్యం. నా తల్లీ తమ్ముడితో సహా మమ్మల్ని చేరదీసినందుకు కృతజ్ఞతలు. ఇంక సెలవు.”

రావణుడు లేడిని తట్టి చెప్పాడు, “ధైర్యంగా వెళ్ళు. విజయం మనదే.”

కుటీరం దగ్గిరలో లేడికి వినిపించిన మాటలు రామ లక్ష్మణులు అన్నవే. తమ్ముడు “అన్నా! ఇటువంటి బంగారు లేడి ఆ మారీచుడి మాయే. నేను వెళ్ళి దీని సంగతి తేల్చి వస్తాను” అన్నాడు.

దానికి రాముడిచ్చిన సమాధానం, “లేదు, నేనే వెళ్తున్నాను. నువ్వు చెప్పినట్టూ ఇది ఆ మారీచుడే అయితే, రెండుసార్లు కనికరించిన వాడి సంగతి ఈ రోజు తేల్చవల్సిందే.”

అంతటి చావు భయంలోనూ మారీచుడు ఆశ్చర్యపోయేడు, తనని లక్ష్మణుడూ, రాముడూ ఎలా గుర్తుపట్టారో? ఇదేనా ధర్మాచరణ వల్ల కలిగే జ్ఞానం? ఆ తర్వాత రాముడు తనని అనుసరిస్తుంటే, నెమ్మదిగా నడక; దూకడం, పరుగు, బాణానికి అందనంత దూరంలో ఆగి రాముడి కోసం వేచి చూడడం; మళ్ళీ దగ్గిరలో రాముణ్ణి చూసి దూరంగా పరుగు. గుండెల్లో బెదురు; రామ, రామ. రాముడు బాణం తీశాడా? సంధించాడా? నమఃశివాయ, రామ, రామ, నమఃశివాయ… కాలం ఎంతసేపు గడిచిందో, రాముడు తన కూడా ఎంత దూరం వచ్చాడో గమనించలేదు కానీ మారీచుడికి చివరగా తెలిసి వచ్చిన విషయం తన కడుపులో గుచ్చుకున్న రామబాణం ప్రాణం తోడేస్తోంది. శూర్పణఖ చెప్పినది నిజమే. రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో కనిపించదు. అయినా రెండు సార్లు తనని కనికరించిన రాముడు ఈ సారి ఊరుకోడని తనకి ముందు తెలియకపోతే కదా? శరీరం అదుపు తప్పేలోపుల, స్వామి కార్యం కోసం చేయాల్సిన పని ఒక్కసారి గుర్తొచ్చి అరిచేడు మారీచుడు పెద్ద గొంతుతో, “హా సీతా! హా లక్ష్మణా!”

నేల మీద పడి ఉన్న మారీచుడి దగ్గిరకొచ్చి రాముడు అడుగుతున్నాడు, “ఎవరు చేసినదీ కుట్ర? దీని వెనకనున్న మోసం ఏమిటి?”

ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్న మారీచుడి మనసులో రెండు పరస్పర విరుధ్ధమైన భావాలు శరవేగంతో కదలడం మొదలుపెట్టినై. తాను గడిపిన నికృష్టమైన రాక్షస జీవితం ఒక్కసారి కళ్ల ముందు తిరిగింది. ఇన్నేళ్ల జీవితంలో తననీ, తల్లినీ, తమ్ముణ్ణీ పెంచి పోషించిన రకారంతో మొదలయ్యే రాక్షసేశ్వరుడి పేరు ఇప్పుడు తనకెదురుగా ఉన్న శతృవుకి నోరు విప్పి చెప్పేయడమా లేకపోతే ధర్మమూర్తిగా మరో రకారంతో మొదలయ్యే శతృవు పేరు తన నోట్లో నానుతుండగా ఈ తుఛ్ఛమైన శరీరం విడిచేయడమా? స్వామి ద్రోహమా? స్వకార్యమా? స్వామి ద్రోహం చేసినవాడికి నిష్కృతిలేదని ధర్మాత్ముడైన ఈ రాముడు గ్రహించలేడా? రావణుడి పేరూ, అతనెక్కడుంటాడో తాను రాముడికి చెప్పకపోయినా, చూడబోతే సర్వ రాక్షస సంహారం కోసమే దండకారణ్యం చేరిన ఈ రాముడు ఏదో విధంగా తెలుసుకోగలడు. ఈ అవసాన దశలో తనెదురుగా నిల్చున్న ధర్మాత్ముణ్ణి చూస్తూ ఈ రాముడి పేరు తల్చుకోవడమే మంచిది. ఈ ఆలోచన వస్తున్నప్పుడే శరీరం అదుపు తప్పుతూండగా రాముడు రెట్టించి అడిగినదే అడగడం వినిపిస్తోంది మారీచుడికి.

ప్రాణం పోతుందని తెలిసిన మారీచుడు, మొహంలో విరక్తితో కూడిన నవ్వుతో చెప్పేడు, “నా దురదృష్టం ఏమిటంటే, నా యజమాని ఉప్పు తిన్నందుకు చావబోయే ఆఖరి క్షణంలో కూడా నీ పేరు నా నోట్లోంచి రాకూడదని ఆయన ఆజ్ఞ. అందువల్లే ‘హా సీతా, హా లక్ష్మణా’ అనాల్సివచ్చింది. రెండుసార్లు నన్ను దయతల్చిన నువ్వు ఎవరివో నాకు ఇప్పటికి తెలిసి వచ్చింది. నీ రూపాన్ని చూస్తూ, పైకి అనలేకపోయినా నీ నామం నోట్లో మెదులుతూండగా ఈ శరీరం విడిచేస్తాను. రాక్షసుడిగా పుట్టినా నీ చేతిలో చావడం అదృష్టమే.”

“ఎవరు నీ యజమాని, ఏమిటీ మాయ అంతా?” రాముడు మరోసారి అడుగుతున్నాడు.

దిక్కులు దద్దరిల్లేలా ‘హా సీతా, హా లక్ష్మణా’ అని పెద్ద గొంతుకతో అరిచిన మారీచుడికి, అతి కష్టం మీద ఆఖరి శ్వాస తీసుకుంటూ మైకం కమ్మేసి, కళ్ళు మూసుకుపోతున్నప్పుడు రకారంతో మొదలయ్యే ఏ నామం అయితే తనని ఇన్నాళ్ళూ భయపెట్టి అనుక్షణం గుండెల్లో దడ పుట్టించిందో అదే నామం పెదవుల మీద ‘రామ, రామ, రామ…’ అని శబ్దం రాకుండా కదులుతుండగా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేయి.

తాను అడిగిన ప్రశ్నలకి సమాధానం రాకపోవడంతో మారీచుడి శరీరం నిశ్చేతనం అవడం గమనించిన రకారంతో పేరు మొదలయ్యే ఆజానుబాహుడు, కావాలని తనతో బద్ధశతృత్వం కొనితెచ్చుకున్న రకారంతో పేరు మొదలయ్యే మారీచుడి యజమాని ఎక్కడుంటాడో కనుక్కుని, ఆతన్ని బంధుకోటితో సహా మారణహోమంలో సర్వనాశనం చేయడానికి భుజాల మీద కోదండం, అక్షయతూణీరాలూ కదులుతుండగా వడివడిగా ముందుకి నడిచాడు.
-----------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment