Tuesday, June 25, 2019

ఒక ఊహ – ఒక కల


ఒక ఊహ – ఒక కల




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి................

ఒక సినిమా దర్శకుడు, పేరు చెప్పను, కానీ ఆయనకు గడ్డం ఉంటుంది, సాయంత్రం లాన్‌లో కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నాడు. ఎందులో? తూగుటుయ్యాల్లో. దీన్ని అంత నిర్దిష్టంగా చెప్పడానికి ప్రాధాన్యతేమీ లేదు. కానీ కూర్చునే స్థలాన్ని నేను అట్లా నిర్ణయించాను. ఆకుపచ్చ గడ్డిలో ఆయన పుస్తకాన్ని సీరియస్‌గా చదువుతుండగా ఒక పొడుగ్గా ఉన్నతను, ఇతడెవరో నాకు తెలుసు, ఈ దర్శకుడి దగ్గరకు ఒక పని మీద వచ్చాడు. ఈ పొడవు మనిషి భార్యకూ–ఈమె ఒక చిన్నపాటి నటి–ఆ దర్శకుడికీ కొంచెం పరిచయం ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో తనకు బహుశా వేషం అడగటానికి వచ్చాడు.

అనామకంగా వచ్చినదానికీ, చిన్నదే అయినా ఒక రిఫరెన్స్‌తో వచ్చినదానికీ ఉండే తేడాకొద్దీ ఆ దర్శకుడు కళ్లెత్తి, అతడు ఎవరో తెలుసుకుని, కూర్చోమన్నట్టుగా చేయి చూపించాడు. ఆ ఉయ్యాల ముందు ఒక టీపాయ్, ఇది తెల్లరంగుది, మరో అదనపు కుర్చీ కూడా వేసుకుందాం.

ఇతడితో మాట్లాడటానికి వీలుగా ఆ దర్శకుడు తను చదువుతున్న పుస్తకాన్ని టీపాయ్‌ మీద పెట్టాడు. ఆ పెట్టడంలో బ్యాక్‌ కవర్‌ పైకి వచ్చింది. బ్యాక్‌ కవర్‌ మీద ‘రచయిత’ ఫొటో ఉంది. మామూలుగా ఒక వేషం కోసమే వచ్చినవాడి దృష్టి అలాంటి సందర్భంలో ఆ దర్శకుడి మీద తప్ప ఉండకూడదు; కానీ ఆ బ్యాక్‌ కవర్‌కూ తనకూ ఉన్నట్టుగా స్ఫురించిన అస్పష్టమైన లింకేదో అతడిని ఆ పుస్తకం వైపు తదేకంగా చూసేలా చేసింది. ఫొటోలోని మనిషి, నమ్మలేనట్టుగా చూస్తున్న ఈ కళ్లకు తెలిసివుంటాడని పసిగట్టిన ఆ దర్శకుడు, ఆ పుస్తకాన్ని ఇతడు స్పష్టంగా చూసేలా ఇతడివైపు తిప్పి, ‘నీకు తెలుసా ఈయన?’ అని అడిగాడు. ‘నాకు బామ్మర్ది అవుతాడు సార్‌’ అని అప్పుడే తెలుసుకుంటున్నంత ఎక్సయిటింగ్‌గా జవాబిచ్చాడు.

ఆ బామ్మర్దిని నేనే! నేను రాస్తానని గానీ, ఒకట్రెండు పుస్తకాలు వచ్చివుంటాయని గానీ ఇతడికి తెలియదు. అసలు అతడా లైన్లో లేడు. ఏ నాలుగైదేళ్లకో ఒకసారి ఎక్కడైనా ఉమ్మడి బంధువర్గపు సందడిలో తారసపడే దూరపు చుట్టరికం మాది.

కేవలం తనను వేషం అడగటానికి వచ్చిన ఒక అతి మామూలు వ్యక్తి, తాను చదువుతున్న ఒక రచయితను ‘బామ్మర్ది’ అన్నప్పుడు, ఆ దర్శకుడికి ఆ రచయితపట్ల ఏర్పడిన ఇష్టాన్నో అభిమానాన్నో ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?

బహుశా ఏదైనా పెళ్లయివుండాలి; లేదా ఏదో ఒక ఫంక్షన్‌. అంటే ఆ ఎర్రటి రిబ్బన్లు వేలాడదీయడమూ ఆ హంగామా ఏదో తెలుస్తోంది. పెళ్లి కాకపోవచ్చు, ఏదో గెట్‌టుగెదర్‌ లాంటిది. చాలామందిమి ఒక పెద్ద గదిలో గుండ్రంగా నిల్చునివున్నాం. నేను ఎంట్రన్స్‌ దగ్గరే కుడివైపు ఉన్నాను. నా వెనక నా కొలీగ్స్, ఆఫీసు లెక్క ప్రకారం నా సబార్డినేట్స్‌ ఒక నలుగురైదుగురు ఉన్నారు. అంటే మిగతావాళ్లు కూడా మా ఆఫీసువాళ్లే అయివుండాలి; కాకపోతే వేర్వేరు డిపార్ట్‌మెంట్ల వాళ్లు.

ఒకావిడ, ముఖం గుర్తు లేదు, వయసులో చిన్నదే, కానీ అందరమూ బహుశా ఆమె కోసమే ఎదురు చూస్తున్నంత ప్రాధాన్యత గల మనిషి, వడిగా అడుగులేస్తూ లోపలికి వస్తోంది. మాలో మేము ఏదో మాట్లాడుకుంటున్న మా దృష్టి ఆమెవైపు మళ్లింది. చిత్రంగా, ఆమెతోపాటు వెంట వస్తున్న నలుగురైదుగురిలో బాల్‌రెడ్డి ఉన్నాడు. ఇతనిది మా ఊరే. నాకు చిన్నప్పటినుంచీ పరిచయం. ఏదో చిన్నపని చేసుకుంటూ హైదరాబాద్‌లోనే చాలా ఏళ్లుగా ఉంటున్నట్టు తెలుసు కానీ ఎప్పుడూ కలవలేదు. పండగలప్పుడు ఊరికి పోయినప్పుడు కలుస్తూనే ఉంటాం మళ్లీ. అంటే, హైదరాబాద్‌ లోని మా పరస్పర ఉనికిలతో మాకు సంపర్కం లేదు. కాకపోతే ఇక్కడ ఇలా ఉన్నట్టుండి ప్రత్యక్షం కావడంతో ‘అరే మా బాల్‌రెడ్డి’ అనుకునే ఒక ఎక్సయిట్‌మెంట్‌ నా లోపలికి ప్రవేశించింది. ఇద్దరమూ మనసారా కళ్లతో పలకరించుకున్నాం.

ఆమె లోపలికి వస్తూనే, అందరితో కరచాలనాలు చేసేందుకు వీలుగా ముందు మేమే నిల్చున్నాం కాబట్టి, మా వైపు రాబోయింది. ఇంతలో నా కుడిపక్కనే కొంచెం దూరంలో నిల్చున్న ఇంకో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ రెండడుగులు ముందుకు వేయడంతో ఆమె దృష్టి అతడి మీద పడి అటువైపు మరలింది. బాల్‌రెడ్డీ, నేనూ గట్టిగా హేండ్‌షేక్‌ చేసుకున్నాం. ఆమె వెనక ఉన్నతనికీ నాకూ పరిచయం ఉందని ఆమెకు తెలిసిపోయేలా ఈ కరచాలనం జరిగింది.

ఆ రెండోగుంపుకు షేక్‌హేండ్‌ ఇచ్చాక ఆమె నావైపు తిరుగుతుందనుకున్నాను; కానీ ఆమె మూడో గుంపు వైపు సాగిపోయింది. అలా మొత్తం గుండ్రంగా అందరినీ చుట్టేశాక వాతావరణం ఫంక్షన్‌ స్టార్ట్‌ అయిన మూడ్‌లోకి వచ్చేసింది. నేను మాత్రం చిన్నబుచ్చుకున్నాను. దాన్నుంచి బయటపడి ఎంత మామూలుగా ఉందామనుకున్నా ఆమె నన్ను స్కిప్‌ చేసి వెళ్లిన విషయమే గుర్తొస్తోంది. ఈ బాల్‌రెడ్డి ఆమె దగ్గర ఏదో చిన్నస్థాయి ఉద్యోగి అయివుండాలి. అది మా స్నేహంలో ఏ మార్పూ తేదు. కానీ ఆమె దాన్ని ఎలా చూస్తుంది? ఆమె ఎలాగైనా చూడనీ, నేనొక డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ను అయినప్పుడు మర్యాదకొద్దీ నాకు షేక్‌హేండ్‌ ఇచ్చివుండాల్సింది. కానీ ఆమె స్కిప్‌ చేసింది. ఈ స్కిప్‌ చేయడానికి ఈ బాల్‌రెడ్డి ఫ్యాక్టరే పని చేసి వుంటుందనే నమ్మిక నన్ను తొలిచేస్తోంది.

మనకు కొత్తగా వచ్చిన మేనేజర్, గతంలో మన దగ్గర అటెండర్‌గా పని చేసినవాడి కొడుకే అన్నప్పుడు కలిగే భావం ఎలాంటిది? ఆ మేనేజర్‌ను ‘మేనేజర్‌ స్థాయి’ నుంచి తగ్గించడానికి అది కచ్చితంగా కారణం కాగలదు. బహుశా బాల్‌రెడ్డి అట్లా ఒక డిపార్ట్‌మెంట్‌ హెడ్‌నైన నన్ను డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ స్థాయి నుంచి తగ్గించి వుంటాడు. అందుకే ఆమె నాకు షేక్‌హేండ్‌ స్కిప్‌ చేయగలిగింది. షేక్‌హేండ్‌ ఇవ్వకూడదని కూడా కాదు; నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే, ఆమె కచ్చితంగా ఇటువైపు తిరిగి దాన్ని పూర్తి చేసుకునే మూడోవ్యక్తి వైపు మరలేది; కానీ ఇటు తిరగాల్సిన మనిషిని అటు తిరిగేట్టు చేసిన ఆ బలహీన క్షణానికి బాల్‌రెడ్డి కారణమయ్యి ఉంటాడు. అది నన్ను ఇంకా మనస్తాపానికి గురిచేసింది. నాకు కోపం వస్తోంది. నేను ఆమెవైపే అడుగులు వేస్తున్నాను. దీన్ని ఇగ్నోర్‌ చేద్దామనే అనుకుంటున్నాను, కానీ నా అడుగులు ఆమెవైపే పడుతున్నాయి. ఇక దీన్ని తేల్చుకోకుండా నేను ఉండలేను. ఆమెకు ఎదురుగా వెళ్లాను. ‘అట్లా నన్ను స్కిప్‌ చేసి ఎలా వస్తారు?’ ఈ హఠాత్‌ ప్రశ్న అర్థం కానట్టుగా ఆమె నన్నే చూస్తోంది. నేను మళ్లీ అదే అడుగుతున్నాను: ‘అట్లా నన్ను ఎందుకు స్కిప్‌ చేశారు?’ నా గొంతు మామూలుకంటే తీవ్రమైంది. నా ఒంట్లోకి వణుకు వచ్చేసింది. ఫంక్షన్‌ వాతావరణం గంభీరంగా మారిపోయింది. ఆమె ఏమీ జవాబివ్వడం లేదు. నా గొంతు ఇంకా పెరిగింది. నాకు ఏడుపుతో కూడిన కోపం వస్తోంది. ‘నన్ను ఎట్లా మీరు స్కిప్‌ చేయగలిగారు?’

ఒక లోకంలో పలుకుతున్న నా గొంతు ఇంకో లోకంలోని నా చెవులకు వినిపిస్తూ ఉండగా, ఆ స్వరంలో ఉన్న తేడా నాకే అర్థమవుతూ ఉండగా, నా భార్య నన్ను ‘ఏమైంది, ఏందో కలవరిస్తున్నవ్‌?’ అంటూ ఉండగా, నేను కలలోంచి వాస్తవం లోకి మేల్కొంటూ, ‘నేను గట్టిగా మాట్లాడిన గదా’ అంటూ ఒక రకమైన ఆశ్చర్యంతో లేచి కూర్చున్నా.

కలల్లో కొందరు మాట్లాడుతారంటారు. నా మీద అట్లాంటి ఫిర్యాదు గానీ గమనింపు గానీ ఎవరూ ఎప్పుడూ నా దృష్టికి తేలేదు. నాకు తెలిసి ఈ ఒక్క సందర్భంలోనే నేను బయటికి మాట్లాడాను.

ఇట్లా ఊహల్ని కూడా పెయిన్‌గా మారేంత లోలోపలికి జొప్పిస్తూ, నా గురించి నేను హాయిగా బాధపడుతూ బతికేస్తున్నానని నా ఊహాపాఠకుడికి చెబితే–-‘మీ బోడి ఊహలు, కలలు కూడా మాకు అవసరమా?’ అని అడిగాడు. లోకం గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. నా గురించి రాసుకోగలిగేది నేను ఒక్కడినే కదా!
----------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment