Thursday, June 27, 2019

చిన్న ప్రశ్న – పెద్ద దూరం


చిన్న ప్రశ్న – పెద్ద దూరం





సాహితీమిత్రులారా!

ఎప్పుడైనా క్యాంటీన్‌కు పోయినప్పుడు ఆమె ఇంకో టేబుల్‌ మీద భోంచేస్తూ కనబడుతుంది. ఆఫీసుకు వస్తున్నప్పుడు షిఫ్ట్‌ ముగించుకుని పోతూ కనబడుతుంది. ఎప్పుడైనా మగ స్నేహితుడితో టీ తాగుతూ కనబడుతుంది. ఎప్పుడో తెగిపోయిన చెప్పును తన్నుకుంటూ ఆమె వెళ్తున్నప్పుడు ఏమైనా సాయం చేయగలమా అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేం.

ఆమె వార్తలు చదువుతుంది. రెండు మూడు తరాలుగా కలిగిన ఇంట్లో పుడితే తప్ప ఉండని ఒంటి మెరుపు. ఆ స్కిన్‌ టోన్‌ దాన్ని అలాగే ఫొటో తీసి ఎప్పుడైనా పుస్తకం వేస్తే కవర్‌గా వేసుకోవచ్చు. వీటికంటే కూడా నీలపు రంగు కళ్లు మరింత బాగుంటాయి నాకు.

బస్సుకోసం బస్టాపులో ఆమె నిలబడటం చూసి వుంటాం. రద్దీ లేనప్పుడు సరే, ఉన్నప్పుడు ఆమె అందరిలా వేళ్లాడుతూ వెళ్లడం తలుచుకుంటేనే దిగులేస్తుంది. తర్వాతెప్పటికో ఒక కొత్త స్కూటీ కొనుక్కుని రావడం మొదలవుతుంది. అటుపై క్యాబ్స్‌లో పోవడం చూస్తూ వుంటాం. కొన్నాళ్లకు చిన్న కారు తోలుకుంటూ కంటబడుతుంది. బహుశా ట్రెయినీగా చేరినప్పటినుంచి, ఉద్యోగంలో పర్మనెంట్‌ అయి, పేరు వస్తున్న కొద్దీ పెరుగుతున్న వేతనపు మార్పేదో ఈ మొత్తం ప్రయాణ సాధనాల ద్వారా అంతుబడుతూ ఉంటుంది.

ఏదో ఒకరోజు ఉన్నట్టుండి ఆమె ముఖంలోకి ఒక అద్భుతమైన కళ వచ్చి చేరుతుంది. అది అంతకు ముందు ఎప్పుడూ చూడని మెరుపు. ఇప్పుడు ఇంత అందంగా కనబడుతోందంటే, మరి నిన్నటిదాకా కనబడిన అందం అందం కాదా? ఆ మార్పేమిటో ఈ మగబుర్రకు వెంటనే తట్టదు. కొన్నాళ్లు ఆఫీసులో అసలు కనబడదు. కనబడినప్పుడు కనబడుతోందని చూస్తాం గానీ, కనబడనప్పుడు కనబడలేదని ఎలా గుర్తిస్తాం?

ఏదో ఒకరోజు ఉన్నట్టుండి మళ్లీ ఊడిపడుతుంది. ఈ వెలుగు మాయమైనా మన జీవితంలో ఏం చీకటి సంభవించినట్టు? అప్పుడు ఎన్ని రోజులుగా కనబడటం లేదో ఒక అంచనాకు వస్తాం. మళ్లీ మామూలే. మళ్లీ అదే జీన్సులో, మళ్లీ అదే సల్వార్‌ కమీజులో, ప్రత్యేక సందర్భాల్లో చీరకట్టులో కనబడుతుంది. కానీ ఏదో ఒకసారి మరీ దగ్గర నుంచి వెళ్లినప్పుడో, టేబుల్‌ మీద కూర్చుని కాళ్లు ఊపుతూ కాఫీ తాగుతున్నప్పుడో ఛక్‌మని వెండిమట్టెలు మెరవడం చూస్తాం. అప్పటి గ్యాప్‌ ఎందుకో ఇన్నాళ్లకు గానీ అంతుపట్టనందుకు మన మందబుద్ధిని తిట్టుకుంటాం. మళ్లీ జీవితం పరుగెడుతూ, నత్తనడుస్తూ, కూలబడుతూ, లేస్తూ సాగుతూనే ఉంటుంది.

ఒకరోజు ఆడ్‌ టైములో మనం క్యాంటీన్‌కు వెళ్తాం, ఎవరో ఫ్రెండొస్తే టీ తాగించడానికి. అప్పుడామె అద్దాల పక్కని టేబుల్‌ మీద ఒంటరిగా కూర్చుని పళ్లు ఫలహారం చేస్తూ వుంటుంది. ఏమిటో ఇంత శ్రద్ధ. తర్వాతెప్పటికో ఆమె తిండిలో మార్పేదో వస్తుందని గమనించడం మొదలుపెడతాం. అంతకుముందు కనబడ్డ బుల్లి బుల్లి డబ్బాలు కాస్తా పెద్దవవుతాయి. జ్యూసులు గ్లాసులు గ్లాసులు తాగేస్తూ ఉంటుంది. మన మగబుర్ర అప్పటికి చిక్కుడుకాయలు చుంచుతూ కొంత సంసారంలో నలిగివుంటుంది కాబట్టి, ఈసారి అంచనా వేయడంలో పొరపాటు పడం. అయ్యో, ఈ బక్కప్రాణి అప్పుడే తల్లవుతోందా?

ఆ తర్వాత కొన్నిరోజులకు ఉబ్బుపొట్టతో దర్శనమిస్తుంది. జీన్సుప్యాంట్లలో అస్సలు కనబడదు. బట్టలు వదులుగా వేసుకుంటూ ఉంటుంది. నడకలో తేడా తెలుస్తుంది. అంతకు ముందు కొవ్వు అసలు కనబడని పిరుదులు కండపడతాయి. బుగ్గలు చిక్కనవుతాయి. మనిషిలోకి మరింత దివ్యత్వం ఏదో వచ్చి చేరుతుంది. మరి ఇది అందమైతే అప్పుడు కనబడిన అందం అందం కాదా? అంతకు ముందుది అందం కాకుండా పోయిందా? స్త్రీ అందం దశలు దశలుగా ఎలా విప్పుకుంటూ వస్తుంది!

పోతూ వస్తూ దాటేసుకుంటూనే ఉంటాం. కానీ ఇంతకాలమైనా పరిచయం కాకుండా ఎందుకు ఉండిపోయింది? రిటైర్‌ అయ్యేదాకా ఒకే ఆఫీసులో ఉన్నా, మనతో ప్రత్యేకించి పని పడకపోతే, ఉద్యోగరీత్యా సంభాషించుకోవాల్సిన అవసరం రాకపోతే ఎలా పరిచయం అవుతుంది? పనిగట్టుకొని పరిచయం చేసుకోవడంలో నాకు ఉత్సాహం లేదు. జరిగిపోవాలంతే. మన చుట్టూనే జీవితాలు ప్రవహిస్తూవుంటాయి. మనం వాటిని ఖండించుకుంటూనో, ఒరుసుకుంటూనో పోము. అసలు ఆ ప్రవాహానికీ మనకూ నిమిత్తమే లేదు. ఇదెంత శూన్యం?

మళ్లీ కొన్నాళ్లదాకా ఆమె మనకు కనబడదు. ఆపాటికి మనకూ ఒక కొడుకు పుట్టి వుంటాడు. వాడిని చూడటమే గుండెల్ని పొంగిస్తూ వుంటుంది. ఊయల్లో తప్ప వాడు నిద్రపోడని పాత చీరల్ని కట్టి ఊయల చేస్తాం. వాడు మొదటిసారి బోర్లా తిరుగుతాడు. పాకుతాడు. మనల్ని చూసి గుర్తుపట్టి నవ్విన రోజు జీవితంలో మరిచిపోలేం.

చాలా రోజుల తర్వాత ఉన్నట్టుండి ఆమె మళ్లీ ఆఫీసులో ప్రత్యక్షమవుతుంది. గత జీవితం ఏదీ ఆమెతో వెంటలేనట్టే పొట్ట ఖాళీ చేసుకుని తిరిగివస్తుంది. మనిషి మాత్రం కొంచెం నిండుగా అయివుంటుంది. మళ్లీ క్యాంటీన్‌లో ఎదురవుతూ, షిఫ్టు చేసుకుని పోతూ ఉంటుంది. ఉన్నట్టుండి, ఒకరోజు వేరే ఛానల్‌ స్క్రీన్‌ మీద దర్శనమిస్తుంది.

అయ్యో, ఒక్కసారైనా ఆమె దగ్గరికి వెళ్లి, ‘పుట్టింది పాపా, బాబా?’ అని అడగాలనిపించింది. కానీ ఎట్లా పోయి అడుగుతాం? ఏ ఆడ స్నేహితురాలి సాయంతోనో సేకరించగలిగే సమాచారం కాదు నాకు కావలసింది. ఆమె జీవితపు సంరంభంలో మిళితం కాగలిగే ఒక చిన్న ఉనికి, ఈ భూమ్మీది సకల జీవులతో పంచుకోగలిగే ఒక ఏకత.
----------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment