Saturday, April 20, 2019

నీళ్ళ బయ్యం


నీళ్ళ బయ్యం




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

ఆనాటి వాన చినుకులు పుస్తకంలో, నల్ల మిల్లి పెద భామిరెడ్డిగారి గ్రామం కథలో, వంశీ వర్ణనకి ఫిదా అయిపోయి, అదే వెదుర్లంక ఊరి బేక్డ్రాప్‌లో గాలి కొండపురం రైల్వే గేటు టైపులో ఓ థ్రిల్లర్ రాసేయ్యాలని కొన్నేళ్ళ కిందట తెగ ఇన్‌స్పయిరయ్యి, పట్టుమని పది పేజీలు రాసేకా, అర్థమైంది, అదంత వీజీ కాదని. ఇంకేటైనా రాద్దారనుకొని, రావి శాస్త్రి కథలూ, భరాగో కథలూ గట్రా చదివేసి, రాంపండు గారి బందుల దొడ్డి ఎనకాతలున్న చింతల తోపు దాటి, పెద దత్తుడిగారి మర్రిచెట్లు కాడ కుచ్చుని ఆలోచిస్తా వుంటే అప్పుడు తట్టింది- కథలకి ఇతివృత్తాలంటూ సెపరేటుగా ఉండవని. అయి జీవితాల్లోంచే పుట్టుకొచ్చేత్తాయని!

అల్లాటిదే, చిన్నప్పుడు ఊళ్ళో జరిగిన సంగతొకటి…

గురువారం సంత కాడ దొమ్మరాటొచ్చిందని సూత్తాకెల్తంటే, రొప్పుకుంటా ఎదురొచ్చిన చిర్రావూరి పంతులుగారబ్బాయి బద్రం, “ఉరేయ్ ఈర్పినోరి చిన్న శీనుగాడు ఎర్ర కాలవలో కొట్టుకుపోతన్నాడంట!” అని చెప్పి అదే పోత పొయ్యాడు.

నేనూ ఆడెనకాలే పరిగెట్టుకుంటా పోయా. ఆయిలు కొట్టు తాతాలు గారి పెద్దరగుల వీధి గుండా పోతే దెగ్గరని అటేపునుంచి పోతంటే, అప్పుడెదురొచ్చాడు చిన్న శీనుగాడు. ఆడ్ని చూడగాల్నే నా పై ప్రాణం పైనే పొయ్యింది. నేను అరిచిన అరుపుకి ఆడు కూడా ఝడుసుకున్నాడు గావాల, నిక్కరు తడిచి పొయ్యింది ఎదవకి.

“ఏరా! నువ్వు ఎర్ర కాలవలో కొట్టుకుపోయావంట కదా?” అన్నాను.

“ఎవడ్రా చెప్పింది? ఎదురుంగా నేను కనపడతం లేదా?” అన్నాడు.

నిజవే, ఆడి కాళ్ళు కూడా ఎనక్కి తిరిగి లేవు. మరి ఆ బద్రంగాడేటి అలా చెప్పాడు!

అదే చెప్పాను.

“ఏటీ, బద్రంగాడా? ఆడే కదరా కొట్టుకుపొయ్యింది! అది చెబ్దారనే నిన్నెతుక్కుంటా నేనొచ్చింది.” అన్నాడు.

నాకింకా డవుటుగానే ఉంది, ఈడు మనిషా దెయ్యమా అని.

ఈడు మనిషైతే, ఇందాక కనిపించిన బద్రంగాడు?

అదే అడిగితే, “ఆడి కాళ్ళు గానీ చూసేవా?” అన్నాడు.

“చూసేనెహే! ఎదరకే ఉన్నాయ్.” అన్నాను.

“సాలిపేట రామాలయం పక్క సందులోంచి బోది గట్టు గుంటా ఎల్లుంటాడు, పాష్టుగా ఎల్లచ్చని. కాలవ కాడికెల్తే తెలిసిపోద్దిగా, పా కాలవ కాడికి పోదాం…” అన్నాడు.

దార్లో సోడాకొట్టు ఆదెమ్మామ్మ “ఏరా ఎదవల్లాల! ఇంత మద్దినేల ఎక్కడికిరా పరుగులూ?” అంటే…

“కోడూరోరి తోటలోకి కొండసిలవొచ్చిందంట మామ్మా, సూత్తాకెల్తన్నాం”! అన్నాడు.

“కోట సత్తెమ్మ గుడి కాడ, ఏట ఏత్త్నారా? ఎల్లండెల్లండి, మా దొడ్డ తల్లి!” అంది. ఆవిడ సౌండింజినీరు.

తీరా కాలవ కాడికెళ్ళాక, అక్కడ జనం లేరు.

ఎర్ర కాలవ రేవులో బాసింపట్టేసుకుని, తాటి ముంజెలు తింటన్నాడు బద్రంగాడు.

“ఏరా, నవ్వుతాలగుందా? నువ్వు కాలవలో కొట్టుకెల్తన్నావని ఆడూ, ఆడు కొట్టుకెల్తన్నాడని నువ్వూ! ఏంట్రా ఇది?” అని ఒక్కసారి వాడి మీదకి దూకేహాను.

ఆడు అప్పుటికే గజీతగాడు, లటక్కన కాలవలోకి దూకేహాడు. ఒడ్డునే ఉన్నా శీనుగాణ్ణయినా పట్టుకుందారని అటెంపుకి తిరుగుతే, ఆడూ అంతే! గభాల్న దూకేహాడు.

ఉక్రోషం పట్టలేక, ఆడెనకాలే నేనూను.

తెలివొచ్చేసరికి, నా మొకమ్మీద వాకలపూడి రత్తయ్యగారి పెద పాలేరు చంద్రయ్య మొకముంది.

“ఏరా, ఈత రానోడివి ఎందుకురా దూకేవ్?” అంటన్నాడు.

పక్కనున్న శీనుగాడు, బద్రంగాడు తప్పుచేసినట్టు తల దించుకునున్నారు.

“కాలు జారి పడిపోయానండీ…” అన్నానేను.

టయానికొచ్చి జుట్టు పట్టి లాకొచ్చాడు కాబట్టి సరిపోయింది! లేకపొతే శీనుగాడూ, బద్రంగాడూ గాదు, నేను కొట్టుకు పొయ్యేవోణ్ణి ఎర్రకాలవలో.

ఏరా ఎందుకురా ఇలా చేసారని ఆళ్ళిద్దర్నీ నిలదీస్తే, నా నీళ్ళ బయ్యం పోడానికి కాలవలో దూకేలా చేహామన్నారు.

మాయదారి నీళ్ళ బయ్యం ఉప్పుడికీ పోలేదు!
--------------------------------------------------------
రచన: మాధవ్ కందాళై, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment