Wednesday, April 17, 2019

కొండదారిలో!


కొండదారిలో!




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి................

ఆ దారి వెంట నడచిపోతోంటే
సూరీడి ఏటవాలు కిరణాలు
నీడలను నాట్యాలాడిస్తుంటాయి.

గాలులు చేలో మొక్కలతో
అంటుకునే ఆట కాబోలు
అలసట లేకుండా ఆడుతూంటాయి.

రెక్కలు చరుచుకుంటూ
పొగలా లేచిన పక్షుల గుంపొకటి
మబ్బుల్లోకి ఎగిరి మాయమౌతుంది.

ఎవరో పేనిన ఊడల ఉయ్యాల
ఊగేందు కెవరూ రారేంటని
కొమ్మలను కుదిపేస్తుంటుంది.

కొండదారిలో రాలిపడ్డ పూలగుత్తుల్నీ
కుబుసాలు విడుచుకుంటోన్న జంటసర్పాలనీ
జాగ్రత్తగానే దాటుకు ఇల్లు చేరతాను కానీ,

ఆ గాలిలో నలిగిన పూలపరిమళమేదో
ఊపిరిలో చేరి వెంటాడటమాపదు.
కడవల్లో నీలాకాశాన్ని మోసుకుంటూ
వడివడిగా నడచిపోయిన ఆ
కొండయువతి కడియాల చప్పుడు
ఘల్లుమని ఈ గుండెల్లో
మోగడమాగదు!
-----------------------------------------------------
రచన: మానస చామర్తి, 
ఈమాట సౌజన్యంతో

2 comments:

  1. ఎక్కడి కొండదారి తల్లి మాతల్లి. ట్రాఫిక్ లో పొగ పీల్చుకొని సస్తావుంటే. ఏమి తవికలు రాస్తున్నారు.

    ReplyDelete

  2. కవయిత్రి గారు వ్రాసినది కొండదారి గురించే కదా, ట్రాఫిక్ కాలుష్యంతో నిండి పోతున్న నగర దారుల గురించి కాదుగా. ఆ మేరకు కవిత బాగానే ఉందే. ఇంకా కాస్తోకూస్తో కొండదారులు మిగిలే ఉన్నాయి దేశంలో. పట్టణీకరణ వాటిని కూడా కబళించేటంత వరకు ఆశ్వాదిద్దాం.

    ReplyDelete