Sunday, December 9, 2018

సోమన తెలుగు జాతీయాల సొబగు


సోమన తెలుగు జాతీయాల సొబగు




సాహితీమిత్రులారా!


తడియొత్తు చీరతో దాది కౌగిటఁజేర్చి
చూపంగ కన్నార చూడనైతి
దడవి యాడకమున్న తట్టాడుమని పట్టి
వడకంగ సెజ్జపై వ్రాల్పనైతి
నల్లంత దవ్వుల నప్పలప్పలనంగ
నెదురుగాఁ బడతేర నెత్తనైతి
వియ్యాలచే నిచ్చి వేడుక నను వారు
తిట్టింప విని దప్పి దేరనైతి
నకట మిథ్యామనోరథుం డైతిగాని
కొడుకులం గని తమవారు గొండసేయ
నుండలేదయ్యె సంపద లుబ్బెనేని
లేబరమ గాదె బిడ్డలు లేని బ్రతుకు!
బిడ్డలు లేని బ్రతుకు లేబరమే గదా అని చెప్పిస్తున్నాడు కవి. లేబరము అంటే శూన్యము. బిడ్డలుంటే–పసితనాన్నించీ వారితో తండ్రి పొందే ఆనందాలను–వారి చిట్టి చేతల అనుభవాల సంతోషాన్నీ ఏకరువు పెట్టిస్తున్నాడు.

శిశువు పుట్టగానే వంటిమీది మావి పోదుడిచి, కొద్దిపాటి తడిగల మెత్తటి చీర మడతల్లో వుంచి మంత్రసాని ఆ శిశువును తండ్రికి చూపిస్తుంది. ఆ బిడ్డని–తొలిసారిగా తండ్రి అయిన ఆనందం అనుభవిస్తూ–దాది చూపించగా కనులారా చూడకపోతినే! కొద్దిరోజుల తర్వాత పసివాడు కాళ్ళూ చేతులూ తడువుకునే ప్రయత్నం చేస్తూ విఫలుడవుతూ, వొణుకుతూ వుంటే పట్టుకొని జాగ్రత్తగా శయ్యమీద పడుకోబెట్టకపోతినే! మరికొంత పెద్దవాడయిన తర్వాత తప్పటడుగులు వేస్తూ అల్లంతదూరం నుంచి అప్పలప్పలంటూ తొక్కు తొక్కు పలుకులతో ఎదురుగా వస్తుంటే ఎత్తుకోకపోతినే! పిల్లవాడు పుట్టాడని తెలిసి, భార్య తరఫు వాళ్ళు వచ్చి, పసివాడిని ఎత్తుకొని–ఇన్నాళ్ళకు వచ్చావురా మీ నాన్న పొగరణిచి ముకుదాడు వేసేవాడివి–అని పరాచికంగా తిట్టిస్తుంటే విని సంతోషపడకపోతినే! కొడుకున్నవాడు కొండంతవాడు అని తన బంధువర్గం పొగడుతూవుంటే విని ఆనందించకపోతినే! ఎంత అతిశయమైన సంపదలున్నా బిడ్డలు లేకపోతే బ్రతుకు శూన్యమే గదా! అని విలపిస్తున్నాడొక విప్రుడు.

సందర్భం మనవి చేస్తాను. భారత యుద్ధానంతరం ఒకరోజు అర్జునుడు ద్వారకకు వస్తాడు, కృష్ణుణ్ణి చూడడానికి. ఆ రోజు కృష్ణుడు ఏదో క్రతువు–ప్రత్యేకమైన పూజ–చేస్తూ దీక్షలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మడు ఏడ్చుకుంటూ కృష్ణార్జునుల దగ్గరికి వస్తాడు దీనంగా. ఆయన శోకాన్ని చూసి కృష్ణుడు కన్నీరు పెట్టుకుంటాడు. కృష్ణుడి బాధను చూసి అర్జునుడూ కళ్ళనీళ్ళ పర్యంతమవుతాడు. సంగతేమిటంటే ఆ విప్రుని భార్య గర్భవతిగా వుండి, శిశువును ప్రసవించగానే ఆ శిశువు చనిపోతాడు. ఇలా ఒకసారిగాదు, మూడుసార్లు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయన భార్య గర్భవతి. ప్రసూతి దినం వచ్చింది. ‘మళ్ళీ ఏమవుతుందో కృష్ణా, నా బిడ్డను నువ్వే కాపాడాల’ అని వేడుకోడానికి వచ్చాడు. సంతులేనంతకాలం లేదే అనే ఏడ్పు అలా ఉండగా, పుట్టగానే బిడ్డ గతిం-చడం, అదిన్నీ ప్రతిసారీ అలాగే కావడం–మళ్ళీ ఇప్పుడూ అలానే అవుతుందనే భయంతో రక్షించవయా అని ప్రార్థించడానికి నీ దగ్గరికి వచ్చాను కృష్ణా! అంటాడు ఆ విప్రుడు. మా ఇంటి వాకిలి దగ్గర నువ్వుండి ఆ యమభటులను రాకుండాజేసి శిశువును బ్రతికించు అని వేడుకుంటాడు. ‘ఈ గర్భము రక్షించిన నా గౌరవమేమి జెడక, నారాయణ! నానాగుణసంపన్నులలో సాగుదు, నటుగాకయున్న సమయుదు వగలన్’ అనిన్నీ అన్నాడు. పిల్లలుంటే నానాగుణసంపన్నులలో కొనసాగుతాడట. సంతానం కలిగివుండడమనేది సమాజంలో అంత గౌరవభాజన మన్నమాట.

కృష్ణుడేమో, అయ్యో నేను దీక్షలో ఉన్నాను, బయటికి రాకూడదు. రేపొస్తానులే అంటాడు. బ్రాహ్మడికి మండుతుంది. రేపొచ్చి నువ్వు పొడిచేదేముంది, మా ఆవిడ ఇప్పుడే పురుటి నెప్పులు పడుతుంటే అని విసుక్కుని, ‘ఇంతలో మాడిననేమి చేసెదవు మంత్రపు నీళులు చల్లవచ్చునే!’ అని ఎత్తిపొడుస్తాడు. తాను కృష్ణుడి దగ్గరకు ఆర్థించడానికి వచ్చాడు. అయినా బ్రాహ్మడి మాటలు చూడండి కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్లు! పైగా మంత్రపు నీళులు చల్లవచ్చునే అంటాడు. కండ్లక్కనపడకుండా వచ్చే మృత్యువును నిరోధించగలవాడు మంత్రపు నీళులు చల్లి ఆ పని చేయలేడూ! పెడసరంగా మాట్లాడే అధికారం బ్రాహ్మలకుంది. దానికి నన్నయభట్టు సాక్ష్యం కూడా ఉంది: పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత! విప్రులయందు నిక్కము, అని.

అదలావుంచండి గాని, ఇలాంటివి చిత్రమైన జాతీయాలు వాడటంలో ఈ కవి మహా అఖండుడు. సరే, అర్జునుడు ‘నేను పోయి ఆ పని చేసి వచ్చేదా?’ అంటాడు. కృష్ణుడు నవ్వి, ఆ పని నీ చేతగాదులే అని, అయినా నేనెందుకు కాదనడం అని సైన్యాన్ని తీసుకుని పో అని అనుమతిస్తాడు. అర్జునుడు గాండీవం తీసుకొని బ్రాహ్మడితో కలిసి వారింటికి పోయి కాపలా కాస్తాడు కాని, విప్రపత్ని ప్రసవించడమూ, శిశువు మరణించడమూ కూడా జరుగుతాయి. ‘యమభటులు నా కనుగప్పి పోయారు. శిశువు చనిపోయాడు. సైన్యమంతా చిన్నపోయింది. చూడటానికి వచ్చినవారంతా పెదవి విరిచి వెళ్ళిపోయారు. నా గాండీవం పరువుపోయింది!’ అని అర్జునుడు బాధపడతాడు. బ్రాహ్మణుడు మాత్రం అర్జునుడిని ముక్కచీవాట్లు పెడతాడు. నువ్వు పార్థుడివా అపార్థుడివా అంటాడు. పెద్ద పోటుమగనిలా వచ్చావు. ‘పాఱెడి బండ్లకు కాళ్ళుసాపగా నలవడునన్న’ అని ఎత్తిపొడుస్తాడు. వేగంగా పోయే బండిని ఆపడానికి ఎదురుగ్గా కూచుని కాళ్ళుచాపితే పనవుతుందా, కాళ్ళను తొక్కుకుంటూ బండి వెళ్ళిపోతుందిగాని. ఒక పని చేద్దామని వచ్చినవాడికి ఆ పని సిద్ధాసిద్ధతల ఫలంలో నాలుగో భాగం ఉంటుంది, మంచైనా కీడైనా. అలా ఈ వైఫల్యంలో నాలుగోవంతు పాపం నీదే! అంటూ, అసలు నిన్ననేదెందుకులే ‘పెద్ద లావు గలదంచు’ నీకీ గాండీవమిచ్చాడే, ఆ అగ్నిహోత్రుడు, అతన్ని అనాలి–అంటూ అర్జునుడిని వాయిస్తాడు బ్రాహ్మడు. సరే, ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడితో కలిసి పోయి, మేరువు దాటి, ఉత్తర సముద్రాన్ని ఉత్తరించి, పాతాళానికి పోయి, ఆ పెంజీకటి కవ్వలినించి విప్రుని పిల్లలను తెచ్చి అతని కిస్తాడనుకోండి–అది వేరే పెద్ద కథ!

పిల్లలు పుట్టినప్పుడు తండ్రి ఎంత ఆనందిస్తాడో, ఎంత వేడుకపడతాడో, తెలుగిండ్లలో వియ్యాలవారు పరియాచకంగా పసివాడిచేత ఎలా తండ్రిని తిట్టిస్తారో, ఇలాంటి విశేషాలన్నీ ఎంతో సహజంగా సుందరంగా వింగడిస్తున్న పై పద్యం మహాకవి నాచన సోమనాథుని ఉత్తర హరివంశంలోనిది. సోమనాథుడు తన్ను తాను నవీన గుణ సనాథుడు అని చెప్పుకున్నాడు. అది తన సామర్థ్యం తానెరిగి చెప్పుకున్న మాటేగాని స్వోత్కర్ష అనుకోనక్కరలేదు. శ్రీనాథుడూ పోతనా తెలుగు సాహితీ రంగస్థలం మీదికి రాకముందు కవిత్రయంతో సమవుజ్జీలనిపించుకున్న మహాకవులు ఇద్దరే ఉన్నారు. ఒకడు నన్నెచోడుడైతే, రెండోవాడు నాచన సోమనాథుడు. హరివంశం భారతం కొనసాగింపనీ, హరివంశంతో కలిస్తేనే భారతం మహాభారతమవుతుందనీ భావిస్తారు. ఆశ్వాసాంత గద్యాల్లో తిక్కన కృత శ్రీమహాభారత కథానంతరంబున–అంటూ తిక్కన సోమయాజిని ఉటంకించి, తానూ తిక్కనంత వాడినని సూచించాడు సోమన. ఆయన ఉత్తర హరివంశమే వ్రాశాడుగాని పూర్వ హరివంశం ఎందుకు వ్రాయలేదో!

ఎఱ్ఱాప్రగడ హరివంశం పూర్తిగా రచించాడు. ఎఱ్ఱన, సోమన దాదాపు సమకాలికులేనని కొందరూ, ఎఱ్ఱన కొంచెం ముందువాడని కొందరూ అంటారు. సోమనను ఎఱ్ఱన అనుకరించాడని వేలూరి శివరామశాస్త్రిగారూ, కాదు, ఎఱ్ఱననే సోమన అనుసరించాడని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారూ అన్నారు గానీ బహుశా సమకాలికులైన వాళ్ళకు ఒకరి ప్రభావం మరొకరి మీద పడే అవకాశం తక్కువనుకుంటాను. ఏదేమైనా ఇరువురూ మహాకవులు. ఎఱ్ఱన హరివంశంలో వుండే గాంభీర్యమూ హుందాతనమూ సోమన హరివంశంలో కనిపించదు. తన కాలపు సమాజపు ప్రత్యక్షతా, భాషలో లోకంలో బహుళవ్యాప్తంగా ఉన్న పదాల, జాతీయాల వాడుకా సోమనలో ఉన్నంతగా ఎఱ్ఱనలో లేదు. ప్రస్తుతం మనం సోమనను గురించి ముచ్చటించుకుంటున్నాం కాబట్టి సోమన ఒక విలక్షణ, అసాధారణ కవే కాని సామాన్యుడు కాదని చెప్పుకుందాం. విశ్వనాథ సత్యనారాయణగారు ‘ఒకడు నాచన సోమన్న’ అని తనకు గురుస్థానీయుల జాబితాలో చేర్చారు సోమనను.

పై పద్యం చూశారు గదా ఎంత సహజ సుందరంగా ఉందో! బిడ్డను తడియొత్తు చీరతో దాది తండ్రికి చూపించడమూ, అప్పలప్పలంటూ పసివాడు తప్పటడుగులూ తొక్కుపలుకులతో రావడమూ, వియ్యాలవారు వేడుకగా తిట్టించడమూ (అలా తిట్టిస్తే తనకు దప్పిదేరుతుందట), కొడుకుని చూసి తమవారు కొండచేయటమూ లాంటి స్వభావరమ్యాలైన బొమ్మలు నిలబెట్టాడు సోమన ఈ పద్యంలో.

ఇక సోమన వాడిన సామెతలూ, సామెతల్లాంటి జాతీయాలూ, అర్థాంతరన్యాసాలూ చిత్రవిచిత్రంగా ఉండి ఆశ్చర్యమూ, మెప్పూ కలిగిస్తాయి. ఇవి కావ్యమంతటా కానవస్తాయి. కొన్ని తిలకించండి.

కుమ్మరావమున రాగిముంతలేరంగ గలవె!

జీలుగు పెరిగిన, మాలెకు కంబంబుగాదు

మద్దులు మునింగి పాఱ, వెంపళ్ళు తమ కెంత బంటి

పాముకాటు సీర దుడిచిన బోవునె!

తవుడు దిని చచ్చువాడికి విషము పెట్టువాడు వెర్రిగాడె!

ఇలాంటి వక్కణాలు చాలా హృద్యంగా వాడాడు. ధర ఇంగలాల పుట్ట అంటాడొకచోట.

గర్భవతులున్న ఇళ్ళల్లో హరివంశాన్ని పారాయణం చేయించడం పూర్వం చాలా ఇండ్లలో ఉండేది. ఇప్పుడూ ఎవరన్నా చేస్తుండవచ్చు. మృతి చెందిన విప్ర బాలకులను బ్రతికించి తెచ్చిన శ్రీకృష్ణుని లీలలు ఇందులో ఉన్నందున అలా పారాయణం చేస్తారు గాబోలు.

‘నాచన సోమనాథ కవినాథల సత్కవితాలతావళిన్ బూచిన పూల సోయగ మపూర్వము’ అని పొగడ్తలందిన సోమన తన కావ్యంతో కవితాప్రియులకు కలిగించిన రసానందం అనుభవైకవేద్యం. ఉత్తర హరివంశంలో నాకు నచ్చిన అనేక పద్యాల్లో పైదీ ఒకటి.
----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment