Sunday, December 9, 2018

గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5


గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5





సాహితీమిత్రులారా!

భారతీయ చరిత్ర ఎంత సంక్లిష్టమైనదో మన దేవతల చరిత్ర కూడా అంతే సంక్లిష్టమైనది. ఇంతకుముందు భాగాల్లో చర్చించినట్టు భారతీయ వాఙ్మయంలో గణేశుని ప్రస్తావన ప్రముఖంగా 5వ శతాబ్దం తరువాతే కనిపించినా, గజరూపాన్ని దైవంగా ఆరాధించే సంస్కృతి అంతకంటే ప్రాచీనమైనదని మనం ఊహించవచ్చు. అయితే, గజారాధన యొక్క పూర్వచరిత్రను అంత సులభంగా వివరించలేము. ఏనుగు, ఎద్దు వంటి జంతువులను, చెట్లను ఆరాధించడం (animism) భారత ఉపఖండంలోనే కాక పశ్చిమాసియాలోనూ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోనూ కనిపిస్తుంది కాబట్టి గజారాధన మూలాలను శోధించడానికి మరింత లోతైన విశ్లేషణ అవసరం. ఈ వ్యాసభాగంలో ముందుగా గత విభాగాల్లో చర్చించిన విషయాల సారాంశాన్ని క్లుప్తంగా ప్రస్తావించి, ఆపై గజారాధన మూలాల గురించిన వివిధ సిద్ధాంతాలను, వాటిపై నా అభిప్రాయాలను వివరిస్తూ ఈ అంతుచిక్కని వింతదేవునిపై చర్చకు ఈ విడత వ్యాసంతో మంగళవాక్యం పాడుతాను.

గత విభాగాల్లో చర్చించిన విషయాల సారాంశం
వేద వాఙ్మయంలో గజముఖుడైన గణేశుని ప్రస్తావన లేదు.
రామాయణ, మహాభారతాల్లో కూడా గజాననుని ప్రస్తావన లేదు. భారతంలో గణపతిగా, గణేశునిగా చాలా చోట్ల శివుడిని వర్ణించే శ్లోకాలు (ఒక చోట విష్ణువును వర్ణించే శ్లోకం) కనిపిస్తాయి. వ్యాసునికి లేఖకుడిగా గణపతి మహాభారతం వ్రాశాడని వర్ణించే శ్లోకాలు కొన్ని నాగరి ప్రతుల్లో తప్ప భారతదేశంలో దొరికే ఇతర మహాభారత ప్రతుల్లో లేవు.
మానవగృహ్య సూత్రాల్లో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణింపబడ్డ వినాయకులు (బహువచనం) గజముఖులు కారు.
పాణిని, పతంజలి, కౌటిల్యుడు మొదలైన వారు రాసిన ప్రాచీన లౌకిక సాహిత్యంలో కూడా ఇతర దేవతల ప్రస్తావన ఉన్నా గజాననుని ప్రస్తావన లేదు.
మలిపురాణ యుగంలోనే మనకు గజముఖుడైన గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. అయితే, శైవ పురాణాల్లో తప్ప వైష్ణవ పురాణాలైన విష్ణు పురాణం, భాగవత పురాణంలో గణపతి ప్రస్తావన కనిపించదు.
సంస్కృత కావ్యాల్లో 5వ శతాబ్ది తరువాతే గణేశుని ప్రస్తావన కనిపిస్తుంది. అయితే ప్రాకృత కావ్యమైన సత్తసాఈలో (గాథాసప్తశతి) మాత్రం స్పష్టంగా గజముఖుడైన గణేశుని ప్రస్తావన ఉంది.
గణేశుడే పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించే ముద్గల పురాణం, గణేశుడే సర్వజగత్తుకు మూలాధారమని కీర్తించే గణేశ పురాణం గాణపత్యమతాన్ని విభిన్నంగా చూపే పురాణాలు.
ఎనిమిదవ శతాబ్దం నాటికి భారతదేశమంతటా ప్రధాన దేవునిగా గుర్తింపు సాధించిన గణేశుడు, భారతీయ వర్తకులు, (బౌద్ధ) మతప్రచారకులు, రాజులతో పాటు ప్రయాణించి ఆగ్నేయాసియా, చైనా, జపాన్ల దాకా తన ప్రభావాన్ని విస్తరించుకొన్నాడు.
గజముఖారాధన మూలాలు: వివిధ ఊహాగానాలు
మనకు ఏనుగు ముఖంతో, మిగిలిన శరీరం మానవ రూపంతో కనిపించే నాణాలు, శిల్పాలు ముందుగా వాయవ్య దిశలోని గాంధార, కాంభోజ, సింధు రాజ్యాల్లో కనిపించాయి కాబట్టి ఈ దేవుడు ఉత్తర, పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుండే వచ్చాడని చాలామంది పండితుల ఊహాగానం. గజముఖారాధన మూలాల గురించి లోతైన పరిశోధన జరగకపోయినా, అక్కడక్కడ కనిపించే చర్చలను బట్టి ఈ నాలుగు రకాలైన మూలాలను వర్ణించవచ్చు.

వైదిక సంప్రదాయంనుండే పుట్టిన దేవుడు: వేదాల్లో గజముఖుని ప్రస్తావన లేకపోయినా, ఋగ్వేదంలోనూ, అథర్వవేదంలోనూ యక్షుల ప్రస్తావన కనిపిస్తుంది. యక్షులకు నాయకుడైన కుబేరుని ప్రస్తావన అథర్వవేదంలో, శతపథబ్రాహ్మణంలో ఉంది కాబట్టి యక్షులలో గజాననుడు ఒకడు కావచ్చు. ఋగ్వేదంలోనే రుద్రుని ప్రస్తావన ఉంది కాబట్టి, అతని కొడుకుగా అతని గణాలకు అధిపతిగా గణేశుడు ప్రముఖ దేవతగా పరిఢవిల్లడం పూర్తిగా వైదిక సంప్రదాయంలోని భాగమే అని కొంతమంది అభిప్రాయం.

అయితే, కుబేరుడు, రుద్రుడు కూడా వేదసాహిత్యంలో అనార్యులుగా, అసుర, రాక్షస గణాలకు అధిపతులుగా వర్ణించడం కనిపిస్తుంది. కాబట్టి ఆలస్యంగా కనిపించే గణేశుడిని వైదిక సంప్రదాయం నుండే పుట్టిన దేవుడిగా భావించడం కష్టసాధ్యమే.


పశ్చిమాసియా ప్రభావం?:
సా.శ. పూ. 1000 కాలానికి చెందిన పశ్చిమ ఇరాన్ ప్రాంతంలోని లూరిస్తాన్‌లో కనిపించే రాతిచిత్రాల్లో ఒక చిత్రం ఏనుగు-మనిషి కలిసిన గజనర రూపంగా కనిపిస్తుంది. ఇది గజాననుడి అతి ప్రాచీన రూపం అయ్యుండవచ్చునని కొంతమంది ఊహ.

అయితే తరువాతి పారశీక శాసనాల్లోగాని, ఆవెస్తా గ్రంథాల్లో గానీ ఎక్కడా గజరూపంలో ఉన్న దేవతల ప్రస్తావన లేకపోవడంతో పాటు, పారశీక దేవుడు భారతదేశంలోని మతాలపై ఇంతగా ప్రభావం చూపించడం అంత సులభంగా వివరించలేము కాబట్టి, ఈ ఊహను అంతగా బలపరచలేము.

స్థానిక దేవతలలో ఒకడు: జంతువులను, చెట్లను దేవతలుగా ఆరాధించడం భారతదేశంలో అనాదిగా కనిపిస్తున్న ఆచారం. ఇప్పటికీ పల్లెల్లో కనిపించే నాగదేవత పూజ, రావి చెట్టు పూజ అనార్య సంప్రదాయాలని చాలామంది పండితులు భావిస్తారు. అదీగాక భారతదేశంలో వివిధ ఆటవికతెగల వారు వారి తెగల చిహ్నాలుగా (totem) వివిధ జంతువులను గుర్తులుగా వాడేవారని చెప్పుకోవచ్చు. అయితే వారివారి చిహ్నాలకు దైవత్వం ఆపాదించి పూజించేవారని చెప్పే ఆధారాలు మనకు దొరుకుతున్నాయి. ఆటవికులలో నెమలి, మూషికము, వృషభము, వరాహము, మొదలైన జంతువులను పూజించేవారున్నారని మనకు అనేక ఆధారాలు లభ్యమతున్నాయి. వరాహావతారము, నరసింహావతారము ఆయా తెగల దేవతలను విష్ణువు అవతారాలుగా వైదిక సంప్రదాయంలో కలుపుకొనే ప్రయత్నమే కావచ్చు. అలాంటి తెగల్లో గాణపత్యులు ఒక తెగ అయితే, గుప్తుల కాలం తరువాత వారి ప్రాభవం పెరిగి, వారి దేవుడైన గజాననుడు వైదిక, బౌద్ధ, జైన సంప్రదాయాల్లో ప్రధాన దేవునిగా గుర్తింపు సాధించివుంటాడు.



సింధులోయ నాగరికతనుండి వచ్చిన దేవుడు: సింధులోయ నాగరికతలో దొరికిన జంతువుల ముద్రల్లో ఎక్కువగా ఏనుగు, ఎద్దు ముద్రలే కనిపించడం విశేషం. శివుని ముద్రగా భావించే పశుపతి ముద్రలో కూడా ఉన్న జంతువుల్లో ఏనుగు, మహిషం కూడా ఉండడం విశేషం.


మట్టి పాత్రలు, ఆభరణాలతోబాటు త్రవ్వకాల్లో దొరికిన మట్టి బొమ్మల్లో ఏనుగు-మనిషి రూపంలో ఉండే బొమ్మలు కూడా దొరకడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించదగ్గ అంశం. ఒకవేళ ఈ మట్టి రూపాలు వారు ఆ కాలంలో పూజించిన దేవతల రూపాలని నిరూపించగలిగితే, గజముఖారాధన సింధు నాగరికత అంతటి ప్రాచీనమైనదని చెప్పుకోవచ్చు.


మనకు అలగ్జాండర్ కాలం తరువాత గాంధార, కాంబోజ, సింధు రాజ్యాలను పాలించిన ఇండో-గ్రీకు రాజులు కూడా తమ ఏనుగు, ఎద్దు బొమ్మల కలిగిన నాణేలను ముద్రించడం వారు అక్కడి స్థానిక ప్రజల ఆచార, వ్యవహారాలను గౌరవిస్తూ అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కావచ్చు.


అదీ కాక సా. శ. పూ. 50వ సంవత్సరంలో హెర్మేయస్ (Hermaeus Soter) అనే ఇండో-గ్రీక్ రాజు ముద్రించిన
ఒక నాణెంలో ఒక గ్రీకు రాజు రూపానికి తలపైన ఏనుగు చర్మం, తొండం కనిపిస్తాయి. నిజానికి భారతదేశంలో ఎక్కడా కనిపించని ఏనుగు బొమ్మలతో వున్న నాణేలు వాయవ్య దిశలోని రాజ్యాల్లో విదేశీ రాజుల పాలనలో కనిపించడం విశేషం.

అయితే కేవలం ఈ నాణేల ఆధారంగా మనం ఇక్కడ గజారాధన ఉండేదేమోనని ఊహించడం శాస్త్రసమ్మతం కాదు. నాణేలతో పాటు ఇతర పురావస్తు, సాహిత్య, చారిత్రక ఆధారాలతో ఇంకా లోతైన పరిశోధనలు కొనసాగిస్తే గానీ, అంతుతెలియని ఈ వింతదేవుని పూర్వాపరాలు సశాస్త్రీయంగా వివరించవచ్చు.


బహిరంగ గణేశ ఉత్సవాలు
ఏది ఏమైనా ప్రస్తుతం మనం ఘనంగా వీథుల్లో జరుపుకుంటున్న గణేశ చవితి ఉత్సవాలకు మాత్రం మూలం మరాఠ రాజ్యంలోని పీష్వాలు ప్రారంభించిన గణేశ ఉత్సవాలే. నానాసాహెబ్ పీష్వా రాజ్యకాలంలో గాణపత్యవ్రతం ప్రారంభమైనట్టుగా మనకు మరాఠా రాజ్యానికి సంబంధించిన దస్తావేజుల ద్వారా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మట్టితో గణపతిని తయారుచేసి శనివారవాడకు తీసుకురావాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు మనకు కనిపిస్తాయి. అంతకు ముందు గణపతిని ఎవరి ఇండ్లలో వారు పూజించేవారేమోనని మనం ఊహించవచ్చు. సవాయి మాధవరావు కాలంలో (1760-1791) పది రోజులపాటు ఘనంగా శనివారవాడలో జరిగిన గణేశ ఉత్సవాలలో 526మంది నృత్యకారులు, 185మంది గాయకులు, 732మంది నటీనటులు పాల్గొన్నట్టు అందుకు 4358 రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పే లెక్కల వివరాలు మనకు కనిపిస్తున్నాయి. మోరయ గోస్వామి శిష్యుడైన దేవధర్ విధారమహరాజ్ ఈ గణపతి నవరాత్రుల వ్రత విధానాన్ని సిద్ధంచేసినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది ఈ బహిరంగ ఉత్సవాలు ఛత్రపతి శివాజీ కాలంలోనే ప్రారంభమైనట్టుగా కూడా వాదిస్తారు.

తరువాత బ్రిటిష్ కాలంలో జాతీయోద్యమంలో భాగంగా బాలగంగాధర తిలక్ ఈ గణేశ ఉత్సవాలు దేశమంతటా జరపాలని సూచిస్తూ కేసరి పత్రికలో వ్యాసాలు రాశాడు. ఆ రోజుల్లోనే బాంబే, పూణేలతో పాటు బరోడా, గ్వాలియర్, గోవా మొదలైన నగరాల్లో పెద్ద ఎత్తున గణేశ ఉత్సవాలను నిర్వహించడం మొదలైంది. నిజామ్ సంస్థానంలో భాగమైన హైదారాబాద్‌లో కూడా ఆ రోజుల్లోనే బహిరంగ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని ఊహించవచ్చు.

ఉపసంహారం
నా అభిప్రాయం ప్రకారం గజముఖారాధన సింధులోయ నాగరికతనుండే భారత దేశానికి ప్రాకి ఉండవచ్చు. భాషాకుటుంబ వ్యాప్తిని వివరించేటప్పుడు ద్రావిడ భాషలు కూడా పాకిస్తానులోని బలూచిస్తాను నుండి సింధు, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా దక్షిణ భారతదేశాన్ని చేరుకున్నాయని ఒక వాదం ఉంది. ఇప్పటికీ బలూచిస్తానులో ఉన్న బ్రహూయి భాష అందుకు తార్కాణమని చూపిస్తారు. గుజరాతీ, మరాఠీ భాషల్లో కూడా ద్రావిడ భాషల ప్రభావం ఉందని కొంతమంది భాషావేత్తల అభిప్రాయం. ఈ వాదమే నిజమైతే, ఈ భాషల వ్యాప్తితోపాటు వారు పూజించే గజాననుడు కూడా ఈ ప్రాంతాలకు చేరి ఉండవచ్చు. అందుకే ఇప్పటికీ మనకు దక్షిణ భారతంతో పాటు గుజరాతు, మహారాష్ట్రలలో గణపతే ప్రధాన దేవుడు. అయితే గణపతితో పాటు రుద్రుడు, స్కందుడు, లక్ష్మి, గౌరి, కాళి వంటి దేవతల పుట్టుపూర్వోత్తరాలను గురించి సమగ్రంగా లోతైన పరిశోధనలు చేస్తేగానీ వీరి మూలాల గురించి మనం ఏ విషయం ఇదమిత్థంగా చెప్పలేము.

(సమాప్తం)
-----------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment