Sunday, April 15, 2018

ఆంధ్రకవితా పితామహుడు


ఆంధ్రకవితా పితామహుడు
సాహితీమిత్రులారా!అల్లసాని పెద్దనకు "ఆంధ్రకవితా పితామహుడ"ని పేరు
ఆయనను గురించి "శ్రీశ్రీ" వ్రాసిన కవిత చూడండి-


ఈ యఖండ ప్రతిభ విరిసి య
నేక రుచుల తురంగలించెడు 
మధువు లొలికిన మంజుకవితల
మనుచరిత్రమున..

ఆ దినమ్మున కృష్ణరాయ ధ
రాధిపుని పేరోలంగమ్మున
త్వత్కవిత్వ రస స్రవంతిని
ధార కట్టినది

మృదు మధుర గాన ధ్వనుల విని
కృష్ణ సర్పము లవశమొందిన 
విధములపు డట  నున్న పండిత
హృదయముల తోచె 

అపుడు మ్రోగెను నీదు పాదము
నందునుండి జనించి సభలో
గండ పెండారపు సముజ్జ్వల
గాన గీతములు

గౌరవము గని గరువముం గని
పారవశ్యము చెంది ఆశీ
ర్ధ్వనులతో కృష్ణరాయని
ధన్యుని చేసితివి

ఏండ్లు పూండ్లును నాడు మొ1దలు గ
తించె కాని భవద్యశస్సులు
నేటి వరకు శరత్సుధాకర
నిర్మలత తాల్చు

నీవు నాటిన తోటలోపల 
చేవ తరుగని పూల గుత్తులు
నేటివరకును తేటవలపులు
నింపెడిని దెసల

జీవచిత్ర కళారహస్యము
చిందు వార్చిన నీకవిత్వము
చిత్రకారుల చేతగల కుం
చియల విచ్చినది

తెలుగు కవనపు తీరు తీయము
నిలిచి వెలుగుట కొక మెరుంగును
చిలికి చుక్కల నడుమ మింటను
కులుకుచున్నావు.

రచన - 1928 జులై, 22
ముద్రణ - కవితాసమితి తొలివార్షిక సంచిక,1929