Tuesday, November 28, 2017

సొగసు చూడతరమా!


సొగసు చూడతరమా!




సాహితీమిత్రులారా!

మన కావ్యాలలో నైషధం విద్వదౌషధం
అని పేరుగాంచిన శ్రీనాథుని శృంగారనైషధములో
నలదమయంతుల వివాహ వృత్తాంతం ఇతి వృత్తంగా

సాగింది. అందులో  నలుడు ఇంద్రాదులదూతగా
దమయంతి అంతఃపురంలోకి
తిరస్కరణీ విద్యతో వెళ్ళినపుడు
మొదటిసారిగా నలుడు దమయంతిని
చూస్తాడు అప్పుడు దమయంతిని చూచిన
నలుని స్థితి శ్రీనాథుడు వర్ణించిన పద్యాలు
కొన్ని-

సుదతి ముఖేందు మండలము సొంపున రాగ ర సాంబురాశి య
భ్యుదయముఁ బొంది యెంతయును నుబ్బున వేల నతి క్రమించుడున్,
మదిఁ గడు భీతిఁ బొందిన క్రమంబున భూవరు దృష్టి సేరె న
మ్మద గజరాజ యాన కుచ మండల తుంగ మహీంద్రశృంగ మున్

మగువ ముఖేందువం దమృత మధ్యమునన్ మునుఁగంగఁ బాఱియో,
మగువ కుచద్వయంబు నడుమం బడి రాయిడి దందసిల్లి యో,
మగువ గభీర నాభి బిల మార్గముఁ దూఱి పరిభ్రమించి యో,
సొగపున రాజనందనుని చూపులు నిల్చుఁ దదంతరంబు లన్
                                                                    (శృంగారనైషధము - 3- 148, 149)

ఆ దమయంతిని కోరికమీర ఆపాదమస్తకం చూస్తూ
నలమహారాజు బ్రహ్మసాక్షాత్కారానందమును
అతిక్రమించేదైన మన్మథావేశాన్ని అనుభవిస్తూ
ఇంకేమీ తెలియని స్థితిలో ఉండెను.
ఆ సమయంలో శ్రీనాథమహాకవి
దమయంతి సౌందర్యాని ఈ విధంగా వర్ణించాడు-

నలుడు దమయంతి ముఖము అనే చంద్రుని సౌభాగ్యాన్ని
దర్శించటంచే అనురాగ సముద్రం ఉప్పొంగి చెలియలి కట్టను
దాటుకొని వెల్లి వొడువగా, అతని చూపు తాను ఆ వెల్లి(ప్రవాహం)లో
మునిగి పోతాననే భయంచేతకాబోలు ఆ మదించిన ఏనుగు నడకలదాని
కుచమండలమనెడి ఉన్నత గిరిశిఖరాల పైకెక్కాడు. రాజు దమయంతి
ముఖం చూచి అనురక్తి మితిమీరగా ఆమె స్తనసౌభాగ్యాన్ని పరికించడం
మొదలు పెట్టాడు ఇదంతా ఎలావుందంటే చంద్రోదయం సమయాన
సముద్రం పొంగి వెల్లువయితే దరినున్నవాడు మునకభయంతో కొండ
ఎక్కినట్లుంది.నలుని చూపులు దమయంతి ముఖచంద్రుని యందు
అమృతమునడుమ మునిగిపోయినందుననో, ఆమె చనులరెంటి
నడుమ సందులో పడి ఒరయిక చేతఇఱికి కొన్నందువల్లనో,
ఆమె లోతైన పొక్కిటి(నాభి)రంధ్రపు దారిలో దూఱి సుడితిరిగి
నందునో పారవశ్యముచేత పారవశ్యము పొంది దానిదానిలోపల
నిలిచిపోయాడట.

No comments:

Post a Comment