Saturday, June 13, 2020

లోకరీతి


లోకరీతి





సాహితీమిత్రులారా!

ఒక గురువుగారు శిష్యుని పిలుపు మేరకు వారి ఇంటికి వెళ్ళాడు.
అక్కడ శిష్యుని భార్యకు కోపం వచ్చి కుండతో శిష్యుని కొట్టింది.
కుండ పగిలిపోయింది. కుండ మూల్యం ఇవ్వమని గద్దించింది.
అది చూచిన గురువుగారు అనుభవవేత్త
ఈ శ్లోకంలో తన అనుభవం వివరించాడు చూడండి.

అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే!
అహో!  భాగ్యవతీ నారీ!  భాండమూల్యం నయాచతే!

నాతలపై నా భార్య ఎన్నో వందల కుండలు పగులగొట్టింది
(కోపం వచ్చినపుడు కుండనెత్తి తలపై కొట్టేది).
కాని ఎన్నడూ కుండ వెలను అడుగలేదు
నా భార్యే మహోత్తమురాలు-
అని భావం.

Thursday, June 11, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం





సాహితీమిత్రులారా!

శ్రీనాథకవిసార్వభౌమునికి ఇచ్చిన సమస్య ఇది చూడండి. 
కేవలం సర్వనామాలనే ఇచ్చి పూరించమనడం చాల క్లిష్టమైనది.
ఒకానొక సమయంలో ఒక సభలో శ్రీనాథమహాకవిని పరీక్షించడానికి 
కుత్సితంగ "అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱె" -
అనే సమస్యను ఇచ్చారు.
దానికి శ్రీనాథుని పూరణ-

కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థని తేరి టెక్కెముల్
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింత లున్
కొందఱు కృష్ణ జన్మమునఁ గూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱం
దరే

భైరవాశ్వములు - కుక్కలు, పార్థుని తేరి టెక్కెముల్ - కోతులు,
ప్రాక్కిటీశ్వరులు - వరాహాలు, కాలుని యెక్కిరింతలు - దున్నపోతులు,
కృష్ణ జన్మమునఁగూసిన వారలు - గాడిదలు, అంటే సభలోని వారు
కుక్కలు, కోతులు, పందులు, దున్నలు, గాడిదలు అని నిందాహేళనం.

Tuesday, June 9, 2020

మాట అంటే మాటలా?


మాట అంటే మాటలా?





సాహితీమిత్రులారా!

మాట అంటే పదము, వాక్యం, వార్త, సూక్తి, లోకోక్తి, ప్రతిజ్ఞ, కథ, ప్రార్థన ఇలా అనేక అర్థాలున్నాయి.
ఈ పద్యం చూడండి మాటను ఎంత గొప్పగా చూపించాడో.

మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్
మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్
మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్
మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగ మున్

కాబట్టి మంచి మాటలు నేర్చి, అర్థం చేసికొని, చక్కగా వివరించడం కూడా అభ్యాసం చేయాలి. లేకుంటే అగౌరవం, హీనత్వం, గర్వభంగం మొదలైనవి ఎన్నో గలుగుతాయి. కావున ప్రతి మనిషి సమయానికి తగిన విధంగా మాట్లాడవలెనని కవి హెచ్చరికగా దీన్ని భావించవచ్చు. మాటమీద ఎంత చక్కని పద్యంమో కదా

Sunday, June 7, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం





సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకమారు వేశ్య(కవయిత్రి) వచ్చి
అష్టదిగ్గజకవులకు సవాలుగా ఒక సమస్యను ఇచ్చింది.
"మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్" - అనేది సమస్య.
ఆ సమస్యను మరుసటి రోజుకు చెప్పేవిధంగా సమయమిచ్చింది.
దీనికి సమాధానం ఎలాగా అని ఆలోచించి తెనాలి రామకృష్ణుని ఆశ్రయించినారు.
దానికి అతడు పెద్దనతో 
"రేపు బోగంది వచ్చి సమస్య అడిగినంతలో మా శిష్యుడు 
అని మీరు చెప్పగా నేను మీ శిష్యుడనై చెబుతాను" -  అని అన్నాడు.
కచేరి ప్రారంభమైంది పెద్దన తన శిష్యుడు చెబుతాడని చెప్పాడు.
తెనాలిరామకృష్ణుడు లేచి పద్యాన్ని ఈ విధంగా పూరించాడు.

"కోరిక లుప్పతిల్ల మదిఁగోరిన యట్టి కళా విశేషముల్
 చారు తరంబులన్ రతుల సల్పఁగ నేర్చిన యట్టి జాణ యీ
 వార వధూ శిరోమణి వంతుల వేసుక దెబ్బ తీయుఁడీ
 మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలంద
ఱున్"

దీనితో అష్టదిగ్గజ కవులు ఆనందించగా సభ అంతా
 కరతాళధ్వనులతో వెల్లివిరిసింది. 

Friday, June 5, 2020

ఎవరి భావన వారిది

ఎవరి భావన వారిది





సాహితీమిత్రులారా!

కొడుకుల్ పుట్టరటంతు నేడ్తురవివేకుల్ -
అని ధూర్డటి - కాళహస్తీశ్వర శతకంలో అంటాడు.
కాని పుత్రులు శత్రువులంటున్నాడు
కనుపర్తి అబ్బయామాత్యుడు చూడండి-

కొడుకులు పుట్టరంచునొక కొన్ని దినమ్ములు చింత నంద నుల్
పొడమిన ఆయువున్, బలము, బుద్ధియు, విద్యయు చాల కల్గగా
ఉడుగని చింత- కల్గి తమనోలి భజింపక చింత - తండ్రి కె
ప్పుడు కడు చింత వేయుదురు -పుత్రులు శత్రులు గాక మిత్రులే

మోదం కలిగించే వారు మిత్రులు
ఖేదం కలిగించేవారు శత్రువులు
మరి కొడుకులు పుట్టటం ఆలస్యమైతే ఒకటే వేదన,
మందులూ, మాకులూ, దానాలూ, ధర్మాలూ,
పూజలూ, యజ్ఞాలూ, యాగాలూ ఒకటేమిటి అన్నీ
కొడుకు పుట్టేదాకా. లేకలేక ఒక పుట్టగానే
వాడి ఆయుర్దాయంగూర్చి, ఆరోగ్యాన్ని గూర్చి,
చదువుగూర్చి ఒకటే ఆరాటం చివరికి
ప్రయోజకుడైనాడు అనుకొంటే వృద్ధాప్యంలో
మా మొగం చూడంటంలేదని
తల్లిదండ్రుల వ్యధ పడుతుంటారు
మరి ఇంత వేదనకలిగించే పుత్రుడు
మిత్రుడెలా అవుతాడు శత్రువేకదా -
 అంటున్నాడు కవిగారు.

Wednesday, June 3, 2020

బంగారమంటి కోమటి



బంగారమంటి కోమటి






సాహితీమిత్రులారా!

ఏదైనా ఎక్కువైతే అది పిచ్చికిందికే లెక్క.
మరి సంగీతం ధ్యాసతో ఒక వ్యాపారి ఏమిచేశాడో?
ఈ పద్యం పుట్టింది. చూడండి........


లింగాల గురివిసెట్టికి
గంగాధరుడేమి? గతులు కల్పించెనయా
బంగారమంటి కోమటి
సంగీతముచేత బేరసారములుడిగెన్!


గురివిసెట్టి వ్యాపారం చక్కగా చేసుకుంటూ ధనం సంపాదించేవాడు.
గంగాధరుడనే సంగీత విద్వాంసుడు అతనికి సంగీతం నేర్పడం మొదలు పెట్టాడు.
గురివిసెట్టి సంగీతం పాడుకుంటూ తరననాం..... తరననాం.... అంటూ
ఒక మానిక వేయవలసినవానికి రెండు, రెండు వేయవలసినవానికి మూడు
ఇలా వేయడం వల్ల వ్యాపారం పూర్తిగా ఎత్తిపెట్టే దాకా పోయిందట.
అవసరం కాని విషయాలలో తలదూర్చితే ఇంతేకదా!

Monday, June 1, 2020

ముక్తి ఎన్ని రకాలు?


ముక్తి ఎన్ని రకాలు?





సాహితీమిత్రులారా!

మనం భగవంతుని జన్మరాహిత్యంకోసమే పూజించాలని
పెద్దలు చెబుతారు. కాని దాన్ని మనం ముక్తి అనే పదంతో వాడుతుంటాం.

ముక్తి అనేది నాలుగు రకాలని చెబుతారు.
1. సాలోక్య, 2. సామీప్య, 3. సారూప్య, 4. సాయుజ్య ముక్తి.

ఇంతకు ఇవేమిటివి అంటే తెలుసుకుందాం.-

సాలోక్యముక్తి - అంటే భగవంతుడుండే లోకంలో భక్తుడుండడం

సామీప్య ముక్తి-
                            భగవంతుని ఆంతరంగికులలో చేరి భగవంతుని సమీపంలో ఉండడం

సారూప్య ముక్తి - ఇది ఒకవిధంగా భగవంతుని ఆకారంలో ఉండడం

సాయుజ్య ముక్తి - భగవంతుని రూపంతో బాటు భగవందానందం పొందుతూ 
                                                భగవంతునిలో లీనమవడం.
ముక్తిలో కూడా ఇన్ని విధాలున్నాయి.
మనకే విధమైన ముక్తి కావాలో మనం ఆవిధమైన పద్ధతిని
అవలంబించి  ఆయనలో చేరాలిమరి.