Wednesday, December 6, 2017

విప్రతిషేధే పరం కార్యమ్


విప్రతిషేధే పరం కార్యమ్




సాహితీమిత్రులారా!


విప్రతిషేధే పరం కార్యమ్ - అనేది పాణినీయం
వ్యాకరణ సూత్రం. విప్రతిషేధే పరం కార్యమ్ - అంటే
మొదట చెప్పిన విధీ(కార్యము), తరువాత చెప్పిన విధీ
(కార్యము) రెండూ ఒకే శబ్దం విషయంలో తారసిల్లినపుడు
(వచ్చినపుడు) మొదటి విధిని విడిచి రెండవ విధిని
గ్రహించాలి అనేది సూత్రార్థం.
దీన్ని గ్రహించిన ఒక కవి
ఎంత చమత్కారంగా వాడాడో చూడండి-

"నిజపలి రాద్యః ప్రణయీ,
హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!"
"శృణుసఖీ పాణి సూత్రం
విప్రతిషేధే పరం కార్యమ్"

రాధ ఆమె చెలికత్తెల సంభాషణగా కూర్చబడినది

రాధ - నిజపలి రాద్యః ప్రణయీ,
           హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!
(నా భర్త నామీద మొదటి నుంచి ప్రణం ఒలికించాడు
 ఇప్పుడేమో కృష్ణుడొకడు  నా జీవితంలో ప్రవేశించాడు
 ఏమిచెయ్యనే)

గోపిక - శృణుసఖీ పాణి సూత్రం
              విప్రతిషేధే పరం కార్యమ్
(ఏముందీ అటువంటి వాటన్నిటికి  శాస్త్రకారులు మనకు దారి
చూపించే పోయారు పాణిని సూత్రం వినలేదా
విప్రతిషేధే పరం కార్యమ్- అని)

అంటే మొదటివాడైన భర్తను వదిలేసి రెండవవాడైన కృష్ణుని
ఆశ్రయించమని సలహా ఇచ్చింది - పాణిని సూత్రం ఎంతబాగా
ఉపయోగించింది



Tuesday, December 5, 2017

శతకాలలో సీస పద్యరచన


శతకాలలో సీస పద్యరచన




సాహితీమిత్రులారా!

మన సీసపద్యంలో సీసమనేది సంస్కృతంలో శీర్షిక అనే పదం నుండి
పుట్టింది. ఈ ఛందస్సుతో రచించిన రచన శీర్షమును, అంటే
శిరస్సును అలంకరించినట్లగును. సీసము సాధారణంగా ఏదైనా విషయంకాని, కథా సందర్భములను గాని వివరించే చోట్లనే కవులు ఉపయోగించారు. ప్రబంధవర్ణనలలో సీసపద్యము కనబడతాయి.
సీసముతో మొదట శతకం వ్రాసినవాడు 
పాల్కురికి సోమనాథుడనే చెప్పవచ్చు. ఈయన వ్రాసిన 
చతుర్వేదసారము అనే దానికి
బసవలింగ శతకమని మరోపేరుంది. దీనికి గలకారణం "బసవలింగ "
అనే సంబోధనతో లేదా మకుటంతో ఉండటమే. దీనిలో సంఖ్యాపరంగా
చూస్తే దీనిలో నాలుగువందల సీసపద్యాలున్నాయి. అంటే నాలుగు 
శతకాలు. ఈ సీసపద్య శతకాల్లో రెండు విభాగాలున్నాయి 
1. సీసముతోటి ఆటవెలది అనుసంధానింపబడినవి
2. సీసముతోటి తేటగీతి అనుసంధానించబడినవి

అయితే ఇక్కడ సోమన వ్రాసిన పద్యాలన్నీ ఆటవెలది 
అనుసంధాన పద్యములే. పూర్వం సీసాలన్నీ ఆటవెలది అనుసంధానితాలే అందువల్లసోమనాథుడు ఈ విధంగా వ్రాశాడు.
ఉదాహరణ పద్యం -
బసవన్న శ్రీపాద పద్మ పుష్పంధయ
         స్థేముండు పాల్కుర్కి సోముడనగ
బసవపుర ప్రాప్యపర్వతోత్తర ముఖ
         సీముండు పాల్కుర్కి సోముడనగ
బసవపురాణ ప్రబంధ సంఘటనాభి
         రాముండు పాల్కుర్కి సోముడనగ
బసవ శతక గద్య పద్యాది సంస్కృతి
         ధాముండు పాల్కుర్కి సోముడనగ
పరగ ప్రస్తుతించి భావించి భజియించి
బసవ విభుని కరుణ యెసగ బడసి
నిర్వికల్పరతి చతుర్వేదసారమన్
పద్యముల్ రచింతు బసవలింగ

ఈ సోమశేఖరకవి విరచిత శతకాలు మరి రెండున్నట్లు 
తెలుస్తున్నది 
సోమశేఖర శతకంలోని పద్యం-
తలకమ్మి కొండయు, విలుకమ్మి కొండయు
         గడయును నడుముగా గలుగుతేరు
సరసిజ ముకుళంబు సద్వాక్యకలనంబు
         మాతలినాలగు మాతలియును
మిన్నుల జనువాడు కన్నుల వినువాడు
         నంక పర్యంకంబులైన శరము
చల్లని పవనంబు నెల్లైన భువనంబు
          మేపును మోపుగా మెలగు నారి
కాకకోర్తు విల్లు గఱిగల గుఱ్ఱాలు
పగలు రేలు దిరుగు బండికండ్లు
గలగ బురజయంబు గైకొన్న నిను గొల్తు
చిరశుభాంక సోమశేఖరాంక


Monday, December 4, 2017

మరువలేను ఓ పోలీసు వెంకటసామి


మరువలేను ఓ పోలీసు వెంకటసామి 




సాహితీమిత్రులారా!

జననం - 04-12-1922       మరణం-11-02-1974
ఘంటసాల 96వ జన్మదినోత్సవం
ఈరోజు సంగీతసామ్రాజ్యంలో
ఆయనది తిరుగులేని మధురగళం
ఆయన జీవిత విశేషాలు
ఆయన మొదట సినిమాలో
ఎలా అడుగు పెట్టారన్నది
ఈ ఆడియోద్వారా తెలుసుకోగలరు
కిరణ్ ప్రభ టాక్ షో లోని ఈ ఆడియో
అందరు వినండి-

Sunday, December 3, 2017

స్వర్గంలో విప్లవము


స్వర్గంలో విప్లవము




సాహితీమిత్రులారా!

గతంలో భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి
ఆ సందర్భంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లో వికసించిన
కవిత ఇది. తెలుగు సాహిత్యం, తెలుగు సంగీతం, తెలుగు సంస్కృతి, 
తెలుగు శిల్పం, తెలుగు నాట్యం, తెలుగు చలనచిత్రరంగం, తెలుగువారి 
అభిరుచులు స్వర్గానికి ఎలా వ్యాపించిందీ, స్వర్గవాసులలో
ఎటువంటి మార్పుతెచ్చిందీ, సంభావించిన ఊహాచిత్రం ఇది.
ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఉదయశ్రీ - 5 లోనిది.

"ఇందిరా! ఇదేమి? ఇంటిలో కూర్చుండి
వంటచేయుచుంటి వొంటరిగాను?"
"అక్క!  భాగ్యనగరమట!  తెల్గుసభలంట!
కోడలమ్మపోయి కులుకుచుండె!!"

స్వర్ణదీతటాన సౌపర్వకన్యలు
"ఎంకిపాట" లభినయింతురంట!
ప్రతిదినమ్ము అదితి "బంగారుబొమ్మ పూ
ర్ణమ్మ" మోము ముద్దులాడునంట!

"త్యారాజు" గారి తంబురా శ్రుతి విని
వాణి వీణ మౌన మూనెనంట!
"ఘంటసాల" వారి గానామృతము గ్రోలి
అమృత మొల్లరంట అమరులెల్ల!

అమరకాంతలెల్ల "అమరావతీకేశ
బంధము"లకె మోజుపడుదురంట!
చెక్కిరంట దేవశిల్పులు "ఓరుగల్
ద్వారబంధము"ను సుధర్మముందు!

సిద్ధహస్తుడై "క్షేత్రయ్య" గారికి
రంభ ప్రణయలేఖ వ్రాసెనంట
"కూచిపూడిబాణి" క్రొత్తగా నేర్చిన
అచ్చరలకు విలువ హెచ్చెనంట!

ఒకటి రెండు సార్లు "ఊర్వశి" రాదాయె
ఇంద్రసభకు; ఎచటి కేగె నామె?
తెలుగు చలనచిత్రకళ ప్రేమతో పిల్వ
దివిని విడిచి భువికి దిగెను మగువ!

భాగ్యనగరి ద్రాక్షపండ్లు తెచ్చివగాని
తెరవదంట తలుపు దివిజగృహిణి!
అమృతమానువేళ "ఆవగాయ"ను సురల్
నంచుకొందురంట నడుమ నడుమ!

భాగవతములోని పద్యాలతో శచీ
దేవి పెదవి మరియు తీపియెక్కె!
రుచులు పల్లవించు శచిమోవి క్షణమైన
వీడలేడు నేడు వేల్పుఱేడు!

కవి సమూహమందు కాళిదాసుడు లెస్స!
మహలులందు తాజమహలు లెస్స!
నగరులందు భాగ్యనగియే హైలెస్స!
దేశభాషలందు తెలుగు లెస్స!!

(ఈ నెల 15వ తేదీ నుండి  భాగ్యనగరిలో ప్రారంభమౌ 
ప్రపంచ తెలుగు  మహాసభలకు
గుర్తుగా మరోమారు ఈ కవితను ఇక్కడుంచాను.)

గోపురం నీడ త్రిప్పి పడే దేవాలయం


గోపురం నీడ త్రిప్పి పడే దేవాలయం




సాహితీమిత్రులారా!

హంపి విరూపాక్ష దేవాలయంలోని
ప్రత్యేకత ఏమంటే రాజగోపురం
నీడ దేవాలయంలో త్రిప్పి పడుతుంది
అలాగే దేవాలయం గోపురం నీడకూడ
ఆలయంలో పడుతుంది-
ఈ వీడియోలో విశేషాలు గమనించండి-


Saturday, December 2, 2017

వసంతం


వసంతం


సాహితీమిత్రులారా!

వసంతం అనే కవిత
"ఫూలోం కీ బహార్" అనే హిందీ
కవితకు స్వేచ్ఛానువాదం)

దూరమెరుగని దూరం నుండి
విరామ మెరుగక పయనాన్ని
సాగిస్తున్న పాంధకిశోరాన్ని
వెదకుతున్నాను వసంతాన్ని
            అదుగో వసంతం వెల్లివిరిసి
            వనిరూపుదాల్చింది
ఆవనిలో వూగే విరులూ
తరులు తరుశాఖలూ
నన్నే పిలుస్తున్నాయి పదేపదే

            తోటమాలీ తలుపు తెరవవోయీ
            తోటమాలీ తలుపు తెరవవోయీ
            నీతోటలోని ప్రతి కొమ్మారెమ్మా
            నన్నేపిలుస్తున్నాయి కమ్మగా
స్తబకాల వన్నెలవెలిగే వనిలో
ననకారుశోభనాట్యమాడే వనిలో
ఆటలాడేపూల
పాటపాడే తుమ్మెదల
చూడమంటున్నాయి కొమ్మలు
            తోటమాలీ తలుపు తెరవవోయి!
            నీతోటలోని కొమ్మలు నన్నేపిలుస్తున్నాయి!
అవి వనినేత్రాలా
దివిలోని తారకలా
ఆనందం చిమ్మేగొట్టాలా
నీతోటలోని అందాల విరులు
              తోటమాలీ తలుపుతెరవవోయి!
              నీతోట ప్రతిపూవునన్నేపిలుస్తున్నాయి!
విరితావుల మత్తెక్కి
ఆనందపు పిచ్చెత్తి
నన్నువోపాటపాడమని
స్వాగతం పలుకుతున్నాయి
              తలుపు తెరువు తోటమాలీ!
              నాపాలిటి వనమాలీ!
శాద్వల శ్యామల భూతలస్వర్గం
కాదిది అపరిదివితలస్వర్గం
తోటప్రక్కలవెళ్ళే వారికేం తెలుసు
కన్నెత్తియైనా ఇటు చూడరు
ఏపూలు విరిశాయో వారికేం తెలుసు
                తోటమాలీ తలుపు తెరవవోయీ!
                తోటమాలీ తలుపు తెరవవోయీ!
హాసవిలాస సుఖాల జీవించి
తుదకా సుఖాల్లోనే నశించే
ఆనంద రూపాలీ విరులు
వీని చావుకేమీ బ్రతుకేమీ
             నేనూ వీటి నవ్వుల నేర్వడానికే వచ్చా
             నింత దూరం ఆ పువ్వుల నవ్వుల నన్ను
             నేర్వనీ తోటమాలీ తలుపు తెరవవోయీ!
తోటమాలీ తలుపు తెరవవోయీ!
వనమాలీ తలుపు తెరవవోయీ!
ఆ పూలు నన్ను పిలుస్తున్నాయి.

Friday, December 1, 2017

భయము లేనిది ఏది?


భయము లేనిది ఏది?




సాహితీమిత్రులారా!



భర్తృహరి వైరాగ్యశతకంలోని
ఈ శ్లోకం భయం లేనిదేదో చెబుతుంది
చూడండి-

భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలా ద్భయం,
మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయా భయమ్,
శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాన్తా ద్భయం,
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమే వాభయమ్


భోగాలనుభవిస్తున్నా మనే తృప్తి మిగలకుండా రోగాలోస్తాయేమోనని
రోగభయం, మంచి కులంలో పుట్టామని తృప్తి పడటానికి ఏం తప్పు
జరిగినా కులానికి అప్రతిష్ట వస్తుందేమోనని భయం, బాగా డబ్బు (ఐశ్వర్యం)
ఉన్నదిలే అని ఆనందపడితే రాజు ఆ ధనాన్ని కైంకర్యం చేస్తాడేమోనని భయం,
మానశౌర్యం చేత విర్రవీగే వీలు లేకుండా అనుక్షణం ఎప్పుడు ఏం జరుగుతుందోననే
భయం, సౌందర్యం ఉందనుకుంటే ముసలితనం వస్తుందనే భయం, శాస్త్ర విజ్ఞానం
వుందంటే ప్రతివాదులతో వాదనా భయం, మంచి శరీరం వుందంటే దీనికి ఎప్పుడు
యముని బాధ కలుగుతుందోనని భయం ఇలా ప్రతిదానికి ఏదో ఒక విఘాతం ఉందికాని భయంలేనిది ఒక్క వైరాగ్యానికే - అని శ్లోకభావం