Sunday, January 3, 2021

భగవంతుడు ఎక్కడ లేడు?

 భగవంతుడు ఎక్కడ లేడు?




సాహితీమిత్రులారా!



భగవంతుడు సర్వవ్యాపి కదా!

ఈ పద్యంలో

కాసుల పురుషోత్తమకవి 

భగవంతుడు లేడనికదా!

వారు ఆవిధంగా ప్రవర్తించింది మనకు 

ఏవిధంగా చెప్పాడో చూడండి-


అచట లేవని కదా! యరచేత జఱచె గ్రు

                        ద్ధత సభస్తంభంబు దానవేంద్రు

డచట లేవనికదా! యస్త్రరాజం బేసె

                        గురుసుతుం డుత్తోదరము నందు

నచటలేవనికదా! యతికోపి ననిచె పాం

                        డవులున్న వనికి గౌరవకులేంద్రు

డచటలేవనికదా! యాత్మీయసభను ద్రౌ

                        పదివల్వ లూడ్చె సర్పధ్వజుండు

లేక యచ్చోటులను గల్గలేదె ముందు

కలవు కేవల మిచ్చోట గల్గు టరుదె

చిత్రచిత్ర ప్రభావ!  దాక్షిణ్యభావ!

హతవిమతజీవ!  శ్రీకాకుళాంధ్రదేవ!

                                                        (ఆంధ్రనాయక శతకము -9)

బహు విచిత్రమైన మహిమకలవాడా!

దయాభావం కలవాడా!

శత్రుసంహరకుడా!

శ్రీకాకుళం అనే క్షేత్రంలో వెలసిన

ఆంధ్రనాయకుడను పేరుగల విష్ణుమూర్తీ !


స్తంభంలో ఉండవని హిరణ్యకశిపుడు

స్తంభాన్ని అరచేతితో కొట్టాడు.


ఉత్తర గర్భంలో ఉండవని బ్రహ్మాస్త్రాన్ని

అశ్వత్థామ ఉత్తర కడుపులోని శిశువుపై

ప్రయోగించాడు.


అడవిలో ఉండవని కోపిష్ఠియైన దూర్వాసుని

పాండవుల వద్దకు పంపాడు దుర్యోధనుడు.


సభలో ఉండవని ద్రౌపది వస్త్రాలను

లాగించాడు సుయోధనుడు.


మొదట అక్కడ  లేకపోయినా స్తంభాదుల్లో

నీవు సాక్షాత్కరించావు.

మరి ఈ శ్రీకాకుళం గుడిలో

మొదటినుండి వెలసి ఉన్నావు

ఇక్కడ కనిపించడంలో ఆశ్చర్యం

కానేకాదు -  అని భావం.

No comments:

Post a Comment