Wednesday, September 18, 2019

పోగొట్టుకునేవి కొన్ని (ఏ వరసా లేకుండా)


పోగొట్టుకునేవి కొన్ని (ఏ వరసా లేకుండా)




సాహితీమిత్రులారా!

కీసూ, పర్సూ వంటివి

“ఇక్కడే పెట్టాను. ఇంతలో ఏమై పోతుంది?” ఆమెపై చికాకు పడతావు. “నాకేం తెలుసు?” ఒకవైపు సమయం ముంచుకొస్తుంటుంది. వస్తువుల్ని అటూ ఇటూ పక్కకి తోసేస్తూ, విసుగు ఎక్కువయితే విసిరేస్తూ వెతుకుతావు. వాదన ఇంకొంచెం పెరుగుతుంది. నిజానికి మీరు గొడవ పడుతున్నది వేరే విషయంపై అని మీకిద్దరికీ తెలుసు. కీసూ, పర్సూ వంటివి చాలాసార్లు దొరుకుతాయి. అప్పటికి అక్కసు చల్లబడుతుంది. పడకపోతే మరేదయినా చిన్న విషయం దొరుకుతుంది.

జ్ఞాపకం

అన్నిటినీ ఒకేసారి ఎల్లప్పటికీ గట్టిగా పట్టుకుని ఉండలేవు కనక ఏదో ఒకటి జారిపోతూనే ఉంటుంది. కానీ పోయినప్పుడు పోయిందని తెలియనందువల్ల నువు బాధ పడవు. అకస్మాత్తుగా ఏ సాయంత్రమో వానలో చిక్కుకు పోయినప్పుడో, మసకవెలుతురులో అకారణంగా ఎవరో నవ్వినప్పుడో అది దొరికిపోతుంది. “ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది!” అంత అందమైన దాన్ని, మళ్లీ ఎప్పటికీ కలగని అనుభవాన్ని ఎలా మర్చిపోయావో అని దిగులు పట్టుకుంటుంది. అప్పటికి ఇంకోటేదో పోయే ఉంటుంది.

ఊరూ, ఉనికీ

నీ చుట్టూ ఒకరికొకరు సాయం చేసుకునే నీవారంతా ఉంటారు. పెళ్ళి వేడుకల్లో ఆదమరిచి నృత్యం చేస్తుంటావు. ఒడిదుడుకులున్నా నిబ్బరంగా సాగిపోతుంటాయన్నీ. కొన్ని విలువలుంటాయి. ఎదగడానికో దారీ, గుర్తించడానికో వ్యవస్థా ఉంటాయి. ఉన్నట్టుండి యుద్ధం వంటి విపత్తేదో మీద పడుతుంది. నువు చూస్తూండగానే నీ కుటుంబమూ, నీ ఊరూ ఛిన్నాభిన్నమవుతాయి. నీకు ఏమీకాని నువు ఎవరివీ కాని వేరే నేలపై కాందిశీకుడివై తిరుగుతూ నీ పిల్లల కోసమో, ఆ పూట రొట్టెముక్క కోసమో దేవులాడుతుంటావు. పోయిందేదీ తిరిగిరాబోదని వణికించే గాలి కటువుగా చెప్పే రాత్రుళ్లలో నీ ఊరివైపు తలపెట్టుకు పడుకుంటావు ఒకప్పటి కల కోసం.

పుస్తకం

అరుదయిన పుస్తకాన్ని మిత్రుడు చదివి ఇస్తానని పట్టుకెళతాడు. ఇస్తానిస్తాను అన్నవాడు మాట మార్చేస్తాడు. “నేను తీసుకు వెళ్లానా? గుర్తు లేదే!” తర్వాతెప్పుడో ఒక వాన సాయంత్రం వాళ్ల ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూచున్నప్పుడు వాళ్ల పిల్లాడు పడవ చేయమని తీసుకు వచ్చిన కాగితం ఆ పుస్తకం లోనిదే అని గ్రహించీ కత్తిపడవ చేసి వాడితో ఆడుకుంటావు. ఇంతకూ నువ్వా పుస్తకాన్ని చదవనే లేదు.

అవకాశం

ఎదురు చూడగా చూడగానో, అనుకోకుండానో ఎదురవుతుంది. “…ఒకటో తేదీన మీరు ఉద్యోగంలో చేరవలసి ఉంటుంది!” “ఇద్దరం కలిసి కొందాంరా!” “మనమో సారి మాట్లాడుకుందాం!” లేదా అటో, ఇటో తేల్చుకోవలసి వస్తుంది. కొంతసేపు తర్కమూ, ఉద్వేగమూ తగవులాడుకున్నాక నువు ఒకవైపు ఉండిపోతావు రెండో వైపు చూస్తూ. తర్వాత ఎప్పుడో నీ అవకాశాన్ని అందిపుచ్చుకున్న స్నేహితుడు కనిపించి తను పోగేసుకున్నదంతా చూపించుకున్నప్పుడో, ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త భర్తతో నవ్వుతూ సరసమాడుతూ కనిపించినప్పుడో ఊర్వశి బార్లో ఒక్కడివే మూలన టేబుల్ దగ్గర కూచుని తప్పతాగి తప్పు చేశానని కుమిలిపోతావు. అదే అవకాశం రెండోసారి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎట్లా పోగొట్టుకున్నావోనని తల్చుకుని ఇంకాస్త.

కుక్క పిల్ల

కాళ్లకు చుట్టుకుంటూ ఉంటేనో, పిల్లలు పేచీ పెడుతుంటేనో మీ ఇంటికి చేరిన నల్ల మచ్చల తెల్ల కుక్కపిల్ల నీకు చేరువవుతుంది. షరతుల్లేని ప్రేమ మీ మధ్య పెరిగాక ఒకరోజు అది ఎటో వెళ్లిపోతుంది. నువు పిచ్చాడిలా సందులూ గొందులూ పట్టుకు వెతుకుతావు. “సీజర్!” “లైకా!” పిల్లల కంటే నువ్వే ఎక్కువ బెంగ పెట్టుకుంటావు. నువు దాన్ని కనుక్కునేలోగా అదే నిన్ను వెతికి పట్టుకుంటుంది. మీదపడి నీ మొహం నాకుతుంది.

నిన్ను

నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. పని లోనో, ఏ పులి సవారి లోనో. ఒక దిగులు దిగుడుబావి లోనూ కావచ్చు. వెతక్కపోయినా చివరికి నీకు నువు దొరుకుతావు ఎప్పటికో అద్దంలో పైకి తేలి. “ఎవరు నువ్వు?” పోలిక పోల్చుకుంటూ అడుగుతావు. కొత్త నువ్వును నువ్వంత ఇష్టపడవు కూడాను. కానీ రాజీ పడడానికి ప్రయత్నిస్తావు. కొన్ని సమర్థనలూ, సంజాయిషీలూ సిద్ధం చేసుకుంటావు. “ఇదంతా నాకోసం కాదు!” “నువ్వయినా అదే చేసి ఉండేవాడివి!” ఇక కొత్త నువ్వు నువ్వవుతావు. ఎప్పటికీ దొరక్కపోతే ఏ పేచీ ఉండదు.

కలం లేక అటువంటిదేదయినా

చిన్నప్పుడు నువు క్లాస్ ఫస్ట్ వచ్చినప్ప్పుడు మీ నాన్న ఇచ్చిన పెన్ అది. మామూలుగా కనపడని రంగులూ డిజైనూ. నీకు ఆ పెన్ బాగా కలిసి వస్తుంది. దాంతో రాసిన ప్రతి పరీక్షా అనుకున్న దానికన్నా బాగా రాస్తావు. పరీక్ష రేపు అనగా ఆ పెన్ కనపడకుండా పోతుంది. నడిచిన దారికి అటూ ఇటూ వెతుకుతావు. ఇంట్లో వెతికిన చోట్లన్నీ మళ్లీ మళ్లీ వెతుకుతావు. అంతకుముందు భద్రంగా దాచి మర్చిపోయిందేదో దొరుకుతుంది. దురదృష్టవంతుడివయితే ఇంట్లో వారెవరో దాచిందీ, నీ కంటపడకూడనిదీ. పరీక్ష సరిగా రాయవు. ఇంట్లో తిడతారు. నెపం నీ లక్కీ పెన్ మీదకి తోసేస్తావు. లేదా పరీక్ష మామూలుగానే బాగా రాస్తావు. పెన్‌లో మహత్యమేదీ లేదనీ, అంతా నీ కృషేననీ తెలుసుకుంటావు పెన్ పోయిన దిగులు ఉన్నా.

అర్థం, సారం, లక్ష్యం

అన్ని రంగులూ, రుచులూ, వాసనలూ నకిలీవని తేలుతుంది. మనుషులందరూ డొల్లగా కనిపిస్తారు. ఎవరి పని వాళ్లు చేయవలసి ఉంటుంది కాబట్టి చేస్తున్నట్టుంటుంది కానీ అందరూ, అన్నీ నటిస్తున్నట్టూ, ఒకప్పటి తమ నీడలుగా మాత్రమే మిగిలినట్టూ తోస్తుంది. జీవితాన్ని నీకు ఎవరో బలవంతంగానో, మోసం చేసో అంటగట్టినట్టుంటుంది. అది నువు ఆశించింది కాదు. నీకు బయటికి దారీ కనబడదు.

మనుషులు

మరి కొంతసేపటికి బూడిద కాబోయే ఆమె చేతిని పట్టుకుని మరో చేత్తో నిమురుతూ కూచుంటావు పక్కనే కూచుని. “మీ మామయ్య వచ్చాడా?” ఊళ్ళోనే ఉండీ పదేళ్లుగా మీ ఇంటి వైపు చూడని మనిషి చివరి చూపుగానైనా వస్తాడేమోనని వాకిలివైపు చూస్తుంటావు. ఆనక వాళ్ల పోలికల కోసం నీ పిల్లల మొహాలను పట్టి పట్టి చూస్తావు. నెమ్మదిగా దూరంగా జరిగిపోయిన కొందరు అదాటున గుర్తు వస్తారు. “ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్లు?” వేరే మనుషులతో ఆ ఖాళీలని భర్తీ చేస్తావు. ఎవరెప్పుడెందుకెట్లాగో తెలియదు కానీ పోతారన్న విషయం తెలిసినా నిన్ను సిద్ధం చేసుకోలేవు.

పేరు

అన్నీ సక్రమంగా చేస్తావు. చలామణీలో ఉన్న రూల్స్ ప్రకారమే డబ్బో, అధికారమో, జ్ఞానమో పోగు చేసుకుని అందరి గౌరవమూ సంపాదిస్తావు. నలుగురికీ మేలు కలిగే పనులు చేసి ఆదర్శంగా నిలుస్తావు. అప్పుడొక రాత్రి ఏదో మైకం కమ్మి నీ స్నేహితుడి కూతురు చేయి పట్టుకుంటావు. “ఆ అమ్మాయికీ ఇష్టమేననుకున్నాను!” “తనే రెచ్చగొట్టింది!” కానీ అందరికీ నువు కామాంధుడిగా గుర్తుండిపోతావు. ఎప్పటికయినా దాన్ని మర్చిపోతారని ఓపిగ్గా ఎదురు చూస్తుంటావు. ఒకవేళ నువు దాన్నుండి తప్పించుకుంటే ఎప్పుడో నీ కూతురు ఎవరితోనో ప్రేమలో పడిపోతుంది. నీ పేరు పోకుండా ఉండడానికి ఆ పిల్లనో, పిల్లాడినో, ఇద్దరినో చంపుతావు లేదా చంపిస్తావు. నువు కోరని పేరేదో దొరుకుతుంది నీకు.

అమాయకత్వం

పక్కింటి పోలీస్ మీనాన్న మీద పోట్లాటకొచ్చినప్పుడు మీనాన్న నువ్వనుకున్నట్టు సూపర్ మేన్ కాదని తెలుస్తుంది. శిక్ష తప్పించుకోవడానికి నువు చెప్పిన అబద్ధాన్ని అందరూ నమ్ముతారు. తప్పని తెలిసినా ఆ విజయం థ్రిల్ ఇస్తుంది. అన్న మీద చాడీలు చెప్పకుండా ఉండడానికి నీకు లంచం దక్కుతుంది. బ్లాక్ మెయిలింగ్ అలవాటు చేసుకుంటావు. అవి పెద్దవాళ్లకు తెలిసినా నవ్వుకుంటారు కనక వీటివల్ల ప్రమాదమేదీ లేదని తెలుసుకుంటావు. “ఇవాళ మా వాడేం చేశాడో తెలుసా!” అంచెలంచెలుగా అందరినీ మాయ చేయడం అలవాటవుతుంది. అప్పుడప్పుడూ నిన్ను కూడా. మధ్యలో ఎప్పుడో చేతులూపగానే గాల్లోకి ఎగిరినట్టు వచ్చే కలలు ఇక రావడం మానేస్తాయి.

నగలూ, డబ్బూ, ఆస్తులూ వగైరా

ఏ ఎరకో వలలో పడతావు. “రెట్టింపు వడ్డీ!” “ఈ సారి ఎకరం పందెం!” దురాశ నిన్ను నిలవనీయదు. నువు పక్కవాడి ఆస్తి మీద కన్నేసినప్పుడే ఇంకొకడు నీ ఇంటికి కన్నమేస్తాడు. లేదా తోబుట్టువే కాజేస్తాడు. పోయింది పోగా దాని కోసం చింతలో మునిగి మరిన్ని రోజులూ, మనశ్శాంతీ, ఆరోగ్యమూ కూడా పోగొట్టుకుంటావు.

దయా, జాలీ మొదలయినవి

“వై డూ దే హేవ్ టు బెగ్?” తన పాకెట్ మనీతో తనకు నచ్చిన బొమ్మ కొనుక్కోడానికి నీతో బయలుదేరిన పాప దారిలో ముసలి బిచ్చగాడికి ఆ డబ్బంతా ఇచ్చేయడం చూసినప్పుడో, వానలో ఇంటి ముందు చెట్టు కింద చిక్కుకుపోయిన పనివాళ్లను ఆమె ఇంట్లోకి పిలిచి ఉన్నదేదో వాళ్లకు తినడానికి పెట్టినప్పుడో, పనయ్యాక దొంగనోటు ఇచ్చి తిరిగి మురికినోట్ల చిల్లర తీసుకునేప్పుడో తడుతుంది నీకు ఏవేం పోయాయో. కానీ వాటి వల్ల సమయమూ, శ్రమా దండగ అని తెలిసిపోతుంది అప్పటికే. ముఖ్యంగా డబ్బులు ఆదా అవుతాయని. కనీసం నీ చలికాలాన్ని వెచ్చగానూ, వేసవిని చల్లగానూ ఉంచేందుకు సరిపోయేంతయినా.

లోకం

నువ్వేది ఎంతగా కోరుకుంటావో దాన్ని నీకు చెందకుండా చేయడానికి విశ్వమంతా అంత కుట్రా పన్నుతుంది ఇంకెవరి మీదా లేని పగ నీ మీదే ఉన్నట్టు. అందరూ నిన్ను పట్టించుకోకపోవడమో, వదిలేయడమో, వెలివేయడమో జరిగాక నీకు నువ్వే మిగులుతావు. అది తప్పితే నెమ్మదిగా ముదిమితనపు మతిమరుపు మొదలవుతుంది. “నేను తాతయ్యా నేను!” కొంతకాలానికి నువ్వెవరినీ గుర్తు పట్టలేవు. ఆపై కొన్నాళ్లకు ఎవరూ నిన్ను గుర్తు పట్టలేరు.

నమ్మకం

నువ్వింకాస్త ఉన్నతంగా బతకాలనుకుంటావు. నీకు దారి చూపే గురువు దొరుకుతాడు తర్కమూ జ్ఞానమూ కలగలిపి కొత్త వెలుగులు ప్రసరిస్తూ. నువు ఆరాధిస్తుంటావు ఆయన్ని. అనుకోకుండా ఒక మధ్యాహ్నం ఆయన లాగిపెట్టి వాళ్ల ఆవిడని చెంపదెబ్బ కొట్టడం నీ కళ్లబడుతుంది. నీకిక ఎవరిని నమ్మాలో తెలియదు. అయినా ఇంకొకరిపై ఇంకో నమ్మకం పెట్టుకుంటావు ఎప్పుడో దాన్నీ పోగొట్టుకోడానికే. నిన్నూ ఇంట్లో ఎవరూ నమ్మరు. మానేస్తానని ఇచ్చిన మాటే మళ్లీ మళ్లీ ఇస్తావు. తప్పతాగి ఇంటికి వస్తావు. “మీరెవరూ ఎటూ నమ్మడం లేదుగా!” దారి మధ్యలో నీవల్ల ప్రమాదమేదీ లేదనీ, చీకట్లో తోడుగా నడుస్తాననీ చెప్పడానికి ఆ ఆమ్మాయి వెనకే వేగంగా నడుస్తుంటే ఆ అమ్మాయి ఎందుకు పరుగెత్తిపోయిందోనని ఆలోచిస్తూ పడుకుంటావు. లేదా నీ చివరి రోజుల్లో నువు జీవితకాలం నమ్మిన దేవుడు అబద్ధమనో, సిద్ధాంతం తప్పనో నీకనిపిస్తుంది.

స్నేహమూ, ప్రేమా ఇంకా కొన్ని

నీ ఆప్తమిత్రుడికి ఇంకో పరిచయస్తుడిని పరిచయం చేస్తావు. వాళ్లిద్దరూ నీకు చెప్పకుండా ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళతారు. “నువు ఈ మధ్య బిజీగా ఉంటున్నానన్నావుగా!” వాళ్లిద్దరూ అన్నిటికీ నిన్నొదిలేసి వెళుతూన్నారని ఆలస్యంగా తెలుస్తుంది. లేదా నీమీద మిత్రుడికెవరో చాడీలు చెప్తారు. లేదా తీసుకోవడమే కానీ ఇవ్వడం ఎరగని స్నేహమది అని నీకే తోస్తుంది. ఉన్నట్టుండి నీతో మాట్లాడడం మానేస్తుంది ప్రియురాలు. అలక తీర్చడానికి ఆమెకి ఇష్టమైనదేదో ఊరంతా వెతికి వెతికి కొని తీసుకు వెళతావు. తిరుగు బహుమతిగా తన పెళ్లి శుభలేఖ ఇస్తుంది. “ప్లీజ్! నన్ను వదిలేయి!” అనువుగా వాన పడుతుంటే నువు తడుస్తూ కరువు తీరా ఏడుస్తావు. ఎప్పటికో లోపల్లోపలే ఏడవడం అలవాటవుతుంది. అదృష్టవంతుడివయితే ఈలోగా ఇంకోటేదో దొరుకుతుంది లేదా పోతుంది.

సమయం

అంత తొందరగా ఎలా గడిచిపోయిందో నీకు తెలియదు. లెక్క చూస్తే ఏం మిగలదు. ఒక్క జ్ఞాపకం కూడా.

ప్రాణం

చిట్టచివరికి దీన్ని పోగొట్టుకుంటావు. పోతుందని అప్పటిదాకా భీతిల్లినా, పోయాక పోయిందని నీకు తెలియదు కనక దిగులేమీ ఉండదు.
--------------------------------------------
రచన: చంద్ర కన్నెగంటి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment