Friday, October 12, 2018

ఆహవి(అనువాదకథ)


ఆహవి(అనువాదకథ)




సాహితీమిత్రులారా!


ఈ అనువాదకథను ఆస్వాదించండి...............

ఏదో అడవి జంతువు వెంటపడుతున్నట్టు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది ఆహవి. ఆమెకు పదేళ్ళుంటాయి. ఆమెతోపాటు గాలికూడా రయ్యిమని లోపలికి దూరింది. పుస్తకాల సంచిని విసిరేసింది. దేన్నో వెతుకుతున్నట్టు అటూ ఇటూ చూసింది. పది మైళ్ళదూరం పరుగుతీసినట్టు రొప్పుతోంది.

అమ్మ వంటగదినుండి తొంగిచూసింది. ప్రతి శుక్రవారమూ జరిగే తంతే ఇది. బడినుండి వచ్చేప్పుడే పేచీ పెట్టుకోడానికి ఏదో ఒక కారణంతో వస్తుంది. అఖిల ఒంటరిగా కెనడాకి శరణార్థిగా వచ్చినప్పుడు నాలుగు నెలల చూలాలు. ఐదునెల్ల తర్వాత ఆహవి పుట్టింది. అమ్మే ఆహవికున్న ప్రపంచం. ఒడిలో పడుకుంటే అఖిల ఆమె తల నిమిరింది.

“నిమరకు. గట్టిగా రెండు చేతులతో నొక్కు!” కయ్యిమంది. తల్లి కూతురి తలను రెండు చేతులతో అదిమింది.

“సరే, ఇక నీ కాకమ్మ కబుర్లతో నా బుర్ర నింపు…” అంది. ఇంత ఆవేశంగానూ కోపంగానూ ఆహవి ఇదివరకు ఎప్పుడూ మాట్లాడలేదు.

అఖిలకి కూతుర్ని ఎలా మంచి చేసుకోవాలో తెలుసు. “ముందు నువ్వు తిను. తర్వాత నేను అబద్ధాలు చెప్పినట్టు ఎవరు చెప్పారో అది చెప్పు.”

“బక్కపీనుగ మైక్‌గాడు చెప్పాడు.”

“వాడికెలా తెలుసు?”

“వాడికి అన్నీ తెలుసు. వాడికి ఇద్దరు నాన్నలు. ఇద్దరూ విమానాలు నడిపేవాళ్ళే!”

“విమానం నడిపేవాళ్ళైతే వాళ్ళకి అన్నీ తెలుసా ఏంటి? ఇంకేం చెప్పాడో చెప్పు,”

“మా నాన్న వదిలేసి పోయాడట…”

“దానికి నువ్వేమన్నావు?”

“గాడిద పళ్ళోడా! ఉడత ముక్కోడా! అని తిట్టాను.”

“ఎందుకలా తిట్టావు?” తల్లి ప్రశ్నించింది.

“అంతకంటే ఎక్కువగా తిట్టడానికి నాకు బూతులు రావు.” నొచ్చుకుంది ఆహవి.

“దానికి వాడేమన్నాడు?”

“మీ అమ్మ నిన్ను పడేసి బొడ్డుపేగుని దాచుకునుండొచ్చు అన్నాడు.”

“అవునా? నువ్వేమన్నావు?”

“నువ్వే చూడటానికి బొడ్డుపేగులా ఉన్నావు. మీ అమ్మ అదే చేసిందేమో అన్నాను,” అంది ఆహవి.

“ఆ పైన?”

“అప్పుడు గంట కొట్టేశారు.” అంది ఆహవి.

శుక్రవారం రాత్రులంటే ఆహవికి నచ్చవు. అఖిలకి కూడా చిరాకే. తను ఉద్యోగం చేసే కంపెనీలో వారానికి నాలుగు రోజులు పగలు ఉద్యోగం. శుక్రవారం మాత్రం రాత్రి ఉద్యోగం. రాత్రంతా మేలుకుని ఎక్స్‌పోర్ట్ చెయ్యాల్సిన వస్తువులను పెట్టెల్లో సర్దిపెట్టాలి. శనివారం పొద్దున్నే వాటిని తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి. శుక్రవారం రాత్రుల్లో ఆహవికి తొందరగా అన్నం పెట్టి పడుకోమని చెప్పి పనికి వెళ్ళిపోతుంది అఖిల. టీవీ చూస్తూనే అలా మంచం మీద వాలిపోయి నిద్రపోతుంది ఆహవి. పొద్దున్నే లేచే సమయానికి అమ్మ పక్కన ఉంటుంది.

ఆహవి చదువుకునే బడిలో ఐదు రకాల పిల్లలు చదువుతారు. ఇద్దరు తల్లులున్న పిల్లలు. ఇద్దరు తండ్రులున్న పిల్లలు. అమ్మ, నాన్న ఇద్దరూ ఉన్న పిల్లలు. ఒంటరి తండ్రితో ఉండే పిల్లలు. ఒంటరి అమ్మతో ఉండే పిల్లలు. ఇద్దరు తల్లులు, తండ్రులు ఉన్న పిల్లలు గొప్పలు పోతుంటారు. ఒంటరి తల్లులున్న పిల్లల్ని గేలి చెయ్యడం, ఆటపట్టించడం- మీ నాన్న ఎక్కడ? లేచిపోయాడా? అని. వాళ్ళకి అలా ఏడిపించడం సరదా.

“మా నాన్నేడి?” అని ఆహవి తన తల్లి మీద ఎప్పుడూ విరుచుకుపడుతూ వుంటుంది. కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.

ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు వంద పెన్సిళ్ళు పోగొట్టుకొచ్చింది. అడిగితే ‘పోయింది’ అని అరుస్తుంది. తనతో చదివే పిల్లలందరూ ఇలానే పోగొడుతున్నారా?

“పెన్సిల్ ఎక్కడే?” అడిగింది అఖిల

“పోయింది,” అంది.

“ఎక్కడ పోగొట్టావు?”

“పెన్సిల్ ఏమైనా నాకు చెప్పా పోతుంది? ఎలానో పోయింది.”

“అదెలా పోతుంది రోజుకొక పెన్సిల్? నీకు పెన్సిళ్ళు కొనే నేను పేదరాల్ని ఐపోయేలా ఉన్నాను!”

“ఇప్పుడేమైనా మనం కోటీశ్వరులమా?”

“మాటకు మాట ఎదురు మాటాడకు. నేనొక్కదాన్నీ రాత్రింబవళ్ళు కష్టపడి సంపాయిస్తున్నాను. నీకు వంట చేసి పెడుతున్నాను. నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. కొంచం బాధ్యత తెలుసుకుని నడుచుకో. చెప్పేది అర్థమవుతోందా?”

“నువ్వు చెప్పినవాటిల్లో ఏ పదానికి నిఘంటువు చూసి అర్థం తెలుసుకోవాలో చెప్పావంటే అప్పుడు అర్థమవుతుంది!”

ఇడియప్పానికి కలిపిన పిండిని కొంచం తీసుకుని ఉండగా ఒకచేత్తో పిసుకుతూ టేబుల్ కింద కూర్చుని కథల పుస్తకం చదువుతోంది ఆహవి. ఆ ఒక్క చోటే ఆమెకు తల్లి తొందర ఉండదు. చాలా సమయం పట్టే కొత్త అల్పాహారాన్ని తయారుచేసి టేబిల్ కిందున్న కూతురి చేతికి అందించింది అఖిల. దాని రంగునీ ఆకారాన్నీ చూసి ఆహవి ‘వద్దు’ అనేసింది.

“తిని చూడు నచ్చుతుంది,” అంది అఖిల.

“నువ్వు చేసేవి ఏవీ బాగోవు!”

“నువ్వు రానురాను అన్యాయంగా తయారవుతున్నావే! చిన్నపిల్లగా ఉన్నప్పుడే నయం, ఏం పెట్టినా తినేదానివి.”

“అప్పుడేం తినేదాన్ని?”

“నన్ను తినేదానివి!” అంది అఖిల.

అది విని పడిపడి నవ్వింది కూతురు. టేబుల్ కిందనుండి బయటికొచ్చి తల్లి చుట్టూ చక్కర్లుకొడుతూ, “నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మ! నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మ…” అంటోంది. అఖిలకీ నవ్వొచ్చింది. ఆహవితో తర్కించడం అసాధ్యం. మాటలకి తడుముకోదసలు. నోరు తెరిస్తే చాలు, చమత్కారం అలా వచ్చిపడుతూనే ఉంటుంది.

ఇంత తెలివితేటలున్న పిల్ల రోజూ పెన్సిళ్ళెందుకు పోగొడుతోంది? అఖిలకి అంతు చిక్కలేదు. ఆమె స్కూల్ టీచర్ కూడా ‘ఈ పిల్ల కావాలనే పోగొడుతుంది!’ అంది. తనతో చదివే పిల్లలకి కూడా ఈ పెన్సిళ్ళు మాయమయ్యే మర్మం అంతుచిక్కలేదు. కూతుర్ని ఒక సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్ళింది. డాక్టర్ ఇద్దర్నీ కొన్ని ప్రశ్నలడిగాడు. తర్వాత పాపతో ఏకాంతంగా మాట్లాడాడు.

“ఆహవి మనసులోపల తీరని వెలితి ఉంది. దాన్ని పూరించడానికి ప్రయత్నించండి.” అన్నాడు డాక్టర్. అప్పుడనిపించింది అఖిలకి, నాన్నలేని లోటే తనకున్న వెలితైయుండచ్చు అని.

సిల్వియాకి ఫోన్ చేసింది. అఖిలతో కలిసి చదువుకున్న స్నేహితురాలు ఆమె. మీడియాలో దర్యాప్తు కథనాలవీ కవర్ చేస్తుంటుంది. కొలంబోలో ప్రసిద్ధ జర్నలిస్ట్. మాంగుళంలో అఖిలవాళ్ళమ్మ చనిపోయినప్పుడు యుద్ధవాతావరణం నెలకొని ఉండటంతో అంత్యక్రియలవీ సిల్వియా సాయంతోనే నెరవేర్చగలిగింది. జరిగినవన్నీ సిల్వియాకు తెలుసు. రాత్రికి రాత్రి తప్పించుకుని వచ్చిన అఖిలని కొలంబోలో తనతోబాటు ఉంచుకుని, దొంగ పాస్‌పోర్ట్ ఇప్పించి, కెనడా రావడానికి సాయంచేసింది. ఆమెతో ఇప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు,

“పేరు తెలుసా?” అడిగింది.

అఖిల చెప్పింది.

“ఎలా తెలుసు?”

“వాళ్ళు మాట్లాడుకున్నారు.”

“ఇంకేమైనా వివరాలు తెలుసా?”

“కమేండో డివిజన్ మేజర్ జయనాథ్ ఆద్వర్యంలో ముట్టడి చేశారు.”

“ఇది చాలు. కనుక్కుంటాను.” అని ధైర్యం చెప్పింది సిల్వియా.

రెండు నెలల తర్వాత అర్ధరాత్రి సిల్వియా దగ్గరనుండి ఫోన్ వచ్చింది. “వెంటనే బయలుదేరు, కనిపెట్టేశాను!” అంది. సిల్వియా అడ్రస్ చెప్తుండగా న్యూస్ పేపర్ మీద రాసుకుంది. రెండు రోజుల్లో బయల్దేరుతామని చెప్పింది అఖిల. “ఎంత తొందరగా వస్తే అంత మంచిది. రెండు నెలలుగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఫలితం ఈ వివరాలు. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు. వెంటనే రా!” అంది సిల్వియా.

జూలై 9, 2010 శుక్రవారం అఖిల తన కూతురితో కొలంబోలో దిగింది. మినువాంగొడ కొలంబోనుండి 35 కిలోమీటర్ల దూరం. అక్కడనుండి ఉడుగంపొల అనే గ్రామానికి వెళ్ళాలి. అవన్నీ పూర్తిగా సింహళులు నివసించే ప్రాంతాలు కావడంతో అఖిలకి కొంచం బెరుకు ఉండింది. సిల్వియా నవ్వింది. “గుర్తుందా? నువ్వు కెనడా వెళ్ళేప్పుడుకూడా ఇలానే భయపడి చచ్చావు. నేను చెప్పాను–రెండువేల ఏళ్ళ క్రితం ఏసుని కనడానికి మేరీమాత పది రోజులు గాడిదల మీద ప్రయాణించలేదా? నువ్వు విమానంలోనే కదా ఎగరబోతున్నావు! ఎందుకింత భయపడుతున్నావు? అని. ఇప్పుడు చూడు, యుద్ధం లేదు. ఒక గంట ప్రయాణమే. నిర్భయంగా వెళ్ళి రా. నాకు తెలిసిన ఆటో అతన్ని ఏర్పాటు చేశాను.” అంది సిల్వియా.

ఆహవి ఆటోని చూడటం ఇప్పుడే. దానిలో ప్రయాణం అనగానే ఆమెకి పట్టలేనంత కుతూహలం! తల బయటకి పెట్టి వేడుక చూసింది. ఆకాశానికేసి చూసింది. ఇంత నిర్మలమైన నీలవర్ణపు ఆకాశాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. ఇంత వెలుతురు కూడా కొత్తే ఆమెకి. మినువాంగొడ దాటగానే తారు రోడ్డు మట్టి రోడ్డుగా మారింది. ఆటో కుదేయడం మొదలుపెట్టింది. ఆ కుదుపులకి ఆహవి తుళ్ళింత జతచేరింది. వీధుల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఆటోని వెంటాడాయి. రోడ్డు పక్కనే ఉన్న అరటి చెట్లకు పెద్దపెద్ద అరటి గెలలు వేలాడుతున్నాయి. చిన్న మూతి ఉన్న బాటిళ్ళ లోపల పెద్ద మామిడికాయలు చెట్లకి వేలాడుతున్నాయి. “ఇదెలా సాధ్యం?!” అడిగింది ఆహవి. “నీకన్నీ తెలుసంటావు కదా? ఆలోచించు…” అంది అఖిల. గిన్ని కోళ్ళను ఆహవి టేబుళ్ళ మీద చూసిందిగానీ ఇలా వీధుల్లో తిరగడం చూళ్ళేదు. చిన్న తలతో, పెద్ద శరీరంతో అవి మేత పొడుచుకుతింటూ అటూ ఇటూ నడవడం ఆశ్ఛర్యంతోబాటూ నవ్వూ తెప్పించాయి. ఆమె చిన్ని బుర్ర అన్ని ఆశ్చర్యాలను నింపుకోలేకపోయింది. ఉన్నట్టుంది, “అమ్మా, ఎక్కడికెళ్తున్నాము? అమ్మమ్మ వాళ్ళ బంధువుల ఇంటికా?” అనడిగింది.

“కొంచం ఆగు, ఎందుకంత తొందర? చెప్తాను. వెళ్ళేచోట తిన్నగా ప్రవర్తించు. అక్కడ నీ వంకర మాటలు ప్రదర్శించకు. నీ బుర్రని కాసేపు వాడకు. నీ పేరేమని ఎవరైనా అడిగితే ఒక మంచి కెనడా అమ్మాయిలా ఆహవి అని చెప్పు. పళ్ళికిలించుకుంటూ నిల్చోకు.”

“సరే, అలా బుద్ధిమంతురాలిగా నడుచుకుంటే నాకేమిస్తావు?”

“ఏమివ్వాలేంటీ? క్లాసులో మంచిపేరు తెచ్చుకుంటే గిఫ్ట్ అడగచ్చు. లేదా వంద మీటర్ల పరుగుపందెంలో నెగ్గితే ఏదైనా ఇవ్వచ్చు. తిన్నగా ఉండటానికి కూడా ఏదైనా ఇస్తారా?”

“ఓ దేవుడా! నా జీవితమే ముగిసిపోయింది. పదివేల మైళ్ళు ఎగిరివచ్చింది నా సత్ప్రవర్తనని ప్రదర్శించడానికా!”

“సరే సరే. ఇక ఆపు. ఇంక కొన్ని నిముషాలే! నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది.”

“నేను నమ్మను,” అంది ఆహవి.

“గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే రోజు. ఒకసారి అది మారాక మళ్ళీ గొంగళిపురుగుగా మారగలదా?”

“అదెలా మారుతుంది? సీతాకోకచిలుక సీతాకోకచిలుకే!”

“అదే. నీ జీవితంలోకూడా అలాంటొక సమయం ఇది.”

“నేను రూపు మారబోతున్నానా?”

“మట్టి బుర్ర!” అనొకసారి ముద్దుగా ఆహవి తలమీద మొటికేసింది తల్లి.

అఖిలకి కొంచం సింహళం వచ్చు. ఏం మాట్లాడాలన్నది మనసులో ఓ సారి ఆలోచించుకుంది. ఆ వీధిలో అన్నీ మూడు నాలుగు గదులున్న ఇళ్ళు. అన్నిటికీ పైకప్పుగా ఆస్బెస్టాస్ రేకులు. పూలచెట్లు మెండుగా నాటివున్నాయి. ఎక్కడ చూసినా బోగన్‌విలియా, గులాబీ, అంథూరియం, కార్నేషన్ పువ్వులు పూసివున్నాయి.

ఆటో డ్రైవర్ దార్లో వెళ్ళే ఒకతన్ని సిఱిబాలా గురించి విచారించాడు. అతను ఒక ఇంటిని చూపించాడు. ‘ఒక సాధారణమైన సిపాయి ఇల్లు ఇంత పెద్దదా!’ అని అఖిల మనసులోనే ఒకసారి ఆశ్చర్యపోయింది. డ్రైవర్‌ని వెయిట్ చెయ్యమని ఆహవి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఒక మహిళ వచ్చి తలుపు తీసింది. ఇంటిలో వేసుకునే దుస్తుల్లో ఉంది. 14 సైజ్ దేహాన్ని 12 సైజ్ దుస్తుల్లో కుదించినట్టు, దుస్తులు పిగిలిపోతాయా అన్నట్టు ఉంది ఆమె శరీరం. అయితే నవ్వు ముఖం. మెడలో లావుపాటి గొలుసులు. రెండు చేతులకీ మోచేతులదాకా గాజులు. వయసు ముప్పైకి లోపే ఉంటుంది.

“ఎవరు కావాలి?” అని అనుమానంగా అడిగింది.

“సిఱిబాలా…” అని అఖిల చెప్పగానే,

“ఆ! లోపలికి రండి,” అని సగం చిరునవ్వుతో ఆహ్వానించింది. నోటితో రమ్మని చెప్పినా మనసులో గాబరా ముఖంలో కనిపించింది.

“నా పేరు అఖిల. నేను కెనడా నుండి వస్తున్నాను. ఈమె నా కూతురి ఆహవి,” అంది.

ఆ ఇంటి ఆవిడకి ఏమీ అర్థంకాక దిగ్భ్రమ చెందినట్టు చూస్తూ ఉంది. చప్పుడు వినబడి లోపలనుండి ఓ పాప బయటికొచ్చింది. ఆ పాపను చూడగానే ఆహవికీ అఖిలకీ ఆశ్చర్యం! ఆహవిని అచ్చు గుద్దినట్టుంది. అదే ఎత్తు, అదే ఉంగరాల జుట్టు, అవే పొడవాటి కళ్ళు.

ఆ పాపని చూపించి, “మా కూతురు అసుందా. ఏమైనా తాగుతారా?” అనడిగింది ఇంటావిడ.

“నీళ్ళు మాత్రం…” అంది అఖిల.

“ఆయన లీవులో వచ్చివున్నారు. రెండు రోజుల్లో తిరిగెళ్ళిపోతారు. ఇప్పుడు సంతకెళ్ళారు. వచ్చేస్తారు,” అని చెప్పి వంటగది వైపుకెళ్ళింది.

ఆహవీ, ఆ ఇంటి పాపా ఒకరినొకరు ‘ఎంత వింతా!’ అన్నట్టు చూసుకున్నారు. సిఱిబాల ఇల్లాలు వంటగదినుండి నీళ్ళతో వెనుతిరిగిన సమయానికి సైకిల్ మీద వచ్చి దిగాడు సిఱిబాల. చేపలు, కాయగూరలు ఉన్న సంచుల్ని పట్టుకుని ఇంటి లోపలకి నవ్వుతూ అడుగులేశాడు. ఆ క్షణం తన జీవితం తల్లకిందులవ్వబోతోందని అతనికి తెలీదు.

అఖిల లేచి నిల్చుంది. అఖిలనీ ఆహవినీ చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఓ అడుగు వెనక్కేశాడు. ఆహవిని చూసి, తర్వాత తన కూతుర్ని చూశాడు. వాడికి ఏమీ అర్థం కాలేదు. వాడి భార్య బిత్తరపోయినట్టు చూస్తూ ఉంది. ఏదో చెడు తన జీవితంలోకి అడుగుపెట్టినట్టు తోచింది.

అఖిల సిఱిబాలని చూసింది. అదే ముఖం, అవే విరిగిన పళ్ళు. వాడి నవ్వు తల్లకిందులుగా కనిపించింది. ఏం చెప్పాలి, ఏం దాచాలి అన్నది ముందే నిర్ణయించుకుని పొడిపొడిగా మాట్లాడింది అఖిల.

“జెయసిక్కుఱు యుద్ధం జరుగుతున్న సమయం. 21 నవంబర్ 1997. శుక్రవారం. మాంగుళం. అర్ధరాత్రి ఒంటిగంట. మిలిటరీ వాహనంలో నువ్వు నీ జతగాడితో వచ్చి నా ఇంటి తలుపు పగలగొట్టావు. మా అమ్మ తల మీద నీ స్నేహితుడు తుపాకీతో కొట్టాడు… ఇది నీ కూతురు. పేరు ఆహవి. ఈమెకు తన తండ్రిని చూపించాలని కెనడానుండి వచ్చాను.”

సిఱిబాల భార్య దండెం మీంచి తడిచీర తెగిపడినట్టు నేలమీద దబ్బున పడిపోయింది. నీళ్ళ గ్లాసులు చెల్లాచెదురయ్యాయి. సిఱిబాల నోరు తెరచుకుని వణికిపోతూ నిల్చున్నాడు.

ఆహవిని చేయిపట్టి లాక్కుపోతూ అఖిల పరుగున వెళ్ళి ఆటోలో కూర్చుంది. డ్రైవర్ తలదువ్వుకుంటూ ఉన్నాడు. “తొందరగా… తొందరగా పోనివ్వు!” అంది అఖిల. ఆహవికి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నది ఏదీ అర్థంకాలేదు. ఏం జరిగిందన్నది ఆమె చిన్న బుర్రకి అంతుచిక్కలేదు. ఆటో కదలగానే ఏదో పెద్ద ఇబ్బందినుండి తప్పించుకుని పారిపోతున్నట్టు ఆహవికి తోచింది. అమ్మ ముఖానికేసి చూసింది. ఆవేశంలో చమటలు పోస్తున్న ఆ ముఖం మరెవరిదోలా అనిపించింది.

“నేను మంచిగా ప్రవర్తించానా? ఎవరది? నా పేరెందుకు సింహళంలో చెప్పలేదు?” అనడిగింది ఆహవి.

అఖిల కూతుర్ని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టింది. తర్వాత, “అతని పేరు సిఱిబాల. అతడే మీ నాన్న. అతని ముఖాన్ని గుర్తుపెట్టుకో. బుర్రలో నిలుపుకో. ఇదే చివరిసారి. ఇక నువ్వెప్పుడూ అతణ్ణి చూడబోవు.”

“అప్పుడు అసుంద? ఆమె తల్లి, తండ్రి ఎవరు?”

“ఈ రోజునుండి అసుంద ఒంటరి తల్లికి కూతురు”

“నాలాగా?”

“నీలాగే.”
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: ఎ. ముత్తులింగం, 
ఈమాట సౌజన్యంతో 

No comments:

Post a Comment