మన శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక
ఆయన నిర్యాణం తరువాత సముద్రంలో
మునిగిందని మనవారు చెబుతారు
ఆ ద్వారక ఇప్పుడు సముద్రంలో కనుగొనబడింది
దానిగురించిన డాక్యుమెంటరీ ఇక్కడ చూడగలరు-
భారతదేశంలోని దేవాలయాల గురించి
కొంత ఆసక్తి కరమైన సమాచారాన్ని
నేషనల్ జాగ్రఫి ఛానల్ వారు రూపొందించిన ది లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే
ఈ డాక్యుమెంటరీ చూడండి.
ఇందులో తంజావూరు బృహదీశ్వరాలయంపైకి
అంతబరువైన రాతిగోపురాలను ఎలా ఎక్కించారో
హంపిలోని సమాచారం ఖజురహో దేవాలయాన్ని
గురించి తాజ్ మహల్ గురించిన విషయాన్ని
మనం గమనించవచ్చు చూడండి-
మన శ్రీవేంకటేశ్వరులవారిని ప్రపంచప్రజలకు
పరిచయం చేసేందుకు నేషనల్ జాగ్రఫిక్ వారు "ఇన్ సైడ్ తిరుమల తిరుపతి" అనే పేరున డాక్యుమెంటరీ చేశారు. అందులో
మన తిరుమలను గురించి వారు ఏమి చెబుతున్నారో
చూడగలరు. ఇక్కడ మనం ఆ డాక్యుమెంటరీ
చూసి తెలుసుకుందాం-
కర్మసిద్ధాంతం మన హిందూధర్మంలోనే కాక జైనమత సాంప్రదాయంలోనూ ఉంది. ఇది వారికి చాల ముఖ్యమైనది. చేసిన కర్మలను బట్టి శుభాశుభ కర్మ ఫలాలను అనుభవించవలసి వస్తుంది. అదే జన్మలో కాకపోతే తరువాత జన్మలో అనుభవించాల్సి వస్తుంది. సత్కర్మలకు సత్ఫలం, దుష్కర్మలకు దుష్ఫలం తప్పదు. సర్వజ్ఞులైన తీర్థంకరులకు ముందుగానే అన్నీ తెలియవచ్చు. కర్మలు - ఘాటీయ కర్మలు(ఆత్మగుణాలను కలుషితం చేసే దుష్టకర్మలు), అఘాటీయకర్మలు అని రెండు విధాలు. ఆత్మకు సహజంగా సర్వజ్ఞత్వం, సర్వదర్శన శక్తి, పరమానందాన్ని అనుభవించే అవకాశం, సర్వశక్తిమంతత్వం ఉంటాయి. అయితే ఘాటీయ కర్మలు ఆత్మకు అవి లేకుండా చేస్తాయి. అవి 1. జ్ఞానా వరణీయ కర్మ ఆత్మకు సహజం ఉండే సర్వజ్ఞత్వ శక్తికి అడ్డువస్తుంది. 2. దర్శనావరణీయ కర్మ దేనినైనా చూడగల శక్తికి ఇది ప్రతి బంధకం కలిగిస్తుంది. 3. మోహనీయ కర్మ పరమానందాన్ని అనుభవించే శక్తికి ఈ కర్మలు గుదిబండలు అవుతాయి. 4. అంత్రాయ కర్మ ఇది ఆత్మ సర్వశక్తిమంతం కావడానికి ప్రతిబంధకం అఘాటియ కర్మలు - 4 1. వేదనీయ కర్మ- కష్టసుఖాలనే భావనలను కలిగిస్తుంది 2. నామకర్మ - జన్మించినపుడు ఏ విధమైన శరీరాన్ని ధరించాలో నిర్ణయిస్తుంది. 3. ఆయుకర్మ- ఆత్మ ఏ దేహధారణ చేస్తుందో ఆ దేహ ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తుంది 4. గోత్ర కర్మ - ఏ అంతస్తు కుటుంబంలో జన్మించాలో నిర్ణయించే కర్మ
మదం అనే మాట తరచు వింటుంటాం అంటే ఏమిటో? "ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చున్ " అంటుంటారు కదా! మదం అంటే కొవ్వు, పొగరు అని చెప్పవచ్చు. "శబ్దరత్నాకరం"(నిఘంటువు) ప్రకారం- మదము - క్రొవ్వు, ఏనుగు క్రొవ్వు, రేతస్సు, ఏనుగు రేతస్సు, కస్తూరి, గర్వము, సంతోషం అనే అర్థాలున్నాయి. ఇక్కడ మదం అనేది మూడు రకాలని త్రిమదములు అవి - 1. అన్నమదం, 2. ధనమదం, 3. కులమదం మరో రకంగా మదం 8 రకాలు అంటే అష్టమదములు అవి - 1. అన్నమదం, 2. అర్థమదం, 3. స్త్రీ మదం 4. విద్యామదం, 5. కులమదం, 6. రూపమదం, 7. ఉద్యోగమదం, 8. యౌవన మదం. ఇవి ఇలా ఉంటే గజమదం అనేది ఏనుగుకు శరీరంలో ఎనిమిది చోట్ల మదం(క్రొవ్వు/రేతస్సు) పుడుతుంది. 1. కన్నులలో పుట్టే మదం పేరు "సీధువు" 2. చెక్కిళ్ళలో పుట్టే మదం పేరు "దానం" 3. చెవులలో పుట్టే మదం పేరు "సాగరం" 4. తొండం చివరల పుట్టే మదం "శీకరం" 5. చనుమొనల వద్ద పుట్టే మదం పేరు "శిక్యం" 6. జననాంగాల వద్ద పుట్టే మదం పేరు "మదం" 7. గుండె సమీపంలో పుట్టే మదం పేరు "ఘర్మం" 8. కాళ్ళ వద్ద పుట్టే మదం పేరు "మేఘం" ఏనుగుకు ఇన్నిరకాల మదాలున్నాయి. ఈ విషయాలు యతులను గజారోహణం చేయించేవారికీ, ఏనుగులపై విగ్రహాలను ఊరేగించేవారికీ తెలిసివుండాలి అంటారు పెద్దలు.
కృష్ణయజుర్వేదానికి తైత్తిరీయమనే పేరు ఉంది. తిత్తిరి అంటే తీతువు పిట్ట. దీనికి సంబంధించిన ఒక కథ పూర్వులు చెప్పినది ఇక్కడ గమనిద్దాం. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మరాతుడు అనే మునికుమారుడు. యాజ్ఞవల్క్యుడు యజుర్వేదంలో దిట్ట అయిన వైశంపాయనుడు అనే ఋషి శిష్యుడు. ఒక సందర్భంలో అహంకారంతో మాట్లాడిన యాజ్ఞవల్క్యుని గురువుగారు కోపించి తనవద్ద నేర్చుకొన్న యజుర్వేదాన్ని కక్కమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. ఆ కక్కిన యజుర్గణం రక్తసిక్తమై ఉండగా తిత్తిరి పక్షులరూపంలో యజుర్గణ దేవతలు వచ్చి వాటిని తిన్నారు. అందుకని యజుర్వేదానికి అప్పటి నుండి తైత్తిరీయమనే పేరు వచ్చింది. వేదాలన్నీ పోగొట్టుకున్న తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. అప్పుడు సూర్యుడు వాజి(గుఱ్ఱం)రూపంలో వచ్చి యాజ్ఞవల్క్యునికి యజుర్గణాన్ని ఉపదేశించాడు. అప్పటి నుండి యజుర్వేద శాఖకు వాజసనేయ శాఖ అనే పేరు వచ్చింది అని ఐతిహ్యం.
మన హిందూసమాజంలో సన్యాసి అనే పదం సుపరిచితమైనదే. దీన్ని గురించి ఇంకెందుకు తెలుకోవడం అనే అనుమానం రావచ్చు. కానీ మనకు తెలిసిన విషయం స్వల్పం. అందుకే మరికొంత తెలుసుకుందాని ఇక్కడ చర్చించడం జరుగుతోంది. ఆశ్రమ ధర్మాల్లో సన్యాసం నాలుగవది. మొదటిది బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం. సన్యాస మనే ఈ పదాన్ని ఇంతకుపూర్వం సన్న్యాసం అని, సంన్యాసం అని వాడేవాళ్ళు. సన్యాసం అంటే వైరాగ్య భావనతోనో, అదే లక్ష్యంగానో సంసారిక జీవితాన్ని త్యజించివేయడం. వైరాగ్య తీవ్రతను బట్టి మంద వైరాగ్యం, తీవ్ర వైరాగ్యం, తీవ్రతర వైరాగ్యం అని మూడు విధాలుగా చెబుతారు. 1. గృహసంబంధమైన సమస్యలను తట్టుకోలేక సన్యసించటాన్ని మందవైరాగ్యం అంటారు. 2. దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణత్రయాన్ని వదలిన సన్యాసాన్ని తీవ్రవైరాగ్యం అంటారు. 3. కర్మకాండలలో చెప్పిన విధివిధానాలు ప్రయోజనరహితమని విడిచి పెట్టిన సన్యాసాన్ని తీవ్రతర వైరాగ్యమని అంటారు. ఈ విభజన కాకుండా సన్యాస తీవ్రతను బట్టి మరి రెండు రకాల విభజన వుంది. అందులో నాలుగు విధాలని, ఆరు విధాలని చెప్పబడుతున్నవి. మొదట నాలుగు విధాలైన వాటిని గమనిస్తే- 1. కుటీచకం, 2. బహూదకం, 3. హంస సన్యాసం, 4. పరమహంస సన్యాసం తీవ్ర వైరాగ్యం వల్ల తీసుకునే సన్యాసాలు మొదటి రెండు సన్యాసాలు. వాటిలో మొదటిది 1. కుటీచకం- 2. బహూదకం. తీవ్రతర వైరాగ్యం కలిగిన సన్యాసులు హంసలు, పరమహంసలు సంచారం చేసే శక్తిలేని సన్యాసి ఊరివెలుపలో, ఏదైనా ఒక నదీతీరంలోనో మఠం ఏర్పరచుకొని, కాషాయవస్త్రాలు దండ కమండలలాలు ధరించి స్వయంగా ఆహారాన్ని సంపాదించుకునే సన్యాసి కుటీచకుడు. పుణ్యతీర్థాలను, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ ఎక్కడా ఆరు రోజులకు ఎక్కువ కాకుండా గడుపుతూ సంచారం చేస్తుండే సన్యాసి బహూదకుడు. హంసలు ఆచార విహితమైన మార్గంలో సన్యాస వ్రతం కొనసాగిస్తారు. పరమహంసలు బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాసతో తీవ్ర సాధన చేస్తుంటారు. ఒక జీవిత కాలం సాధనలో కృతకృత్యులు కాలేని పరమహంసలు తిరిగి జన్మలు ఎత్తి సాధన కొనసాగించి గమ్యం చేరుతుంటారని ప్రతీతి. రెండవ విధానంలో పైన చెప్పిన నాలుగు విధాలే కాకుండా మరో రెండు విధాలున్నాయి. తురీయాతీత, అవధూత అనే వ్యవస్థలు. మరో విభజనప్రకారం 6 విధాలు ఇవే- 1. కర్మఫల సన్యాసం / కర్మసన్యాసం 2. వైరాగ్య సన్యాసం / జ్ఞాన సన్యాసం 3. ఆతుర సన్యాసం / క్రమ సన్యాసం 4. వివిదిషా సన్యాసం / విద్వత్సన్యాసం 5. కర్మైక దేశ సన్యాసం / పరమార్థ సన్యాసం 6. గౌణ సన్యాసం గౌణ సన్యాసంలో బ్రహ్మణేతరులు స్త్రీలు కూడ సన్యాసం తీసుకోవచ్చు. పురాణ కాలంలో బ్రహ్మణేతరులు సన్యాసం తీసుకోవడం ఉంది. ఉదాహరణకు విదురుడు ఇలా సన్యాసం తీసుకొన్నవాడే.