Thursday, July 25, 2019

దిష్టి


దిష్టి




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి..................
ఒక రచయితకి మూఢనమ్మకాలు వుండకూడదు కదా? దిష్టి తగిలిందనో, తగులుతుందనో ఎవరైనా అంటే, ఇదేం మూర్ఖత్వం అని ఖండించాలి. కామన్‌మేన్‌కీ రచయితకీ తేడా ఉంది కదా! చూడండి, నేనే ఇప్పుడు దిష్టి గురించి రాయాల్సొచ్చింది. మరిప్పుడు దీన్నేమనాలి? గ్రహబలం సరిగ్గా లేదనుకోవాలా, బ్యాడ్ టైమ్స్ నడుస్తున్నాయి అనుకోవాలా?

ఇదంతా 2017 డిసెంబర్ 18వ తారీకున తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైంది. ఎప్పట్లాగానే నాలుగు గంటలకు లేచి మేడమీంచి కిందికి దిగి వచ్చాను. పెరటి తలుపు తీస్తే పప్పు, జోరో లఘుశంక తీర్చుకోవడానికి పరుగెత్తుతాయి. లేవగానే నేను చెయ్యాల్సిన మొదటి పని అదే. అప్పుడు మేము ముదలియార్ వీధిలో ఉండేవాళ్ళం. ఇండిపెండెంట్ హౌస్. ఆ రోజు తలుపు తియ్యగానే పొట్ట లోపలికి అతుక్కుపోయి, బక్కచిక్కి, చూడగానే జాలి పుట్టేట్టున్న ఒక పిల్లిపిల్ల గుమ్మం దగ్గరే కనిపించింది. ఆకలితో కుయ్యి కుయ్యిమని నీరసంగా ఏడుస్తోంది. నెలరోజుల పిల్లయుంటుంది. క్యాట్ ఫుడ్ కొంచం తీసి పెట్టడమే ఆలస్యం… అబ్బబ్బా, మాటల్లో ఎలా చెప్పను! మ్మ్…మ్మ్… అని అరుస్తూ ఆ బౌల్ మీద పడిపోయి ఆవురావురుమంటూ తినేసింది. ఓ మై గాడ్! ఎన్ని జన్మలెత్తినా ఆ క్షణాలను మరిచిపోలేను. ఆకలేసిన ప్రాణికి అన్నమే దైవం. ఆహారమే పరమార్థం. అయితే ఆకలెయ్యాలి. ఛ! ఛ! ఆకలి అన్న మూడక్షరాల పదం తలుచుకోగానే లోపల కలిగే భావం గురించి కాదు నేను చెప్పేది. ఆహారం దొరుకుతుందన్న ఆనవాలు, నమ్మకం కూడా లేనప్పుడు పుట్టే ఆకలి. ఒక విమాన ప్రమాదాన్ని ఊహించుకోండి. మీరు మాత్రమే బ్రతికారు. ఆల్ప్స్ కొండల్లోనో, అమేజాన్ అడవుల్లోనో, లేదా ఒక నిర్మానుష్యమైన దీవిలోనో పడిపోయారు. అప్పుడు పుట్టే ఆకలి. చివరికి సాటి ప్రయాణికుడి శవాన్ని కొరుక్కొని తినగలిగే ఆకలి. అలాంటి ఆకలి గురించి చెప్తున్నాను.

ఆ పిల్లిపిల్ల తిని ఎన్ని రోజులైందో ఏమో. దాన్ని చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ రోజు నా పుట్టినరోజు. దేవుడు నాకెటువంటి బహుమతిని ఇచ్చేడో కదా అనుకున్నాను. కడుపు నిండేంతవరకు ఆత్రంగా తిని, ఆ తర్వాత కొంచం నెమ్మదినెమ్మదిగా తినసాగింది పిల్లిపిల్ల. అక్కడే కూర్చున్నాను. మొత్తం తినేశాక నా ఒడిలోకి ఎక్కి పడుకుని నిద్రపోయింది. చాలాసేపు అలానే కూర్చుండిపోయాను. ఇంతకంటే జీవితంలో ఆనందకరమైన క్షణాలేముంటాయనిపించింది నాకు. ఆధ్యాత్మికులు జీవన సాఫల్యం అంటారే, అలాంటిది. ఆకలేసినవాడికి అన్నం పెట్టడం కంటే మరొక సాఫల్యం ఉంటుందా? తర్వాత ఆ పిల్లిపిల్లను పప్పు, జోరోల కంటబడకుండా బయట స్కూటర్‌లో పెట్టాను.

ఇప్పటికే ఇంట్లో చింటూ ఉంది. జోరోకి (గ్రేట్ డేన్) పిల్లులంటే పడదు కాబట్టి చింటూనీ జోరోనీ వేరువేరుగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. దానికి తోడు చింటూ భలే చురుకు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడూ శబ్దం చేస్తూనే వస్తుంది. వెంటనే జోరోని గదిలో వేసి తలుపు పెట్టేసేవాళ్ళం. చింటూ తినగానే బయటకు వెళ్ళిపోతుంది. లేదా డాబామీదున్న గదికెళ్ళి పరుపు మీద పడుకుని నిద్రపోతుంది. ఆ గది తలుపు వేసేస్తే ఇక జోరోనుండి భయం ఉండదు. మెల్లమెల్లగా ఆ పద్దతినే ఈ పిల్లిపిల్ల కూడా అలవాటు చేసుకుంది. దీనికి గెయ్రో అని పేరు పెట్టింది అవంతిక. ఇలాంటి పేర్లెలా పెడుతుందో! అసలు ఆలోచించే అవనరం కూడా ఉండదు తనకు. మనసులో ఆ సమయానికి ఏదనిపిస్తే అదే పేరు.

భయపడకండి, వాటినెలా పెంచామో చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించను. ఒక్క వాక్యంలో ముగించేస్తాను. 2018 జనవరి 30వ తేదిన జోరో కాలం చేశాడు. తేదీలు నాకు గుర్తుండవు కాని అది జనవరి ముప్పై కాబట్టి మరిచిపోలేకున్నాను. గ్రేట్ డేన్ ఆయువు ఏడేళ్ళే. అయితే జోరో పదేళ్ళు బతికాడు.

వియోగ బాధకి కాలం ఓ గొప్ప ఔషధం అన్నది నిజమే. జోరో చనిపోయి ఏడాది దాటింది. ఆ బాధనుండి పూర్తిగా కోలుకున్నాను. అప్పట్లో పిచ్చి పట్టినట్టు ఉండేది. జోరో జ్ఞాపకాల గొలుసులతో కట్టి, నన్ను సముద్రం లోతుల్లోకి విసిరేసినట్టుండేది. శరీర బాధని తట్టుకోవచ్చు కానీ మనోవేదన తట్టుకోవడం చాలా కష్టం. ‘బుర్రలో వేయి తేళ్ళు’ అని ఎన్నోసార్లు రాశాను కాని, అది ఆ రెండు రోజుల్లో నేను మొదటిసారి అనుభవించాను. ఫోన్ రింగయినప్పుడు కూడా కనీసం ఎత్తలేకపోయాను. ఒకట్రెండు కాల్స్ తీసుకున్నా కానీ అటునుంచి మనిషి గొంతు వినపడగానే భోరుమని ఏడ్చాను. నా ఏడుపు నాకే వింతగా అనిపించింది. జోరో పోయిన మరుసటి రోజు ఉదయం పరామర్శించేందుకు ఒక ఫ్రెండ్ వచ్చారు. నేను నిల్చునే పెద్దపెట్టున ఏడవటం మొదలెట్టాను. సంగీతం, రచన, ఆధ్యాత్మికత, దేవుడు–ఇవేవీ నా బాధను తగ్గించలేకపోయాయి. మరో మిత్రుడు వచ్చి నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నంతసేపూ బానే ఉన్నాను. మూడు గంటల తరువాత తిరిగి ఇంట్లోకి రాగానే మళ్ళీ జ్ఞాపకాల గొలుసులు నన్ను చుట్టుకున్నాయి. నా కథల్లో రాసినట్టే నేనూ శోకసాగరంలో ముణిగిపోయాను. నాకు పిచ్చి పట్టేస్తుందేమోనని చాలా భయపడ్డాను. ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఇంకో ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా సీరియల్ చూడమని సలహా ఇచ్చాడు. గేమ్ ఆఫ్ త్రోన్స్ మొదలుపెట్టాను. మెల్లమెల్లగా మనసు తేరుకుంటున్నట్టనిపించింది.

జోరో పోయిన కొన్ని రోజులవరకూ ఆ సంగతి తెలిసి పరామర్శించడానికి ఫోన్ చేసిన మిత్రులెవ్వరితోనూ నేను ఫోన్‌లో మాట్లాడలేదు. జోరోకి నాకు మధ్య ఉన్న ప్రేమ అటువంటిది. మరి అంత లోతైన ప్రేమ, ఉన్నట్టుండి జోరో పోయినప్పుడు ఇంత బాధను కలగచేసేట్టయితే, అసలు ఆ ప్రేమ అవసరమా? అనిపించింది. అంటే, పెంచుతూ ప్రేమించకపోవడం అనేది అసంభవం కాబట్టి, నేను అసలు జోరోని పెంచే ఉండకూడదు. ఇప్పుడు జోరో లేకుండాపోవటం నన్నొక మానసిక రోగిని చేసింది.

‘జ్ఞాపకాలు దుఃఖకారణాలు. గతంలో బ్రతడం వల్ల విషాదమే మిగులుతుంది. అందువలన జ్ఞాపకాలను చంపుకోవాలి.’ అయితే ఈ జ్ఞాపకాలను చంపుకోవడం ఎలా? మనల్ని మనం ఎలా బంధవిముక్తులను చేసుకోవాలో బాబాలు, గురువులు చాలా చిట్కాలే చెప్పివున్నారు. ఉన్నట్టుండి ఒకతని ఆరేళ్ళ కూతురు చనిపోయింది. బాబాగారికి ప్రియ శిష్యుడతను. బాబా దగ్గరకెళ్ళి మొరపెట్టుకున్నాడు. ‘ఏడవకు, నీ కూతురు నీ దగ్గరకంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండే మరో చోట పుట్టింది. ఇదిగో చూడెంత హాయిగా ఉందో!’ అని చూపించాడు బాబా. ఆయన చెప్పిందంతా బుర్రకు అర్థం అవుతుంది. అయినా మనసుకు అర్థంకాదే! జోరో ఎడబాటుని భరించలేకపోతున్నాను. అన్నానని కాదు కాని, జోరో తిండికి నెలకు షుమారు ఇరవై వేలు ఖర్చయ్యేది. అలా నెలనెలా ఖర్చు పెడుతున్నప్పుడు నాకు కొంచం కంగారుగానే ఉండేది. ఎప్పడు దీనినుండి నాకు విముక్తి? ఇలా అయితే నేను సౌత్ అమెరికా టూర్ ఎప్పుడు వెళ్ళేది? ఇలా. ఒక రోజు అర్జంటుగా ఏదో రాస్తూ ఉన్నాను. ఇంట్లో చేపలు లేవు. జోరో చేపలు లేనిదే తినడు. ముందురోజు కూడా తినలేదు. కాని నాకు టైము లేదు. పత్రికకు అర్జంటుగా రాసి పంపించాలి. ఇంతలో రచయిత ప్రభు కాళిదాస్ వచ్చారు. ఆయన శాకాహారి. అయినా నాకోసం అంగడికెళ్ళి చేపలు కొనుక్కొచ్చిపెట్టారు.

చూడండి, అప్పుడేమో ‘ఎంతకాలమిలా’ అని చిరాకుపడ్డాను. ఇప్పుడేమో ‘ఎందుకింత తొందరగా పోయావు జోరో? ఇంకా కొన్నిరోజులు బతికుండాల్సింది’ అని పిచ్చివాడిలా ఏడుస్తున్నాను. నా ఏడుపును మీరు సులభంగానే ఊహించుకోవచ్చు. అదేమీ మౌనంగా కళ్ళనీళ్ళు తుడుచుకోవడం కాదు. ఉన్నట్టుండి పెద్దగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేవాణ్ణి. స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటాను. ఉన్నట్టుండి జోరో జ్ఞాపకమొచ్చి భోరున ఏడుస్తాను.

‘ఈ ఇంట్లో ఇక ఉండద్దు’ అంది అవంతిక. ‘నువ్వు అప్పుడప్పుడూ ట్రిప్పులకెళ్ళిపోతుంటావు. ఈ ఇంట్లో నేనొక్కదాన్నీ ఉండలేను. ఎటువంటి భద్రతా లేదు. అసలే దొంగల భయం ఉన్న ఏరియా.’ అంది. జోరో ఉన్నప్పుడు ఇంటి లోపలికి ఒక బల్లిని కూడా రానియ్యలేదు. ఆకులు కదిలినా సరే జోరో భౌ భౌలతో వీధి దద్దరిల్లిపోయేది. అయినా, ‘ఇప్పుడెందుకు ఇల్లు మారడం? ఇంటి ఓనర్ కూడా ఇంకో ఐదారేళ్ళు ఇక్కడే ఉండండి అని బలవంతపెట్టారు. పదేళ్ళనుండి ఈ ఇంటిలోనే ఉన్నాము. ఇల్లు కూడా అన్ని రకాలుగానూ సౌకర్యంగానే ఉందికదా,’ అన్నాను అవంతికతో. దొంగల భయం ఎక్కడైనా ఉండేదే కాని, అవంతిక ఇల్లు మారాల్సిందే అని పట్టుబట్టింది.

జోరో పోయిన తర్వాత ఒక రోజు మా పనమ్మాయికి వడ్డీకి డబ్బులిచ్చిన ఒకామె మా ఇంట్లోకొచ్చి పనమ్మాయితో గొడవకు దిగింది. ఆమె జుట్టు పట్టుకుని కింద పడేసి కొట్టింది. దీని గురించి పోలీసులతో చెప్పలేము. ఎందుకంటే నిజజీవితం చాలా కఠినమయినది. మా పనమ్మాయి ఆ వీధిలో చెత్త ఊడ్చే పాకీ రాజేంద్రన్ భార్య. ఆ వచ్చినామె ‘ఒసేయ్, చెత్తలోడి పెళ్ళామా! నీకింత పొగరా?…” అంటూ తిట్టింది. ఇంతకంటే ఆమె అన్న మాటలను ఇక్కడ రాయటం అసాధ్యం.

పోలీసులకెందుకు చెప్పలేమంటే, వాళ్ళు ఆ చెత్త ఊడ్చే రాజేంద్రన్‌ను స్టేషన్‌కి తీసుకెళ్ళి ఉతుకుతారు. ఇంతకుముందు ఈ వీధిలోనే ఒక ఇంట్లో యాభై కాసుల బంగారు నగల దొంగతనం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో కనిపించినవారిలో రాజేంద్రన్ కూడా ఒకడు.‘పట్టుకోండి ఆ చెత్తూడ్చేవాణ్ణి’ అనేది పోలీసుల లాజిక్. నేను దీని గురించి పత్రికలో రాసి రాజేంద్రన్‌ని విడిపించాను. రాజేంద్రన్ నిజంగానే అమాయకుడు. అతని బతుకే వీధుల్లో కదా? అలాంటిది సీసీటీవీ కెమెరాలో అతని ముఖం ఎందుకు కనిపించదు?

ఒక ఆడ రౌడీ మా ఇంట్లో దూరి మా పనిమనిషిని లాగి కొట్టి గొడవకు దిగుతుంది. అయినా నేను పోలీసులకు ఫోన్ చెయ్యలేను. పోలీసులకు చెప్తే ముందుగా రాజేంద్రన్‌ను విచారించాలని తీసుకెళ్ళి ఇదివరకున్న కోపాన్నంతా కలగలిపి వాడి మక్కెలిరగ్గొడతారు. అదే జోరో ఉండుంటే ఆ రౌడీ రాలుగాయి ఇంటి గేటు తీసుకుని పెరట్లోకి అడుగుపెట్టగలిగేదా?

ఆ మరుసటిరోజు పొద్దున్నే వరండా కంబి గేటు తీసిన శబ్దం. వరండా గేటు తీయగల ఒకే ఒక వ్యక్తి అవంతిక మాత్రమే. అయితే తనేమో పెరట్లో ఉంది. నేను నా రాత పని ఆపి వెళ్ళి చూస్తే సన్యాసి దుస్తుల్లో ఉన్న ఒక అరవయ్యేళ్ళ వ్యక్తి. పుష్టిగా ఉన్నాడు. ముఖంలోనూ, చూపులోనూ సన్యాసికుండాల్సిన శాంతం, కరుణలాంటివేవీ లేవు. పప్పు ఎటువంటి శబ్దం చెయ్యకుండా పడుకుని ఉంది. కనీసం కదలను కూడా లేదు. జోరో అయుంటే ఈ పాటికి ఆ మనిషినుండి రెండు కేజీల కండ ఒలిచేసి ఉండేది. అసలు ఆ మనిషి లోపలికొచ్చే అవకాశమే ఉండేది కాదు.

ఆ మనిషితో ఏం మాట్లాడాలో నాకు తెలీలేదు. ‘గేటు తీసుకుని లోపలికి రావడమే కాకుండా లోపలి తలుపు కూడా తీసుకుని రాడానికి ప్రయత్నిస్తున్నాడే’ అని నా రక్తం మరిగిపోతోంది. నేనప్పుడున్న ఆలోచనల్లో ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. అవంతికని పిలిచాను.

‘ముందు మీరు బయటకెళ్ళండి’ అంది వేలు చూపిస్తూ.

‘మీకు దేవుడి కటాక్షం దొరుకుతుంది, దొరుకుతుంది’ అని ఏదో ఆఫీసర్లా చెప్తున్నాడు దర్పంగా.

‘ఏదైనా కానివ్వండి. ముందు గేటు బయట నిల్చుని చెప్పండి. ఏదైనా ఉంటే కాంపౌండ్ గేటుకవతలనుండి బెల్లు కొట్టాలి గాని సరాసరి ఇలా లోపలికి రావడమేంటి?’ అంది అవంతిక.

అతన్నింక ఏమీ మాట్లాడనివ్వకుండా బయటకు పంపించి కాంపౌండ్ గేటుకు తాళమేసింది. రోజుకు నలుగురైనా వచ్చి దేవుడు పేరు చెప్పి అడుక్కోవడం జరుగుతుందిక్కడ. భిక్షం పెట్టేవరకు చెవులు తూట్లుపడేలా గేటు లేదా బెల్లు కొడుతూనే ఉంటారు. జోరో మొరిగిందంటే ఆ అరుపులకే దడుచుకుని పారిపోయేవాళ్ళు పూర్వం.

అడుక్కునేవాళ్ళ పద్ధతే మారిపోయింది. అందరూ దేవుళ్ళ పేరు చెప్పి అడుక్కుంటున్నారు. భిక్షం పెట్టకుంటే శాపాలు పెడుతుంటారు. మామూలు భిక్షగాళ్ళను చూడటమే అరుదైపోయింది. బాబా పేరు చెప్పుకుంటూనో, జంధ్యం, పిలక పెట్టుకునో, సన్యాసి వేషం వేసుకునో, నలుగురైదుగురు కలిసికట్టుగా వచ్చి బెదిరించి కూడా భిక్షమడుగుతున్నారు. చూడ్డానికి ఒక్కొక్కడూ పహిల్వానుల్లా ఉంటారు. ఇవ్వలేదంటే శాపాలు పెట్టడం.

అవంతిక చెప్పింది నిజమే. జోరో లేకుండా ఈ ఇంటిలో ఉండలేం.

ఇక తప్పక ఇల్లు వెతకడం మొదలుపెట్టాం. ఇల్లు వెతికే అందరికీ ఎదురయ్యే మూడు ఇబ్బందులివే: 1. ముస్లిములకు ఇల్లు దొరకదు. 2. మాంసాహారం తినేవాళ్ళకి ఇల్లు దొరకదు. 3. కుక్కలు పెంచుకునేవారికి ఇల్లు దొరకదు. నాకు ఇల్లు ఇవ్వను అనేందుకు రెండు కారణాలున్నాయి: మాంసాహారం, కుక్కలు. అద్దె ఇల్లు వెతికే తంతంతా ఒక చదరంగం ఆటగాడి ఎత్తుగడలతో జరుగుతున్నట్టుగా ఉంది. అయితే, జోరో పోయిన నాల్రోజులకే ఇల్లు దొరికింది. ఇప్పుడుంటున్న ఇంటి నుండి కుడి వైపుకు వెళ్తే శాంతోమ్ హై రోడ్. రోడ్డుకవతల వైపున్న అపార్ట్‌మెంట్స్‌లో ఇల్లు దొరికింది. ఇక్కణ్ణుండి ఐదు నిముషాల నడక దూరం. అపార్ట్‌మెంట్స్‌ కాబట్టి ఎప్పుడూ సెక్యూరిటీ వాళ్ళుంటారు.

కొత్త ఇంటికి మారిపోయాం. అయితే చింటూని, గెయ్రోని ఎలా కొత్తింటికి తీసుకెళ్ళడం? మీకు తెలీయందేమీ కాదు. కుక్కలు మనం ఎక్కడికెళ్తే అక్కడికి మనతోపాటే వచ్చేస్తాయి. పిల్లులు అలా కాదు. అవి వాటి నివాసాలను అంత సులువుగా మార్చుకోలేవు. ఉన్నచోటనే ఉంటాయి. అయినప్పటికీ చింటూనీ, గెయ్రోనీ వేర్వేరుగా బుట్టల్లో పెట్టుకుని తీసుకొచ్చాము. చింటూని బుట్టనుండి బయటకు తీయగానే పిట్టలా ఎటో ఎగిరిపోయింది. వాటికి దారి తెలీకూడదని మేము రాత్రి పది దాటాకే తీసుకొచ్చాము. అయినా అంత రద్దీగా వున్న హైవేను ఎలా దాటెళ్ళిందో మరి! అందుకనే చింటూని తీసుకెళ్ళడానికి నాకు మనసొప్పలేదు. ఎలాగోలా అది పాతింటికి వెళ్ళిపోతుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఇంటి దగ్గర చింటూకి స్నీకీ అనే ఒక ప్రేయసి ఉంది. నిజానికి స్నీకీ మరో పెద్దపిల్లికి ప్రేయసిగా ఉండేది. ఆ సంగతి మొదలుపెడితే మనం ఇప్పుడెక్కడెక్కడికి వెళ్ళిపోతామో… అదొక పెద్ద ప్రేమకావ్యం!

సరే, వీలైనంత క్లుప్తంగా చెప్తాను. ఆ పెద్దపిల్లి చూడటానికి రౌడీలా ఉంటుంది. చూడటానికేంటి? అసలది రౌడీ పిల్లే. ఇక్కడ మీరొకటి తెలుసుకోవాలి. మనుషుల్లో జ్ఞాని, పండితుడు, అమాయకుడు, దొంగ, వెధవ, మోసగొండి, పోకిరి, మహాత్మ, మంచివాడు, చెడ్డవాడు, చాదస్తుడు, ఛాందసుడు అని రకరకాలు ఉన్నట్టే పిల్లుల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. రౌడీ పిల్లి, పండిత పిల్లి, శాంతమూర్తి పిల్లి, దొంగ పిల్లి, మంచి పిల్లి, అమాయక పిల్లి, కాలాంతక పిల్లి, మోసగొండి పిల్లి, హంతక పిల్లి అని పలు రకాలున్నాయి. స్నీకీ ఒరిజినల్ ప్రియుడు రౌడీ పిల్లి. చింటూ ఏమో ఇంటలెక్చువల్ టైప్. (వాన్ గోని గుర్తుకు తెచ్చుకోండి). ముందు చింటూ రౌడీ పిల్లితో ఎలాంటి తగవుకూ పోలేదు. స్నీకీని అప్రోచ్ అయి తన కోరిక చెప్పిందనుకుంటాను. అయితే స్నీకీ ఆ వివాహేతర సంబంధాన్ని నిరాకరించి చింటూని కొరికి మరీ వెంటబడి తరిమింది. మేము చింటూ దెబ్బలకు మందు పూశాం. అది ఒకసారితో ఆగలేదు. చింటూ మళ్ళీ మళ్ళీ మెడ మీద, ఒంటి మీద పంటి గాట్లు తగిలించుకుని వచ్చేది. ఎన్నిసార్లయినా ఇదే తంతు. మేము గాయాలకు మందులు రాయడం, అది మళ్ళీ కొరికించుకుని రావడం. చింటూ ఒళ్ళంతా ఆ దెబ్బలనుంచి పుండ్లు పడ్డాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంజక్షన్ కూడా చేయించాము. కొన్ని రోజులు మామూలుగానే ఉండి, ఒకరోజు మళ్ళీ తన ఒన్ సైడ్ లవ్‌ని చెప్పి ఒంటిమీద గాట్లు పెట్టించుకొని వచ్చింది. ఈసారి ఆ రౌడీ పిల్లి కూడా కొరికినట్టుంది. కాని, అక్కడే ఆ రౌడీ పిల్లి తన జీవితంలోనే చాలా పెద్ద తప్పు చేసింది. ఎప్పుడైతే ఆ రౌడీ పిల్లి చింటూని కొరికి తరిమిందో అప్పుడే స్నీకీ చింటూ ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత స్నీకీకి రౌడీ పిల్లి అనవసరం అయిపోయిందనుకుంటాను. నేను పిల్లిని కాను కాబట్టి ఇంతకంటే ఈ వివరాలలోకి వెళ్ళలేకపోతున్నాను.

ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. స్నీకీ నడుము ఊపుకుంటూ (అలనాటి నటి బి. సరోజాదేవిలాగ) అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేదిగానీ తన మకాం మాత్రం మార్చుకోలేదు. పక్కవీధిలోనే ఉండేది. అప్పుడు ఒకానొక రోజు ఉన్నట్టుండి చింటూ కనిపించకుండా పోయింది. అవంతిక ఎక్కడెక్కడో వెతికింది. అయితే స్నీకీ మాత్రం వేళకు వచ్చి తిని వెళ్ళిపోయేది. అవంతిక దిగులు పెట్టుకుంది. నాకు కూడా మనసు వికారంగా అయిపోయింది. బీచ్‌కి వెళ్ళిన బిడ్డ కనిపించకపోతే ఎలా ఉంటుంది? ఒక రోజు రెండు రోజులు కాదు; ఒక వారం దాటింది. అది నాలుగు గంటలకొకసారి తినకుండా ఉండలేదు. అందునా చేపల్లో కొరమీనులు మాత్రమే తినేది. ఇంకేదీ తినేది కాదు. ఎక్కడికెళ్ళుంటుంది? ఎన్ని రోజులు తినకుండా ఉంటుంది? ఇన్ని రోజులు తినకుంటే చచ్చిపోదూ? ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా చింటూ దొరకాలని రకరకాల ఎమోటికాన్లతో ప్రార్థనలు చేశారు. పిల్లులు మిస్టీరియస్ ఏనిమల్స్ అని ఒక ఫ్రెండన్నాడు: ‘అవి నిగూఢమైనవి; ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి, ఎక్కడ ఉంటాయి అనేది అసలు పసిగట్టలేము.’ అని.

అవంతిక చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరిగి వెతికింది. ‘పక్కవీధిలో వెతికావా? స్నీకీ ఉండే వీధిలో?’ అని అడిగాను. ‘మొట్టమొదట వెతికింది అక్కడే’ అంది. అయితే ఎక్కడికెళ్ళుంటుంది? ఒక వారం తర్వాత మళ్ళీ పక్కవీధిలో వెతకడానికి వెళ్ళాం. మమ్మల్ని చూసి ‘మ్యావ్’ అనుకుంటూ వచ్చింది చింటూ. ఇంతకీ ఏం జరిగిందంటే, రౌడీ పిల్లినుండి స్నీకీని పర్మనెంటుగా దూరం చెయ్యడానికి చింటూ అక్కడే స్నీకీతోనే ఉండిపోయింది; నిముషమైనా ఎడబాయకుండా. ఓసి దీని పాసుగూలా! కింగ్ సైజు బెడ్డు మీద వైభవంగా నిద్రపోయిన చింటూ తన ప్రేయసి కోసం రోడ్లమీద పడుకుంది. బిచ్చగాడుపిల్లిలా మారిపోయింది. తెల్లటి చర్మం నల్లబడి, దుమ్ము కొట్టుకపోయి, ఎముకలు కనిపించేలా చిక్కిపోయింది. ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాం. మమ్మల్ని స్నీకీ వెంబడించింది. మామూలుగా రెండుమూడు స్పూన్ల నీళ్ళు తాగే చింటు ఆ రోజు రెండున్నర గ్లాసులు తాగింది. దేవుడా, ఒక వారంగా తిండీ తిప్పలు లేకుండా, చివరికి నీళ్ళు కూడా తాగకుండా ఉందది.

కొత్తిల్లు మరింత దూరం అవుతుంది కాబట్టి చింటూని తీసుకురావద్దని అనుకున్నాం. తీసుకొచ్చి, అది రోడ్లు దాటేప్పుడు కార్ల కిందో, లారీల కిందో పడి చచ్చిపోవడం కంటే స్నీకీతో అక్కడే ఉండనిద్దాం, అనుకున్నాను, కానీ ఎందుకో తెచ్చాం. అయితే దాని అదృష్టం! వాహనాలను తప్పించుకుని రోడ్డు దాటుకుని వెళ్ళి స్నీకీతో చేరిపోయింది. ఆ తర్వాత అవంతిక రోజూ పొద్దునా రాత్రీ రోడ్డు దాటుకుని వెళ్ళి చింటూకీ, స్నీకీకీ ఆహారం, నీళ్ళు పెట్టొచ్చేది. స్కూటర్‌ మీదే వెళ్ళేది. ఒక రోజు స్కూటర్‌ని ఏదో బైక్ గుద్ది చిన్న యాక్సిడెంట్ కూడా అయింది.

కానీ గెయ్రో ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండగలిగింది. గెయ్రో సాధు పిల్లి. ఎవరి జోలికీ పోదు. ఏ పిల్లితోనూ గొడవకు దిగదు. ప్రేమలో పడలేదు. అయితే లిబిడో ఉంది. ఆడపిల్లుల వెంట పడుతుంది; కాని అది తరిమితే తగువు పడకుండా తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో కొంచం మారాం చేసింది. అవంతిక కాళ్ళను కొరికేది. రోజురోజుకీ దాని కోపం పెరుగుతుండటం చూసి, ఈ కొత్త ఇల్లు నచ్చలేదని పాతింటి దగ్గరే వదిలిపెట్టి వచ్చింది అవంతిక. రోజూ ఆహారం పట్టుకెళ్ళి పెట్టొచ్చింది. ఇలా పదిహేను రోజులు గడిచింది. అంతటితో తన అజ్ఞాతవాసం ముగించుకోవాలనుకుందేమో, అవంతికను చూడగానే ఏడుపు మొదలుపెట్టింది. తన వెనకనే వచ్చి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంటే, అవంతిక తీసుకొచ్చేసింది.

ఆ పదిహేను రోజులు గెయ్రో ఎలా గడిపి ఉంటుంది? దానికక్కడెవరూ స్నేహితులు లేరు. చింటూ, స్నీకీ ఎప్పుడూ గెయ్రోని తమ జట్టులో చేర్చుకోలేదు. ఇంటిలోనే రాజులా బతికింది. వీధుల్లో ఎలా గడిపిందో? దానివల్లకాక మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. తర్వాతెప్పుడూ అవంతికని కొరకలేదు. కోపం ప్రదర్శించలేదు. ఈ అపార్ట్‌మెంట్‌లో అందరితో కలిసిపోయింది. అందరితోనూ స్నేహంగా ఉంది. అందరూ దాన్ని ముద్దు చేశారు. గెయ్రో అని ఎవరైనా పిలిస్తే తిరిగి చూసి దీర్ఘంగా మూ…వ్ అని బదులిచ్చేది. అవంతికను మువ్ మువ్ అని పిలిచేది.

అమ్మయ్య, అన్నిరకాలుగా సెటిలయ్యాం అనుకున్నాను. అనుకున్న రెండు వారాలకు ఒక రోజు గెయ్రో కనిపించకుండా పోయింది. ఈ విషయం ఎవరికి చెప్పినా వాళ్ళకది అర్థంకావటంలేదు. ఎందుకంటే ఎవరికీ గెయ్రో ఏంటో తెలీదు. గెయ్రో వేరే పిల్లుల వెనక వెళ్ళే రకం కాదు. ఈ అపార్ట్‌మెంట్‌ కాంపౌండ్ దాటి ఎక్కడికీ వెళ్ళదు. ఎప్పుడూ వెళ్ళిందీ లేదు. అయితే, అందరూ–పిల్లులంతే, ఉన్నట్టుండి ఎటయినా వెళ్ళిపోతాయి; మళ్ళీ వచ్చేస్తాయి–అన్నారు. నాకూ అవంతికకు మాత్రం ఇది అలాంటి బాపతు ఇన్సిడెంట్ కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

అన్నట్టు, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను. గెయ్రో కనిపించకుండా పోయిన రోజుకు ముందురోజు మా ఎదురు ఫ్లాట్‌లో ఉండే ఆవిడ గెయ్రోని చూసి ‘అమ్మో! ఎంత పెద్ద పిల్లీ?!’ అని దిష్టి పెట్టిందట. కొన్నిటిని అభినయించి మాత్రమే చూపించగలం. ఆ ‘అమ్మో’ మామూలు అమ్మో కాదు, ఒక భయంకరమైన ‘అమ్మో!’ అమ్మో! ఎంత పెద్ద పిల్లీ?! అని అలా దిష్టి పెట్టిన ఆవిడకి పిల్లులంటే పడదన్నది అదనపు సమాచారం. మా అపార్ట్‌మెంట్ వాచ్‌మేన్ దగ్గర ఎప్పుడూ పిల్లల గురించి కంప్లయింట్ చేస్తుంటుందట. పిల్లులేమైనా ఆమె ఇంట్లో జొరబడి దొంగతనం చేస్తున్నాయా? అలాంటిదేమీ లేదు. ఈ అపార్ట్‌మెంట్‌ కాంపౌండ్‌లో మూడు పిల్లులున్నాయి. బ్రౌనీ, పుస్సీ, బ్లాకీ. బ్రౌనీ, బ్లాకీలు మగ పిల్లులు. పుస్సీ ఆడ పిల్లి. ఏ పిచ్చి మొద్దెధవ దానికి పుస్సీ అని పేరు పెట్టాడో మరి, దాన్నొదిలేయండి. ఆ మూడు పిల్లులకూ మేము ఇక్కడికి వచ్చినప్పట్నుండీ రోజూ తిండి పెడుతున్నాం. అవి కూడానూ తిండి కోసం వెతుక్కుంటూ వేరెక్కడికీ వెళ్ళవు. అపార్టుమెంట్లవాళ్ళు పెట్టేవే చాలు. చక్కగా తింటాయి. కింద కాంపౌండ్‌ లోపలే పడుంటాయి. అప్పుడప్పుడూ అవి ఆవిడ కంటపడుతున్నాయట. అది ఆమెకు నచ్చలేదట. ‘ఛీ… పిల్లులంటేనే నాకు అసహ్యం!’ అని వాచ్‌మేన్‌తో చెప్పి వాపోయేదట.

ఆవిడ ‘అమ్మో! ఎంత పెద్ద పిల్లీ?!’ అని దిష్టి పెట్టిన మరుక్షణం నుండి అవంతిక కలవరించడం మొదలుపెట్టింది. ఎదురింటామెవి కొరివి కళ్ళు, దిష్టి పెట్టేసింది అని మళ్ళీ మళ్ళీ అనేది. గెయ్రోకి దిష్టి తీయమని మా పనమ్మాయికి చెప్పింది అవంతిక. పనమ్మాయి మర్నాడు తీస్తానని చెప్పింది. దిష్టి పెట్టి 24గంటలైనా కాలేదు ఈ లోపు గెయ్రో కనిపించకుండా పోయింది. గెయ్రో కనిపించకుండా పోయినప్పట్నుండీ ఎదురింటావిడకి తిట్లభిషేకం మొదలయింది. ఆమెకు వినిపించేలా కాదనుకోండి, నాకు మాత్రమే వినిపించేలా. పాపిష్ఠి కళ్ళు, కొరివి కళ్ళు, పాపిష్ఠి కళ్ళు, కొరివి కళ్ళు!

ఎవరైనా పట్టుకెళ్ళి వండుకు తినేశారా అని నాకు అనుమానం మొదలైంది. నా జీవితంలో నేను ఇంతలా బాధపడింది లేదు అనే చెప్పాలి. జోరో చివరి శ్వాస వదిలినప్పుడు పిచ్చిపట్టినవాడిలా అయ్యాను. చాలా ఏడ్చాను. అయినప్పటికీ జోరోది ఒక నిండైన జీవితం అన్న తృప్తి ఉండేది. ఎంత గొప్ప ఆయుర్దాయం! ఏడేళ్ళు బతకాల్సింది నిండుగా పదేళ్ళు బతికింది. చివరి దశలో కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు, పెట్టలేదు. నా ఒడిలో పడుకుని ప్రాణం విడిచిపెట్టింది. అయితే ఇప్పుడు గెయ్రో ఎక్కడికెళ్ళిందీ తెలీటంలేదు. చుట్టుపక్కల అందరినీ విచారించాం, వెతికిన చోటే వెతికాం. పిల్లికోసం వెతుకుతున్నందుకు వింతగా చూసేవాళ్ళు. ‘పిల్లులంతేనండి. ఉన్నట్టుండి వెళ్ళిపోతాయి. అదే తిరిగి వచ్చేస్తుందిలెండి…’ అనేవాళ్ళు. ‘అది మిగతా పిల్లుల్లా కాదురా ఫూల్స్!’ అని మనసులోనే తిట్టుకొనేవాణ్ణి. అవంతిక పిచ్చి పట్టినట్టయిపోయింది. తను సరిగ్గా నిద్రపోవటంలేదు, తినటంలేదు. నిద్ర మధ్యలో నేను లేచినప్పుడు చూస్తే బాల్కనీలో నిల్చుని గెయ్రో గెయ్రో అని పిలుస్తూ వుండేది. ‘పిలిచి ప్రయోజనంలేదు అమ్మూ, నీ గొంతు వినిపించే దూరానుంటే వచ్చేసేది కదా?’ అని ఓదార్చేవాణ్ణి. గెయ్రో నాలుగు గంటలకొకసారి తినేది. మాతో దాగుడుమూతలు కూడా ఆడుకునేది. ఎక్కడైనా దాక్కుని మమ్ముల్ని వెతకమనేది. వెతికేప్పుడు మువ్ మువ్ అని గొంతిచ్చేది. ఎప్పూడూ మియావ్ అని మాత్రమ్ అస్సలు అనేది కాదు.

“అయ్యో! ఎంత దారుణం. ఎక్కడికెళ్ళింది నా బుజ్జిపిల్లి? చచ్చిపోయిందంటే సరే, ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటాం. కానీ ఇలా కనిపించకుండా పోతే ఏమనుకోవాలి? ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని మన సాయంకోసం ఎదురుచూస్తుందేమో?” అని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేది అవంతిక.

గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెటర్నిటీ వార్డుకు వెళ్ళారా ఎప్పుడైనా? ప్రతి గోడమీదా ‘పసికందులను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్నెత్తుకుపోయే దొంగలు తిరుగుతుంటారు’ అని రాసుంటుంది. మెటర్నిటీ హాస్పిటళ్ళలో పసిపిల్లల్ని దొంగిలించడం చాలా సులువు. బిడ్డను కన్న అలసటతో తల్లి నిద్రపోతుంటుంది. ఆమెను చూసుకోటానికొచ్చిన బంధువులామె ఏ టీ, కాఫీ తీసుకురాడానికో వెళ్ళినపుడు, నిద్రపోతున్న పసికందును తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు. దేనికి? చేయీ, కాలూ తీసేసి బిచ్చగాళ్ళను చేసి సంపాయించుకోడానికి. మంచి డబ్బు. మన దేశంలో సులువుగా డబ్బు సంపాయించగల పెద్ద వ్యాపారం బిచ్చమెత్తించడం. ఇంకా వివరంగా కావాలంటే స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా చూడండి. భారతదేశపు పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర పసిపాపల్ని చంకనేసుకుని ఒక తల్లి అడుక్కోవడం చూసే ఉంటారు. ఆ పసికందులందరూ ఇలా దొంగిలించబడ్డవారే. అలా ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి స్థితిలో ఉన్నాం మేము.

దిష్టి అన్నది నిజమా? రచయితనయిన నేను ఇలాంటివన్నీ నమ్మొచ్చా?

నేనిప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. ఒకప్పుడు డీయెంకే పాలనలో ఐదేళ్ళపాటు తమిళనాడంతా కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి. కడలూర్‌లాంటి ఊళ్ళలో రోజుకు 18 గంటలు కరెంటు కోత ఉండేది. మరికొన్ని చోట్లయితే 20 గంటల కరెంటు కోత కూడా ఉండేది. చెన్నై రాజధాని కాబట్టి ఇక్కడ కేవలం 6 గంటలు మాత్రమే కరెంటు కోత ఉండేది. మంత్రులుండే ఏరియాలకు మాత్రం మినహాయింపు. అప్పుడు మా వీధిలో ఒక మాజీ మంత్రి ఉండేవారు. అతను ఏడీయెంకే. పాలనలో ఉన్నదేమో డీయెంకే. మాజీ అయితేనేం? మంత్రేగా? కాబట్టి మా వీధిలో మాత్రం కరెంటు కోతే ఉండేది కాదు. ‘ఈ విషయం ఎక్కడైనా రాసేవు, వెంటనే కరెంట్ కోసేస్తారు’ అని నన్ను గట్టిగానే హెచ్చరించింది అవంతిక. నేను కూడా కరెంటు కోతకు భయపడి దాని గురించెక్కడా పెన్ను కదపలేదు. నాలుగేళ్ళ తర్వాత ఒక రోజు రాఘవన్‌తో మాటల్లో ఈ విషయం ప్రస్తావించాను. ‘ఆహా, మీరు అదృష్టవంతులు!’ అని అన్నాడు. రాఘవన్ చాలా సహృదయుడు. ఎవరిని చూసీ దిష్టి పెట్టే రకం కాదు. అసలు అతనివి కొరివికళ్ళు కానే కావు. ప్రపంచశాంతీ, శ్రేయస్సూ కోరుకునే రకం. మీరు అదృష్టవంతులు అన్నది కూడా అతను దీవెనలాగే అన్నాడు. మరుసటి రోజే ఫుల్ బ్లాకవుట్! పొద్దున ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు కరెంటే లేదు. దీని గురించి నేను రాఘవన్‌కి చెప్పలేదు, నొచ్చుకుంటాడని.

మరొక సంఘటన నలభై ఏళ్ళ క్రితం దిల్లీలో జరిగింది. అక్కడ నాకు మారియప్పన్ అని ఒక స్నేహితుడుండేవాడు. ఒక ఆదివారం నన్ను భోజనానికి రమ్మని అతను తన ఇంటికి పిలిచాడు. అతని కొడుక్కి రెండేళ్ళు. వాడు బట్టల్లేకుండా ఇల్లంతా దోగాడుతున్నాడు. బొద్దుగా, పుష్టిగా, ముద్దుగా, గుండ్రటి పిర్రలతో చూడ్టానికి చిన్న సైజు సుమో వీరుడిలా ఉన్నాడు. ఆ విషయం నేను మారియప్పన్‌తో అన్నాను. అతను నవ్వాడు. వారం తర్వాత అతన్ని మళ్ళీ కలిసినపుడు చెప్పాడు: పొయ్యిమీదనుండి దించిన కుక్కర్ మీద దర్జాగా కుర్చున్నాడట పిల్లాడు. చర్మమంతా కాలి పోయిందట. మారియప్పన్ తీవ్రమైన హేతువాది. అంతకంటే ఏమీ చెప్పలేదు. అప్పట్నుండి నేనెవర్నీ, దేన్నీ మెచ్చుకోవటంలేదు.

దిష్టి దృష్టి వల్లే కాదు, మాట వల్ల కూడా వస్తుందేమో. మాటలో ఉంటుంది ఆ కిటుకు. మొట్టమొదట నేను చెన్నై వచ్చినపుడు, ఒక స్నేహితున్ని కలవడానికి చిన్మయానగర్ వెళ్ళాను. వర్షాకాలం. రోడ్లంతా బురద కొట్టుకుపోయి ఏదో ఆఫ్గన్ విలేజ్‌లా అనిపించింది నాకు. నేను చెన్నైలో ఉన్నంతకాలం చిన్మయానగర్‌లో ఉండను, ఒట్టు అన్నాను. అప్పటికి నేను అవంతికను కలవలేదు. తర్వాత కలిశాను. అవంతిక చిన్మయానగర్‌లో ఉండేది. కాబట్టి పన్నెండేళ్ళు చిన్మయానగర్‌లోనే మకాం పెట్టాల్సివచ్చింది.

ఇంతకంటే ఇంకో ఒక సంఘటన జెర్రుల గురించి. గాయత్రి చెప్పిన విషయం ఇది. ఆమెకు ప్రదీప్ అని ఒక ఫ్రెండున్నాడు. అతని ఇంట్లోకొచ్చిన జెర్రి గురించి చాలా దిగులుగా చెప్పాడట. ఎందుకంటే అతనికి దోగాడే చంటిపాప ఉంది. అప్పుడు గాయత్రి, ‘ఈ ఇంటికొచ్చి పదేళ్ళయింది. అదృష్టవశాత్తూ ఇంతవరకెప్పుడూ జెర్రులు రాలేదు.’ అన్నదట. సరిగ్గా గాయత్రి తన స్నేహితుడితో అలా చెప్పిన మరుసట్రోజు పొద్దున డైనింగ్ టేబిల్ కింద జెర్రి పాకుతూ కనిపించిందట.

గెయ్రో కనిపించకుండా పోయిన మూడో రోజు. పొద్దున పది గంటలకు అవంతిక ధ్యానం చెయ్యడానికి కూర్చుంటూ, ‘గెయ్రో దొరికితేగానీ నేను ధ్యానం నుండి లేవను’ అంది. మధ్యాహ్నం భోజనానికి కూడా లేవలేదు. మూడు గంటలకు లేచి మేడ మీదకెళ్ళింది. అక్కడినించి కిందకు దిగి, మా అపార్ట్‌మెంట్ పక్కన కొన్నేళ్ళుగా తాళమేసి ఉన్న ఇంటికి వెళ్ళింది. ‘గెయ్రో ఇక్కడ ఇరుక్కుపోయుంది’ అంది. ఎవరూ నమ్మలేదు. ‘అదెలా చెప్పగలరు ఇక్కడే ఉందని? మీకెలా తెలుసు?’ అని గేలి చేశారు.

ఆ ఇంటికి తాళమేసుండటంతో మేడమీదకెక్కి చూడాల్సి వచ్చింది. కొంత దూరాన కరెంటు డిపార్ట్‌మెంట్‌వాళ్ళు మరమ్మత్తు పనులు చేస్తూ కనిపించారు. ఈ ఇంటిమీదకెక్కగలరా? అని వాళ్ళనడిగింది.

ఒకతను నిచ్చెన వేసి ఎక్కాడు. పైకి వెళ్ళి గొంతెత్తి మియావ్ మియావ్ అంటూ కిటికీలవీ తడుతూ వెతికాడు. ‘ఇక్కడ పిల్లేదీ లేదు మేడమ్!’ అన్నాడు.

‘గెయ్రో అని పిలవండి.’

‘గెయ్రో గెయ్రో’ అని పిలిచాడు.

‘అవును మేడమ్! ఇంటికి వెనక వైపు బావిలాంటి గొయ్యి ఉంది మేడమ్. అక్కన్నుండి అరుస్తోంది. పైకెక్కడం దానివల్ల కాలేదు.’

తర్వాత అక్కడనుంచి నిచ్చెన వేసి గెయ్రోని ఎత్తుకొచ్చాడు. అది కూడా బెదిరిపోకుండా అతని చేతిలో దీనంగా కూర్చొని ఉంది.

దాటేప్పుడు పొరపాటున ఆ గొయ్యిలో పడిపోయినట్టుంది. నీరసంగా బక్కచిక్కిపోయుంది. అవంతిక పట్టుదల వదులుకోకుండా ప్రయత్నించింది కాబట్టే కనిపెట్టగలిగాం. అదే ‘ఎటో వెళ్ళింది, వెళ్ళినట్టే తిరగొస్తుంద’ని వదిలేసుంటే? ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది. తిండి నీళ్ళు లేకుండా ఆకలితో చచ్చిపోయుండేది. కుళ్ళిపోయి కంపుకొట్టి ఉండేది. ఆ గొయ్యినుండి అది ఎంత గట్టిగా అరిచినా వీధికివతలకి వినిపించదు.

ఆ రోజు నేను, అవంతిక బీచ్‌కెళ్ళాము. ఇక్కణ్ణుండి ఐదు నిముషాలు నడిస్తే బీచ్. పాతింటి నుంచి మరో నాలుగు నిముషాలెక్కువ పట్టొచ్చంతే. కానీ అక్కడున్న అన్నేళ్ళలో ఎప్పుడూ బీచ్‌కెళ్ళలేదు.

“ఈ రోజెందుకు రావాలనుకున్నావు?” అనడిగాను.

“ధ్యానం నుండి లేచి డాబా మీదకెళ్ళాను. అక్కణ్ణుండి సముద్రానికేసి చూసి, సముద్రం తల్లిని అడిగాను. ‘ఈ ప్రపంచానికంతటికీ తల్లివి నువ్వు. మరి నా బిడ్డకు ఏమైందో చెప్పు,’ అని మొరపెట్టుకున్నాను. మరుక్షణం ఆ ఇల్లు నా కంటపడింది.” అంది.

“శుభం. దిష్టితో పోయింది నీ దృష్టితో వచ్చేసింది!” అన్నాను.
---------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, మూలం: చారు నివేదిత, 
కథ మూలం: దిరుష్టి, ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment