Monday, July 22, 2019

కార్తీక శివజ్యోత్స్న


కార్తీక శివజ్యోత్స్న




సాహితీమిత్రులారా!

శా. ప్రారంభించి చకోరపోతము మహీయజ్జ్యోత్స్నయం దుత్సవ
       శ్రీరంజిల్లుచు సోలుచుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం
       గార ధ్యానమునం దహర్నిశము జొక్కంజేయవే దేవ శ్రీ
       గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా!

కార్తీకపు చిరుచలిలో పున్నమి రాతిరి ఆరుబయటో డాబాపైనో పడుకొని, పిండారబోసినట్టు ఆకాశమంతా పరుచుకున్న తెలివెన్నెలని కనులతో, తనువుతో, మనసుతో జుఱ్ఱుకోవడం ఒక అందమైన అనుభూతి. అప్పుడు మనం అచ్చంగా ఒక చకోరపక్షి అయిపోతాం. శివభక్తులయితే బహుశా, కైలాసంలో సాక్షాత్తూ ఆ సర్వేశ్వరుని దర్శించినట్టే అనుభూతి పొందినా ఆశ్చర్యం లేదు. నెలతాలుపుకీ వెన్నెలకీ ఏదో అనాది అనుబంధం! అలాటి అనుబంధమే యీ పద్యం వ్రాయడానికీ కవిని పురికొల్పిందేమో!

ఇది అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకంలోని పద్యం. ఈ అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య కాదు, యథావాక్కుల అన్నమయ్య. ఇతను పదమూడవ శతాబ్దానికి చెందిన శైవకవి. తెలుగు సాహిత్యంలో శతకాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శతకసాహిత్యానికి చాలా విస్తృతి ఉంది. మనకు శతకాలు వేలాదిగా కనిపిస్తాయి. తెలుగులో శతకాలకు మూలం శివకవులే. మొదటగా లభించిన శతకం మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారమని సాహిత్యకారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మరొక శతాబ్దానికి వెలసినవి యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకమూ, పాల్కురికి సోమన వృషాధిపశతకమూను. అన్నమయ్య సోమనలలో ఎవరు ముందు ఎవరు వెనుక అన్న విషయం గురించి వాదోపవాదాలున్నాయి. అన్నమయ్య తన గురువు పేరు ‘ఆరాధ్య సోమేశ్వరు’డని చెప్పుకున్నాడు. అతను పాల్కురికి సోమనాథుడే అని నిడదవోలు వెంకటరావుగారు అభిప్రాయపడ్డారు. కాని యితను వేరనీ, పాల్కురికి సోమన అన్నమయ్యకు తరువాత వాడనీ శతకవాఙ్మయసర్వస్వము వ్రాసిన విద్వాన్ వేదము వేంకటకృష్ణశర్మగారు అన్నారు. ఆ గ్రంథానికి పీఠిక వ్రాసిన మల్లంపల్లివారు కూడా దానితో ఏకీభవించారు.

ముందువెనుకల మాట ఎలా ఉన్నా, తెలుగు సాహిత్యాన్ని శతకాలతో సుసంపన్నం చేసిన ఘనత మాత్రం శివకవులదే! శతకాలను చాటుప్రబంధాలుగా పూర్వ లాక్షణికులు పేర్కొన్నారు. వీటినే ముక్తకాలని కూడా అంటారు. చాటువులలో కథా పాత్రల ప్రమేయం లేకుండా కవి నేరుగా తన సొంత అభిప్రాయాలనూ, భావాలనూ, అనుభూతులనూ వ్యక్తీకరిస్తాడు. శతకాలలో అధికశాతం భక్తిశతకాలే. భక్తులు భగవంతునిపై తమకున్న అమితభక్తిని రకరకాలుగా చాటుకునే పద్యాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎక్కువగా భగవత్‌స్తుతి, ఆత్మార్పణా కనిపిస్తాయి. మతపరమైన ఆచారాలు, తత్త్వము, భక్తుల కథలూ భక్తిశతకాలలో భాగమే. ముఖ్యంగా శివకవుల శతకాలలో వీరశైవ మతాన్ని గురించి చాలా సమాచారం దొరుకుతుంది. వారు సాహిత్యాన్ని మతప్రచారానికి సాధనంగా వాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే శివకవుల యితర శతకాలతో పోలిస్తే యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకంలో వీరశైవం తీవ్రరూపంలో కనిపించదు. ఇతను లింగధారణ చేసిన జంగముడు కాదని తన గురించి అతను చెప్పుకున్న వివరాలబట్టి అనుకోవచ్చు. ఈ శతకంలో తన గురించీ, కృతిరచనా కాలాన్ని గురించీ కవి కచ్చితమైన వివరాలని ఇవ్వడం ఒక విశేషం. తనని యజుశ్శాఖకి చెందిన ఆరాధ్యబ్రాహ్మణునిగా చెప్పుకోవడాన్ని బట్టి, యితను వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన శైవుడు అనిపిస్తుంది. ఇతను అద్వైతాన్ని కూడా ఆమోదించినట్టుగా వేదం వేంకటకృష్ణశర్మగారు భావించారు. కాని నాకు అది పూర్తిగా నిజం కాదని అనిపించింది. ఎందుకంటే, ఒక పద్యంలో “సోహం” “సోహం” అనేవాడు “మోహధ్వాంతములో మునింగిన మహామూఢు”డనీ, “అతిభ్రష్టు”డనీ, అతను శివునికి చాలా దూరంగా ఉండిపోతాడనీ, ఎవడయితే అహంకారాన్ని వీడి సద్భక్తితో నీకు “దాసోహం” అంటాడో, అతనే నీవై ఉంటాడనీ వర్ణిస్తాడు. ఇక్కడ “సోహం” అనే అద్వైతమతాన్ని చాలా స్పష్టంగా ఖండించడం గమనించవచ్చు. భక్తునికి భగవంతుని స్థానాన్ని యివ్వడం శైవవైష్ణవ మతాల రెంటిలోనూ కనిపిస్తుంది. కాని అది అద్వైతభావన కాదు. అన్నమయ్య యీ శతకంలో జ్ఞానమార్గాన్ని ఖండించి, కర్మ భక్తి మార్గాలను బోధించినట్టుగా నాకనిపింది.

ఈ శతకంలోని మరొక విశేషం ఏమిటంటే, ఇతర శివకవుల శతకాలతో పోలిస్తే, యిందులో కవిత్వం పాలు ఒకింత ఎక్కువగా గుబాళించింది. పాల్కురికి సోమన వృషాధిపశతకంలో భక్తి, మతవిషయాలతో పాటు మనలని ఆకర్షించేది అందులోని భాషాగరిమ. అందులో పద్యాలు శబ్దాలంకారశోభితాలు. రకరకాల భాషలలో, మణిప్రవాళశైలిలో ఉన్న పద్యాలు కూడా అందులో కనిపిస్తాయి. ఈ సర్వేశ్వరశతకంలో, సమాసబందురమైన చిక్కని ధారతో పాటుగా, చక్కని పోలికలూ దృష్టాంతాలూ అర్థాంతరన్యాసాలంకారాలు మన మనసులని మురిపిస్తాయి. అలా నా మనసుని ఆకట్టుకొన్న ఒక పద్యమే యీ నెల వెన్నెల పద్యం.

పోతము అంటే పక్షిపిల్ల. చకోరపోతము అంటే ఒక పిల్ల చకోరం అన్న మాట. పిట్ట గొంతే కొంచెం, అందులో పిట్టపిల్లది ఇంకెంత చిన్న గొంతుకుంటుంది! కాని పిల్లలకు సహజంగా ఆత్రం ఎక్కువ. ఇష్టమైనది తాగేటప్పుడో తినేటప్పుడో వారు పడే ఆత్రం భలే ముచ్చటగా ఉంటుంది. తనని తాను అలాంటి చకోరపు పిల్లగా అభివర్ణించుకుంటున్నాడు కవి. అందుకే ఆరంభంలోనే “ప్రారంభించి” అన్నాడు. అంటే ప్రయత్నంతో కూడి అని అర్థం. వెన్నెలేమో “మహీయజ్జ్యోత్స్న.” అంటే దిగ్దిగంతాల దాకా వ్యాపించిన గొప్ప వెన్నెల. అంత వెన్నెలనీ తాగేయాలని యీ చకోరపోతానికి ఉత్సాహం. ఆ ఉత్సాహంలో అది నిరంతరంగా సొక్కిసోలుతూ ఉంటుంది. సరిగ్గా అలాగే, శివుని దివ్యమైన శృంగార ధ్యానములో తన చిత్తం నిమగ్నమైపోయేలాగా అనుగ్రహించమని కోరుకుంటున్నాడు కవి. ఇక్కడ దివ్యశృంగారము అంటే దివ్యమైన సౌందర్యం. నింగీనేలా అంతటా పరచుకున్న వెన్నెలంత దివ్యసౌందర్యం శివునిది. ఒక్కసారి ఆలోచించి చూస్తే, వెన్నెలకీ శివునికీ ఎంత దగ్గరి పోలికో మనకి అవగతం అవుతుంది! వెన్నెల ఎప్పుడూ రాత్రే ప్రకాశిస్తుంది. అంచేత అది నలుపు తెలుపుల చిత్రమైన సమ్మేళనం. శివుడూ అంతే! ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అతను ఎంతటి జ్ఞానమూర్తియో, అంతటి తామసికశక్తి. మనం చిత్రించుకున్న భౌతిక రూపాన్ని ఊహలోకి తెచ్చుకున్నా, అతను నలుపు తెలుపుల చిత్ర సంగమమే! శివుడు స్వయంగా తెల్లని తెలుపు, పక్కనే వామభాగంలో అమ్మవారు శ్యామలాస్వరూపంలో వెలుగుతూ ఉంటారు. తలపైన గంగమ్మ, నెలపూవు, ధవళకాంతులీనుతూ ఉంటారు. మెడలోని నాగన్నా, గొంతుకలోని గరళమూ, కట్టిన గజచర్మమూ నల్లగా నిగారిస్తూ ఉంటాయి. ఆ శివస్వరూపమే కార్తీకపు వెన్నెల. వెన్నెలనయితే కనులతో చూడవచ్చు, మనసుతో ఆస్వాదించవచ్చు. మరి శివుని దివ్యశృంగారమో? అది కనులకి కడుతుందా? మన కళ్ళకి అది సాధ్యంకాదు. అందుకే ఆ దివ్యసౌందర్యాన్ని ధ్యానిస్తానని అంటున్నాడు కవి. అయితే, అంతటి మహాదేవుని శృంగారమూ, ఒకే ఒక కంటిజతకి కనిపిస్తుంది. మామూలుగా కనిపించడం కాదు, నిరంతరం ఆ చూపులకి గమ్యస్థానమే ఆ సౌందర్యం! ఆ నేత్రాలు ఎవరివో, పద్యం చివరిపాదంలో ఒక అద్భుతమైన విశేషణంతో చెప్పాడు కవి. “శ్రీగౌరీలోచననర్తకీనటనరంగస్థాన” – పద్యానికంతటికీ మకుటాయమానమైన ప్రయోగం ఇది! శ్రీగౌరి – పార్వతీదేవి, లోచన – కనులనే, నర్తకీ – నర్తకి, నటన – నాట్యానికి, రంగస్థాన – రంగస్థానమైన ఓ సర్వేశ్వరా. పార్వతీదేవి కన్ను అనే నర్తకి (కనులు రెండయినే చూపు ఒకటే కాబట్టి) నిరంతరం నాట్యం చేసే రంగస్థలం అట శివుడు! ఎంత గొప్ప ఊహ చూడండీ యిది! అమ్మవారి చూపులు ఎప్పుడూ అయ్యవారిపైనే కదులుతూ ఉంటాయన్న విషయాన్ని ఎంత అందంగా చెప్పాడు అన్నమయ్య! “గౌరీలోచన నర్తకీ నటన రంగస్థాన సర్వేశ్వరా!”

చాటుసాహిత్యంలో తరచూ కనిపించే లక్షణం – పద్యాల గురించీ, కవుల గురించీ జనవ్యవహారంలో వ్యాప్తమైయ్యే కథలు. ఈ శతకం గురించి కూడా అలాంటి ఐతిహ్యం ఒకటి ఉంది. అన్నమయ్య యీ శతకాన్ని రచించడం మొదలుపెట్టినప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడట. ప్రతి పద్యాన్నీ ఒక తాటాకు మీద వ్రాసి కృష్ణానదిలో వదిలిపెడతాననీ, అది తిరిగి వస్తే స్వామి ఆ పద్యాన్ని స్వీకరించినట్టు భావించి శతకరచన కొనసాగిస్తాననీ, ఎప్పుడైనా ఒక పద్యం తిరిగి రాకపోతే, అక్కడితో ఆపేసి గండకత్తెర వేసుకొని ప్రాణత్యాగం చేస్తాననీ ఆ ప్రతిజ్ఞ. అలా సాగుతున్న రచనలో ఒక పద్యం దగ్గరకి వచ్చేటప్పటికి అది తిరిగి రాలేదట. అప్పుడు తన శపథం ప్రకారం మెడ కత్తిరించుకొనేందుకు సిద్ధపడితే ఒక పసులకాపరి ఒక తాటాకుని తెచ్చి యిచ్చాడట. దాని మీద తన పద్యం కాకుండా అదే మకుటంతో మరొక పద్యం ఉన్నదట. దానిని, శతకరచన కొనసాగించమన్న శివుని ఆజ్ఞగా భావించి, ఆ పద్యాన్ని కూడా స్వీకరించి శతకాన్ని పూర్తి చేశాడని కథ. శతకంలో తిరిగిరాని పద్యమూ, తిరిగి వచ్చిన కొత్త పద్యమూ రెండూ ఉన్నాయి! నా దృష్టిలో కవిత్వపరంగా చూస్తే, ఆ రెంటిలోనూ, తిరిగిరాని అన్నమయ్య పద్యం ఉత్తమమైనది. తాత్త్వికదృష్టితో ఆలోచిస్తే, తిరిగివచ్చిన రెండో పద్యం ఉన్నతమైనది! సరే ఇంత చెప్పుకున్నాక ఆ రెండు పద్యాలనూ కూడా చదివి ఆస్వాదించండి మరి.

తిరిగిరాని అన్నమయ్య పద్యం:

తరులం బువ్వులు పిందెలై యొదవి, తత్తజ్జాతితో బండ్లగున్
హర! మీ పాదపయోజ పూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ, నశ్వములౌ, ననర్ఘమణులౌ, గర్పూరమౌ, హారమౌ
దరుణీరత్నములౌ, బటీరతరులౌ, దథ్యంబు సర్వేశ్వరా!

తిరిగివచ్చిన పద్యం:

ఒక పుష్పంబు భవత్ పదద్వయముపై నొప్పంగ సద్భక్తి రం
జకుడై పెట్టిన పుణ్యమూర్తికి బునర్జన్మంబు లేదన్న, బా
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచుం బెద్ద నై
ష్ఠికుడై యుండెడివాడు నీవగుట దా జిత్రంబె సర్వేశ్వరా!
--------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment