Monday, July 15, 2019

ఒక ఉన్మాది మనస్సినీవాలి


ఒక ఉన్మాది మనస్సినీవాలి






సాహితీమిత్రులారా!

సీ. నిండారు తెగగొని నిగిడించు తూపుల
               వైరి మర్మంబులు వ్రచ్చి వ్రచ్చి
     బిగితంపు ముష్టి కంపితమైన యసిధార
               విమత కంఠాస్థులు విఱిచి విఱిచి
     అనువొంద నల్లార్చి యందంద పెనుగద
               శత్రుదేహంబులు చదిపి చదిపి
     చదల వమ్ముగ బర్వు శక్తిశులాదుల
               బగఱ పీనుగు లుర్వి బఱపి పఱపి

తే. ఏ దినంబును వృథవోవనీని కడిమి
     యొదవ బోరాడునాట చెన్నొందెనేని
     కూడు చవి యగుగాక నిష్క్రోధమైన
     దర్పమూరక యూరింప దరమె దేవ!

పద్యాలనగానే లలితమనోహర దృశ్యాలూ సుందరవర్ణనలే అని కొందరు భ్రమపడుతూ ఉంటారు. అలాంటి భ్రమని పటాపంచలు చేసే పద్యం ఇది. మృదుమధురమైన సంగీతాన్నే కాదు ‘ఉన్మాది మనస్సినీవాలిలో ఘూకం కేక’ని కూడా వినిపిస్తుంది కవిత్వం. ప్రాచీన పద్యకవిత్వం కూడా అందుకు సమర్థమైనదే. కొన్ని కావ్యాలలో కథలూ వాటిలోని పద్యాలూ చదువుతూ ఉంటే, ఈనాడు ప్రపంచాన్ని ఉడికెత్తిస్తున్న హింసాప్రవృత్తీ యుద్ధోన్మాదమూ అనాదిగా మానవుని అంతరంగంలో దట్టంగా అలనుకొన్న చీకట్లేనన్న సంగతి స్పష్టంగా తెలిసివస్తుంది. మనిషి అంతరంగంలో దాగిన ఆ ఉన్మాదాన్ని బహిరంగంగా ఆవిష్కరించే కథ బాణాసురవృత్తాంతం. ఆ బాణాసురుని పోరాటకండూతిని నగ్నంగా ప్రదర్శించే పద్యమిది!

నాచన సోమన రచించిన ఉత్తరహరివంశం పంచమాశ్వాసంలో వస్తుంది బాణాసురుని కథ. బాణాసురుడు ఒక విపరీత మనస్తత్వం కలిగినవాడు. ఇతను బలిచక్రవర్తి కుమారుడు. బహుశా యితని చిన్నతనంలోనే తండ్రి పాతాళానికి వెళ్ళిపోయాడేమో! ఇతని చిన్నతనం గురించి అంతగా తెలియదు కాని కొంత పెద్దవాడయ్యాక గొప్ప శివభక్తుడవుతాడు. ఒకనాడు శివుడు కుమారస్వామిని వాత్సల్యంతో దగ్గరకు తీసుకోడం చూసిన బాణునికి సంతోషమూ విచారమూ ఒకేసారి కలుగుతాయి. తన తండ్రి ఉండుంటే తనని కూడా అలా లాలించేవాడు కదా అనుకొంటాడు. ఈశ్వరుడినే తన తండ్రిగా పొందాలని తపస్సు చేస్తాడు, సాధిస్తాడు. పరమశివుడు బాణుని భక్తికి మెచ్చి తన కొడుకుగా ఆదరిస్తాడు. కుమారస్వామి అతడిని తమ్మునిగా గౌరవిస్తాడు. మంచి నగరాన్నీ, గొప్ప శక్తి సంపదలనీ ప్రసాదిస్తాడు. భక్తితో శివుని మెప్పించి తన నగరానికి కాపలావానిగా కూడా చేసుకొంటాడు. తండ్రి బలిచక్రవర్తి దుర్గానికి విష్ణువు కాపలాదారయితే కొడుకుకి శివుడన్న మాట! పైగా వేయిచేతులు కూడా వరంగా పొందుతాడు బాణుడు. ఇంకేవుంది! వాడి గర్వానికి మితి లేకుండా పోతుంది. త్రిలోకాలనూ ఎనిమిది దిక్కులనూ జయిస్తాడు. అయితే, బాణుడి బలానికి భయపడి అందరూ యుద్ధం చేయకుండానే అతనికి లొంగిపోతారు. అందువల్ల యుద్ధకాంక్ష తీరక అతని చేతులు తీటపుడుతాయి. తిరిగి పరమశివుని దగ్గరకి వెళ్ళి తన బాధను వెళ్ళబోసుకొంటాడు. ఆ సందర్భంలో వచ్చే పద్యమిది.

పూర్తిగా అల్లెతాటిని లాగి (నిండారు తెగగొని) ప్రయోగించే బాణాలతో పగవారి ఆయువుపట్టులు (వైరిమర్మంబులు) చీల్చి చీల్చి, బిగించిన పిడికిట కదిలే కత్తి వాదర చేత శత్రువుల మెడల ఎముకలు (విమత కంఠ + అస్థులు) విఱిచి విఱిచి, పెద్ద గదను అనువైన విధంగా త్రిప్పుతూ తిరిగి తిరిగి శత్రువుల శరీరాలను నలగగొట్టి నలిపి నలిపి, ఆకాశంపై (చదలన్) అంతటా వ్యాపించే శక్తి శూలాల వంటి ఆయుధాలతో శత్రువుల శవాలను (పగఱ పీనుగులు) నేలపై పడేసి పడేసి, ఏ రోజూ వృధాగా పోకుండా (వృధ + పోవనీని) పరాక్రమం (కడిమి) చూపించగలిగేటట్టు యుద్ధమనే ఆట (పోరాడు+ఆట) అమరినప్పుడు కదా, తిండి రుచిస్తుంది (కూడు చవి యగుగాక.) ఎవరిపైనా కోపం చూపించలేని నా యీ గర్వం లోలోపల ఉట్టినే ఊరిపోతూ ఉంటే భరించడం శక్యమా!

అదీ బాణుని బాధ! యుద్ధం చేయడమంటే అలాంటి యిలాంటి యుద్ధం కాదు వాడికి కావలసింది. ఎదుటి వారిని నానా రకాలుగా చిత్రవధ చేస్తే కాని ఆ యుద్ధ దాహం తీరదు. అప్పుడు కాని అసలు తిండి కూడా సహించదట! కంటకుడైన శత్రువు తనంతటి వాడు ఒకడుంటే, ‘కంటికి నిద్రవచ్చునె, సుఖంబగునే రతికేళి, జిహ్వకున్ వంటక మిందునే’ అని కాశీఖండంలో వింధ్యుడు వాపోతాడు. ఈ బాణాసురుని బాధ ఇంకాస్త విపరీతమైనది. తనంతటి శత్రువు కలిగి, అతనితో యుద్ధం చేస్తేనే కాని వీడికి తిండి రుచించదు!

బాణాసురిని రాక్షసోన్మాదం అంతా మనకి చాలా స్పష్టంగా స్ఫురింపజేసేలా సాగింది నాచన సోమన పద్యరచన. ఆ పైశాచికస్వభావాన్ని విపులంగా ఆవిష్కరించడంలో కవి ఎలాంటి మొహమాటమూ చూపలేదు. అందుకే సీసపద్యం ఎన్నుకొన్నాడు. నిండారు, బిగితంపు, మొదలైన విశేషణాలూ; వ్రచ్చి వ్రచ్చి, విఱిచి విఱిచి, అంటూ సీసపద్య పాదాల చివర ఆమ్రేడితమైన క్రియలు, బాణాసురుని కోరిక తీవ్రతను సంపూర్ణంగా ధ్వనింపజేస్తున్నాయి. బాణాసురునికి యుద్ధం ఒక క్రీడ. అది లేని రోజు వృధాగా పోయినట్టే! ‘కూడు చవి యగుగాక’ అన్నది పదునైన అచ్చ తెనుగు ప్రయోగం. బహుశా ఇది తిక్కనగారి ఒరవడి. ఇలా ఒక వ్యక్తి స్వరూప స్వభావాలను మనసుకెక్కేట్టుగా వర్ణించడం మంచి కవిత్వ లక్షణం. అయితే అందులోంచి ఒక సార్వజనీనమైన అంశమేదయినా వ్యంజింప జేయగలిస్తే అది మరింత గొప్ప కవిత్వం అవుతుంది. అది తర్వాతి పద్యంలో కనిపిస్తుంది. బాణాసురుని చేత యింకా యిలా అనిపించాడు సోమన.

దేవా! కయ్యముతోడి వేడుక మదిం దీండ్రింప మర్త్యుండు నే
త్రోవం జేతులతీట వుత్తునని కోరున్ దానువుండైన నా
కీ వే చేతులు చేసి తీ కసిమి రింకెట్లోర్తు నోర్తున్ రిపు
గ్రీవాఖండనమండనస్ఫురదసిక్రేంకారముల్ గల్గినన్

‘కయ్యముతోడి వేడుక’ అంటే యుద్ధకాంక్ష. యుద్ధకాంక్ష మనసులో తీండ్రిస్తూ (చెలరేగుతూ) ఉండే మనిషి (మర్త్యుండు), ఎలాగయినా సరే తన చేతుల తీట తీర్చుకోవాలని (పుత్తునని) ఆరాటపడుతూ ఉంటాడు. మనిషికయితే రెండే చేతులు. నువ్వు నాకు ఈ వేయి చేతులు చేశావు (చేసితి). ఈ కసిమిరి (తీట) ఇంక నేనెలా ఓర్చుకోగలను. ‘రిపు గ్రీవా ఖండన మండన స్ఫురత్ అసి క్రేంకారముల్ గల్గినన్’ ఓర్చుకోగలను. శత్రువుల కంఠాలు నఱకడమనే అలంకారంతో ప్రకాశించే ఖడ్గపు క్రేంకారాలు (తలలు నరికేటప్పుడు, అవి విరిగి పడేటప్పుడూ వచ్చే శబ్దాలు) వినగలిగినప్పుడు తన చేతుల తీట తీరుతుందని చెపుతున్నాడు బాణాసురుడు. రెండు చేతులున్న మనిషికే తీవ్రమైన యుద్ధకాంక్షతో చేతులు తీటపెడుతూ ఉంటే, వేయిచేతుల దానవుడైన తనకు మరెంతగా ఆ పోరుతీట ఉంటుందోనని సమర్థింపు కూడానన్న మాట! ఇక్కడ బాణాసురుని స్వభావాన్ని వ్యక్తపరచడంతో పాటుగా నిరంతరమైన మనిషి యుద్ధోన్మాదంపై ఒక వ్యంగ్యాస్త్రాన్ని కూడా సంధించాడు సోమన. పద్యమంతా అచ్చతెలుగు పొడి మాటలతో నడిపించి, చివరికి ఒక దీర్ఘసంస్కృత సమాసం ప్రయోగించడం ఒక పద్యరచనా శిల్పం. అది చదువరులలో ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా, సందర్భోచితంగా వాడినట్లయితే, చెప్పే విషయాన్ని మరింత దీప్తిమంతం కూడా చేస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్న బాణాసురునిలో, శత్రువుల తలలు నఱకడమనే తలపు వచ్చేసరికల్లా, ఒక్కసారిగా ఉప్పొంగిన ఉత్సాహావేశాలు చివరి సమాసం ద్వారా అద్భుతంగా స్ఫురిస్తాయి.

శివుడు కానీ శివుడంతటి యోధుడు కానీ తనతో యుద్ధం చేస్తే తప్ప తనకి తృప్తి కలగదని బాణుడు కోరుకొంటాడు. శివుడు భక్తుని వెఱ్ఱితనానికి నవ్వుకొని అలాగే జరుగుతుందని వరమిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణునితో బాణాసురునికి యుద్ధం సంభవిస్తుంది. విశేషం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇతర రాక్షసుల్లాగా, బాణాసురుడిని చంపడు. అతని చేతులన్నిటినీ నరికేసి, నాలుగు చేతులు మాత్రం మిగులుస్తాడు. దానితో బాణుని ఉన్మాదం నశిస్తుంది. తన కూతురుని కృష్ణుని మనవడికిచ్చి పెళ్ళి చేస్తాడు.

ఈనాటికీ వేయి చేతులున్న బాణాసురులకి కొదవేమీ లేదు. అయితే మనిషిని చంపడం కన్నా మనిషిలోని ఉన్మాదాన్ని చంపడం కష్టతరం, కానీ అదే మేల్తరం కూడాను అన్న సందేశాన్ని మనం బాణాసురవృత్తాంతం నుండి తీసుకోవచ్చునేమో!
------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment