Wednesday, March 6, 2019

వంద సంవత్సరాల క్రితం


వంద సంవత్సరాల క్రితం




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి............

వేదాలు వల్లించలేదట
ఉపనిషత్తుల సారం గ్రహించలేదట
పురాణాలు పఠనం చెయ్యలేదుట
కానీ ప్రకృతి లక్షణాలని పరికించి పరిశీలించి
తను వేసిన ప్రశ్నల్ని
తను ఇచ్చిన సమాధానాల్ని
వేద వాక్కులంటున్నారు.

చిన్నప్పుడు లెక్కలు కట్టటమే
సరిగా తెలియని
మామూలు బడి పిల్లవాడట!
విశ్వవిద్యాలయాల్లో
ఉద్యోగం దొరకని
గుమాస్తా పనిగాడట!
కానీ అరుదైన దృష్టితో
అద్భుత సృజనతో
సృష్టి ప్రాథమిక సూత్రాలు కొన్నిటిని
సరిదిద్ది తిరగ వ్రాసిన
మహానుభావుడీతడట!

అందరి గడియారాలు ఒకే టైం చూపిస్తాయని
యావద్విశ్వ ప్రపంచానికి కాలప్రమాణం ఒకటేనని
భ్రమతో తృప్తి పడుతున్న మానవ లోకానికి నిజం చెప్పి కళ్ళు విప్పాడు
ఎవరి గడియారం వాడిదేనట, ఒకరి గడియారం మరొకరికి సరిపడదట
కాంతి వేగంతో పరిగెడితే
ముందుకు సాగం సరిగదా
మనలోని ప్రతి జీవకణపు కాలచక్ర పరిభ్రమణ వేగం తగ్గి తరిగి
ముసలితనానికి ఆనకట్టలు పడి యౌవనం పొడుగవుతుందట.
మనకనువుగా దూరాలు సంకోచించుకుని
దూర నక్షత్ర మండలానికి
దారి సుగమం అవుతుందట

గట్టి రాళ్లలోనూ
స్రవించే ద్రవాలలోనూ
ప్రవహించే వాయువులలోనూ
నిత్యం కదులుతూ నాట్యం చేస్తూ
అణువులు గుంపులు గుంపులు గా విహరిస్తూ ఉంటాయని
ప్రతి వస్తువూ అణు-కణాల సముదాయమని,
కణాదుడు, డెమోక్రిటియస్,
అనాదిగా ఎందరో విజ్ఞానులు
ప్రవచిస్తూ వచ్చారు
ఈ కణాల సైజు, అణువుల సంఖ్య
కచ్చితంగా లెక్కలు కట్టే పద్ధతి మాత్రం
శతాబ్ది కిందట
మానవ జాతికి
ఈ మహామేధావి పెట్టిన బిక్ష

భూదేవిని తడిపి ముంచే
భూపాలుని కిరణరశ్మి
విశ్వమంతా వ్యాపించి
నిశ్చలమైన వేగం తో ప్రసరించే
కాంతి కణ సముదాయమని
నిర్వచించిన మహావిజ్ఞాని

ప్రకృతి నాట్య ప్రదర్శనకి తెరతీసి
సృష్టి రహస్యాలపై వెలుగు ప్రసరింపచేసి
మన కోసం, మన నాగరికత కోసం
సాంకేతిక సామగ్రుల సముపార్జన కోసం
జరిగే శాస్త్ర విజ్ఞాన పరిశోధనను
అధిశాసించినవీయన మాటలు-
మేసర్లు, లేసర్లు, క్లిస్ట్రానులు, సింకోట్రానులు
ఆటంబాంబులు, హైడ్రొజన్ బాంబులు ఒకటి కాదు బోలెడు

అందుకనే అన్నారు
క్రోధి నామ సంవత్సరం పంతొమ్మిది వందల అయిదు
“యానస్ మిరాబిలిస్” అని
అద్భుతమైన ఏడాదని!
ఆనాడు ఐన్‌స్టయిన్ వ్రాసిన
అయిదు పరిశోధనా పత్రాలే
వంద సంవత్సరాల క్రితం
జరిగిన అద్భుతాలు!
విశ్వ రహఃపేటిక నుండి
జారి పడిన మహాద్భుతాలు!!

Source: Einstein’s Miraculous Year: Five papers that changed the face of Physics. Edited by John Stachel. Princeton University Press 1998
------------------------------------------------------
రచన: పెమ్మరాజు వేణుగోపాల రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment