Monday, March 11, 2019

స్టాంప్ ఆల్బమ్‌


స్టాంప్ ఆల్బమ్‌




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి..................

రాజప్ప కీర్తి పాతబడిపోయింది. మూడు రోజులుగా పిల్లలందరూ నాగరాజు చుట్టూ మూగేస్తున్నారు. నాగరాజుకి గర్వం తలకెక్కేసింది అని రాజప్ప తోటి పిల్లలతో కూడా చెప్పాడు. ఎవరూ ఒప్పుకోలేదు. నాగరాజు సింగపూర్ నుండి వాళ్ళ మామయ్య పంపిన ఆల్బమ్‌ను అందరికీ చూపించాడు. బడిలో పొద్దున గంట కొట్టేంతవరకు పిల్లలు నాగరాజు చుట్టూనే నిల్చుని ఆల్బమ్‌ను చూశారు. మధ్యాహ్నం లంచి టైములోనూ వాడి చుట్టూనే మూగారు. గుంపులు గుంపులుగా ఇంటికి వచ్చికూడా చూసెళ్ళారు. ఓపిగ్గా అందరికీ చూపించాడు. ఎవరూ ఆల్బమ్‌ను తాకకూడదన్న ఒక్క షరతు మాత్రం పెట్టాడు. వాడే ఒడిలో పెట్టుకుని ఒక్కొక్క పేజీగా తిప్పుతూ ఉంటే పిల్లలు చూసుకోవాలి.

బడిలో అమ్మాయిలకు కూడా నాగరాజు ఆల్బమ్‌ను చూడాలని ఆశ కలిగింది. అమ్మాయిలందరి తరఫున పార్వతి వచ్చి అడిగింది. ఆ అమ్మాయికి ధైర్యం ఎక్కువ. ఆల్బమ్‌కు అట్టవేసి ఆమె చేతికిచ్చాడు నాగరాజు. అమ్మాయిలందరూ చూశాక సాయంత్రానికి తిరిగి వాడి చేతికొచ్చింది ఆల్బమ్‌.

ఇప్పుడు రాజప్ప ఆల్బమ్‌ గురించి మాట్లాడే నాథుడే లేడాయె. వాడి పేరు పడిపోయింది.

ఒకప్పుడు రాజప్ప ఆల్బమ్‌ విద్యార్థుల మధ్య బాగా ప్రసిధ్ధం. తేనెటీగ తేనె పోగుచేసినట్టు ఒక్కో స్టాంపుగా సేకరించి పెట్టుకున్నాడు. ఇది తప్ప మరో విషయం మీద ధ్యాస ఉండేది కాదు వాడికి. పొద్దున ఎనిమిదికే ఇంటినించి బయల్దేరి, స్టాంపులు సేకరించే పిల్లలందరి ఇళ్ళకూ వెళ్ళేవాడు. రెండు ఆస్ట్రేలియా స్టాంపులిచ్చి ఒక ఫిన్లాండ్ తీసుకునేవాడు. రెండు పాకిస్తాను తీసుకుని ఒక రష్యా ఇచ్చేవాడు. సాయంత్రం బడినుండి ఇంటికి రాగానే సంచక్కడ పడేసి, అమ్మ ఇచ్చిన జంతికలు నిక్కర్ జేబులో పోసుకుని, నిల్చునే కాఫీ తాగేసి, ఇంటినుండి బయల్దేరేవాడు. నాలుగు మైళ్ళు దూరంలో ఉన్న ఓ పిల్లాడిదగ్గర కెనడా ఉన్నట్టు సమాచారం అందేది. జంతికలు నములుతూ అడ్డదారిలో పొలాల గట్లమీద పరుగు తీసేవాడు.

ఆ బళ్ళో అందరికంటే వీడి స్టాంప్ ఆల్బమే పెద్దది. బడిలో చదివే ఒక పిల్లాడు ఆ ఆల్బమ్‌కు పాతికి రూపాయలిస్తానన్నాడు. సిరస్తాదారు కొడుకు వాడు. డబ్బు మదం! డబ్బులిచ్చి ఆల్బమ్‌ కొనేయాలని చూశాడు. రాజప్ప బాగా గడ్డి పెట్టాడు. ‘మీ యింట్లో ముద్దుగా ఉండే ఒక పసిబిడ్డ ఉంటుంది కదా? ముప్పై రూపాయలిస్తాను. డబ్బులకిచ్చేస్తావా?’ అనడిగాడు. అక్కడ కూడివున్న పిల్లలందరూ చప్పట్లుకొట్టి, ఈలలేసి రాజప్పకి ఆమోదం తెలిపారు.

అయితే ఇప్పుడు వాడి ఆల్బమ్‌ గురించిన మాటేలేదు. అంతేకాదు, నాగరాజు ఆల్బమ్‌ను చూసిన అందరూ దాన్ని రాజప్ప ఆల్బమ్‌తో పోల్చారు. రాజప్ప ఆల్బమ్‌ ఏ కొసకూ సరితూగదట.

రాజప్ప నాగరాజు ఆల్బమ్‌ను చూపించమని అడగలేదు. అయితే వేరేవాళ్ళు చూసేప్పుడు ఆ పక్కకే తిరగనట్టు ముఖం పెట్టుకుని ఓరకంట చూశాడు. నిజంగానే నాగరాజు ఆల్బమ్‌ చాలా అందంగా ఉందని తెలిసింది. రాజప్ప ఆల్బమ్‌లో ఉన్న స్టాంపులు నాగరాజు ఆల్బమ్‌లో లేవు. సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ ఆల్బమ్‌ చూడటానికి నాణ్యంగా, చాలా అందంగా ఉంది. దాన్ని చేతిలో పెట్టుకుని ఉండటమే గొప్పగా అనిపిస్తుంది. అలాంటి ఆల్బమ్‌ ఈ ఊరి అంగళ్ళలో దొరకదు.

నాగరాజు ఆల్బమ్‌ మొదటి పేజీలో ముత్యాల్లాంటి అక్షరాలతో వాడి మామ ఇలా రాసి పంపారు.

ఏ.ఎస్.నాగరాజు
సిగ్గులేకుండా ఈ ఆల్బమ్‌ను ఎవరూ దొంగిలించరాదు.
పైన రాసున్న పేరు చూడు. ఇది నా ఆల్బమ్‌.
గడ్డి ఆకుపచ్చగా ఉన్నంతవరకు, తామర పువ్వు ఎర్రరంగులో ఉన్నంతవరకు,
సూరీడు తూర్పున ఉదయించి పడమరన అస్తమించేంతవరకు ఇది నా ఆల్బమే.

తక్కిన పిల్లలందరు దీన్ని వారి వారి ఆల్బమ్‌లలో రాసుకున్నారు. అమ్మాయిలూ తమ నోటు పుస్తకాలలోను, పాఠ్యపుస్తకాలలోనూ రాసుకున్నారు. “ఎందుకర్రా వాడిని చూసి మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు?!” అని పిల్లల మీద అరిచాడు రాజప్ప.

ఎవ్వరూ బదులు మాట్లాడకుండా రాజప్పకేసి చూశారు. కృష్ణుడు అలా మౌనంగా ఉండలేదు.

“పోరా కుళ్ళుబోతోడా!” అని అరిచాడు కృష్ణుడు.

“నాకెందుకురా కుళ్ళు? వాడి ఆల్బమ్‌ కంటే నాది పెద్దదిరా!” అన్నాడు రాజప్ప.

“వాడి దగ్గరుండే ఒక స్టాంప్ నీ దగ్గరుందా? ఇండోనేషియా స్టాంపొక్కటి చాలు. కళ్ళకద్దుకోరా వాడి స్టాంపుని,” అన్నాడు కృష్ణుడు.

“నా దగ్గర ఉండే స్టాంపులన్నీ వాడిదగ్గర ఉన్నాయా?” అనడిగాడు రాజప్ప.

“వాడి దగ్గరుండే ఒక స్టాంపు చూపించు చూద్దాం,” అన్నాడు కృష్ణుడు ఉక్రోషంగా.

“నా దగ్గరుండే ఒక్క స్టాంప్ వాణ్ణి చూపించమను చూద్దాం. పది రూపాయలు పందెం!”

“నీది చెత్త ఆల్బమ్‌… చెత్త ఆల్బమ్‌…” అని కేకపెట్టాడు కృష్ణుడు. అక్కడున్న పిల్లలందరూ “చెత్త ఆల్బమ్‌… చెత్త ఆల్బమ్‌…” అని వంత పాడారు.

తన ఆల్బమ్‌ గురించి ఇక మాట్లాడటం దండగని అర్థంచేసుకున్నాడు రాజప్ప.

‘అష్టకష్టాలుపడి ఒక్కొక్క స్టాంపుగా సేకరించి తయారుచేసుకున్న ఆల్బమ్‌ తనది. సింగపూర్ నుండి తపాలాలో వచ్చిన ఆల్బమ్‌ నాగరాజుని ఒక్కే రోజులో గొప్పవాణ్ణి చేసేసింది. రెంటికీగల తేడా ఈ పిల్లలకి తెలియదు. చెప్పినా ఈ తెలివితక్కువ శుంఠలకు తలకెక్కదు’ అనుకున్నాడు.

కానీ రాజప్ప లోలోపల కుమిలిపోతున్నాడు. బడికి వెళ్ళడానికే ఇష్టం కలగటంలేదు.

తోటి పిల్లల ముఖాలు చూడటానికే సిగ్గేసింది. మామూలుగా శని, ఆదివారాల్లో స్టాంపుల కోసం తెగ తిరిగేవాడు ఇప్పుడు ఇంటినుండి అడుగు బయటకు పెట్టడమే లేదు. ఒక్క రోజులో రాజప్ప తన ఆల్బమ్‌ను ఎన్నిసార్లు తిరగేసేవాడో లెక్కే ఉండేది కాదు. రాత్రి నిద్రనుండి ఉన్నట్టుండి మేలుకుని ట్రంకుపెట్టె తెరచి ఆల్బమ్‌ను ఒకసారి తిరగేసి మళ్ళీ పడుకునేవాడు. అలాంటిది, గత నాల్రోజులుగా పెట్టెనుండి బయటకైనా తియ్యలేదు. ఆల్బమ్‌ను చూడాలంటేనే చిర్రెత్తుకొస్తోంది. నాగరాజు ఆల్బమ్‌తో పోలిస్తే తన ఆల్బమ్‌ ఒట్టి అప్పళం పొట్లం అనిపించింది వాడికి.

రాజప్ప ఒక నిర్ణయానికొచ్చాడు. ఈ అవమానాన్ని వాడు ఎక్కువ రోజులు ఓర్చుకోలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం నాగరాజు ఇంటికి వెళ్ళాడు.

‘ఉన్నట్టుండి నాగరాజు చేతిలోకొక ఆల్బమ్‌ ఊడిపడిందంతే! స్టాంపు సేకరణలో ఉన్న పట్టువిడుపులూ, కష్టనష్టాలు వాడికేం తెలుసు? ఒక్కో స్టాంపుకూ స్టాంపు సేకరించేవాళ్ళ దగ్గర ఎంత విలువుంటుందో వాడికి తెలుసా ఏంటి? పెద్ద స్టాంపే గొప్ప స్టాంప్ అనుకుంటూ ఉంటాడేమో. స్టాంపుల విషయంలో నాకున్నంత అవగాహన, అనుభవం వాడికిలేదు. వాడు కేవలం ఔత్సాహికుడంతే. నా దగ్గరున్న పనికిరాని స్టాంపులు కొన్నిచ్చి విలువైన స్టాంపులు కొట్టేయలేనా ఏంటి? ఎందరి దగ్గరో నా తెలివితేటలు ప్రదర్శించి స్టాంపులు సంపాయించలేదా? ఈ విషయంలో నేనెరిగిన మాయలూ, యుక్తులూ ఎన్నెన్నీ? ఈ నాగరాజు నా ముందు ఏ మూలకి?’

రాజప్ప నాగరాజు ఇంటికి చేరుకుని మేడమీదకెళ్ళాడు. వాడు తరచూ ఆ ఇంటికి వచ్చేవాడే కాబట్టి వాడ్ని ఎవరూ ఏమీ అడగలేదు. మేడమీద నాగరాజు బల్లముందు కూర్చున్నాడు రాజప్ప. కాసేపటికి నాగరాజు చెల్లెలు కామాక్షి వచ్చింది. “అన్నయ్య టవునుకెళ్ళాడు,” అని చెప్పి “అన్నయ్య ఆల్బమ్‌ను చూశావా?” అనడిగింది.

“ఊఁ” అన్నాడు రాజప్ప.

“చాలా బాగుంది కదా? స్కూల్లో వేరే ఎవరి దగ్గరా ఇంత పెద్ద ఆల్బమ్‌ లేదంట కదా?”

“ఎవరన్నారు?”

“అన్నయ్యే చెప్పాడు.”

పెద్ద ఆల్బమ్‌ అంటే ఏంటి? చూడటానికి పెద్దదిగా ఉంటే చాలా?

కాసేపక్కడ ఉండి, కామాక్షి కిందకెళ్ళిపోయింది.

రాజప్ప బల్లమీద్దున్న పుస్తకాలు చూస్తూ కూర్చున్నాడు. అనుకోకుండా చేయి డ్రాయర్ తాళానికి తగిలింది. లాగి చూశాడు. తాళమేసి ఉంది. తెరిచి చూస్తే ఏమౌతుంది? బల్ల మీద వెతికి తాళం చెవి పట్టుకున్నాడు. మెట్లదగ్గరకెళ్ళి ఓ సారి కిందకు తొంగి చూసొచ్చి, గభాలున డ్రాయర్ తీశాడు. పైనే ఉంది ఆల్బమ్‌. మొదటి పేజీ తెరవగానే దానిలో రాసున్నది చదివాడు. గుండె లబక్ లబక్ మని కొట్టుకుంటోంది. ఒక్క నిముషంలో డ్రాయర్‌కి తాళం వేశాడు. ఆల్బమ్‌ తీసి షర్ట్‌కి నిక్కర్‌కీ లోపల దాచుకుని కిందకు దిగి ఇంటికేసి చూసి పరుగు పరుగున అక్కడనుండి వెళ్ళిపోయాడు.

నేరుగా ఇంటికి వెళ్ళి పుస్తకాల అలమరా వెనుక ఆల్బమ్‌ను దాచి పెట్టాడు. వాకిట్లోకొచ్చాడు. ఒళ్ళంతా కాలిపొతున్నట్టుంది. ముఖంలో సూదులు పొడిచినట్టు జివ్ జివ్వుమని నొప్పిగా ఉంది.

రాత్రి ఎనిమిది గంటలకు ఎదిరింటి అప్పు వచ్చాడు. చేతులూ తలా ఆడిస్తూ విషయం చెప్పాడు. నాగరాజు స్టాంప్ ఆల్బమ్‌ కనిపించట్లేదంట. వాడూ నాగరాజూ టవునుకెళ్ళారట. తిరిగొచ్చి చూసేసరికి ఆల్బమ్‌ కనిపించట్లేదట.

రాజప్పకి మాటలే రాలేదు. అప్పు ఎలాగో ఒకలాగా అక్కడ్నుండి వెళ్ళిపోతే బాగుండనిపించింది రాజప్పకి. అప్పు అటు వెళ్ళగానే గదిలోకొచ్చి గడియ పెట్టాడు. అలమరా వెనక్కెళ్ళి ఆల్బమ్‌ తీసుకున్నాడు. వేళ్ళు బిగుసుకుపోయాయి. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కిటికీ వైపు ఎవరైనా చూస్తారేమోనని భయమేసి మళ్ళీ అలమరా వెనక ఆల్బమ్‌ను దాచాడు.

రాత్రి అన్నం సరిగ్గా తినలేకపోయాడు. పొట్టంతా బరువుగా అనిపించింది. ఇంట్లోవాళ్ళు వాడి ముఖం చూసి, “ఏంట్రా అదోలా ఉన్నావు?” అనడిగారు. తన ముఖంలో భయంకరమైన తేడా వచ్చేసిందేమో అనుకున్నాడు రాజప్ప.

ఎలాగైనా నిద్రపోవాలి అని పడకేశాడు. నిద్ర పట్టలేదు. తను నిద్రపోయేప్పుడు ఎవరైనా అలమరా వెనకనున్న ఆల్బమ్‌ను కనిపెట్టేస్తే ఏం చెయ్యాలి అని భయమేసి, ఆల్బమ్‌ను తీసుకొచ్చి దిండుకింద పెట్టుకున్నాడు.

రాత్రెప్పుడు నిద్రపోయాడో వాడికే తెలియదు. పొద్దున నిద్ర లేచాక తలదిండు కిందనున్న ఆల్బమ్‌ తీయలేకపోయాడు. అమ్మో, నాన్నో ఎవరో ఒకరు అక్కడికి వస్తూనే ఉన్నారు. ఆల్బమ్‌తోబాటు పరుపుని మడిచేసి దాని మీద కూర్చున్నాడు.

పొద్దున మళ్ళీ అప్పు వచ్చాడు. అప్పటికీ రాజప్ప మడిచిన పరుపు మీదే కూర్చుని ఉన్నాడు. అప్పు పొద్దున్నే నాగరాజు వాళ్ళింటికి వెళ్ళి అక్కడ్నుండి ఇక్కడికి వచ్చాడు.

“నిన్న నువ్వు వాళ్ళింటికి వెళ్ళావా?” అనడిగాడు అప్పు.

రాజప్పకి పొట్టలో తిప్పింది. మధ్యమంగా తలూపాడు. అంటే ఎలాగైనా అర్థం చేసుకో అన్నది వాడి భావం.

“మేము టవునుకెళ్ళినపుడు నువ్వు మాత్రమే అక్కడికి వచ్చావని కామాక్షి చెప్పింది,” అన్నాడు అప్పు.

తనని అనుమానిస్తున్నారన్నది తెలిసిపోయింది రాజప్పకి.

“నిన్న రాత్రినుండి ఏడుస్తూనే ఉన్నాడు నాగరాజు. వాళ్ళ నాన్న పోలీసులకు చెప్పినా చెప్పొచ్చు…” అన్నాడు అప్పు.

రాజప్ప మౌనంగా ఉన్నాడు.

“వాళ్ళ నాన్న డి.ఎస్.పీ. ఆఫీసులోనే కదా ఉద్యోగం చేసేది? ఆయన చిటికేస్తే పోలీసు టీమంతా వచ్చేస్తారు,” అన్నాడు అప్పు. అప్పుడనగానే, అప్పుని వెతుక్కుంటూ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. అప్పు వెళ్ళిపోయాడు.

రాజప్ప వాళ్ళ నాన్నకూడా టిఫిన్ ముగించి సైకిలేసుకుని బయటకెళ్ళిపోయాడు. గుమ్మం తలుపు మూసే ఉంది.

రాజప్ప ఇంకా ఆ మడత పెట్టిన పరుపు మీదే కూర్చునున్నాడు. అర్ధగంటయింది. కదలకుండా అట్టే కూర్చునున్నాడు.

అప్పుడు గుమ్మం దగ్గర తలుపు కొట్టిన శబ్దం వచ్చింది.

‘పోలీస్, పోలీస్’ అని లోలోపలే చెప్పుకున్నాడు రాజప్ప. తలుపుకి గడియ వేసే ఉంది.

తలుపు కొడుతున్న చప్పుడు కొనసాగుతూనే ఉంది.

రాజప్ప మడిచిన పరుపు విప్పి ఆల్బమ్‌ తీసుకుని అలమరా వెనకాల అల్బమ్‌ను కుక్కాడు. తనిఖీ చేస్తే దొరికిపోతుందే! మేడ మీదకి పరిగెట్టాడు. అక్కడా నిలవలేకపోయాడు. ఆల్బమ్‌ తీసి చొక్కాలో దాచుకుని కిందకు దిగాడు.

అప్పుడూ తలుపు బాదుతున్న శబ్దం వస్తూనే ఉంది.

“ఎవరో చూడరా. వెళ్ళి తలుపు తియ్యి,” అని అమ్మ లోపల్నుండి అరిచింది. ఇంకా కొన్ని క్షణాల్లో అమ్మే వెళ్ళి తీసేస్తుందేమో!

రాజప్ప పెరట్లోకి పరుగు తీశాడు. స్నానాల గదిలోకి దూరి తలుపు గడియ పెట్టుకున్నాడు. వేణ్ణీళ్ళ పొయ్యి మండుతోంది. ఫట్ మని ఆల్బమ్‌ను పొయ్యిలో పడేశాడు. ఆల్బమ్‌కు నిప్పంటుకుని మంట ఇంకాస్త పెరిగింది. అన్నీ విలువైన స్టాంపులు. సులువుగా దొరకని అరుదైన స్టాంపులు. అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి రాజప్పకి.

అప్పుడు స్నానాల గది బయట అమ్మ మాటలు వినిపించాయి.

“స్నానం చేసి తొందరగా బయటకు రా. నీ కోసం నాగరాజు వచ్చాడు,” అంది వాళ్ళ అమ్మ.

రాజప్ప షర్టు నిక్కరు విప్పేసి తడి తువ్వాలు కట్టుకుని బయటొచ్చాడు. ఇంట్లోపలికొచ్చి షర్టు నిక్కరు తొడుక్కుని మేడ మీదకెళ్ళాడు. నాగరాజు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రాజప్పని చూడగానే, “నా స్టాంపు ఆల్బమ్‌ పోయిందిరా…” అని హీనస్వరంలో అన్నాడు. వాడి ముఖంనిండా దుఃఖం కనిపించింది. బాగా ఏడ్చాడని వాడి కన్నులు కూడా చెప్తున్నాయి.

“ఎక్కడ పెట్టావురా?” అని అడిగాడు రాజప్ప.

“డ్రాయర్‌లో పెట్టి తాళమేసినట్టే గుర్తురా. టవునుకెళ్ళి తిరిగొచ్చి చూస్తే కనిపించట్లేదు.”

నాగరాజు కళ్ళనించి నీళ్ళు కారాయి. వాడు రాజప్ప ముఖం చూడటానికి ఇబ్బంది పడి అటు తిప్పుకున్నాడు.

“ఏడవకురా… ఏడవకు…” ఓదార్చాడు రాజప్ప.

రాజప్ప ఓదార్చినకొద్దీ ఇంకా వెక్కివెక్కి ఏడ్చాడు నాగరాజు.

రాజప్ప ఒక్క ఉదుటున కిందకెళ్ళాడు. నిముషంలోపే తిరిగొచ్చి నాగరాజు ముందు వచ్చి నిలబడ్డాడు. రాజప్ప చేతిలో తన ఆల్బమ్‌ ఉంది.

“నాగరాజూ, ఇదిగోరా నా ఆల్బమ్‌. ఇది నువ్వే ఉంచుకో. నీకే ఇచ్చేస్తున్నాను… ఎందుకలా చూస్తున్నావు? సరదాకి చెప్పట్లేదు. నీకే ఇచ్చేస్తున్నాను. ఎప్పటికీ నీకే!”

“ఊరికే చెప్తున్నావు…” అన్నాడు ఏడుపాపుకుంటున్న నాగరాజు.

“లేదురా. నీకు… నీకే ఇచ్చేస్తున్నాను. నిజంగా నీకే! ఉంచుకో.”

రాజప్ప, తన స్టాంప్ అల్బమ్‌ను ఇచ్చేయడమా! జరిగే పనేనా? నాగరాజుకి నమ్మశక్యంగా లేదు. అయితే రాజప్ప అదే మాటని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. వాడి గొంతు కంపించింది.

“నాకిచ్చేస్తే, మరి నీకు?”

“నాకొద్దురా.”

“ఒక్క స్టాంపు కూడా వద్దా?”

“ఊహూఁ!”

“ఒక్క స్టాంపైనా లేకుండా నువ్వెలా ఉండగలవు?” అని అడిగాడు నాగరాజు.

రాజప్ప కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు.

“ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు నువ్వు ఆల్బమ్‌ ఇవ్వనక్కర్లేదు. నువ్వే ఉంచుకో. నువ్వెంతో కష్టపడి సేకరించిన స్టాంపులున్న ఆల్బమ్‌ ఇది,” అన్నాడు నాగరాజు.

“లేదు, నువ్వే ఉంచుకో. నీ దగ్గరే. తీసుకుని ఇంటికెళ్ళి పో. వెళ్ళు, వెళ్ళు…” అని రాజప్ప ఏడుస్తూ గట్టిగా చెప్పాడు.

నాగరాజుకు ఏమీ అర్థం కాలేదు. ఆల్బమ్‌ తీసుకుని కిందకి దిగొచ్చాడు. చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వెనకాల దిగొచ్చాడు రాజప్ప.

ఇద్దరూ గుమ్మం దగ్గరకొచ్చారు.

“నువ్వు నీ ఆల్బమ్‌ ఇచ్చినందుకు చాలా థేంక్స్‌రా. నేను ఇంటికి వెళ్ళనా?” అంటూ గడప దాటబోయాడు నాగరాజు.

“నాగరాజూ!” అని పిలిచాడు రాజప్ప.

నాగరాజు తిరిగి చూశాడు.

“ఆ ఆల్బమ్‌ ఇలా ఇవ్వు. ఈ రోజు రాత్రికి ఒకే ఒక్కసారి ఆల్బమ్‌ మొత్తాన్నీ చూసేసి, పొద్దున్నే నేనే మీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను,” అన్నాడు రాజప్ప.

“సరే.” అని ఆల్బమ్‌ ఇచ్చేసి వెళ్ళాడు నాగరాజు.

రాజప్ప మేడమీదకు వెళ్ళి తలుపేసుకుని ఆల్బమ్‌ను గుండెకేసి అదుముకుని వెక్కివెక్కి ఏడ్చాడు.
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: సుందర రామస్వామి,
(మూలం: స్టాంప్ ఆల్బమ్‌ (1958). సుందర రామస్వామి వాసనై(2016) అన్న కథల సంపుటినుండి.)
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment