Friday, January 4, 2019

మా అమ్మంటే నాకిష్టం!


మా అమ్మంటే నాకిష్టం!




సాహితీమిత్రులారా!

ఈ అనువాద కథను ఆస్వాదించండి..............

ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నాను, బాల్యంలో నేను ‘చడ్డీ రాస్కెల్’ని. ఉదయం లేచిన వెంటనే అమ్మానాన్నలు ఇద్దరూ ‘పాయిఖానాకు వెళ్ళు’ అని ఎంత చెప్పినా ‘రావటం లేదు’ అని జవాబిచ్చి రెండు రెండు రోజులు వెళ్ళకుండా ఉండిపోయేవాణ్ణి. గబ్బువాసన వచ్చే ‘పాయిఖానా’ ఆ చిన్న వయస్సులో ఎలా ఇష్టమవుతుందో చెప్పండి? దానికి బదులుగా మిఠాయి అంగడికి వెళ్ళమంటే రెండు రెండు సార్లు వెళ్ళటానికి సిద్దంగా ఉండేవాడిని. ‘పాయిఖానాకు వెళ్ళేవరకు నీకు అన్నం పెట్టను’ అని అమ్మ కసిరి, నాన్న కన్నెర్రజేసి, నాకన్నా వయస్సులో నాలుగేళ్ళు పెద్దదైన అక్కయ్య చేతిలో చింతబరికె పట్టుకుని ‘వెళతావా లేదా?’ అని గద్దిస్తే మరో దారి లేనట్టు మౌనంగా పాయిఖానాలోకి వెళ్ళి చడ్డీ విప్పకుండానే నీళ్ళను పారబోసి వచ్చేసేవాణ్ణి. అమ్మానాన్నలు ఊరకుండిపోయేవారు. అంతకు మించి ఏ తల్లితండ్రులైనా ఇంకేమి చేయగలరు?


అయితే తల్లితండ్రుల నోళ్ళు మూయించగలిగినా దేహపు నోరు మూయించటం సాధ్యమా? పెట్టినదంతా గుటుక్కుమనిపించి గప్‌చుప్‌గా ఉండటానికి పొట్ట ఏమైనా బ్లాక్‌హోలా? వేళ కాని వేళలో అది చేయిచ్చేది. దాదాపు పాఠశాలకు వెళ్ళినపుడే ఇబ్బంది పెట్టేది. బళ్ళారి జిల్లాలోని మా పాఠశాలలో తాగడానికే నీళ్ళు ఉండనపుడు శౌచ్యానికి, అదీ విద్యార్థుల శౌచ్యానికి నీళ్ళ కోసం ఎదురుచూడ్డం మరీ అత్యాశ అయిన సంగతి. పాఠశాలలో పాయిఖానాలే ఉండలేదు. చుట్టుపక్కల కావలసినంత బయలు ప్రదేశం ఉన్నప్పటికీ మొత్తం పాఠశాల చుట్టూ కంచె వేయించి ఏ విద్యార్థి కూడా తప్పించుకోకుండా చూసుకోవటానికి ప్రధానోపాధ్యాయులు కఠినమైన ఉత్తర్వులు విధించారు. మాస్టర్లంటే భయంతో వణికేవాళ్ళం కావటం వల్ల మా ‘అర్జెంట్’ సంగతిని వాళ్ళ దగ్గర చెప్పుకోవటానికి భయం. ఇక సహవిద్యార్థులకు చెప్పుకుంటే వచ్చే లాభం మాత్రం ఏమిటి?

అప్పుడు ఒకటవ తరగతిలో ఉన్నాను. బండ్రి మాస్టరుగారు “రారా చిలుకా… రంగుల చిలుకా” అని నటిస్తూ మా చేత వల్లెవేయిస్తున్నప్పుడు నాకు ‘వచ్చేసింది’. నా బాధ మాస్టరుగారికి ఎలా అర్థమవుతుంది? ఆయన మరింత ఉత్సాహంతో “రారా చిలుకా… రంగుల చిలుకా” అని మరింత ఉత్సాహంతో నృత్యం చేసి చూపించారు. పిల్లలందరూ గట్టిగా “రారా చిలుకా… రంగుల చిలుకా” అని అరిచారు. పళ్ళను గట్టిగా కరిచి పట్టుకుని, పొట్టను గట్టిగా పిండి, పిలవకుండా వచ్చిన అతిథిని లోపలికి తోయటానికి ప్రయత్నించాను. ‘రావద్దు…రావద్దు’ అని మంత్రాన్ని పఠించేవాడిలా మనస్సులోనే అనుకోసాగాను. అయితే మాస్టరుగారు పట్టుబట్టినట్టు మరింత ఆవేశంతో “రారా చిలుకా… రంగుల చిలుకా” అని అరిచారు. నా నియంత్రణను అధిగమించి వచ్చేసింది. అడుగంతా చల్లబడి ఒంటి మీది రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. బిగపట్టుకున్న బాధను ఇప్పటిదాకా అనుభవించిన నా పొట్ట శాంతించింది. ఇరుగుపొరుగున కూర్చున్న పిల్లల వైపు చూశాను. పక్కనే జరిగిన బాంబ్ విస్ఫోటనపు జ్ఞానమే లేనట్టు “రారా చిలుకా… రంగుల చిలుకా” అని పిల్లలు మాస్టరుగారిని అనుకరిస్తున్నారు. ఆక్సిడెంట్ సద్దు వారి అరుపుల్లో ఎవరికీ వినిపించకుండా అణగిపోయింది. మాస్టరుగారు ఇప్పుడు “పండు ఇస్తాను రా రా” అని చివరికి అడుగు ముందుకు వేశారు. అయితే పండు లేకుండానే రామచిలుక అప్పటికే రావటం జరిగింది.

లేత ముక్కులను మోసం చేయడం ఎంతసేపు సాధ్యం? పక్కన కూర్చున్న పిల్లలకు జరిగిన ప్రమాదపు జాడ దొరికి ముక్కు ఎగపీల్చి అపరాధి ఎవరో తెలియక అటూయిటూ చూడసాగారు. నేను మౌనంగా కూర్చుంటే దొరికిపోతాను కదా? నేనూ ముక్కు మూసుకుని అటూయిటూ చూడసాగాను. అయితే దొంగతనపు భయం లోపల ఉండటం వల్ల కాస్త ఎక్కువగానే నటించసాగాను. పిల్లలకు అనుమానం వచ్చి నా వైపు చూడసాగారు. ముక్కు పుటాలు విప్పార్చి అటూయిటూ మెడ తిప్పే హడావుడి వల్ల పాటలో అపస్వరాలు దొర్లి మాస్టరుగారి దృష్టి మేము కూర్చున్న వైపు పడింది. పాటను ఆపి, “అరేయ్ అబ్బాయి! లేచి నిలబడి ఒక పద్యం చెప్పు,” అన్నారు. నా కాళ్ళల్లో శక్తి సన్నగిల్లింది. ఆయన మాటలు వినలేదన్నట్టు నటించాను. మాస్టరుగారు వదుల్తారా? “చెవులు వినిపించటం లేదేంరా?” అని చేతిలోని బెత్తాన్ని ఎత్తుకున్నారు. మరోదారి లేక లేచి నుంచున్నాను. చిల్లుపడ్డ ప్యాంటు జేబులోంచి నాణాలు రాలిపడ్డట్టు ఉండలు రాలసాగాయి. పిల్లలంతా పామును చూసి బెదరినవారిలా దూరంగా జరిగి నుంచున్నారు. మాస్టరుగారు బెత్తాన్ని పట్టుకుని నా వైపు వచ్చారు.

జరిగిన సంఘటన ఏమిటో అర్థమైన తరువాత మాస్టరుగారు ముక్కు మూసుకున్నారు. నా దగ్గరికి వచ్చి గట్టిగా చెవి నులిమి “పొద్దున్నే ఏం తిన్నావురా? బయటికి వెళ్ళాలని తెలియదా?” అని గద్దించారు. కంచి మేళాన్ని మొదలుపెట్టాను. నాలుగవ తరగతి చదువుతున్న మా అక్కను పిలుచుకుని రమ్మని చెప్పి పంపారు. గౌరి పండుగ అని పట్టులంగా, చోళీ ధరించి, చెవులకు లోలాకులు, మెడలో దండ వేసుకుని చిట్టి గౌరమ్మలా కనిపిస్తున్న మా అక్క క్లాసులోకి ఘల్లుఘల్లుమని గజ్జెల శబ్దం చేస్తూ వచ్చింది. మాస్టరుగారు సాయంత్రం తమ ఇంటిలో గౌరమ్మకు హారతి ఇవ్వడానికి పిలిచారేమో అనే గొప్ప నిరీక్షణలో లోపలికి వచ్చింది. నా అవస్థ చూసి ఏం చేయాలో తోచక కనురెప్పలు టపటపలాడిస్తూ నుంచుంది. మాస్టరుగారు “కొంచెం తుడిచి శుభ్రం చేయమ్మా…” అని అక్కతో అన్నారు. అలాంటి చక్కటి దుస్తులు ధరించిన రోజు ఇలాంటి పని చేయడానికి ఒప్పుకుంటుందా? “మా అమ్మను పిలుచుకొస్తానండీ,” అని మాస్టరుగారి జవాబుకోసం ఎదురుచూడకుండా తుర్రుమని అక్కడి నుంచి పారిపోయింది.

అందరూ మా అమ్మ రాక కోసం ఎదురుచూస్తూ నిలబడిపోయారు. పిల్లలందరూ నా వైపు ఖైదీని చూస్తున్నట్టు చూడటమే కాకుండా ముసిముసిగా నవ్వటం మొదలుపెట్టారు. నాకు దుఃఖం పొంగుకు వచ్చింది. వెక్కివెక్కి ఏడవసాగాను. అయితే కొద్ది సేపట్లోనే దూరంలో మా అమ్మ రావటం కనిపించింది. అమ్మ నడుము మీద నీటి కడవను మోసుకుని, చేతిలో పాతగుడ్డను పట్టుకుని వస్తోంది. అమ్మ వెనుకే అక్క పరుగులాంటి నడకతో వస్తోంది. అమ్మ నన్ను ఎక్కడ తిడుతుందోనని లోలోపల నాకు భయంవేసి దుఃఖం మరింత ఎక్కువైంది.

అమ్మ లోపలికి రాగానే కడవను కిందికి దించి, నా దగ్గరికి వచ్చి నా తలను తన పొట్టకు ఆనించుకుని తల నిమిరి “ఏడవకు… ఏమీ కాలేదు, ఏడవకు.” అని ఓదార్చింది. ఆ ఓదార్పు మాటలకు నాలో దుఃఖం మరింత పొంగుకువచ్చింది. మిత్రులు, మాస్టరు ఎదుట ఉన్నారన్నది మరిచి భోరుమని ఏడ్చేశాను. అమ్మ స్పర్శ నాకు ఎక్కడలేని శక్తిని, సంతృప్తిని ఇచ్చింది. నన్ను ఓదార్చిన అమ్మ నీళ్ళు చల్లి నేలను శుభ్రం చేసింది. అందరూ అమ్మనే చూస్తుండటంతో నాకు విచిత్రమైన అవమానం కలిగినట్టుగా అనిపించసాగింది. పాతగుడ్డతో నేలను తుడిచిన అమ్మ “చిన్న పిల్లవాడు, తెలియదు. క్షమించాలి మాస్టరుగారు,” అని మాస్టరుగారికి చేతులు జోడించి చెప్పి, నా చేయి పట్టుకుని ఇంటికి పిల్చుకుని వచ్చింది.

నా బట్టలన్నీ విప్పించి వేడివేడి నీళ్ళతో నా ఒళ్ళు రుద్దిరుద్ది గుమగుమలాడే సబ్బుతో స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించింది. మురికైన నా నిక్కరును, అంగీని ఉతికి ఆరవేసింది. నా వల్ల అమ్మ ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎంత అవమానం భరించాల్సి వచ్చిందనే విచిత్రమైన అపరాధభావన నాలో చోటుచేసుకుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి “ఇంకొకసారి అలా చేయనమ్మా,” అని రుద్ధస్వరంతో అన్నాను. అమ్మ నా బుగ్గలు పుణికి నుదుటి మీద ముద్దు పెట్టి “నా రాజా!” అని తల నిమిరింది. “నువ్వు పుట్టడానికి ముందు ఎక్కడున్నావో తెలుసా?” అని అడిగింది. తెలియదని తలూపాను. నా చేతిని తీసుకుని తన పొట్ట మీదంతా కదిలిస్తూ “ఇక్కడున్నావు,” అని నవ్వింది. “అప్పుడు ఒకటి-రెండు అంతా నా పొట్టలోనే చేసేవాడివి. పొట్టలోపలే నీ మురికినంతా నేను కడిగేదాన్ని.” అని చెప్పింది. “అవునా?” అని ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చాను.

మరుసటి రోజు పాఠశాలకు వెళ్ళనని మొండికేశాను. మిత్రులంతా అవమానిస్తారన్నది నా సమస్య. నాన్న, “రెండు దెబ్బలు వేస్తాను చూడూ,” అంటూ తన మామూలు వరుసను చూపాడు. అక్క నా చేయి పట్టుకుని తీసుకెళ్ళటానికి నిరాకరించి పాఠశాలకు తన స్నేహితులతో కలసి పారిపోయింది. అమ్మ మాత్రం నాకు నచ్చజెప్పి; దీపావళి పండుగలో మాత్రం బయటికి తీసే గంధపు నూనెను నా ఒంటికి పూసి “చూడు, ఎంత గుమగుమలాడుతున్నావో! ఇక పిల్లలు ఏమీ అనరు. నీ గంధపు నూనె వాసనకు దగ్గరికి వచ్చి కూర్చుంటారు. వెళ్ళు,” అని ధైర్యం నింపింది. గౌరి పండుగ చక్కెర అచ్చులను నా చేతిలో పెట్టి పాఠశాల గేటువరకు తోడుగా వచ్చి నేను వందలాది పిల్లల మధ్య చేరుకునేవరకు చూస్తూ నుంచుని తరువాత ఇంటికి వెళ్ళింది.

అటు తరువాత రోజూ ఉదయం పాయిఖానాకు వెళ్ళటం అలవాటు చేసుకున్నాను. ఆ గబ్బు వాసనను ఎలాగో ఓ పదినిముషాలు భరించి కూర్చుని వచ్చేవాడిని. అయితే మూడవ తరగతిలో ఉన్నప్పుడు మాత్రం నా దురదృష్టం మరొకసారి దర్శనమిచ్చింది. బండ్రి మాస్టరుగారు పిల్లలందరిని విహారానికి గండి నరసింహస్వామి దేవాలయానికి పిల్చుకెళ్ళారు. ఊరి నుంచి నాలుగు మైళ్ళ దూరంలో గుట్టలు, అడవి ఉన్న సుందరమైన స్థలమది. మధ్యాహ్నం భోజనానికి భయంకరమైన కారపు వంట చేయించారు. హాహా అంటూనే అందరం లొట్టలేసుకుంటూ తిన్నాం. అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళాలనుకునే సమయానికి నాకు అవసరం ముంచుకొచ్చింది. వేసవి కాలం కావటం వల్ల చెరువులోని నీళ్ళన్ని ఎండిపోయాయి. మాస్టరుగారికి సమస్యను చెప్పుకోవటం కానీ, నేనే ఎక్కడైనా అడవిలో చెట్టు చాటున కూర్చోవటం కానీ తెలియలేదు. మరొకసారి ‘చడ్డీ రాస్కెల్’ అయ్యాను.

అయితే ఈ సారి మిత్రులకు ఆ విషయం తెలియటం నాకు అస్సలు ఇష్టముండలేదు. చెరువు పక్కనే చిన్న గుట్టలో ఉన్న గుహలో దాగి కూర్చున్నాను. మిత్రులకు, మాస్టరుగారికి నా పరిస్థితి అర్థమై ఎక్కడ నాకు అవమానం కలుగుతుందోనని భయం వేయసాగింది. అయితే మాస్టరుగారు, మిత్రులు నన్ను మరిచిపోయి ఇళ్ళకు వెళ్ళిపోయారు. చీకటి ఆవరించసాగి, బయటి నుంచి ఎలాంటి చప్పుళ్ళు వినిపించనపుడు అనుమానమొచ్చి గుహ నుంచి బయటికి వచ్చి చూస్తే అందరూ తిని పారవేసిన విస్తర్లు గాలికి ఎగురుతున్నాయి. చాలా భయం వేసింది. ఇంటికి వెళ్ళటానికి నాకు దారికూడా తెలియదు. ఏమి చేయాలో తోచక, అక్కడే చీకట్లో ఏడుస్తూ కూర్చున్నాను. చీకట్లో గుడ్లగూబలు ఎగరసాగాయి. కోతులు విచిత్రమైన ధ్వనులతో ఛీత్కారాలు చేయసాగాయి. బర్రుమంటూ వీస్తున్న గాలి గుహ సందుగొందులలో సంచరించి ఎవరో ‘ఓ…’ అని ఏడుస్తున్నట్టు సద్దు చేయసాగింది. చెరువు ఒడ్డున అటూ ఇటూ ఏడుస్తూ తిరిగి తిరిగి అలసి గుహలోనే పడుకున్నాను.

ఓ రెండు గంటల తరువాత అమ్మ, అక్క నన్ను వెదుకుతూ వచ్చారు. అక్క చేతిలో లాంతరు పట్టుకుని ఉంది. నాన్న ఊళ్ళో లేరు. “బాబూ…” అని అమ్మ, అక్క ఆపకుండా కేకలు పెడుతూ నన్ను వెదకసాగారు. నిద్రలో ఉన్న నాకు వారి కేకలు వినిపించలేదు. గుహలో నేనున్నానని వాళ్ళు ఊహించలేకపోయారు. దాంతో ఏమీ చేయాలో తోచక ఒకరికొకరు ఏదేదో తోచింది చెప్పుకుంటూ కూర్చున్నారు. రాత్రవుతున్నట్టే చలి వల్ల నాకు మెలుకువ వచ్చింది. ఎక్కడున్నానో అర్థంకాక కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాను. అస్పష్టంగా అమ్మ కంఠం వినిపించింది. బయటికి పరుగెత్తుకెళ్ళి అమ్మను కరుచుకుని ఏడవసాగాను. అమ్మకూ దుఃఖం పొంగుకు వచ్చింది. ‘పిల్లవాడిని ఒక్కడ్నే వదలి వెళ్ళారుకదా’ అని మాస్టరును శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది. అక్క కూడా నా దగ్గరికొచ్చి నుంచుని నా తలను నిమిరి ఏడవసాగింది. “ఎందుకు నాన్నా… అందరితోపాటు రాకుండా ఇక్కడే ఉండిపోయావు?” అని అమ్మ అడగటంతో నా పరిస్థితిని చెప్పాను. “అయ్యో నా తండ్రీ! పులి, చిరుతలు తిరిగే అడవి ఇది. ఏ మనిషీ చేయకూడని పనిని నువ్వు చేసినవాడిలా ఈ గుహలో కూర్చున్నావు. దేవుడా, జరగరానిది ఏదైనా జరిగివుంటే నా గతి ఏమి తండ్రీ…” అని కూర్చున్న చోటి నుంచే నరసింహస్వామి గోపురానికి చేతులు జోడించింది. మేమిద్దరమూ చేతులు జోడించాం. ఊరికి నడుచుకుంటూ తిరిగొచ్చిన తరువాత అమ్మ మాస్టరుగారి ఇంటికెళ్ళి ఏడుపు కంఠంతోటే తిట్టి వచ్చింది. మాస్టరుగారు, ‘తప్పయిందమ్మా తొందరలో నా దృష్టికి రాలేదు,’ అని క్షమాపణ అడిగారు. ఆ రాత్రి అమ్మ నా పక్కనే పడుకుంది. నాకు నిద్ర పట్టేంతవరకు జోకొడుతూ ఉంది.

నా అవస్థను చూడలేని అమ్మ మరుసటి రోజు నాకు రెండు లోపలి చడ్డీలను తెచ్చింది. కొత్తబట్టలు ఏవైతే ఏమిటి నాకు ఆనందమే ఆనందం. నాన్న మాత్రం “కాస్త గాలి ఆడడానికి వదలవే…” అని వెక్కిరించాడు. లోపల చడ్డీ వేసుకున్న నేను అమ్మ ముందు నుంచుని “బాగున్నానా?” అని అడిగాను. “దిష్టి తగిలేలా ఉన్నావు…” అని బుగ్గలు పుణికి మెటికలు విరిచింది. పాఠశాలలో మూత్రవిసర్జన సమయంలో రెండు చడ్డీలను కిందికి జార్చేటప్పుడు పెద్దవాడినై పోయాను అనే గర్వం కలిగేది.

అదే ఆఖరు. మరెన్నడూ నేను ‘చడ్డీ రాస్కెల్’ కాలేదు. అయితే అక్క మాత్రం అప్పుడప్పుడు వెక్కిరిస్తూనే ఉండేది. ఎవరైనా చిన్నపిల్లలు చడ్డీ రాస్కెల్స్ అయి ఇంటికి ఏడుస్తూ వెళుతుంటే, “నీ బ్రదర్ ఒకడు వెళుతున్నాడు, ఓదార్చడానికి రారా!” అని నన్ను కేక వేసి పిలిచేది. ఎనిమిదవ తరగతిలో చేరినపుడు “ఇకపై మా బంగారు చడ్డీ రాస్కెల్ కావటానికి సాధ్యం లేదు. ఏమైనా ప్యాంట్ రాస్కెలే!” అని వెక్కిరించినపుడు నేను పోట్లాడి, ఆమె జడపట్టి లాగి కుయ్యో మొర్రో అని అరిచేలా చేసేవాడిని. ఇంజనీరింగ్ సీటు దొరికి దూరపు ఊరికి బయలుదేరుతున్నప్పుడు అమ్మానాన్నలు అందరూ కన్నీళ్ళతో వీడ్కోలు ఇస్తుండగా “జాగ్రత్తరోయ్, నువ్వు కాలేజిలో గలీజు చేసుకుని కూర్చుంటే రావటానికి అక్కడ అమ్మ ఉండదు,” అని ఎత్తిపొడిచింది. నేను ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉండగానే ఆమెకు పెళ్ళయింది. నేను ఉద్యోగంలో చేరి, బెంగళూరులో ఇల్లు తీసుకుని సెటిలయ్యే వేళకు ఆమె కొడుకు బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. “పూర్తిగా మేనమామ పోలికే. ఇప్పటికే రెండుసార్లు బడికి వెళ్ళి శుభ్రంచేసి వచ్చాను.” అని చెప్పింది.

అమ్మకు అప్పటికే డయాబిటిస్ జబ్బు మొదలై అయిదారేళ్ళు గడిచాయి. నాన్న కూడా రిటైరయి ఇంట్లోనే ఉండసాగారు. “ఇక ఊళ్ళో ఉండి ఏం చేస్తారు? నా వెంట రండి,” అని వాళ్ళను తీసుకొచ్చాను. ‘పుట్టింటికి వచ్చి ఓ నెల రోజులు హాయిగా ఉంటాను’ అని అక్క అంటూ ఉన్నప్పటికీ మూడేళ్ళు రాలేదు. కొడుకు, భర్త, బడి, ఇదీ అదీ అంటూ కారణాలు ఉండనే ఉండేవి. చివరికి నేనే “అక్కా, అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండలేదు. నువ్వు వచ్చి నాలుగు రోజులు ఉంటే తేరుకుంటుంది,” అని వత్తిడి పెట్టిన మీదట కొడుకును తీసుకుని వచ్చింది. ఇప్పటికే అతను ఏడవ తరగతి చదువుతున్నాడు. “ఇంకా చడ్డీ రాస్కెల్‌గా ఉన్నావేఁరా?” అని అన్నందుకు “ఊరుకో మామయ్య…” అని వాడు ముఖమంతా ఎర్రబరుచుకుని సిగ్గుపడ్డాడు. అమ్మానాన్నలకు మనుమడితో నెలరోజులు ఎలా గడిచాయో తెలియలేదు.

ఆ రోజు హంపి ఎక్స్‌ప్రెస్‌కు అక్క ఊరికి తిరిగి వెళ్ళాలి. “బట్టలు వాషింగ్ మిషన్లో వేయండి, డ్రై చేసుకుని వెళతాను. మళ్ళీ అక్కడ ఎవరు ఉతుకుతారు,” అని అందరి బట్టలూ వేసింది. ఓ పది నిముషాల్లో వాషింగ్ మిషన్లో నీళ్ళు నిండి, అది తిరగటం మొదలుకాగానే పీతి వాసన ఇల్లంతా కమ్ముకుంది. మొదట్లో మాకు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. అక్క కొడుకు వాషింగ్ మిషన్ నుంచి వస్తుందని పసికట్టాడు. “ఏడవ తరగతికి వచ్చిన తరువాత కూడా ఇదేమిట్రా అసహ్యంగా…” అని అక్క కొడుకును తిట్టిపోసింది. “పోమ్మా నేనేం చేసుకోలేదు,” అని వాడు వాదించాడు. “అబద్దాలు చెప్పకు. నువ్వు కాకుండా ఈ ఇంట్లో చిన్నవాళ్ళు ఇంకెవరున్నారు?” అని కసిరింది. వాడు ఒప్పుకోలేదు. “దేవుడి మీద ప్రమాణం అమ్మా. నేను కాదమ్మా,” అన్నాడు వాడు ఏడుపు గొంతుతో. కొడుకు ఏడుపుకు అక్కయ్య కాస్త కరిగింది. “ఏరా, నువ్వా?” అని అనుమానంగా నన్ను అడిగింది. “ఛీ పోక్కా! ఇదేమిటి అసహ్యంగా…” అని ముఖమంతా నలుపుకుని అన్నాను. ‘దాంట్లో పిల్లి ఏమైనా కూర్చుందేమో?’ అని ఆమె అనుమానించటం మొదలుపెట్టింది. ఆమె సుకుమారుడు ఏడుపు మధ్యలో “నాకు తెలుసు, అది ఎవరి పనో…” అని అన్నాడు. “ఎవరో చెప్పు,” అని అక్క అడగ్గానే మా అమ్మ వైపు వేలు పెట్టి చూపించి, “అమ్మమ్మ చేసుకుంది. ఉదయం దగ్గరికి వెళితే వాసన వస్తోంది,” అన్నాడు. అమ్మ ఆ మాటలకు మండిపడుతూ, “అబద్ధం. నా మీద అబద్ధాలు ఎందుకు చెబుతున్నావురా?” అని వాణ్ణి కోపగించుకుంది. “నేనెందుకు అబద్దం చెబుతాను? నువ్వే చేసుకున్నావు. ఇప్పుడు ఒప్పుకోవటంలేదు,” అని వాదించాడు. అమ్మ అత్యంత నిస్సహాయత నిండిన కంఠంతో “నేను కాదే… నీ కొడుకు అబద్దం చెబుతున్నాడు,” అని ఏడుపు అందుకుంది. వాడు మాత్రం అమ్మమ్మ మాటలకు విలువ ఇవ్వకుండా “నువ్వే నువ్వే నువ్వే…” అని గట్టిగా అరిచాడు. అక్క కోపంతో రెండు దెబ్బలు వేసింది. వాడు ఇంటికప్పు ఎగిరిపోయేలా ఏడవసాగాడు.

నేను నేరుగా వెళ్ళి వాషింగ్ మిషన్లో చేయి పెట్టి అమ్మ చీరను బయటికి తీశాను. వాడి అభియోగాన్ని అంగీకరించటానికి అందులో సాక్ష్యం ఉంది. నాకు ఒళ్ళంతా ముళ్ళు లేచినట్టయి కోపం తలకెక్కింది. అమ్మను తిట్టసాగాను. అమ్మ ఇంకా నగరానికి సర్దుకోని పల్లెటూరి మొద్దు అనే భావన ఎక్కడ మనసు మూలలో దాక్కుని కూర్చుందో, నా అసహ్యకరమైన తిట్లలో బయటికి వచ్చింది. “సిగ్గు వేయదా నీకు? ఇంత పెద్దదానివై ఆ మాత్రం తెలియదా? నా ఆఫీసు బట్టలు కూడా అక్కయ్య అందులో వేసింది. రేపు ఆ వాసన వచ్చే బట్టల్ని వేసుకుని వెళ్ళాలా? ఇరుగుపొరుగు ఇళ్ళవరకు ఆ వాసనపోతే వాళ్ళు ఊరుకుంటారనే అనుకుంటున్నావా? ఇది బెంగళూరు. బళ్ళారిలాంటి పల్లెటూరు కాదు. రేపే ఇల్లు ఖాళీ చేయండని అంటారు. నువ్వు మరో ఇల్లు వెదికిపెడతావా? ఛీ…” అని సగం అసహ్యం, సగం కోపంతో అరిచాను. అమ్మ జవాబివ్వకుండా తల వంచుకుని కూర్చుంది.

హంపి ఎక్స్‌ప్రెస్‌కు వేళ కాసాగింది. అక్కయ్య నన్ను శాంతపరిచి, తన బట్టలన్నీ బచ్చలింట్లో ఉతుక్కుని, పిండి, తడి బట్టల్ని మూటకట్టుకుని ప్రయాణానికి సిద్దమైంది. భోజనం చేయటానికీ సమయం లేదు. అక్కను వదలిరావటానికి నేను రైల్వేస్టేషన్‌కు వెళ్ళాను. అక్కయ్య, ఆమె కుమారుడు ఆటోలో బయలుదేరితే, వాళ్ళను అనుసరిస్తూ బైకులో నేను. రైల్లో వాళ్ళను ఎక్కించి, పరుగున వెళ్ళి పెరుగన్నం కట్టించుకుని వచ్చి కిటికీలోంచి అక్క చేతిలో పెడుతుండగా రైలు కూత పెట్టింది. ప్లాట్‌ఫామ్‌లో రైలు వెంబడి నడుస్తున్నప్పుడు అక్క నాకు బుద్దిమాటలు చెప్పసాగింది. “అమ్మ మీద కోప్పడకురా. ఆమె ఆరోగ్యం బాగాలేదు. బిగపట్టుకోవడానికి తగిన శక్తి ఉందోలేదో? మా అత్త కూడా ఇలాగే చేసుకునేవారు…” అని చెబుతుండగానే రైలు వేగాన్ని పుంజుకుంది. రైలు వెళ్ళిపోయి, జనమంతా ఖాళీ అయినా అక్కడే బెంచీ మీద కూర్చున్నాను. అమ్మ మీద కోపంతో అలా అరవకుండా వుండాల్సింది అనిపించి పశ్చాత్తాపం కలగసాగింది. ఇంట్లో జరిగిన రభస వల్ల మనస్సుకు చాలా బాధ కలిగింది.

నాన్న వీధి చివరన ఎదురుచూస్తున్నారు. నేను కనిపించగానే చేయిచాపి బైక్ ఆపారు. బైకును తోస్తూ నాన్నతో అడుగులు వేయసాగాను. “మీ అమ్మకు చాలా దుఃఖం కలిగింది. నాతోనూ మాట్లాడకుండా గదిలో కూర్చుంది. కాస్త వెళ్ళి ఓదార్చు. ఈ మధ్యన ఎందుకో డయాబిటిస్ చాలా వేధిస్తోంది,” అని వేడుకున్నారు.

ఇంట్లో అమ్మ గదిలో ఒక్కతే పడుకునివుంది. నేను లోపలికి వెళ్ళాను. “అమ్మా…” అన్నాను. లేచి కూర్చుంది. దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమె చేతులు పట్టుకుని “తప్పయిందమ్మా, ఎందుకో కోపంతో మతిపోయి అనకూడనిదంతా అనేశాను. నాది తప్పయిందమ్మా,” అని ఆమె చేతులను రెండు దోసిళ్ళలో వెచ్చగా పట్టుకున్నాను. అమ్మ ఏడవసాగింది. “నీవు నన్ను తిట్టావు…” అని చిన్నపిల్లలా ఫిర్యాదు చేసింది. “లేదమ్మా, ఇకపై ఎప్పుడూ తిట్టను,” అని ఆమెను హత్తుకుని వీపు నిమిరి ఓదార్చాను. “నాకు తెలియకుండానే చీరలో అయిపోతూవుంటుంది. నేను కావాలని మిషిన్లో వేయలేదు…” అని చెప్పి రోదించసాగింది. “ఏడవకమ్మా, ఏమీ కాలేదు… ఏడవకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. నీకు తోడుగా నేనున్నాను కదా? ఇప్పుడు భోజనం చేద్దాం రా,” అన్నాను.

మరుసటి రోజు అమ్మ ఒక్కతే బచ్చలింట్లో తన చీర, జాకెట్టు ఉతుక్కుంటూవుంది. నాకు ఏం చెప్పాలో తోచలేదు. “ఎందుకు బట్టలు ఉతుకుతున్నావమ్మా?” అని అడిగాను. “ఇక నుంచి నా చీరలు నేనే ఉతుక్కుంటాను నాయనా. ఏమైనా చేసుకుంటే నాకు తెలియనే తెలియదు. పొరబాటున నీ ఆఫీసు బట్టలతో కలిస్తే బాగుండదు,” అని చెప్పింది. “ఎవరినైనా ఉతకడానికి పెట్టుకుందామమ్మా,” అన్నాను. “ఈ రెండు బట్టలకు ఎందుకు డబ్బులు వృధా చేస్తావు. నీవేమీ చింతపడకు. రోజూ నాలుగు నాలుగు బకెట్ల బట్టలు ఉతికినదాన్ని నేను,” అని తన ముడుతలు పడ్డ ముఖంలో నవ్వును వికసింపజేసింది. అదే పద్దతిని కొనసాగిస్తూపోయింది. ఎన్నడైనా ఒక రోజు ఉతకకపోతే నా దగ్గరికి తన చీరను తెచ్చి చూపించి “ఈ రోజు ఏమీ చేసుకోలేదు చూడూ, మిషిన్‌కు వేయనా?” అని అడిగినపుడు నా కళ్ళూ చెమర్చేవి. “ఆ మాత్రానికి నన్నెందుకమ్మా అడిగేది?” అని అన్నప్పుడు నా కంఠం రుద్ధమయ్యేది.


అమ్మను పరీక్షించిన డాక్టర్‌గారు ఏ దారిని మాకు చూపించలేదు. “ఆమెకు డయాబిటిస్ జబ్బు తీవ్రమైంది. అందుకే అలా అవుతోంది. మీరు ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి.” అని చెప్పారు. అమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళటం మానేసింది. అప్పుడప్పుడు అక్కయ్య ఊరికి మాత్రం అమ్మానాన్నలు ఇద్దరూ రైల్లో వెళ్ళేవారు. చాలావరకు నేను వారి వెంట వెళ్ళేవాణ్ణి. ఒక్కొక్కసారి ఆఫీసు పనుల ఒత్తిడివల్ల వెళ్ళలేకపోతే “రాత్రి రైల్లో పాయిఖానాకు వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. రైలు పరుగులు తీస్తున్నప్పుడు తిరగటం కష్టమవుతుంది. ఏదైనా స్టేషన్లో ఆగినపుడే వెళ్ళండి,” అని నచ్చజెప్పేవాణ్ణి. వాళ్ళు ఊరికి వెళ్ళిన రోజు రాత్రి ఏవేవో భయపెట్టే పిచ్చిపిచ్చి కలలు కని లేచి కూర్చునేవాణ్ణి. ఉదయం వాళ్ళు సురక్షితంగా ఊరికి చేరారని ఫోను వచ్చేవరకూ మనస్సుకు ఊరట కలిగేదికాదు.

ఒకసారి సూపర్ మార్కెట్లో కిరాణా సామాన్లు కొంటున్నప్పుడు పెద్దవాళ్ళు వేసుకునేటటువంటి డైపర్లను చూశాను. ఒక పాకెట్ కొని తెచ్చాను. అయితే అమ్మకు వేసుకోమని చెప్పటానికి సంకోచం కలిగి అలమారాలో దాన్ని దాచిపెట్టాను. ఆఫీసు నుంచి అక్కకు ఫోన్ చేసి, గుటకలు మింగుతూ “నీవు అమ్మను అడుగుతావా?” అన్నాను. ఆ రోజు ఇంటికి తిరిగొచ్చినపుడు అమ్మ ఫలహారం, కాఫీ పెట్టి, నేను తిన్న తరువాత ప్లేటు తీసుకుని వెళుతూ “వేసుకుంటాను నాయనా… ఎక్కడ పెట్టావో తీసివ్వు,” అని అంది. తీసిచ్చాను. అయితే అమ్మకు దాన్ని ఎలా వేసుకోవాలో అర్థం కాలేదు. నాన్నను సహాయం చేయమని అర్థిస్తే “నాకు సిగ్గు వేస్తుంది నాయనా, ఆయన్ను పంపకు,” అని బతిమిలాడింది. చివరికి నేనే ఒక డైపర్‌ను ప్యాంట్ మీదనే వేసుకుని చూపించాను. అమ్మ గదిలో వేసుకుని వచ్చింది. “ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత సులభమైన ఉపాయం తోచిందో చూడూ!” అని అమ్మ వైపు చూసి సంతోషంతో అన్నాను.

సాయంకాలం అమ్మ ఒంటి మీద దద్దుర్లు లేచాయి. డైపర్ వేసుకున్న చోటంతా ఎర్రబడి గాయాలయ్యాయి. డాక్టర్ దగ్గరికి తీసుకునిపోతే ఆయన నన్ను తిట్టారు. “ఆమె డయాబిటిస్ పేషంట్. గాయమైతే నయం కాదు. మీరు ఈ విషయంలో నన్ను ఒక మాటైనా అడగాలా? వద్దా?” అని కోపగించుకున్నారు. గాయాలన్నీ తగ్గటానికి సుమారు నెలరోజులు పట్టాయి.

నేను కొత్తగా కారు కొన్నప్పుడు అమ్మ సుతరాం అందులో ఎక్కనని అంది. “ఒక్కసారి గుడికైనా వెళ్ళొద్దాం రామ్మా. ఏమీ కాదు,” అని ఒత్తిడిపెట్టిన తరువాత ఒప్పుకుంది. అయితే అమ్మను పిలుచుకుని పోకుండా ఉంటేనే బాగుండేదేమోనని అనిపించే సంఘటన జరిగింది. దేవుడికి హారతి ఇస్తుండగా “వచ్చింది నాయనా వచ్చింది,” అని గబగబా అడుగులు వేస్తూ ముఖద్వారం నుంచి బయటికి పరుగెత్తింది. నాకు పరిస్థితి అర్థమైపోయింది. నేనూ వెనుకనే పరుగెత్తాను. మేము పరుగెత్తటం చూసి జనమంతా వెనుకే వచ్చారు. అమ్మ నడిచిన దారిలో ఒకటి రెండు చోట్ల మలం పడింది. భక్తాదులు నివ్వెరపోయారు. నన్ను తగులుకున్నారు. “తప్పయిందండి… ఆమెకు ఆరోగ్యం బాగలేదు. నేనంతా శుభ్రం చేస్తాను,” అని అందరికీ చేతులు జోడించి వేడుకున్నాను. అందరూ ముక్కులు మూసుకుని దూరంగా వెళ్ళి నుంచున్నారు. బయటికి వెళ్ళి కారు నుంచి న్యూస్ పేపర్, కారును తుడిచే గుడ్డ తెచ్చుకున్నాను. అన్నిటిని శుభ్రంచేశాను.

బయటికి వచ్చి చూస్తే అమ్మ కనిపించలేదు. అక్కడక్కడ అమ్మ కోసం వెదికాను. దొరకలేదు. విచిత్రమైన భయం నాలో మొదలైంది. ఇరుగుపొరుగున ఉన్న వీధుల్లోకి వెళ్ళి వెదికాను. అక్కడా కనిపించలేదు. అమ్మకు తిరిగి ఇంటికి ఎలా రావాలో తెలియదు. ఇంటి చిరునామా, ఫోన్ నెంబరు- ఒక్కటీ తెలిసినట్టు నాకు నమ్మకమే లేదు. జనంతో నిండిన ప్రదేశం. పిచ్చివాడిలా చుట్టుపక్కలంతా పరుగెత్తాను. సందులలో నడవసాగాను. ‘అమ్మా, దూరంగా వెళ్ళకమ్మా… నేనిక్కడే ఉన్నాను,’ అని మనస్సులోనే చెప్పుకోసాగాను. గుడి బయట కూర్చున్నవాళ్ళను అడిగితే వాళ్ళు సరియైన సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ గుడి దగ్గరికి వస్తుందేమోనని అక్కడికే వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాను. ఎందుకో అమ్మ రాలేదు. మళ్ళీ చాలాసేపు తిరిగిన తరువాత దూరంలోని వీధిలో ఒక బెంచీ మీద కూర్చుని ఉంది. దొరికింది కదా అని మనస్సు తేలికపడింది. పరుగున వెళ్ళి ఆమె ముందు నుంచున్నాను. “ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, నీ కోసం ఎంతగా వెదికాను…” అని సగం కోపం, సగం భయంతో అన్నాను. “పాయిఖానా ఎక్కడైనా ఉంటుందేమోనని వెదుక్కుంటూ వెళ్ళాను నాయనా. తిరిగి రావటానికి దారి తెలియలేదు,” అని నిరాశగా అంది. ఆమె తలను నా ఎదకు ఆనించుకుని “నీవు ఎక్కడైనా తప్పిపోయివుంటే నా గతి ఏమి? పెద్ద ఊళ్ళో ఎలా వెళ్ళాలో నీకు తెలియదు,” అని ప్రేమగా తల నిమిరాను. నేను దేవాలయానికి తిరిగి వెళ్ళి కారు తెచ్చాను. అమ్మ కారు ఎక్కనంది. “కొత్త కారు నాయనా, వద్దు. నన్ను ఆటోలో ఎక్కించు,” అంది. నేను అమ్మ చేయిపట్టుకుని కార్లో కూర్చోబెట్టి, ఆమె బుగ్గలు నిమిరి “అమ్మా! నాకు ఈ కారు కన్నా నీవే ముఖ్యం.” అన్నాను.

అమ్మకు ఉన్న ఈ సమస్య నాన్న మరణించినపుడూ ఆమెను పీడించకుండా వదల్లేదు. ఒక రోజు నేను, నాన్న, అమ్మ భోంచేస్తూ సంతోషంతో ఏదో మాట్లాడుతూ ఉండగా నాన్నకు అన్నపు మెతుకొకటి గొంతులో అడ్డుపడటంతో కళ్ళు తేలేశాడు. “మాట్లాడు, మాట్లాడు…” అని నేను, అమ్మ ఎంతగా పిలిచినా సమాధానం లేదు. ఆయన మెడ పక్కకు వాలిపోవటంతోటే ఆమ్మకు అర్థమైపోయింది. “మీ నాన్న వెళ్ళిపోయాడు నాయనా,” అని అంటూ పాయిఖానాకు వెళ్ళింది. అక్కడ లోపల కూర్చుని భోరుమని ఏడవసాగింది. నేను నాన్నను అక్కడే నేలమీద పడుకోబెట్టి పాయిఖానా దగ్గరికి వెళ్ళాను. “ఏడవకమ్మా…” అన్నాను. అమ్మ గట్టిగా ఏడుస్తోంది. పాయిఖానా తలుపు తోశాను. “రావద్దు, లోపలికి రావద్దు.” అని వేడుకుంది.

నాన్న చనిపోయిన తరువాత అమ్మ పరిస్థితి మరీ కష్టమైంది. నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు అమ్మ గుమ్మంలో నుంచునేది. ఆమె చూపులతో చూపులు కలిపి చూడటం నాకు కష్టమయ్యేది. నేను వచ్చేవరకు ఇంట్లో ఒక్కతే ఉండేది. ఒకసారి ఆఫీసులో, “మా లోకాలిటిలో ఎవరో ఇంట్లో ఉన్న వృద్దుల్ని దోపిడీ దొంగలు చంపి ఇంటిని దోచుకుని పోయారట. మా ఇంటి నుంచి ఇప్పుడే పోన్ చేశారు.” అని ఎవరో చెప్పగానే కాళ్ళుచేతులు వణికాయి. ఇంటికి ఫోన్ చేస్తే ఎంగేజ్ సద్దు. ఇక ఎదురుచూడ్డానికి ధైర్యం చాలక కార్లో వేగంగా ఇంటికి వచ్చాను. అమ్మ హాయిగా నిద్రపోతూవుంది. “ఎందుకు ఇంత తొందరగా వచ్చావు?” అని అడిగింది. “నీవు క్షేమంగా ఉన్నావు కదా?” అని అడిగాను. జరిగిన దుర్ఘటన గురించి ఏమీ చెప్పలేదు. ఏదో సేల్స్ కాల్ వచ్చినపుడు అమ్మ మాట్లాడి మళ్ళీ రిసీవర్‌ను సరిగ్గా పెట్టలేదు.

మరుసటి రోజు ఆఫీసుకు వెళ్ళిన వెంటనే, ‘నేను ఇంగ్లాండుకు వెళతాను. ఒక సంవత్సరంకాలపు ప్రాజెక్ట్ అయినా ఫరవాలేదు’ అని అభ్యర్థించాను. రెండేళ్ళ ప్రాజెక్టకు నా పేరు వెంటనే మంజూరైంది. అమ్మను తీసుకెళ్ళి అక్క ఇంట్లో వదలి వచ్చాను. “వెళ్ళటానికి కుదరదని చెప్పినా ఆఫీసులో వినటంలేదు. నిన్ను వదలటానికి నాకు మనస్సు రావటంలేదు. అయితే నేనేం చేయను? ఈ సారి నేను తప్పక వెళ్ళాల్సివుంది. ఒకటి రెండు నెలల్లో తిరిగి వచ్చేస్తాను,” అని అమ్మతో చెప్పాను. వచ్చేటప్పుడు కాళ్ళకు నమస్కారం చేసినపుడు తల నిమిరి “మళ్ళీ నిన్ను చూస్తానో లేదో…” అంటూ కన్నీరు పెట్టుకుంది.

మళ్ళీ నేను అమ్మ ముఖాన్ని చూడలేదు. నాలుగవ నెలలో వేకువజామున మూడు గంటల సమయంలో అమ్మ మరణ దుర్వార్త నాకు చేరింది. ఉదయం లేచి పాయిఖానాకు వెళ్ళినామె అక్కడే గుండెపోటు వచ్చి చనిపోయింది. ‘నేను రావటానికి ఎంత లేదన్నా పూర్తిగా ఒక రోజు పడుతుంది. శవాన్ని ఉంచవలసిన అవసరం లేదు’ అని మొబైల్ ద్వారా తెలియజేశాను. నా విమానం కోసం హిత్రూ ఎయిర్పోర్ట్‌లో కూర్చున్నప్పుడు దుఃఖం పొంగుకు వచ్చింది. గట్టిగా ఏడిస్తే చుట్టుపక్కల సంచరిస్తున్నవారు చూస్తారన్న సంకోచంతో కేవలం కన్నీరు కార్చసాగాను. శబ్దం రాకుండా జేబురుమాలుతో నోరు మూసుకున్నాను. నేను ఇల్లు చేరుకునే సమయానికి బంధువులంతా రావటం జరిగింది. చిన్నాయన కుమారుడు శవసంస్కారం చేశాడు. మూడవ రోజున శ్మశానానికి అస్థికలు సేకరించటానికి వెళ్ళాం. అమ్మ గుర్తులు లేకుండా అంతా బూడిదైంది. దూరంగా ముళ్ళ చెట్టులో అమ్మ చీరను పారవేసినట్టున్నారు. అది గాలిలో ఎగురుతోంది.

మరుసటి రోజు పాయిఖానాలో కూర్చున్నప్పుడు తలుపు మీద ఏదో అస్పష్టంగా కనిపించింది. చీకట్లో ఏమిటో తెలియలేదు. బట్టలు వేసుకుని వచ్చి వెలుతురులో తలుపును చూశాను. దుమ్ముకొట్టుకునివున్న తలుపుమీద అమ్మ చేతిముద్ర స్పష్టంగా ఏర్పడివుంది. గట్టిగా ఆన్చిన చేయి అలాగే కిందికి జారింది. గుండె పోటు వచ్చినపుడు దేన్నైనా పట్టుకోవడానికి తలుపు మీద చేయి అదిమివుండాలి. అక్కయ్యను పిలిచి చూపాను. “అవును, అది అమ్మదే. ఇన్నాళ్ళు ఉండలేదు.” అంది. ఆ చేతిగుర్తు మీద నా చేతిని పెట్టి విచిత్రమైన స్పందనని అనుభవించాను. “అక్కా… కొన్నాళ్ళు ఆ గుర్తును అలాగే ఉండనివ్వు. శుభ్రం చేయకు,” అని వేడుకున్నాను. “పెళ్ళి చేసుకోనని పట్టుబట్టావు. పెళ్ళయివుంటే ఈ కష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఒక్కడివే ఎలా ఉంటావో తలుచుకుంటే నాకు దుఃఖం ఆపుకోవడానికి చేతకావటం లేదు…” అని అక్క కంట తడి పెట్టింది.
----------------------------------------------------------
రచన: రంగనాథ రామచంద్రరావు 
మూలం: వసుధేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment