Thursday, January 31, 2019

కథలు చెప్పే అతను


కథలు చెప్పే అతను



సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..........

పాటకి
రాళ్లు కరిగి నీరైపోయిన కథ చెప్పాడు
ముప్పై ఏళ్లుగా
ఏదో ఒక కథ
ఎవరికో ఒకరికి చెప్తూనే వున్నాడు
రాత్రి రెప్పవాల్చని కాలం వరకూ
పాదాల గడబిడ అడుగుల మధ్య
కుండపై దరువేస్తూ
ఏ గుండెలను కరిగించాలనో
ఆ నిశ్శబ్ద సంగీతలయకారుని ఆరాటం
ఏమో ఏ చైతన్యం వైపో

కదిపితే రాళ్ల కథేం
నిజంగా నీళ్ల కథే చెప్తాడు
నీళ్లు అగ్నిగా మారి అడవిని అల్లుకున్న కథ
అశ్రునయనాలతో ఆలపిస్తాడు
అగ్ని కథేం
విల్లు పుష్పంగా విచ్చుకున్న కథ
గొప్ప తమకంతో చెప్తాడు
అతను చెప్పాలి గాని
కుక్కపిల్ల కూడా చెవులు రిక్కించి
వింటుంది

చిన్న గోనె పట్టా
దానిపైనే కూర్చుని
చుట్టూ ఆవరించిన
చీకటి తునకలను చెదరగొడ్తూ
ఒక్కో పాటని
గాలి వీస్తున్నంత సహజంగా
నేర్పుగా
పాడుతాడు

రాతి కాలాన్ని
నిర్దయగా ఛీకొట్టే
వొక్కడు
మనిషిని మనిషిని కలిపే
వొక రాగాన్ని అన్వేషిస్తూ భంగపడ్తూ
యిదే బతుకు అన్నాడు
చెట్టుని కొమ్మని పువ్వుని
మనుషుల్లోకి మళ్లించే
మహా కంకణమేదో కట్టుకున్నట్టున్నాడు
నావైపు తిరిగి ఒక దరువు వేశాడు

అతని దరువు
రాత్రి నిద్రలోనూ వినిపిస్తుంది
----------------------------------------------------
రచన: బాలసుధాకర్ మౌళి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment