Tuesday, September 25, 2018

బండలు(కథ)


బండలు(కథ)



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...............

ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ మొదలవకముందు, ఇండియన్ ఎయిర్‌లైన్సే రాజై వెలుగుతున్నప్పటి కాలంలో– ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తుండేవాళ్ళం.

“ఇందూ, గంటవరకూ గ్యాంగుకి డ్యూటీలేవీ లేవు. మళ్ళీ ఎండ పోతుంది. బండలు ఖాళీగానే ఉన్నాయా?” ఇంటర్‌కామ్‌లో అడిగింది ప్రీతి.

మా గ్యాంగులో వారి డ్యూటీలు- ఎయిర్‌బస్ టెర్మినల్‌లోనూ బోయింగ్ టెర్మినల్‌లోనూ. నన్ను మాత్రం ఈ రెండిటికీ మధ్యనున్న డొమెస్టిక్ కార్గో సెక్షన్‌లో పడేశారీ మధ్య.

“వచ్చేయండి, ఖాళీగానే ఉన్నాయి. నేనూ నా డ్యూటీ బ్రేక్ ఇప్పుడే తీసేసుకుంటాను.” చెప్పాను.

మూడవవస్తోంది.

కార్గో బిల్డింగ్‌కి సరిగ్గా బయట, టార్మాక్ వైపు, అందరికీ ‘అడ్డా’ -అడ్డంగా పడేసున్న ఆ పొడుగాటి స్తంభాలు. మూడడుగుల వెడల్పున్న ఆ భారీ, చదరపు, నలుపురంగు స్తంభాలు కార్గో డివిజన్‌లో భాగమే అనిపిస్తాయి. అవే మా అందరి ‘బండలు’! ఎండలకి కాలవు. వానలకి జడవవు. చలికి వణకవు. వడగళ్ళకి చితకవు. ఏ పది నిముషాలో ఖాళీ ఉన్న ప్రతీ ఒక్కరమూ శీతాకాలంలో వాటిమీద కూర్చోక మానం.

అటునుంచిద్దరూ, ఇటునుంచిద్దరూ వచ్చారు.

కాంటీన్ ట్రాలీ తోసుకుంటూ ఎటెండర్లు వస్తుంటే- సాండ్‌విచ్‌లూ సమోసాలూ పేపర్ ప్లేట్లలో సర్దుకుని, టీ, కాఫీలూ అక్కడే వున్న ప్లాస్టిక్ టేబుల్స్ మీద పెట్టుకున్నాం. కబుర్లూ, టీలూ పూర్తయాయి. ఎవరి డ్యూటీ పాయింట్లకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేనూ కార్గో బిల్గింగ్ లోపలికి వచ్చాను.

నాకోసమే ఎదురు చూస్తున్నాడు ఫెడ్‌ఎక్స్ ఏజెంట్, ‘మాడమ్, నా కన్‌సైన్‌మెంట్ సంగతేమయింది?’ అంటూ. నక్షత్రకుడు! పది రోజుల కిందట సీ-నోట్ అని మేం పిలుచుకునే ఏడేళ్ళనాటి పాత కన్‌సైన్‌మెంట్ నోట్ ఒకటి తెచ్చినప్పటినుంచీ విసుగూ విరామం లేకుండా రోజూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆ నోట్‌లో బుక్ చేసిన వ్యక్తి పేరు సతీష్ అగర్వాల్ అని రాసుంది.

“బాబూ, కార్గోలోనే కాదు, ఎయిర్‌పోర్టంతటా వెతికించినా మీ సామాను కనబడలేదు. అయినా 40 కోట్ల విలువయిన సామాను అని ఇన్‌వాయిస్‌లో ఉంది. అదీ, పన్నెండు టన్నుల మెటల్!” అరిగిపోయిన రికార్డులా చెప్పి, “అయినా ఇన్నేళ్ళూ మీ క్లయింట్ పట్టించుకోనేలేదేం?” చివరికి కుతూహలం పట్టలేక అడిగాను.

“నేను కొత్తగా చేరాను మామ్, నాకంత తెలియదు. బుక్ చేసిన సతీష్‌గారు పోయి ఆరేళ్ళు దాటిందట. ఇప్పుడు ఆయన కొడుకు నీరజ్ అగర్వాల్, ‘సామాను వెతికిస్తారా, చస్తారా!’ అంటూ మా పీకలమీద కూర్చున్నారు. మీకూ ఫోన్ చేస్తానన్నారు. ప్లీజ్, మళ్ళీ చూడండి…” బతిమాలుకున్నాడు.

జాలేసింది కానీ కనిపించని వాటినెక్కడినుంచి తెచ్చేది! ఏ ఈగో దోమో చిన్న పాకెట్టో కూడా కాదు, ఎక్కడో పోయిందనుకోడానికి.

“మళ్ళీ రెండ్రోజుల్లో రండి. ఇంకెక్కడైనా దొరికే వీలుంటుందేమో ప్రయత్నిస్తాను.” వాగ్దానం లాంటిది చేశాను.

సీ-నోట్ కాపీలు తీయించి, అవేవో కరపత్రాలయినట్టు హెల్పర్లకి పంచి, కన్‌సైన్‌మెంట్ వెతకమని అన్ని చోట్లకీ పరిగెత్తించాను.

ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పట్లాగే. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణ స్నేహితులయిపోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు.

‘రాజకీయాలు చర్చించుకోవద్దు మొర్రో!’ అని ఒకళ్ళిద్దరు గీపెట్టినా వినక, వాటి గురించిన వాదనలూ భేదాభిప్రాయాలూ మొహాలు ముడిచెట్టుకోవడం, రుసరుసలూ ఎలాగూ సామాన్యమే.

కొత్తగా హైదరాబాదునుంచి బదిలీ అయి వచ్చిన రాధిక నోట్లోంచి వచ్చీరాని హిందీ తప్ప ఇంకో భాష ఊడిపడదు. ‘పోనీ, ఇంగ్లీష్‌లో ఏడవ్వమ్మా,’ అన్నా వినదు.

పూనమ్ మగవాళ్ళందరి అందాన్నీ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మేం విన్నా వినకపోయినా, తనకున్నాయని ఊహించుకునే రోగాలన్నిటినీ రాజ్ ఏకరువు పెడుతుంటాడు.

డైటింగ్ చిట్కాలు చెప్తుంది అనుభ. సునీతకి ఎప్పుడూ తన వంటల గోలే!

ఈ మధ్యెవరో కొత్తమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ వేటలో పడి జయంత్ రానే రావడంలేదు. వినితకి ఎప్పుడూ ‘నేను, నాకు’ అన్న టాపిక్ తప్ప మరేదీ పట్టదు.

అన్ని సమస్యలకూ పరిష్కారం అజయ్ దగ్గిర మాత్రం తప్పక ఉంటుంది. వద్దు నాయనా అన్నా, ఉచిత సలహాలు ఇవ్వడం మానడు.

ఒకరోజు మామూలుగా ఏ మూలో కూర్చుని ప్రేమ ఒలకబోసుకుంటుండే నీలేష్, నీనా ఎప్పుడూ లేనిది ఇక్కడికి వచ్చారు, మొహాలు చిటపటలాడించుకుంటూ! ఒక బండ చివర్న కూర్చుని లోగొంతుకలతో వాదించుకున్నారు. ఉన్నట్టుండి ఒకపక్క చెమర్చిన కళ్ళని అద్దుకుంటూనే నీనా అతన్ని చెంప మీద కొట్టింది. అతనూ తిరిగి కొట్టాడు. మేం నిశ్చేష్టులమై, చలనం లేకుండా బండలలో కలిసిపోయాం. తను ఇంచుమించు పరిగెత్తుతూ బోయింగ్ టర్మినల్ వైపు నడిచింది. అతనూ అనుసరించాడు. అదృష్టం కొద్దీ మేము తప్ప అక్కడింకెవరూ లేరు. లేకపోతే, అదో కేస్ అయి కూర్చునేది. అదంతా చూసి మేము కంగారు పడ్డాం.

బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా.

ఇంతలో ఎండాకాలం వచ్చింది. బండలు వేడెక్కాయి. వాటిమీద కూర్చోవడం కాదు కదా సమీపించాలన్నా కాల్చేస్తున్న ఎండ వద్దు, వద్దంటూ వారిస్తోంది. మరవి చిన్నబుచ్చుకున్నాయో ఏమో కానీ కారునలుపుకి మారాయి.

కొన్నాళ్ళు ఫెడ్‌ఎక్స్ అబ్బాయీ రాలేదు, నీరజ్ అగర్వాల్‌ నుంచి ఫోనూ లేదు. ‘హమ్మయ్యా, ప్రస్తుతానికి కొంత ఉపశమనం’ అనుకుంటూ కార్గోలో పనిచేస్తున్న వాళ్ళందరం ఊపిరి పీల్చుకున్నాం. హెల్పర్లు కూడా ఆకాశంవైపు తలెత్తి దండాలు పెట్టుకున్నారు.

ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్‌లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో. కోపంతో భగభగమంటున్నాడు.

“సర్, అంత భారీ సామాను సెక్యూరిటీ కంటపడకుండా ఎవరు బయటకి తీసుకెళ్ళగలరో మీరే ఒక్కసారి ఆలోచించండి…” అనునయంగా చెప్పాను.

కొంత వాదన తరువాత, నా శాంతస్వరం వినో ఏమో కానీ అతనే చల్లబడి, “మా ఫాక్టరీ మానేజర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో లేడు. వెంటతెస్తాను. ఆయనే గుర్తుపడతాడు.” అన్నాడు. సరే ఆయనొచ్చాక చూడచ్చులే అని నేనూ మర్చిపోయాను.

హఠాత్తుగా ఒకరోజు, రీజినల్ డైరెక్టర్ నన్ను వెంటనే రమ్మంటున్నారన్న కబురుతో, ఎయిర్‌పోర్ట్ మానేజర్ ఫోనొచ్చింది. ఎందుకా! అనుకుంటూ, ఉరుకులూ పరుగులతో ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టాను.

“ఈయన నీరజ్ అగర్వాల్!” అక్కడ కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్న ఒక వ్యక్తిని పరిచయం చేశారాయన. ‘ఓహో, ఇతనేనా! పైనుండి నరుక్కు వస్తున్నాడన్నమాట! అందుకే, ఉలుకూ పలుకూ లేదీ మధ్య’ అనుకున్నాను.

“ఏమమ్మా, ఈయన కన్‌సైన్‌మెంట్ పోయిందట. మీరెవరూ సహకరించడం లేదంటున్నారీయన. మీరే కదూ ఈ కేసు చూస్తున్నదీ?” తిన్నగా విషయానికి వచ్చారు డైరెక్టర్‌.

పని అయిందో లేదో అని తప్ప ఆయన వివరాలు పట్టించుకోరని, నెపాలు చెప్తున్నానని అనగలిగే అవకాశం ఉందని తెలిసీ ఉండబట్టలేక, వెతికించడానికి ఎంత కష్టపడుతున్నామో క్లుప్తంగా చెప్పాను.

“దాని విలువెంతో చూశారా! ఇంత నిర్లక్ష్యం ఏమిటి?” అడిగారాయన. అవును, చూశాను కానీ ‘మెటల్’కి ఆ ధరెందుకో అంతు పడితే కదా!

“అది బుక్ చేసినదెవరో, ఏమిటో కనుక్కోండి. రేపట్లోగా రిపోర్ట్ కావాలి నాకు.”

‘ఇంక నువ్వు దయచేయి’ అన్నారని అర్థమై, తిరుగు మొహం పట్టాను. నాకెందుకు తట్టలేదీ సంగతి? బుక్ చేసిన ఆ కొలీగ్‌నే అడిగుంటే సరిపోయేది కదా! నన్ను నేను తిట్టుకుంటూ నా ఫైల్లో ఉన్న కాపీ తీశాను. ఆర్.కె.జి. అన్న ఇనీషియల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప సంతకం గిలికేసినట్టుంది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అది పట్టుకుని ఎయిర్‌పోర్ట్ మానేజర్ వద్దకి వెళ్ళాను.

“ఆ టైములో మీ సెక్షన్లో ఎవరెవరి పోస్టింగ్ అయిందో కనుక్కుంటాను,” అన్నారాయన.

మర్నాడే, ఆ వ్యక్తి రాధాకృష్ణ గుప్తా అని తెలిసింది. ఇండోర్‌ నుంచి శ్రీనగర్‌కి బదిలీ అయే మధ్యన మూడ్రోజులు ఇక్కడ టెంపరరీ డ్యూటీ పడిందట. ఇప్పుడతని పోస్టింగ్ బాంకాక్‌లో అట. ఫోన్‌లో మాట్లాడితే, ‘అవును. మొదటిరోజే భారీ సీ-నోటేదో తయారుచేశానన్న గుర్తే. కార్గోలో పనిచేసిన అనుభవం లేదప్పటికి. సలహా అడగడానికి చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏజెంటెవరో తెచ్చిన కాపీలో ‘ఇంత ఇనుమో, ఏదో’ అని రాసుందని లీలగా తప్ప మరేదీ జ్ఞాపకం రావడం లేదు. ఎన్నేళ్ళ కిందటి సంగతో!’ అని చెప్పాడట.

అయినా, బుక్ చేసింది తనే కాబట్టి అతన్ని మర్నాటి ఫ్లైటులోనే రప్పించారు. మొత్తానికి గుప్తా అయితే వచ్చాడు కానీ సామాను ఆకారం కూడా గుర్తు లేదు అన్నాడు. సిటీ, ఇంటర్నేషనల్ కార్గోతో సహా అన్ని చోట్లకీ ఇద్దరు హెల్పర్లని వెంటబెట్టుకుని తిరిగొచ్చాం. ఫలితం లేకపోయింది.

రెండ్రోజుల తరువాత, మరేం తోచిందో ఏమో కానీ ఆత్రంగా వచ్చి మా బండల చుట్టూ తిరుగుతూ, “ఇదే ఆ కన్‌సైన్‌మెంట్ అనుకుంటాను…” అన్నాడు.

కనుక్కోడానికి జూనియర్ అగర్వాల్‌కి ఫోన్ చేస్తే, తన మానేజర్ ఊరినుంచి తిరిగి వచ్చాడనీ, అతన్నీ తనతో పాటు తెస్తాననీ అన్నాడాయన ఉత్సాహంగానే.

మేనేజర్‌కి 50 ఏళ్ళుంటాయి. వచ్చీ రావడంతోనే బండల్ని చూసి, ‘ఇవే, ఇవే!’ అంటూ సంతోషం పట్టలేక ఇక గెంతులేయడమొక్కటే తక్కువ!

అంతటా కబురు పాకింది. ఎయిర్‌పోర్ట్ మానేజర్ కూడా వచ్చి అయోమయంగానే ఆయన్ని అడిగారు, “అయితే, మీ బిల్లుమీద కోట్ల విలువ రాసుందేమిటండీ? అసలే మెటలైనా అంత ధర పలుకుతుందా!”

మేనేజర్ చిద్విలాసంగా నవ్వి, “ఇది వెండండీ!” అన్నాడు.

అందరం నోళ్ళు వెళ్ళబెట్టాం.

“అసలేమయిందంటే, వీటిని మా చెన్నై ఫాక్టరీకి పంపించాలనుకున్నాం. ఇంత బరువున్న వెండి కడ్డీలు వంగిపోతాయి కదా అని వాటికి ఇనప తాపడం చేయించాం. అప్పటికే సతీష్‌గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వీటిని బుక్ చేయించినప్పుడు నేను లేనక్కడ. నీరజ్‌గారేమో యుఎస్‌లో ఉన్నారు. ఫెడ్‌ఎక్స్ వాళ్ళే సలహా ఇచ్చారట, ఏదో మెటల్ అని రాసేయమని. సతీష్‌గారు పోయాక, ఎవరూ వీటి సంగతి పట్టించుకోలేదు. ఫాక్టరీ లెక్కలు చూస్తున్నప్పుడు అవి తేలకపోయి ఫైల్సన్నీ చెక్ చేస్తుంటే ఈ మధ్యే నీరజ్‌గారి కంటపడింది.” ప్రశ్నార్థకంగా పెట్టిన మా మొహాలని చూస్తూ తేలిగ్గా తేల్చేశాడాయన.

హమ్మయ్యా, చిక్కు ముడి విడింది!

మర్నాటి చెన్నై ఫ్లైట్‌లో వాటిని లోడ్ చేయడానికి పెద్ద క్రేనులూ పటాటోపం కనిపించాయి. దూరంగా ఉన్న బే మీద నిలుచున్న ఎయిర్‌బస్ వెనకాతల హెల్పర్లందరూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి చూస్తే, వెనకనున్న కార్గో హోల్డుల్లో కడ్డీలు పట్టలేదు. వాటిని దింపేసి మళ్ళీ ఎత్తి, ముందు హోల్డులో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే పొడుగు చాలలేదు. ఇంక వీలవక రెండిటినీ దించేశారు. ఇన్నేళ్ళూ అవిక్కడే ఎందుకు పడున్నాయో అర్థమయింది. అవసలు మా విమానాలు వేటిల్లోనూ పట్టగలిగే కొలతలున్నవి కావు!

అవి తిరిగి అగర్వాలుల ఇంటికి రాజసంగా పెద్ద ట్రక్కులో ప్రయాణమయాయి.

గుప్తా తప్పు కేవలం సీ-నోట్ సరిగ్గా తయారు చేయకపోవడం మాత్రమే అనుకున్నారు ముందు. కానీ, ఈ సంఘటన తరువాత కడ్డీల పొడుగు సరిగ్గా కొలిపించకుండానే బుక్ చేసి, ఆ తరువాత అవి లోడ్ అయాయో లేదో అని కూడా పట్టించుకోని అతని నిర్లక్ష్యానికి అతని ఇంటర్నేషనల్ పోస్టింగ్ రద్దు చేసి, మూడు నెల్లు సస్పెండ్ చేశారు.

ఇప్పుడు కాంక్రీట్ మీద మా అందరి అనుభూతులకీ సాక్షిగా ఉండే చలనరహితమైన మా బండలైతే లేవు కానీ వాటి కింద ఇన్నేళ్ళూ వర్షం, ధూళి, నుండి తప్పించుకున్న తారూ ఇసుకా మేళవించిన టార్మాక్ భాగం మట్టుకు తళతళలాడుతోంది!
కానీ మేము మాత్రం మా కబుర్లకి మరో చోటోదే వెతుక్కోవాలి.
-----------------------------------------------------------
రచన: కృష్ణ వేణి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment