Friday, September 14, 2018

బౌద్ధానికి పూర్వరంగం


బౌద్ధానికి పూర్వరంగం



సాహితీమిత్రులారా!


బౌద్ధానికి పూర్వరంగం అనే వ్యాసం చదవండి-
క్రీ.పూ. ఆరవ శతాబ్దం మన దేశ తత్వచింతనలో ఒక పెద్ద మైలురాయి. ఆ కాలంలో వైదిక సంస్కృతిని తిరస్కరిస్తూ అనేక నాస్తికవాదాలు, వాటిని ప్రచారం చేసే నాస్తికాచార్యులు బయలుదేరారు. అంతకు మునుపెన్నడు లేని విధంగా ఆ కాలంలోనే ఇన్ని వాదాలు ఎందుకు బయలుదేరాయి? అసలు ఆ కాలంలో సమాజం ఎలా ఉండేది? ఎందుకిన్ని వాదాలు అవసరమైనాయి? అని ఆలోచిస్తే -

హరప్పా నాగరికత తర్వాత భారతదేశంలో భారీ ఎత్తున నగరీకరణ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే జరిగింది. దీనికి ప్రధాన కారణాలు రెండు:

భారీ ఎత్తున ఇనుప పనిముట్లు వాడుకలోకి రావడం.
సారవంతమైన గంగా-యమునా నదుల పరివాహకప్రదేశాల్లో ఎక్కువ భూమిని సాగులోకి తేవడం వల్ల వ్యవసాయ దిగుబడి విపరీతంగా పెరగడం.
వ్యవసాయ ఉత్పాదకత ఇబ్బడిముబ్బడిగా పెరిగి, నిల్వచేసుకున్న అదనపు దిగుబడిని ప్రాకృతికశక్తుల నుంచి గానీ, శత్రువుల, జంతువుల బారినుంచి గానీ రాబోయే కాలానికి దాచుకోవలసిన అవసరం ఏర్పడినప్పుడు సంఘజీవనం తప్పనిసరై ఉంటుంది. గొప్ప నాగరికతలన్నీ నదీతీరాలలో, సారవంతమైన ప్రాంతాల్లో విలసిల్లడానికీ ఇదే కారణం. భారతదేశచరిత్రలో ఇలాంటి అవసరం మొదట హరప్పా/మొహెంజదారో నాగరికతాకాలంలో ఏర్పడింది. (అందుకే ఈ రెండు నగరాల్లోనూ పెద్ద పెద్ద ధాన్యాగారాలు నిర్మించబడి ఉండడంలో వింతేమీ లేదు.) అలాంటి అదనపు ఆహారనిల్వలు ఉండి, మళ్ళీ అప్పటికప్పుడు ఆహార సేకరణ/ఉత్పత్తి చెయ్యవలసిన అవసరం లేకపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ సమయంలో జనుల వ్యాపకాలు బహుముఖాలుగా విస్తరించి ఒకవైపు వర్తక వ్యాపారాలు, సృజనశీలమైన కళలు, సాహిత్యం, సాంకేతికత అభివృద్ధి చెందుతాయి. ఇంకోవైపు ప్రజల జీవనశైలుల్లో మార్పులు అనివార్యంగా వచ్చిపడుతాయి. ‘ఆకలిగొన్నవాడికి కడుపు నింపుకోవడమొక్కటే సమస్య. అది తీరినవాడికి అన్నీ సమస్యలే!’ అన్న విధంగా అంతవరకు లేని వేగం, పోటీతత్వం, ఆరాటం ఎక్కువవడమేగాక అవకాశవాదం, అవినీతి, దురాశ, లోభత్వం, కుత్సితత్వం, లాంటి దుర్గుణాలన్నీ ప్రేరేపితమై ప్రజల్లో అశాంతి పెచ్చుపెరుగుతుంది. అలాంటప్పుడు ‘ఏం జరుగుతోంది? మనం ఎటుపోతున్నాం? ఎందుకీ ఆరాటం?’ లాంటి ప్రశ్నలు కొందరిలోనైనా కలుగుతాయి. వాటికి సమాధానాలు వెదుక్కునే ప్రయత్నంలో భాగంగా పారలౌకికస్పృహ కలిగినప్పుడు ఉపశాంతి కోసం ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమార్గాల మీదికి దృష్టి పోతుంది.

మనదేశంలో క్రీ.పూ. 6వ శతాబ్దంలోనూ అదే జరిగింది. అప్పటికే ఇనుము గురించి తెలియడంతో దృఢమైన పనిముట్ల వాడకంతో అడవులను నరికీ, తగులబెట్టీ సారవంతమైన మైదానాల్లో విస్తారంగా భూమిని సాగులోకి తేవడం వల్ల షోడశ మహాజనపదాల ఆవిర్భావానికి ఆస్కారం కలిగింది. ఈ మహాజనపదాలన్నీ కలిసికట్టుగా ఉండక ఒకదాన్నొకటి ఆక్రమించుకోవడానికి తమలోతాము పోటీ పడడం వల్ల సంక్లిష్టమైన సామాజిక పరిస్థితులేర్పడ్డాయి. అంతే కాక కాశీ లాంటి కొన్ని జనపదాల్లో పాలకుల అసమర్థత వల్ల, ఇతరేతర ఆసక్తులు ఎక్కువై రాజ్యపాలన మీద తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా అసాంఘిక శక్తులు, బందిపోట్ల స్వైరవిహారానికి వీలు కలిగింది. ఆ కాలంలో వాయువ్యాన కాందహార్ (గాంధార) నుంచి తూర్పున బెంగాల్ వరకు (వంగ), దక్షిణాన తెలంగాణా వరకు (అశ్మక) వ్యాపించిన 16 స్వయంపాలిత రాజ్యాలే మహాజనపదాలు.

శుద్ధోధనుడి సమకాలికుడైన బింబిసారుడి కాలంలోనే మగధ ఇతర జనపదాలతో సఖ్యత పెంచుకుంటూ ఒక బలమైన రాజ్యంగా అవతరించింది. బుద్ధుడి మహాపరినిర్వాణానికి కేవలం ఎనిమిది సంవత్సరాల ముందు బింబిసారుడు తన కుమారుడైన అజాతశత్రు చేతిలో హతమైన తర్వాత (అదే కారణం చేత) ఒక్కసారిగా లిచ్ఛవి, అవంతి, కోసల మొదలైన బలమైన రాజ్యాలతో వచ్చిపడిన వరుస యుద్ధాలు ఒకవైపు కోసల ఒక సామ్రాజ్యంగా ఎదగడానికి తోడ్పడినప్పటికీ అప్పటివరకు మహాజనపదాల మధ్య ఉండిన ప్రశాంత వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. ఈ సంక్షుభిత వాతావరణం మౌర్యుల కాలం వరకు కొనసాగింది. ఇది బౌద్ధ మతవిస్తరణకు బాగా తోడ్పడింది. నిరంతరమూ యుద్ధాలు, యుద్ధభయాల మధ్య గడచిన ఆ పరిస్థితుల్లో ఉపనిషత్తుల్లో పేర్కొన్న గహనమైన అధ్యాత్మిక(జ్ఞాన)మార్గం సామాన్యప్రజలకు అందుబాటులోకి రాక, వచ్చినా అర్థం కాక కొంత, గ్రామజీవనం – అరణ్యవాసాల గురించి తెలిపే వైదికసాహిత్యాన్ని సమకాలీన పరిస్థితుల్లో అన్వయం చేసుకోలేక కొంత, అధిదైవికమైన భక్తిమార్గం అప్పటికి ఇంకా ప్రాచుర్యంలోకి రాక ఇంకొంత – ప్రజలు అధిభౌతికమైన కర్మమార్గాన్ని గుడ్డిగా అవలంబించనారంభించారు.

కర్మమార్గమంటే భౌతికమైన మన చర్య(కర్మ)లను నిర్దేశించిన విధంగా చేసుకోవడం ద్వారా ఉపశాంతి పొందడం. కర్మలు 4 రకాలు:

నిత్య: క్రమం తప్పక ఆచరించవలసినవి. సంధ్యావందనం, అతిథి అభ్యాగతులను ఆదరిచడం లాంటివి.
నైమిత్తిక: ప్రత్యేక సందర్భాల్లో చేయవలసినవి. ఆయా పండుగ రోజుల్లోను, గ్రహణ సమయాల్లోనూ, పుష్కరాలప్పుడూ చేయవలసినవి.
కామ్య: ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి చేసేవి. ఐశ్వర్యాభివృద్ధి కోసమో, సంతానం కోసమో చేసే నోములు, వ్రతాలు.
నిషిద్ధ: చెయ్యగూడని పనులు.
యజ్ఞయాగాదులూ కర్మమార్గంలో భాగమే. శాస్త్రోక్తంగా హవిస్సులు వ్రేలుస్తూ చేసేవి యజ్ఞాలైతే యాగాల్లో జంతుబలులు తప్పనిసరిగా ఉంటాయి. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, ఇలా పేరేదైనా యాగాలన్నీ హింసతో కూడుకున్నవే.

యాగాల్లో భాగంగానూ, ఇతరత్రానూ జంతుబలుల పేరిట పాడిపశువులను, కాడి మోసే పశువులను(beasts of burden) విచక్షణారహితంగా చంపడం వల్ల వ్యవసాయం కుంటుపడి, ఒకవైపు ఆహారకొరత, అభద్రత ఏర్పడుతున్నాయి. మరోవైపు రోగాలు, అకాల మరణాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇదీ బుద్ధుడి కాలంలో భారతీయ సమాజపరిస్థితి. తామెదుర్కోలేని సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలలోను, పాలకుల్లోను కూడా మూఢనమ్మకాలు బలపడుతాయి. ఆ విధంగా ఒక పక్క సంక్లిష్టంగా మారిన అప్పటి సామాజిక పరిస్థితులు ప్రజలకు సరళమూ సుబోధకమూ ఐన ఒక ఆచరణీయ మార్గాన్ని చూపే ఒక దార్శనికుడి అవసరాన్ని కలిగించగా, శుద్ధోధనుడు సిద్ధార్థుడిని పెంచిన తీరు అతడు సన్న్యసించి, ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చగలిగే ఆ మార్గాన్ని తానై కనుగొనక తప్పని పరిస్థితులను కలిగించింది.

శుద్ధోధనుడు తనకు కొడుకు పుట్టగానే జాతకం చూపించడం వింతకాదు. కానీ జ్యోతిష్కులు అతడు సన్యాసి కాకుండా ఉండడానికి ఏ విరుగుడు/తరుణోపాయం చెప్పకపోవడం వింత. కొండన్న (కౌండిన్య) అనే జ్యోతిష్కుడొక్కడే సిద్ధార్థుడు కచ్చితంగా బుద్ధుడౌతాడని చెప్పాడు (తర్వాతి కాలంలో ఈయన బుద్ధుడి శిష్యుడై మొదటి అర్హంతుడైనాడు). అందువల్ల శుద్ధోధనుడు సిద్ధార్థుడిని తనకు తోచిన పద్ధతిలో పెంచడం వల్ల అతడు సామాజిక పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా పెరిగాడు. సమాజంలో ప్రధాన సమస్యలైన దారిద్ర్యం, అవిద్య, రోగాలు, జరామరణాల గురించి అసలేమీ తెలియకుండా పెరిగినవాడి చేతుల్లో రాజ్యం పెడితే ఏమౌతుందోననే ఆలోచన శుద్ధోధనుడు చెయ్యకపోవడం ఆశ్చర్యకరం. పైగా శుద్ధోధనుడు రాజు కాడనీ, ప్రజలు/ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న పాలకుడనీ, అతడి పదవి వంశపారంపర్యం కాదనీ కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు ఆయన తన కొడుకును అలా పెంచడం మరీ అమాయకత్వం. పుత్రప్రేమ ఆయన్ను గుడ్డివాణ్ణి చేసిందనుకోవాలి. జీవితమంతా కష్టమనేది ఎరుగకుండా పెరిగిన సిద్ధార్థుడికి ఒక్కసారిగా వాస్తవపరిస్థితులు బోధపడేసరికి ఆ మాత్రం అలజడి కలగడం సహజం.

ఆ విధంగా అప్పటి సమాజం ఒక మహాపురుషుడి మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్న దశలో కపిలవస్తు రాజాంతఃపురంలోని రాకుమారుడికి రాజోచితమైన శిక్షణకు బదులుగా అతడి చుట్టూ ఏ క్షణాన్నైనా భళ్లుమని పగిలిపోయే ఒక అద్దాల మేడ నిర్మితమౌతూ ఉంది. అది పగిలిననాడు అతడే ఏదో ఒక మార్గం కోసం అన్వేషించక తప్పని విధంగా అతడి కళ్ళకు గంతలు కట్టబడ్డాయి. అతడు కచ్చితంగా అత్యుత్తమమైన మార్గాన్నే ఎంచుకుంటాడు. అది కనబడేవరకు అన్వేషిస్తూనే ఉంటాడు – ఎందుకంటే అప్పటివరకూ ఏ విషయంలోనూ రాజీపడడం తెలియకుండా పెరిగాడు కాబట్టి ఇక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా ఉత్తమోత్తమమైన మార్గం కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంటాడు. ఏదో ఒకనాటికి అతడు తథాగతుడై తీరుతాడు.
-----------------------------------------------------------
రచన - త్రివిక్రమ్, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment