Tuesday, September 11, 2018

ఒక సంస్కారవంతమైన కథ


ఒక సంస్కారవంతమైన కథ




సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి-

“ఎన్ని చూడలేదూ బాబూ ఇలాంటివి? జాతకాలు కలవలేదూ? మై ఫుట్! నేనూ చెప్తా ఇంటర్‌వ్యూ ఇచ్చి వెళ్ళిన కాండిడేట్‌కి, ‘హెచార్ విల్ గెట్ బాక్ టు యు!’ అని. అంటే, ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పినట్టే. పొమ్మనలేక పొగబెట్టటమే! ఇదేం కొత్త కాదు.” అంటూ ఆమె వెయిటర్ తెచ్చిచ్చిన కార్డ్ బాగ్‌లో పెట్టుకుంటూ, తల చుట్టూ కళ్ళు తప్ప ఏమీ కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. కుర్చీలోంచి లేచి సన్‌గ్లాసెస్ పెట్టుకుంది.

“కలవాల్సింది జాతకాలు కాదు…” టేబుల్ అవతల నుంచి ఆమె చేయి అందుకుంటూ అన్నాడతను.

“కలవాల్సింది జాతకాలు కాదు మన మనసులు! అని సినిమా డైలాగులు కొట్టక. నాకసలే మండిపోతోంది.” ఆమె హాండ్ బాగ్‌లోంచి బైక్ కీస్ తీసింది.

“జాతకాలు బోగస్. మనసులు మాయ. నిజమైనవి, నిఖార్సైనవి మన శరీరాలు మాత్రమే! కలవాల్సినవి…” అతడు వాక్యం పూర్తిచేయలేదు. దట్టమైన నల్ల మబ్బుల వెనుక దాక్కునా దాగని సూర్యుడి వెలుగులా ముసుగులో కూడా ఆమె మొహంపై నవ్వు తెల్సింది.

ఆ చివరి లైను టైపు చేయగానే ఠక్కున ఆగిపోయాను. నేను రాద్దామనుకున్నది అది కాదు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. ఇద్దరూ ముప్ఫైల వయసు అప్పుడప్పుడే దాటారు. ఇద్దరికీ ఇంకా పెళ్ళి కాలేదు. ఎందుకు? పూర్తిగా తెలీదు. పక్కనున్న టాబ్‌లో బాక్‌స్టోరీ అని రాసి పక్కన ఒక ‘?’ పెట్టాను. ఏవో బాధ్యతల వల్ల అనుకోవచ్చు. ఇద్దరికీనా? ఆ అమ్మాయికి కట్నాల దగ్గరో, అందం దగ్గరో కుదరక సంబంధాలు చెడ్డాయి అని అనుకోవచ్చు. స్టీరియోటైపింగే! ప్రస్తుతానికి పర్లేదు. సరే, ఇంతకు ముందు ఏం జరిగున్నా, కథ మొదలయ్యే సరికైతే ఇద్దరికీ పెళ్ళికాలేదు. ఇద్దరూ అప్పటిదాకా పెళ్ళి సంబంధాల వెబ్‌సైట్లు జల్లెడ పడుతూ ఏమాత్రం ఇంటరెస్ట్ చూపించినవారినైనా కలుస్తున్నారు. ఒకటే పరీక్షకో, ఇంటర్‌వ్యూకో హాజరవుతున్నవారు ఒకరికొకరు సలహాలూ, సూచనలూ ఇచ్చుకున్నట్టు అలా కలసినవాళ్ళతో పరిచయాలు పెళ్ళిపీటలదాకా వెళ్ళకపోతున్నా మాటసహాయాలు మాత్రం అవుతున్నాయి.

అలా ఒకటే పడవలో ఉన్న వీళ్ళిద్దరూ కలిశారు. అమ్మాయి ఇంట పెళ్ళి చూపులు అయ్యాయి. ఇరువైపుల పెద్దవాళ్ళూ ‘కలిసి బతకాల్సింది వాళ్ళు. వాళ్ళకి నచ్చటం ముఖ్యం. మనదేముంది? ఇవ్వాళో రేపో పోయేవాళ్ళం!’ అని అంటూ వాళ్ళిద్దరిని ఒకరిని ఒకరు తెల్సుకోమని ప్రోత్సహించారు. ఇద్దరూ ఫోను నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. చాటింగులు మొదలయ్యాయి. చేస్తున్న పని, వస్తున్న జీతం, కోరుకుంటున్న జీవితం–అన్నింటి గురించీ మాట్లాడుకుంటున్నారు. రెండు మూడు వారాలకి అబ్బాయివైపువాళ్ళు జాతకాలు కలవలేదని, అందుకని సంబంధం వద్దనుకుంటున్నామని తేల్చారు. ఈ విషయం తెలిసిన రెండు మూడు రోజులకి అబ్బాయి అమ్మాయికి మెసేజ్ పెట్టి, ఒకసారి కలుద్దామా? అని అడిగాడు. ముందు తటపటాయించినా అబ్బాయి అడగ్గా అడగ్గా వెళ్ళింది. అలా కలిసి లంచ్ చేసిన వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అది.

ఇవీ నాకు స్పష్టత ఉన్న విషయాలు. తెలీని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో వాక్యం రాయాలంటే నాకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం: అతడలా అనగానే ఆమె ఏమనుకుంది? ఎలా స్పందించింది?

టైమర్ ఇంకా ఇరవై నిముషాలు ఉందని చూపిస్తోంది. అప్పటికి రాయడం ఆపేద్దామనిపించింది. ఇంత ప్రశాంతంగా మళ్ళీ ఒక గంట ఎప్పటికి దొరికేనో? అత్తగారు, మామగారు చూస్తున్న పాత సినిమాలో జమున ఒకటే ఏడుస్తోంది. ఆ శబ్దాలు వినపడకుండా హెడ్‌ఫోన్స్ చెవులకి తగిలించుకున్నాను. కళ్ళు మూసుకొని మళ్ళీ ఆ రెస్టారెంట్ సీన్ ఊహించుకున్నాను. వాళ్ళ ప్లేట్లల్లో మిగిలిపోయిన పిజ్జా ముక్కలు, సాస్ మరకలు, టేబుల్ మీద పరిచి ఉన్న తెల్లని బట్ట, కిటికీల్లోంచి చూస్తుంటే కనిపించే మొక్కలు అన్నీ కనిపిస్తున్నాయి. చిరాకొచ్చెలా హోరెత్తుతున్న హారన్‌లు, తింటున్నవారు కట్లరీతో చేస్తున్న చప్పుళ్ళు, వాళ్ళ మాటలు, ఆడియో సిస్టమ్ నుండి వస్తున్న సంగీతం కలసిన శబ్దాల కాక్‌టెయిల్ నా చెవుల్లోనూ. కానీ ఆమె స్పందన ఎలాంటిదో మాత్రం తెలియటంలేదు. నవ్వుతున్నట్టే ఉంది? నచ్చా? వెగటుగానా? లాప్‌టాప్ మూసేశాను.

బేక్ అవుతున్న కేక్ ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపించాయి. కుర్చీ నుండి లేచి కిటికి దగ్గర నుంచున్నాను. ఎదురుగా స్మిమ్మింగ్ పూల్. ఆడుకుంటున్న ఐదేళ్ళ బాబు. ఆడిస్తున్న ఆరేళ్ళబట్టీ భర్త.

‘ఒక వైపు కిటికీ తెరిస్తే స్మిమ్మింగ్ పూల్. బాల్కనిలో నుంచుంటే కంపు రానంత దూరంలో, చూపులకి బాగనిపించేంత దగ్గరలో చెరువు. పెట్టిపుట్టటమంటే తెల్సునే నీకు? ఇంకా ఎందుకు రాస్తా, రాస్తా అంటావ్?’ రైటింగ్ కోర్సు ఒకటి ఆన్‌లైన్‌లో చేస్తున్నానని తెలియగానే మా పిన్ని ఎత్తుకున్న లెక్చర్. ‘నీకేం తోచకపోతుంటే ఉద్యోగం చేయి. ఎందుకొచ్చిన ఊడిగమనుకుంటే ఏదైనా హాబీ మొదలెట్టు. కుట్లు, అల్లికలు, పెయింటింగ్, బేకింగ్. ఎన్ని సేఫ్ హాబీస్ లేవు? చేస్తున్నవన్నీ ఫోటోలు తీసి ఇన్‌స్టాలో పడేశావనుకో, ఒకసారి ఫాలోయింగ్ మొదలైతే తిరుగేది? మళ్ళీ రాతలెందుకు? జరిగింది చాలదా?’

“అమ్మాయ్! కేక్ చూడమంటావా?” అత్తగారు గది తలుపు మెల్లిగా తోశారు.

ఒక పరుగులో కిచెన్‌లోకి వెళ్ళా. చేతికి గ్లవ్స్ వేసుకొని, ఓవెన్ తలుపు తీసి, కేక్‌ని బయటకు తీస్తుంటే గుండె దడదడలాడింది. ఇది మూడో ప్రయత్నం. మొదటిసారి గిన్నెనుండి కేక్ ఊడి రాలేదు. రెండోసారి చాకు దిగలేదు. ఒకటికి రెండు సార్లు రెసిపి చూసుకొని, అనన్య వాళ్ళ అమ్మకు వీడియో కాల్‌లో చూపిస్తూ జాగ్రత్తగా చేశాను. ఇంతా చేసి ఇదీ మాడితే అంతా బూడిదపాలు.

“అమ్మయ్య, మాడలేదులెండి!” అనేశాను బయటకి.

“వాసన భలే వస్తుందమ్మాయ్. పిచ్చి వెధవ మురిసిపోతాడు,” అన్నారు అత్తయ్య.

“పేచీ పెట్టకుండా తింటే చాలండీ. కొంచెం అటూ ఇటూ అయినా గోల వాడితో.”

“పసివాడులే!” అంటూ ఓ చిన్న ముక్క నోట్లో వేసుకున్నారు. “కరిగిపోతుందమ్మాయ్! సరే, నేను టీ పెట్టేస్తాను. మీ మావగారికి ఆలస్యమవుతుంది.”

టీ మరుగుతున్న వాసన, కేక్ వాసన గదంతా పరుచుకున్నాయి. నేను కేక్‌ని మౌల్డ్‌తో కట్ చేస్తూ ప్రతిదాని మీద ఐసింగ్, టాపింగ్ అనన్య వాళ్ళ అమ్మ పంపిన ఫోటోలు చూస్తూ మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నాను. అనన్య నా కొడుకు క్లాస్‌మేట్. వాళ్ళమ్మ బేకింగ్ ఎక్స్‌పర్ట్. టిఫిన్ బాక్సులో రోజుకొక వెరైటీ కుక్కీలు, కేకులు పెడుతుంటుంది. అనన్య డబ్బాలోంచి వీడూ తిని, అలాంటివే కావాలంటాడు. నేను చేసే నూడిల్స్, పాస్తాలు నచ్చవు మా హీరోగారికి. నాకు చేతకానిదే కావాలి!

అర్రె! ఇందులో ఒక కథ ఉంది కదా! ఒక ఉద్యోగస్తురాలికి వంట చేసేంత ఖాళీ ఉండదు. పిల్లాడికి ప్రతిరోజూ బ్రెడ్-జామ్, రోటి-ఆమ్లెట్ లాంటివి పెట్టగలుగుతుందంతే! కానీ, మిగతా పిల్లలందరూ తెచ్చుకునే వెరైటీ ఫుడ్ చూస్తూ, తన బాక్స్ ఎవరూ పంచుకోకుండా వెక్కిరిస్తున్నందుకు పిల్లాడు బాగా హర్ట్ అవుతాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? కొడుకు కోసం ఉద్యోగ బాధ్యతలను తగ్గించుకునో, ఉద్యోగం మానేసో వంట చేస్తుందా? లేదా కొడుకుకి అమ్మచేతి వంటలో మమతను తెలియనివ్వకుండా ఒక వంటవాడిని పెట్టుకొని నెట్టుకొస్తుందా? ఏం జరిగిందో తెల్సుకోవాలంటే చదవండి తుమ్మల మాధురీ శేఖర్ రాయబోతున్న కొత్త కథ ‘టిఫిన్ బాక్స్!’

నాలో నేను ముసిముసి నవ్వులు నవ్వుకోవడం చూసి అత్తయ్య కేక్ బాగా వచ్చినందుకు మురిసిపోతున్నా ననుకున్నారు. దగ్గరకొచ్చి, “భలే ముద్దొస్తున్నాయ్!” అన్నారు. కాలింగ్ బెల్ మోగింది. ఇల్లంతా దద్దరిల్లి పోయేట్టు మా హీరోగారు ‘కేక్! కేక్!’ అంటూ అరుచుకుంటూ కిచెన్‌లోకి వచ్చి కాళ్ళకి చుట్టుకున్నాడు.

“నో! నో! నో! ముందు ఫ్రెష్ అయ్యి రా! అప్పటివరకూ నో!” ఇంతవరకూ కష్టపడి తయారుచేసినవి వాడి చేతులు తగిలి పాడవ్వకుండా అడ్డు నుంచున్నా. అత్తయ్య వాణ్ణి వెనుకనుంచే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ పట్టుకెళ్ళారు.

టీలు-టిఫెన్లు. వంట-వార్పు. తుడవడం-కడగడం. అన్నీ అయ్యేసరికి దీప నుండి మెసేజ్ వచ్చిందని చూసుకున్నాను. కథ ఎంత వరకూ వచ్చింది?

“జాతకాలు బోగస్. మనసులు మాయ. నిజమైన, నిఖార్సైనవి మన శరీరాలు మాత్రమే! కలవాల్సినవి…” అతడు వాక్యం పూర్తిచేయలేదు.

ఏ వాక్యం? ఎవరతడు?

తెలీదు. బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాను. పక్కలో పడుకోబెట్టుకొని శేఖర్ మా హీరోకి కథ చదివి వినిపించబోతున్నాడు. నేనూ పక్కనే చేరాను. పుస్తకాలు తినే అలవాటున్న పిల్లాడి కథ చదువుతున్నాడు. నాన్న చదువుతున్న కథలో వాడింకా వాక్యాలను రుచి చూస్తూనే ఉన్నాడు, నేను నిద్రపోయాను.

ముందుకు నడవని కథ నుండి కొంత బ్రేక్ తీసుకొని, మళ్ళీ ప్రయత్నించండి. ఓవర్‌కమ్ రైటర్స్ బ్లాక్ అనే సెషన్‌లో చెప్పిన చిట్కాల్లో ఒకదాన్ని కొట్టేశాను. కథ అటకెక్కి మూడు నెలలు అయ్యింది. ఏ మాత్రం సరిగ్గా రాకపోయినా కథంతా కంపు అవుతుంది. వాళ్ళిద్దరికీ ఇది అలవాటే, ఇలా ఇంతకు ముందు ఎన్నోసార్లు చేశారన్న భావన కలిగించకూడదు. ఆ లెక్కన రెండో సారి లంచ్‌కి కలిసినప్పుడే శరీరాల కలయిక గూర్చి సూటిగా అడగడం అతకదు. ఇద్దరూ ఉన్న పరిస్థితుల్లో విసిగి వేసారిపోయారు. ఆ విసుగుని పట్టుకొని రావాలి కథలోకి. నేరుగా చెప్పకుండా ఎలా చూపించటం? అసలు నేనీ కథ ఎందుకు రాయాలనుకున్నాను? టిండర్ నేపథ్యంలో వచ్చిన ఒక కథ చదివా. అలాంటిదే మధ్యతరగతి పెంపరికంలో పెరిగిన ఇద్దరి మధ్య, పరిస్థితుల వల్ల తీసుకున్న నిర్ణయాలతో ఎలా ఉంటుందా అని మొదలెట్టిన కథ! మొదట్లోనే ఆగిపోయింది.

కదలని కథను పూర్తిగా పక్కకు పెట్టేసి ఇంకో కథ మొదలెట్టండి. టిఫిన్ బాక్స్ కథ రాశాను. నేను ముందు ఊహించినట్టూ ఆమె ఉద్యోగమూ మానేయదు, వంటవాణ్ణి పెట్టుకోదు. కొడుక్కి అర్థమయ్యేలా పరిస్థితులను వివరిస్తుంది. వీకెండ్ మాత్రం ఇష్టమైనవి వండిపెడతానని నమ్మకంగా చెబుతుంది. కొడుకు క్లాస్‌మేట్ అమ్మను పరిచయం చేసుకుంటుంది. మాటామాటా కలిసి ఆమె ఇంటినుండే బేకరీ నడిపేందుకు సలహాలిస్తుంది. కథ గొప్పగా వచ్చిందనిపించలేదు. కానీ పత్రికకు పంపడానికి పెద్దగా ఆలోచించలేదు కూడా.

వ్యాయామం చేస్తే ఆలోచనలు చురుకవుతాయి. రోజూ పార్క్‌లో కనిపిస్తుంటే పలకరింపుగా నవ్వుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. కథలో పాత్రలు కూడా నాతో నడకకి వచ్చేవి. నాకంటే ముందుగా వెళ్ళిపోతుండేవి. పలకరించి పరిచయం చేసుకుందామంటే మాత్రం దొరికేవి కావు.

మీరు రాయాలనుకుంటున్న అంశం గురించో, అలాంటి అంశాల గురించో ఇంకెవ్వరైనా రాసే ఉంటారు. అవి చదవటం వల్ల మీకేమైనా ఐడియాలు తట్టచ్చు. దీపకే మెసేజ్ పెట్టాను, ఫీమేల్ సెక్సువాలిటీ గురించి ఈ మధ్య వచ్చిన తెలుగు కథలేమన్నా ఉంటే పంపమంటూ.

టేబుల్ మీదున్న రెండు పుస్తకాలు ప్రస్తుతం చదువుతున్నవి. ఒకటి మెక్సికన్ రచయిత నెట్టల్‌ది. వాళ్ల కథల్లో అఫైర్స్ మనం కొత్త బట్టలు కొంటున్నప్పుడు వేసే ట్రయల్స్ అంత సునాయాసంగా ఉంటాయి. ఒక జంకుండదు. బొంకుండదు. కనీసం వారి కథల్లో, సినిమాల్లో! ఇంకోటి ఇస్మత్ చుగ్తాయ్ కథల పుస్తకం. ఆమె అప్పట్లోనే అన్ని ఎలా రాసిందో, అన్ని రాసినా ఆ విషయాలు మామూలైపోకుండా ఎందుకున్నాయో నాకు అర్థం కాని విషయం. నాకు అర్థం కాని ఇంకో విషయం నేనెందుకు ఇవి రాయడం అనేది. రాస్తేగానీ రోజు గడవని పరిస్థితి కాదే! పిన్ని అన్నట్టు నేనెందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాను? రాయడం ఎందుకింత ముఖ్యం నాకు? నేనేం చిన్నప్పటి నుండి డైరీలు రాసేసి, రచనా పోటీల్లో మొదటి ప్రైజులు కొట్టేసిన రకం కాదే?! చేతిలోకి పెన్ తీసుకోగానే మాటలలా పొంగిపొర్లిపోవే! మాటమాటకీ కూడుకోవడమే! కూడిన వాటిల్లో కోటి తప్పులు! మరి నాకెందుకీ గోల?

దీప నుండి ఒక నాలుగైదు లింకులు వచ్చాయి. చదివాను తీరుబాటుగా రెండుమూడు రోజులు. దీపకి సోమవారం సెలవు. ఆ రోజే ఫోన్ చేశాను.

…ఏంటా కామెంట్లు? …ఓ! ఔనా, అదేంటి భలే ఉన్నాయి ఎన్టర్‌టెయినింగ్‌గా, అంటారేంటండీ మీరు కూడా! …అది కాదండి. కథ బాగా రావచ్చు, రాకపోవచ్చు, కానీ కథను వదిలేసి అలా వ్యక్తిగతంగా …దట్స్ ది వే ఇట్ ఈజ్ అని ఊరుకోలేం కదండీ. …మీరన్నట్టే కామెంట్ మోడరేషన్ లాంటివి చేయచ్చు. సైటులో మోడరేషన్ పెట్టచ్చు. ఫేస్‌బుక్‌, వాట్సాప్ గ్రూపుల సంగతి? …కానీ ఆవిణ్ణి అంతలేసి మాటలు అనడం ఎంత అసభ్యం కదా? వాళ్ళాయనకి మెయిల్ చేసి, మీ ఆవిడ ఇలాంటివి రాస్తుందంటే ఎలాంటిదో ఆలోచించుకో అని రాశారా? …అయ్యబాబోయ్, అవునా? ఆవిడ ఏం అనలేదా మరి? …అవును కదా, ఎందర్ని అంటుంది? ఎంతకాలం అంటుంది? …మరి ఆర్పీ రాసిన కథ కింద కామెంట్స్ ఇంత దారుణంగా లేవే? ఆడవాళ్ళు రాస్తేనేనా? …ఆడవాళ్ళనందరిని ఒకే గాటకి కడతావా? ఎంత చులకన మేమంటూ, ఆయనకూ పడ్డాయా! …అవునా! పోలీసు కేసు బెదిరింపులు అయ్యాయా! నాకు ఇవేం తెలీవు. …కానీ, పోలీసుల వరకూ ఎందుకసలు? ఆయన ఎవరైనా తెలిసున్న వాళ్ళ గురించి ఉన్నది ఉన్నట్టూ, గుర్తుపట్టేట్టూ దింపారా? …ఈ కథ లానే అదీ కూడా ఫిక్షనేనా. మరి …ఎవరూ? ఓ ఆయనా, గుర్తుంది. ఓ ఆరేడేళ్ళ క్రితం ఒకాయన ఒకావిడ గురించి పేరు కూడా మార్చకుండా రాశారు. అప్పుడు ఇలా ఎవరూ గొడవ చేసినట్టు నాకు తెలీదు. ఎవరూ చేయలేదనుకుంటా. మరి ఆర్పీ కథ …ఓహో! ఆయన నాకు ఫలానా ఆడదానిపై ఆపుకోలేని కోరిక కలిగింది అని రాశాడు. ఈయన ఒకానొక ఆడదానికి ఆపుకోలేని కోరిక కలిగిందని రాశాడు. అదా తేడా? …ఏమిటోనండి, ఈ లెక్కన నేను రాయాలనుకుంటున్న కథ …ఎక్కువ ఆలోచించకండీ రాయండీ అని మీరు చెప్తారు …అవున్లెండి. అదీ నిజమే. ఇది ఇప్పటి కథ కాదు. అనానిమస్ ఎప్పుడూ ఒక స్త్రీ రచయితే అయ్యుంటుందని వర్జీనియా ఉల్ఫ్ ఎప్పుడో అంది కదా…

దీపతో మాట్లాడాక నేను కొన్ని రోజులు స్థిమితంగా లేను. తన మాటలే నా చెవుల్లో పదేపదే రింగుమన్నాయి. నేను అప్పటివరకూ మెత్తగా జోకొడుతూ పడుకోబెట్టిన భయం ఒక్కసారిగా విజృంభించింది. నాలోని నమ్మకం, భద్రత ఏడుపు అందుకున్నాయి. నోట్‌బుక్కు నల్లమందులా కనిపించింది. “ఏంటమ్మాయ్… అలా ఉన్నావ్? ఒంట్లో బావుండలేదా?” అని అత్తగారు పదేపదే అడిగారు. పిన్ని మాటలే మననం చేసుకుంటూ కథ జోలికి వెళ్లలేదు. రాసిన డ్రాఫ్ట్స్ డిలీట్ చేశాను. కానీ పట్టిన దెయ్యం పోలేదు. ఎంతకీ పోలేదు.

మీరు రాయబోతున్న కథలోని పాత్రతో మీరు మాట్లాడి చూడండి. ఇంకో సలహా ఆన్‌లైన్ కోర్సులో నేర్చుకున్నది.

హలో!

హాయ్!

ఇది నేను రాస్తున్న కథ. ఇందులో నువ్వు నేను చెప్పినట్టు చేయి.

అప్పుడది నా కథ ఎలా అవుతుంది? ఇంకెవరి కథో అవుతుంది.

ఐ డోన్ట్ కేర్. నా కథలో ఇలాంటి వేషాలన్నీ నేను చూస్తూ ఊరుకోను. ఆ అబ్బాయికి నువ్వు కలవడం కుదరదని చెప్పేయ్.

కుదరదు.

ఎందుకు? ఎందుకు కుదరదు? నువ్వేమన్నా అతణ్ణి ప్రేమిస్తున్నావా? ఇదేమన్నా నీ మొదటి పెళ్ళిచూపులా? ఎన్ని కాలేదు ఇలాంటివి నీకు?

అయితే? నాకిప్పుడు అతడు కావాలి.

నువ్వు అతణ్ణి ప్రేమిస్తున్నావా?

లేదు.

మరి అతణ్ణి కోరుకోవడమేంటి అసహ్యంగా?

అంతేనా? అసభ్యంగా, బజారుదానిలా అని కూడా అను.

ప్లీజ్. నీకు ఆసక్తి లేకపోయినా అతడే నిన్ను వెంటపడి వేధిస్తున్నట్టు రాసుకోనివ్వు. నువ్వు నా ప్రమేయం లేకుండా కథలోకి దూరిపోతున్నావ్. నీ ఇష్టమొచ్చినట్లు నవ్వుతున్నావ్. అతడిని చూడగానే కరిగిపోతున్నావ్. వద్దు! కోపం తెచ్చుకో. భయపడు. నా మాట విను.

ఏంటి నీ గోల అసలు? నేనింతే. నా కథ ఇంతే. రాసే దమ్ము లేకుంటే దొబ్బేయ్! ఇంకో కథ, ఇంకొకరి కథ రాసుకో. నన్ను చావగొట్టకు.

ఇంకోసారి అవకాశం ఇస్తున్నాను. పోనీ, అతడితో గడిపిన వెంటనే, అదే మంచం మీద ఒక మూలన కూర్చొని, ఒంటిని చీరతోనో చున్నీతోనో కప్పుకొని, మోకాళ్ళ మీద తల ఆన్చి, వెక్కి వెక్కి ఏడుస్తావా ప్లీజ్? మన సినిమాల్లో మధ్యతరగతి మర్యాదస్తుల అమ్మాయిలు ఒక వానపడిన రాత్రి, ఒక బలహీనమైన క్షణంలో లొంగిపోయాక వెంటనే తప్పు తెలుసుకొని ఏడ్చినట్టు?

నాకేం అలాంటి రిగ్రెట్స్ లేవు. ఉండవు. నాకేం కావాలో నాకు తెల్సు. ఎలా పొందాలో తెల్సు. కోరుకున్నది దొరికాక ఇంకా ఏడవడం దేనికి?

నువ్వు ఏడవకపోతే నన్ను ఏకేస్తారు. ఇది నీ కథ కాదు, నాదేనని అంటారు!

పిరికిపంద!

అవును. పిరికిపందనే! నీకేం? నువ్వు ఈ కథలో ఉంటే సరిపోతుంది. ఈ కథ దాటితే నీకు ఉనికే లేదు. మేం మనుషులం. ఎన్నో పాత్రలు పోషించాలి మేము ఒకటేసారి. నటిగా ఏ పాత్రకైనా న్యాయం చేయాలి. న్యాయం చేసినందుకు బహుమతిగా ‘నువ్వు వేశ్య పాత్ర అంత బాగా వేశావంటే నువ్వు ఎలాంటిదానివో అర్థమవుతూనే ఉంది’ అన్న ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాలి.

హహహహ! అనేవాళ్ళు అంటారు…

పడేవాళ్ళు పడతారు అంటావ్! అంతేనా?

ముమ్మాటికీ అంతే!

ఏం, నేనెందుకు పడాలి? కథ రాసిన పాపానికా? ప్రపంచాన్ని నేను అర్థం చేసుకుంటున్న వైనాన్ని ప్రపంచానికే చెప్పినందుకా? అది తప్పయితే, అది నా తప్పు. దానికి మా నాన్న ఏం చేశారు? ఎందుకు ఆయన, మా అన్నయ్య అన్నేసి మాటలు వినాల్సి వచ్చింది? పత్రికలు పంచడం వరకూ వచ్చిన పెళ్ళి ఆగిపోయింది. బ్లాగు చదివి కారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అయ్యో! అవి కథలు మాత్రమే, ఫిక్షన్, కల్పించినవి అని అంటే ‘నీ బ్లాగులో ఆహో, ఓహో అని కామెంట్ చేసేవారికి చెప్పుకో ఈ కాకమ్మ కథలు! మాకు కాదు. ఏమీ తెలియని అమాయకురాలు, పాపం! అనుభవం లేదట, కానీ పూసగుచ్చినట్టు రాసేస్తుందంట మరి!’ అన్నారు. బాబాయ్, మామయ్యలు వెళ్ళి మాట్లాడితే, ‘ఏదో మీ మోహం చూసి ఒప్పుకుంటున్నాం. అయితే బ్లాగుల్లాంటి పిచ్చి పనులు మానుకోవాలి పూర్తిగా! ఆ యూనివర్సిటీ స్నేహితుల్లో రాసేవారికి దూరంగా ఉండాలి,’ అని షరతు పెట్టారు కాబోయే అత్తామామలు. అన్నయ్య ఒప్పుకోలేదు. పెళ్ళికి ముందే ఇన్ని ఆంక్షలుంటే, పెళ్ళయ్యాక? అని భయపడ్డాడు. కాబోతున్న వదిన కూడా అండగా నిలిచింది. వాళ్ళ పెళ్ళిలో అందరూ, ఇదే పందిట్లో రెండు పెళ్ళిళ్ళు అని అనుకున్నారు. అనవసరంగా పెళ్ళి చెడగొట్టుకుంది పిల్ల! అని గుసగుసలాడారు.

బ్లాగ్ ఇక డిలీట్ చేసేశాను. ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించలేదు. ఏడాది అయ్యాక శేఖర్…

“మధూ! ఏమయ్యింది?” అంటూ నా భుజాలు ఊపేంతవరకూ, శేఖర్ స్టడీలోకి వచ్చినట్టు చూసుకోలేదు. లాప్‌టాప్‌కి పెట్టిన చార్జర్ ప్లగ్ నుండి ఊడి వచ్చేసింది. లాప్‌టాప్ ఒక మూలకి జరిగిపోయింది. పుస్తకాలు రెండు కార్పెట్ మీద పడున్నాయి.

“ఏదో పీడకల!” అన్నాను.

“ఏంటీ? నువ్వింకా పడుకోనిదే?!”

సగం తెరిచిన ఆమె కళ్ళకి కిటికీకున్న గాజు అద్దాల్లోంచి వస్తున్న వెలుతురు ఇంద్రధనస్సు రంగుల్లో కనిపించింది. గోడలు, కిటికీలు, సీలింగ్, పరుపు, బెడ్‌షీట్, కప్పుకున్న రగ్, అన్నీ తెల్లవే! బాత్రూమ్ లోంచి నీటి చప్పుడు వినిపించింది. అటువైపు తిరిగి పడుకుంది. లేవడానికి ఒళ్ళు సహకరించలేదు.

“గుడ్ మార్నింగ్!” అన్నాడు అతడు బయటకొస్తూ. ఆమె బదులుగా సన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకుంది.

“ఆకలి దంచేస్తుంది. లేస్తావా? బ్రేక్‌ఫాస్ట్ చెప్తాను!” అని అన్నాడు. “బాగా కుమ్మేయాలి. మూడువేలు బిల్లు వేసినందుకైనా. పైగా రాత్రి పడ్డ కష్టం మామూలు కష్టమా?”

“పడ్డ కష్టమా? పెట్టిన కష్టమా?” ఆమె నవ్వుతూ పక్కనున్న దిండు తీసి విసిరింది. కాల్ వస్తుందని అతడు బయటకు వెళ్ళాడు.

ఆమె మెల్లిగా లేచింది. జరిగిందంతా కళ్ళ ముందు మళ్ళీ తిరిగింది. నవ్వుకుంటూనే ఆమె మొహం కడుక్కొని వచ్చేటప్పటికి అతడూ, బ్రేక్‌ఫాస్ట్ సిద్ధంగా ఉన్నారు. అతడన్నది నిజమే. ఆకలి మామూలుగా వేయడంలేదు!

“…”

“హేయ్! ఏమాలోచిస్తున్నావ్, ఉన్నట్టుండి? ఎనీ…”

“ఏం లేదు, ఎందుకో మనవాళ్ళని ఒప్పించగలిగి ఉంటే…”

అతడు అసహనంగా తలూపాడు. “జరగనిది ఎందుకు ఆలోచించటం? మావాళ్ళున్న పరిస్థితుల్లో నేను ఎదురుతిరిగే సమస్యే లేదు. మా తమ్ముడు చనిపోయి…”

“మా ఇంట్లో ఎవరూ చనిపోలేదు.” అంటూ ఆగిపోయింది ఆమె. జ్యూస్ గ్లాస్ అందించాడు. తీసుకుంది.

“ఎనీవే నీకు చాలా థాంక్స్! నిన్నటి వరకూ ఏమో గానీ… ఇవ్వాళ పొద్దున్నే నువ్వెలా ఉంటావోనని భయభయంగా ఉండింది.” అన్నాడు ఆమె చేతిని నొక్కుతూ.

“ఎందుకూ భయం? థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్!” అన్నది.

బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే అతడు గబగబా తయారయి ఏర్‌పోర్టుకి బయలుదేరాడు. ఆమె నిదానంగా రెడీ అయి, తనకు అంతగా పరిచయం లేని కొత్త సిటీని పరిచయం చేసుకోడానికి కార్ రెంట్‌కి తీసుకొని బయలుదేరింది.

పూర్తయిన కథని శేఖర్‌ని చదవమన్నాను.

“అభిప్రాయం తెలుసుకోడానికా? అనుమతి కోరుతూనా?”

చెప్పక్కర్లేకుండానే నా సమాధానం అర్థమయ్యింది.

“నీ కథకు నువ్వు అనుమతి ఇచ్చుకున్న రోజున చదువుతాను.”

“ఆ రోజు ఎప్పటికీ రాకపోవచ్చు.”

“అసలు కథే పూర్తికాకపోవచ్చనన్నావ్! అయ్యిందిగా.”

“నాకు నా కుటుంబం ముఖ్యం!”

“నీకు నువ్వు కూడా ముఖ్యమేగా?”

నాకు నేను ముఖ్యమా? దానికి సమాధానం వెతుక్కుంటూనేనా ఇంత కథ అయ్యింది!
-----------------------------------------------------------
రచన: పూర్ణిమ తమ్మిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment