Saturday, September 1, 2018

ఓ పెంపకం కథ


ఓ పెంపకం కథ





సాహితీమిత్రులారా!

రైల్వే ట్రాక్ పక్కన చిన్న బోడగుట్ట, దానికి ఒక దిక్కునుంచి కంకర రాళ్ళ క్వారి, కట్టెకు చదలు పట్టినట్టు గుట్టను కొరుక్కుంటూ వస్తున్నారు.చిన్న, చిన్న పొదలు, తంగేడు చెట్లు, ఎంపిలి మొక్కలు అంతకు మించి మరేంలేవు. తుప్పలన్న, మహా వృక్షాలన్నా గదే అడవి.

ఆ గుట్టకు మరో దిక్కున చిన్న చిన్న పాకల్లా౦టి గుడిసెలు. ఎక్కువ మొత్తంలో కప్పులమీదికి అట్ట ముక్కలు, చినిగిన గోనెసంచులు.చినిగిన ప్లాస్టిక్ సంచుల నీడ కింద పది,పదిహేను కుటుంబాల వాళ్ళు౦టరు. పక్కన చిన్నవాగు, వానా కాలంలో నీళ్ళతో పార్తది. చలి, ఎండా కాలాలు టౌనులోని డ్రైనేజీ మురికి నీళ్ళతో పారుతు౦టది.

గుడిసెలకు కాస్త ఎడంగా ఎవరో ఆసామిది పల్లంభూమి తోట. ఆ తోటలో కూరగాయలు పండిస్తడు రైతు, జాలి గల్లోడు అప్పుడప్పుడు తిట్టి, కొందర్ని కొట్టినా ఆ పాకలోల్లకి మంచినీళ్ళిచ్చి ఆదుకునే దాత. తోటలో కరెంటు మోటరు౦ది, తోటకి నీల్లోదిలినప్పుడల్లా దొంగ తన౦గానో, దానగుణ౦ వల్లనో నీళ్ళు పట్టుకొచ్చుకుంటరు.

పాకల్లోని వాళ్ళు చిత్తు కాగితాలు, పడేసిన ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునుడు వృత్తి. రైల్వే ఇనుప సామాన్లు దొబ్బుకోరావదం, పాత ఇనుప సామాన్లు కొనే కొట్లో అమ్ముకోవడం ప్రవృత్తి. రైల్వే పోలీసోళ్ళతో మా చెడ్డ బూతులు, తన్నులు తినడం పరిపాటి.

ఈ పాకల్లోనే మాణిక్యం వుంటది, నోరు చానా చెడ్డదని పేరు పడ్డది.

ఆమె నోట్లో పడటమంటే డ్రైనేజీ నీళ్ళు నోట పట్టి పుక్కిలి౦చినట్లే లెక్క. ఎవరూ ఆమె జోలికి పోరు, మొగుడు సచ్చిందెగ్గర నుంచి ఒంటరిగానే వుంటుంది, తనకు దిక్కు మొక్కూ ఎవరూ లేరంటది. కాని మంణిక్యం ఈ పెనక నీడలాగ ఓ కుక్క తోడిడవకు౦డా వుంటది.గోనె సంచి భుజానేసుకొని బైలెల్లిందంటే ఎనక తోకాడి౦చుకు౦ట కుక్క వుండాల్సిందే. వీధిలో చెత్తకుప్పల దెగ్గర అటూ ఇటూగా జమిలిగా కనిపిస్తరు. వీధిలో చెత్తకుప్పల దెగ్గర వేరే కుక్కలు వీళ్ళను చూస్తె చల్లగా జారుకుంటాయ్.రోజూ అరవై, డెబ్భై దాక సంపాదన వుంటది, రైల్వే వాళ్ళ కన్నుగప్పి ఇనుప సామాను దాటిచ్చిన్నాడు సంపాదన రెట్టింపు వుంటది. ఆ రోజు వీళ్ళను చూసిన వాళ్ళు, కిట్టని వాళ్ళు ఎన్నో గుస గుసలు చెప్పుకుంటారు.మాణిక్యం కుక్కను ప్రాణపదిలంగా పెంచుకోవడానికి ఒక పెద్ద కథ లేకపోలేదు.ఎవరూ నమ్మరని ఎవరికీ చెప్పనూ లేదు.అందులో శీలరక్షణ (self-defense), సానుభూతి దాగున్నాయ్.
బాగా మత్తులో ఉన్నప్పుడు కుక్కతో ఇట్లంటది ‘ ఏరా నేసచ్చిన్నాడు ఏ మగ నాకొడుకుని నన్ను తాకనీయొద్దు, నువ్వే పీక్కొని తింటవో, ఈడ్చుకో పోయి ఏ గోతిలోనో గిరాటు వేస్తవో నీ ఇష్టం ‘. బాధగా అంటుంటది.వెంటనే తేరుకొని ‘తనకు ఏకైక శత్రువు పోశామ్మే ‘అని చెప్పేది.

‘దాన్ని నువ్వే పడగొట్టాలిరా, నా మగనికి నాకు మధ్య నిలబడ్డ ఆడది.సాచ్చికం దొరకలేదు కాని అది దొంగే, దొంగ చాటుగా నా మగన్ని కాజేసిన జాణ. నాకు శత్రువైనప్పుడు నీకూ శత్రువే, పగ తీర్చుకోవాలి ‘.

ఫుల్లుగా తాగినప్పుడు ఇదే తంతు, ఎంతకూ తెగదు, కుక్క నుంచి బదులు రాదు.

***

అందరు ఆడ పిల్లలాగ మెట్టినింటికి వచ్చినప్పుడు కొంగున ఎన్నెన్నో కోరికల్ని మూటగట్టుకొని వచ్చింది. సామాన ఛాయ, తెల్లగా కెంపుల్లాంటి కళ్ళు, గుండ్రని ముఖం చూడముచ్చటైన రూపం మాణిక్యానిది.ఆ మొరటోడికి గవేం కనిపించలేదు. హుశారెక్కినప్పుడు నరాల బిగుతును తగ్గించుకునే పని ముట్టుగానే చూసిండు.అందరు ఆడంగుల బతుకి౦తేలే అని సరిపుచ్చుకుంది.వంటరి రాత్రులు ఈదుతూ, గుడిశె పైకప్పు కంతలోంచి పొడ మచ్చల్లాగా పడుతున్న పాల మీగడ లాంటి తెల్లటి వెన్నెల దెగ్గర పక్షపాతం వుండదు. దివాణాల మీద, పూరిపాకల మీద ఒక మాదిరిగానే కురుస్తది. ఆ వెన్నెల రాత్రులు అందరికీ వుంటాయి, మాణిక్యానివి చాలా మట్టుకు శివరాత్రులే. కన్నీళ్ళ మధ్య జాగారపు చీకటి ఘడియలు. నింగి నుంచి వుల్కలు రాలి పడ్డట్టు మాణిక్యం కోరికలు ఒకొక్కటి గా నేల రాలిపడ్డాయి.జీవితం కాలుతున్న ప్లాస్టిక్ సంచుల కమురు వాసన.ఏ గడియలో శురూజేసిండో గని తిట్లు, వడ్లు ద౦చినట్టు పిడి గుద్దులు, వొళ్ళు హూనం చేసేటోడు. తాగోచ్చుడు నోట్లో నోరుపెట్టి కుక్కలాగ వొగార్చేటోడు, ఆ వాసన పీల్చి, పీల్చి తనకూ నిషా ఎక్కేది, కొద్ది దినాలకు తనకూ మందు తాగుడు అలవాటైంది. మొదట్లో సాటుమాటుంగ పోయి సారాపాకెట్లు బొడ్లో దోపుకొని ఇంటికి తెచ్చుకొని తాగేది.మొగడు తన్నిన తన్నులకు, పిడిగుద్దులు తట్టుకోవడానికి టానిక్ దొరికినటైంది.సాటు మాటుంగ పోయి ఏకంగ మగనితోనే సారా కొట్టుకు పోయి తాగటం షూరూ చేసింది మాణిక్యం.

ఒక రోజు మగడు నాటు సారా పూటుగా తాగి దారి పక్కన తుప్పల్లో పడున్నాడంటే లగెత్తి౦ది. నోటెంట నురగలు పూసివున్నాయ్, కట్టెలాగ పడున్నడు. ఎంత కుదుపి లేపినా మనిషి లెగలేదు. చుట్టుపక్కల వాళ్ళు లేపి చూసి ‘కదుల్తలేడు, సచ్చిండన్నరు.’ కల్తీ సార తాగి సచ్చిండన్నరు. దిక్కులేనిదానికి ఎవరు న్యాయంజేస్తారు. గుడిసెలోళ్ళే ఒకొక్కళ్ళు కూడి మాపటాల్లకు దానం చేసి౦న్లు. గా సాయంత్రం నుంచి మాణిక్యం ఒంటరిదై౦ది,దిక్కులేంది అయింది. గుడిసె పక్కన మూల్గుతున్న కుక్క పిల్లను చేరదీసింది, అన్నం తింటూ ఎంగిలి చేత్తో ఒక ముద్దని కుక్క ముందు గిరాటు వేసింది, ఆ ఒక్క ముద్దకే మచ్చికై౦ది. తను యాడికిపోతే ఆడికి తోకూపుకుంటూ వచ్చేది, తను చెప్పిందల్లా చేయటం అలవాటు చేసుకుంది.

ఆ గుడిసెకు మగ దిక్కులేదు, కుక్కే దిక్కు. గుసెలల్ల వున్న మగోల్లు వంటరి ఆడది కనిపిస్తే వెకిలి చేష్టలు చేయకపోలేదు, ఏ మగాడన్న మంచిగ మాట్లాడితే నమ్మేది కాదు మాణిక్యం. అందరు మగాళ్ళలో మగని రూపం కన్పించేది. ఆ తన్నులు, పిడిగుద్దులు, ముక్కు చిట్లి, పెదాలు పగిలి రక్తం కారడాలు గుర్తుకొచ్చేది.

‘ త్తూ, మగానాకోడుకులు ‘ అని తుపుక్కున వూసేది.

నాలుగు ఎంగిలి మెతుకులు తిన్న కుక్క ఇంత విశ్వాసం చూపిస్తుంది.మగనికి ఎంత చాకిరి చేసింది, తాగొచ్చి కక్కుకుంటే చేతుల్లో పట్టి బయట పడేసింది, మూతి కడిగింది, ముడ్డి కడిగింది, కాళ్ళూ, చేతులు కడిగి గోరు ముద్దలు తినిపించింది.మగనితో సరిసమానంగా కూలి, నాలికి వెళ్ళి సంపాదించి౦ది. అడివికెల్లి కట్టెలేరుకోచ్చి౦ది, క్వారీ పనికి పోయింది, ఉడతల్ని వేటాడపోతే తోడురికింది షికారు చేసింది, చివరికి సర్వస్వం అర్పించింది. ఇంత జేసినా. ‘నమ్మేటోడు కాదు బడ్ఖావ్’.

‘ గా సందులో ఎవడితో మాట్లాడుతున్నావ్ ?’

‘ఆ కంచె పొంటి దాక్కొని ఏం జేస్తున్నవ్’ ? అని ఆరాలు తీసి సాదిచ్చేటోడు.

‘ గలీజు పనికి అలవాటు పడ్డదాన్ని, ఎన్ని దినాలు కాపలా కాస్తడు మగాడు. పొద్దు చాపిన చూపులకు కనిపించని మర్మం అది ‘ అనేది.
‘ మనసులు కలువాలె, మగాళ్ళి౦తే…….’

‘ఒంటరి ఆడది కనిపిస్తే తోడేళ్ళలా చొంగలు కార్చుకుంటూ ఎగబడతరు, ఛీ ‘ అనుకుంది మాణిక్యం. ఆ ఘడియ నుంచి మగోనికి బానిస బతుకు బతకోద్దనుకుంది.

మగడు పోయిందెగ్గరి నుంచి గుడిసెలో తనూ కుక్క ఇద్దరే వుండేటోళ్ళు, మాణిక్యం బాగా తాగోచ్చిన్నాడు మత్తులో కుక్క పక్కలో పడుకునేదో, తన పక్కన కుక్క పడుకునేదో గుర్తుండేది కాదు.ఇద్దరికి ఒకరి పక్కన ఒకరు పడుకోవడం అలవాటైపోయింది. మధ్య, మధ్యలో కుక్క తన శరీరం వాసన ముక్కులు ఎగపీలుస్తూ చూసేది. ఆ వేడి శ్వాస మగడు తనమీదికి ఎగబాకి వగర్చిన వేడి గాడ్పులా తగిలేది. కుక్కలకు వాసన పసికట్టడం అలవాటు మీద చూస్తుందని సరి పుచ్చుకుంది.రాను, రాను కుక్కకు తన శరీరం వాసన చూట్టం, నాలుకతో నాకటం అలవాటుగా మారి౦ది. దాని గరకు నాలుకతో శరీరమంతా నాకుతుంటే ఏదో అనుభూతిలోకి జారుకోవడం అలవాటు చేసుకుంది.కుక్కల్ని ఎత్తుకోవడం, ఎత్తుకొని ముద్దులు పెట్టడం, పెట్టి౦చుకోవడం లాంటి సందర్భాలు తను చూసినవి చాలానే ఉన్నాయి.అది క్రమేపి ఇద్దరి మధ్య అలవాటుగా మారింది.

బజార్లో మాణిక్యం తో ఎవరన్నా గొడవ పడ్డారంటే కుక్క ఊర్కొనేది కాదు.తగాదాకు వచ్చిన వాళ్ళ మీదికి ఉరికేది.అది చూసినవాళ్ళు మాణిక్యం తో తగవు పడేవాళ్ళు కాదు, కుక్కతో కరిపిస్తాదని తోక ముడ్చేవాళ్ళు. గీ పొద్దుగాల కుక్క తనెంట రాలేదు, మగతగా కళ్ళు మూస్తూ, తెరుస్తూ పడుకోనుంది, తను రమ్మని సైగ చేయనూలేదు.రాత్రి ఇద్దరు పస్తుగానే పడుకున్నారు. ఆకలైనప్పుడు అద్దంరాత్రి లేసి తనన్నా కడుపునిండా నీళ్ళు తాగి పడుకుంది, కుక్కకు అదీలేదు.గోనె సంచి భుజానేసుకొని పోతుంటే గుడిసె కంచెవార డొక్క లోనికి పీక్కోపోయి ఇసూరోమని పడుకొని వుంది.

మల్లోచ్చేటాల్లకు పక్కింటి ఎల్లమ్మ పిడుగులాంటి వార్త చెవిలో ఊదింది. కోపంతోటి గుడిసెకు బిరబిరా వురికోచ్చింది, కుక్క కంచె సందులో పడుకున్నట్టే వుంది.పోద్దటిలాగ కడుపు పీక్కపోయి పక్కటెముకలు కనిపిస్తలేవు, కుక్క కడుపు నిండుగా వుంది.తన రాకనుచూసి రోజుకు మల్లే తోకూపుకు౦ట దెగ్గరికి రాలే, మత్తుగా పడుకోనుంది. మాణిక్యం పూనకం వచ్చిన దానికి మల్లే ఊగిపోతూ “…ముండల్లార, ఎవతే నాకుక్కకు బువ్వ పెట్టింది ? బయటికి రావే నాసవతి “.అని గైయ్య మని మాణిక్యం తిట్లతోటి, శాపనార్దాలతోటి ఆ వాడ౦తా మారుమోగి పోతుంది.

ఆ తిట్లన్నీ పోశమ్మకే సూటిగా తగులుతున్నాయి, తిట్లు వింటుంటే పోశమ్మకు వశపడుత లేదు.ఎప్పుడు బైటికి పోయి మాణిక్యం జుట్టు పట్టుక తన్నాలా అని కాలుదువ్వుతున్నది, కాని ఇంట్ల బిడ్డ అడ్డంపడి బైయిటికి రానిత్త లేదు. ఆ అదును చూస్కొని మాణిక్యం రెచ్చిపోతుంది.

“బైటికేల్లు నా సవతి, నా కుక్కకు బువ్వ బెట్టిన…ముండెవతో బయటికి రావాలె “.

“ ఏందే తెగ నీల్గు తున్నావ్, కుక్కకు బువ్వబెడితే ఏమైందే నీకు, సిగ్గు షరం లేని ఎదవముండ బైటికొచ్చిన్నంటే కింద పడేసి….బట్టలూడబెరికి తంతా” అంటూ బిడ్డను పక్కకు నెట్టేసి పోశమ్మ బైటికి వురికొచ్చి౦ది.

రావటం రావటంతోటే ఇద్దరు జుట్లు పట్టుకున్నారు, మల్ల యుద్దం, ఇద్దరు సమ వుజ్జీల్లా వున్నారు.ఎన్నాళ్ళదో పగ, ఈ రోజు తలబడుతున్నారు. తిట్లు, శాపనార్దాలు నడుస్తూనే ఉన్నాయి. రైలు పట్టాలమీద గూడ్సు బండొకటి కూత పెట్టుకుంటూ ఎటో వురుకు లంకించుకుంది. కుక్క, వాడలోని జనం ప్రేక్షకుల్లా నిలబడి చూస్తున్నారు.రైలు చప్పుడుకి వాళ్ళ తిట్లు వినపట్టం లేదు, దృశ్యం కనబడుతుంది గోడమీది సినిమాలాగ.ఎటు మాట్లాడాలన్నా మనుషుల్లో రాజకీయాలుంటాయ్. కుక్కకు అంత సంకటంగా వుంది, ఎటూ తేల్చుకోలేక కుడితిలో బడ్డ ఎలుకలాగ కొట్టుమిట్టాడుతుంది. ఇద్దరూ అన్నం పెట్టిన చేతులే, ఎవరి దిక్కు నిలవాలి ? ఎటూ తేల్చుకోలేక పోతుంది. చుట్టూ పక్కలవాళ్ళు ఇద్దరి మధ్యకుపోయి తలదూర్చి కంటు కావాద్దనుకు౦టున్నారు.

ఇంతలో పోశమ్మది పైచేయి అయి౦ది, ఇద్దరి వంటిమీది గుడ్డలు సగానికి పైగా వూడిపోయి కింద మట్టిలో పడి కాళ్ళకింద నలిగిపోతున్నాయి, మాణిక్యం మెడపట్టి కింద పడేసింది పోశమ్మ. మాణిక్యం మీద కూర్చొని పిడిగుద్దులు మొదలు పెట్టింది. చుట్టూ పక్కల వాళ్ళు చూస్తున్నారే గని ఏమీ కల్పించుకోవడం లేదు, సినిమాలో ఫైటింగ్ చూస్తున్నట్టు నిల్చున్నారు జనం.

మాణిక్యం ఓటమిని కుక్క చూల్లేకపోయింది, గైయిన అరుస్తూ పోశమ్మ మీదికి ఉరికింది, కుక్క పోశమ్మ కాలి పిక్కని అందుకోపోయింది, కాలి కండ అందలేదు కుక్క నోటికి, నోటికి అందిన చీరను లాగి పడేసింది. అంతే చీరంతా జారిపోంగ బరిబాతగా గుడిసెలోకి ఉరికి తడిక అడ్డం పెట్టుకుంది. వున్నటుండి కుక్క మీదికి ఎగబడటం తోటి గజ, గాజా వణికిపోయింది పోశమ్మ.

మాణిక్యం మట్టిలోంచి పైకిలేచి వంటి మీద జారిపోయిన గుడ్డలు సరిచేసుకుంది. వంటికి అంటుకున్న దుబ్బను దులుపుకుంటూ కుక్కకెల్లి ఒక్కపాలి మెచ్చుకోలుగా చూసింది. తన జట్టునిల్చి తనకు జరిగిన అమానానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు సంతోష పడింది.మాణిక్యం ధైర్యం తెచ్చుకుంది.

“ ఇగారావే నా సవతి “ అని మాణిక్యం గొంతు విప్పింది, నడి రాత్రి దాక తిట్లు, శాపనార్దాలు, కుక్క అరుపులు రైళ్ళ రాక పోకల మధ్య జనానికి విన్పిస్తూనే ఉన్నాయి.

కుక్క రాత్రంతా వీధిల ‘ గుర్రు…’ మనుకుంటూ పహారా కాస్తూనే వుంది.
ఇద్దరికీ రాత్రంతా నిద్రలేదు.
---------------------------------------------------------
రచన - హనీఫ్, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment