Monday, January 8, 2018

ఇలాటి దూత ఉన్నాడా?


ఇలాటి దూత ఉన్నాడా?



సాహితీమిత్రులారా!


నిషధదేశాధీశుడైన నలుడు దమయంతి స్వయంవరం
వెళుతున్న సమయంలో అతనికి ఇంద్రుడు, వరుణుడు,
అగ్ని, యముడు కనిపించి వారి పనుపున దమయంతి
వద్దకు దూతగా పంపారు. ఇంద్రవరుణాగ్నియములలో
ఒకరిని చేసుకునే విధంగా దమయంతిని ఒప్పించటానికి.
నలుడు మొదట మాటఇవ్వడంతో చిక్కుపడ్డాడు. చివరకు
వారి మాయాశక్తితో దమయంతి వద్గకు వెళ్ళి అక్కడ నలుని
దౌత్యం ఇక్కడ చర్చాంశం-

నలుని చెప్పినదంతా విన్న దమయంతి-
ఏనేడ నింద్రాదులేడ వారలకు
నెప్పుడు మ్రొక్కుదు నేను నీ ధనమ
భూనాథ నీగుణంబులు హంసచేతఁ
బొలుపుగా విని మనంబున నిల్పియున్న
దాన భవన్నిమిత్తమున నిట్లఖిల
ధారుణీనాథ సార్థంబు రావింపఁ
గా నిప్డు వలసె లోకఖ్యాత కీర్తి
కరుణించి పతిబుద్ధి గావింపుమిందు

(నే నెక్కడ దిక్పలకులెక్కడ వారికి నేనెపు మ్రొక్కుతుంటాను.
వారియందు భక్తి వుందికాని భర్తృభావం లేదు. నేను నీసొత్తే,
నీగుణాలు హంసవల్లవిని నిన్నే ప్రేమించాను. నిన్ను
రప్పించటానికే ఈ స్వయంవరం చాటించి రాజులందరిని
రప్పించాల్సివచ్చింది. కాబట్టి దూతభావం వదలి భర్తృభావం
వహించు.)

నన్ను పెళ్లిచేసుకోవటానికి ఒప్పుకోకపోతే నేను ఉరి పోసుకొనో,
విషంత్రాగో, నిప్పుల్లోదూకో, నీటిలోదుమికో ప్రాలుతీసుకుంటాను
అని అన్నది దమయంతి.
దానికి నలుడు-

భూరిసత్త్వులు సర్వలోక విభుల్ విభూతి సమృద్ధు లి
ద్ధోరుతేజులు నిన్నుఁగోరుచున్న వారమరోత్తముల్
వారి పాదరజంబుఁబోలని వాని నన్ను మనుష్యు సం
సారిఁగోరఁగఁ జన్నే నీకుఁ బ్రసన్నులై సురలుండఁగాన్

(దేవతలు చాల బలం వున్నవారు, అన్ని లోకాలేలేవారు,
అష్టసిద్ధులు కలవారు, నిరంతరం పెరిగే తేజస్సుకలవాళ్లు,
వారు నీయందు అనుగ్రహంతో వచ్చినారు. నేను వాళ్లకాలి
అంటిన దుమ్ముతో కూడ సరిపోను. మనుష్యుని, సంసారిని,
న్నుకోరుకుంటావేమి ఇది మంచిదికాదు.)

దేవతల కప్రియంబులు
గావించి మనుష్యులధమ గతులగుదు రిలం
గావున వారి కభీష్టము
గావింపుము నన్నుఁ బ్రీతిఁ గావుము తరుణీ!

(దేవతలకు ఇష్టం లేని పనులు చేసి మనుష్యులు నరకంలో
పడతారు. కాబట్టి వాళ్లకు ఇష్టమైంది చేసి నన్ను కాపాడు.)

నలుని మాటలకు దమయంతి కన్నీరు కారుస్తూ చాలసేపు
ఆలోచించి నలునితో - నీకు దోషం రాకుండా నాకు
ఒక ఉపాయం తట్టింది. ఆ దిక్పాలకులముందే నిన్ను వరిస్తాను.
అప్పుడు నీకే దోషం రాదుకదా అని చెప్పింది.

ఒక ప్రియుడు ప్రేయసి వద్దకు దూతగా వెళ్ళిన వారెవరైనా
ఉన్నారా?  ప్రేయసి ఇంత ఇదిగా ఒప్పించ ప్రయత్నిస్తాడా?
ఇలాంటి వాళ్లు ప్రపంచంలో నలుడొక్కడే ఉంటాడేమో కదా!

No comments:

Post a Comment