Saturday, January 6, 2018

నవ వధువు


నవ వధువు




సాహితీమిత్రులారా!



నేడు తెలుగు పద్యం దాదాపు మృతప్రాయమైందని
అనుకోవాల్యిన తరుణంలో శంకరాభరణం అనే పేరున
ఒక బ్లాగు నెలకొల్పి పద్యంకవిత్వంపై అనేక మందికి
మక్కువ కలిగించి సమస్యాపూరణం ద్వారా ఇప్పటికి
దాదాపు 3000లకు సమస్యాపూరణలు చేసిన చేయించిన
నవ పద్యకవితా భగీరథుడు కందిశంకరయ్యగారు
ఆయన వ్రాసిన తొలితరం పద్యంఖండిక "నవవధువు"
ఇది చూడండి-

కం.
నునుసిగ్గు దొంతరలు మో
మున దాగుడుమూత లాడ, ముత్తైదువ లె
త్తిన తలను వంచు నెపమున
మనమున నున్నట్టి భావమాలిక దాచెన్.

కం. 
ఎక్కడను లేని భావము
లొక్కుమ్మడి నాక్రమించెనో? యామె ముఖం
బొక్కొక్క రంగు మారుచు
చక్కఁగ నెఱుపెక్కె; సిగ్గె జయమును పొందెన్.

చం.
చెలులు ముదంబునన్ పరిహసింపగఁ గోపముఁ జూపు; వారితో
పలుకక మోముఁ ద్రిప్పుకొను; బంధువు లెందరొ వచ్చి చూడ, చూ
పుల నొకమారు వారియెడఁ బోవగనిచ్చి మరల్చు; పెండ్లిపీ
టల తలపోసినంతనె తటాలున నామె మనమ్ము భీతిలున్. 

సీ.
పెళ్ళిపందిరిలోన కళ్ళింతలుగఁ జేసి
          కొని బంధువుల్ దనన్ గనుగొనంగ
బ్రాహ్మణుండు చదువు పావనమంత్రమ్ము
          లలనల్ల శ్రుతిపేయమై చెలంగ
ఆహ్వానితులు సేయునట్టి ప్రశంసల
          నందుకొనంగ సిగ్గడ్డురాగ
అప్పుడప్పుడు వరుం డప్పగించెడి దొంగ
          చూపులం జూడగా నోపలేక
తే.గీ.
భయము నయమును బిడియముల్ పల్లవించి
పూచి సుఖదుఃఖభావముల్ పొందఁజేయ
నెటులొ యన్నింటి దిగమ్రింగి యింతొ యంతొ
యందఱకు మోదమును గూర్చె సుందరాంగి. 

కం.
తలిదండ్రుల నెడబాసెడి
కలకంఠికి కంటినుండి కన్నీ రొలికెన్
చెలులను విడనొల్లకఁ దా
విలపించెను నవవధువు సభీతిన్ ప్రీతిన్. 

ఆయన తెలుగుసాహితీ చరిత్రలో
ఒక ధృవతారగా వెలుగొందాలని
వెలుగొందుతారని నా భావన
- ఏ.వి.రమణరాజు

No comments:

Post a Comment