Saturday, January 27, 2018

తనుయాత్ర అంటే?


తనుయాత్ర అంటే?




సాహితీమిత్రులారా!




తనుయాత్ర అంటే ఈ పద్యం గమనించండి-

లలన మృదుబాహు యుగబిసలతలు గడఁగి
బిసలతా శ్రీలనెల్లను వెసహరించె
మఱి హరింపంగ నవి నెఱివిఱిగికాదె
సారెఁ దనుయాత్రఁ దంతుల జరుగుచుండు
                                                                                                  (5-19)

తనుయాత్రన్ - దేహయాత్రను, (శరీరపోషణము ననుట)
తంతువుల - నులుపోగుల చేతను, జరుపుచుండున్ -
కడపుచుండును, ఆమెయొక్క కోమలమైన బాహువులనెడి 
తామరతూడులు చెలరేగి యెల్ల తూడుల కాంతిసంపదల
అపహరింపగా అవి గుంపుచెదరి మరియొకవిధముగా 
బ్రతుకజాలక నూలిపోగులు వడికికొని శరీరయాత్ర
గడుపు ననియును, తామరతూడులు విరిగెనేని 
వానిలో నూలిపోగులుండుననియు భావము
(వావిళ్ళవారి వ్యాఖ్య)

తనుయాత్రన్ - దేహధారణము, 
తంతులన్ - నూలు వడుకుటచేత
(సన్నిపోగులను ధరించి)
జరుపుచుండున్ - ఆమెబాహువులు తామరతూండ్ల సిరిని హరించినవి,
ఆ కారణమున తామరతూండ్లు నూలువడుకుకొని జీవించుచున్నవి
అదే వానిని విరిచినచో సన్నిదారములు వచ్చుట
                          (వేదమువారి వ్యాఖ్య)
తంతువులతో తనుయాత్ర జరుపుట - నూలుపోగులు వడికికొని 
శరీరయాత్ర గడపుట - అనే వావిళ్ళ అర్థమునే మాటలు మార్చి 
వేదమువారు అనువదించారు.

తంతువులతో తనుయాత్ర జరుపుట - అనగా తంతువులే ఆహారముగా
కాలము గడపుటగాని, నూలు వడికి - అమ్ముకొని దానిమూలమున
జీవించుట కాదు.
గాంధీ వేరుసెనగ పప్పులతో శరీరయాత్ర జరిపెడివాడు - అంటే 
వేరుసెనగ పప్పులను అమ్ముకొని తన్నమూలమున జీవించెడివాడని
అర్థముకాదు. ఆ పప్పులను తిని శరీరము నిల్పుకొనెడివాడని అర్థము.
అట్లే ప్రకృతమునను.
మరియు తామరతూండ్లు నూలువడికొని జీవించినవి అయినందు వల్లనే
వానిని విఱిచినచో  సన్నపాటి దారములు వచ్చుట అని ఆంధ్రమల్లినాథులు 
వ్రాయుట మిక్కిలి వింత. నూలును తినెడివారి కడుపులో నూలు ఉండవచ్చుకాని 
నూలు వడికి అమ్మెడివారి కడుపులో నూలెట్లుండును.

సరే ఇందంతా ఎందుకు

దేహయాత్ర, శరీరయాత్ర - అనే పదాలకు భుజించిట అని అర్థం.
దీనికి క్రింది గ్రంథాలు ప్రమాణాలు-
1. దేహయాత్ర - మెసవుట, భుజించుట(శబ్దార్థ కల్పతరువు)
2. దేహయాత్ర - nourishment, food (ఆప్టే)
3. దేహయాత్ర - తిండి (శబ్దరత్నాకరము)
4. యాత్రాస్యాద్యాపనేగతౌ (అమరము) యాత్రాశబ్దము భోజనము మొదలైన వర్తమానములకును, గమనమునకును - పేరు 
ఉదా- శరీరయాత్రా, ప్రాణయాత్రా(గురుబాలబోధిక) 
5. శృంగారనైషధము(హంసవాక్యము)
   ఫలకుసుమ మూలమాత్రంబున శరీరయాత్ర నడపుచు
   మునులుం బోలె -- ఉన్నవారము(1-108)
6. గీ. పుష్ప ఫల పత్ర జల మాత్రముల శరీర
      యాత్ర గడపుచు సన్మార్గమధిగమించి
      యెసఁగు నివియెల్ల నీకేల యెగ్గొనర్చు
                 (వసుచరిత్ర - 3-128)
7. నీతిచంద్రిక -(మిత్రభేదమున కొంగ వాక్యము)
   జలశైవాదులతో దేహధారణంబు చేయుచు ముముక్షత్వంబు 
   బూని మునివృత్తి నున్నవాడను.

(దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి సాహిత్య సమీక్ష నుండి)


No comments:

Post a Comment