Monday, February 20, 2017

కేళీచిహ్నములు కొన్ని బయలుపడకుండ


కేళీచిహ్నములు కొన్ని బయలుపడకుండ




సాహితీమిత్రులారా!



షట్చక్రవర్తి చరిత్రలోని ఈ పద్యం చూడండి-
మొదటిరేయి గడిచాక నాయికలో
కనబడుతున్న శృంగా చిహ్నాలను
వ్యంగ్యంగా చెలులు చెప్పడాన్ని
వర్ణించే పద్యం ఇది-

అర్థచంద్రునిమీఁద నమరి యున్నవితేఁటు
           లలివేణి యది విస్మయంబు గాదె
యఱమోడ్చి వాడిన వంబుజంబులు పగ
           లంగన యిదియె చోద్యంబు గాదె
బింబంబుపైఁగెంపు డంబుగా నుదయించెఁ
           దరుణిరోయిది విచిత్రంబుగాదె
కరికుంభములమీఁద గనుపట్టె నెలవంక
           తరలాక్షి యిది యద్భుతంబుగాదె
యనుచుఁజెలువలలోఁబ్రోడయైనయట్టి
భామ కనుగీటి తనతోటి పడఁతితోడ
నాయికను జూపి కేళిచిహ్నములు కొన్ని
బయలుపడకుండ ధ్వనియొప్పఁబలికె నపుడు
                                                              (షట్చక్రవర్తిచరిత్రము -5-156)


తుమ్మెదలవంటి జుట్టుకలదానా
తుమ్మెదలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి
అర్థచంద్రునిపై తుమ్మెదలు(తేటులు)
ఏర్పాటయి ఉన్నాయి ఇది వింతకాదా!

(చంద్రుడు ఆకాశంలో ఉంటాడు.
తుమ్మెదలు నేలపై ఉంటాయి.
చంద్రునిలో తుమ్మెదలుండడటం వింత-
అర్థ చంద్రుడు అంటే యువతి నుదురు.
తుమ్మెదలు అంటే ముంగురులు. జుట్టు
చిందరవందరై నుదురు మీద పడుతోంది
అని అర్థం.)


యువతీ పట్టపగలు - పద్మాలు
సగము ముడుచుకొని(అఱమోడ్చి)
వాడి ఉన్నాయి. ఇది వింత(చోద్యం) కాదా
(పద్మాలు పగలు వికసిస్తాయి.
అవి సగం ముడుచుకొని ఉండటం
వాడి ఉండటం వింతకాదా
ఇక్కడ పద్మాలు అంటే పద్మముల
వంటి యువతి కన్నులు.
రాత్రంతా మెలకువతో ఉండటం చేత
వాడి ఉన్నాయని భావం)


యువతీ దొండపండుమీద ఎరుపురంగు చాల
ఎక్కవగా(డంబుగాన్) కలిగింది ఇదివింతకాదా

(దొండపండుమీద ఉండవలసిన దానికంటె
ఎక్కువ ఎరుపు ఉంటే అది వింతేకదా
దొండపండు అంటే దొండపండులాంటి
పెదవి ప్రియుడు కొరకడంచేత రక్తం చిమ్మి
మరింత ఎర్రగా కనబడుతోంది.)

చంచలమైన కన్నులుగలదానా
ఏనుగు కంభస్థలాలపైన చంద్రవంక(నెల)
 కన్పడుతున్నది ఇది వింతకాదా -

(ఏనుగు కుంభస్థలాలపైన చంద్రరేఖ కన్పడటం విత.
ఏనుగు కుంభస్థలం అంటే యువతి వక్షోజాలు.
వాటిపై నెలవంక అంటే ప్రియుని గోళ్ళగుర్తులు)

 అంటూ చెలికత్తెలలో కాస్త ఆరితేరిన(ప్రోడ)
భామ ఒకతె కనుగీటి తన తోడి యువతితో
నాయికనుచూపి కొన్ని క్రీడాచిహ్నాలను
బయటపడకుండా వ్యంగ్యంగా
(ధ్వనియొప్పన్) అన్నది.

No comments:

Post a Comment