Sunday, February 12, 2017

నీయభిషేకమునకు నీ రబ్బు టెట్లు?


నీయభిషేకమునకు నీ రబ్బు టెట్లు?




సాహితీమిత్రులారా!



కర్నూలు మండలం ముడివేముల వాస్తవ్యుడు
ఉప్పల సింహాద్రినరసింహకవి చెప్పిన చాటువులు-

ఒకమారు పెద్ద కఱవు సంభవించగా కాకర్ల గ్రామంలోని
రామలింగేశ్వరస్వామిపై చెప్పినవాటిలో
ఒక పద్యం ఇక్కడ-

భువి నదీనదములు ప్రవహింపకున్న నీ
            యభిషేకమునకు నీ రబ్బు టెట్లు?
చెఱువుకుంటలు నిండి వరి పండకున్న నీ
            సతతపూజా తిలాక్షతల కెట్లు?
పాదపంబులు లతల్ భాసిల్లకున్న నీ
            పూజనవిధికిని పూవులెట్లు?
పశువులు శుష్కించి పాలుపిండక యున్న
            నీ దీపంబున కెట్టు నేతిబొట్టు?
తెలిసి తెలిసియు నపకీర్తి దెచ్చుకొంటి
వింత పనిచేట నీపోఁటి కింకనైన
వాన కురిపించి రక్షించు మానవులను
రమ్యధవళాంగ! కాకర్ల రామలింగ!

దీనిలో కవిగారు ఎంత చమత్కారంగా శివుని ప్రార్థించారు

భూమిమీద నదీనదాలు ప్రవహిస్తేనేకదా శివునికి అభిషేకము.
చెరువులుకుంటలు నిండి వరిపండకపోతే శివపూజకు లేవట
అక్షతలు. చెట్లు తీగలు లేకుంటే శివపూజకు పూలేలేవు.
పశువులు చిక్కిపోయి పాలు ఇవ్వకపోతే దీపానికి నెయ్యి ఎక్కడ
కాబట్టి ఓ రామలింగేశ్వరా నీకు అంతా తెలుసు తెలిసితెలిసి
చెడ్డపేరు తెచ్చుకుంటున్నావు ఇది నీవంటి వారికి తగదు
ఇకనైనా వానకురిపించవయ్యా
రమ్యమైన తెల్లని శరీరంగల ఓ కాకర్ల రామలింగా!
అని ప్రార్థిస్తున్నాడు కవి


No comments:

Post a Comment