Sunday, November 6, 2016

ఇందూ! నందుని మందనుండి


ఇందూ! నందుని మందనుండి



సాహితీమిత్రులారా!


పసుపులూరి సోమయాజకవి
ఇందూ! నందుని మందనుండి కద నీ వేతెంచుటల్ రాకలన్-
అనే మకుటంతో 116 పద్యాలు లలిత శృంగార సుందరంగా
రచించాడు. శార్దూలాల్లో ఇన్ని పద్యాలు ఇంతమృదుమధరంగా
రాయటం చాలా కష్టం. రసానుగుణమైన వృత్తాలు ఇవి. అందులో
శార్దూలం గంభీరమై వీరరౌద్ర రసాలకు పనికివస్తుందని
సంస్కృతాలంకారికులు చెబుతారు. మరి తెలుగు కవులు
ఈ నిబంధనను అంతగా పట్టించుకున్నట్లు కనిపించదు.
చంపకమాలలో భీషణత్వాన్ని శార్దూలంలో మార్దవాన్ని
సృష్టంచడం తెలుగువారి సొమ్మని పెద్దలు కొందరు చెబుతారు.
సుందరమైన ఈ శార్దూల పద్యం చూడండి-


బృందారణ్యము సేమమా అచటి గో బృందంబులున్ లెస్సలా
నందుండున్ సతియున్ సుఖాన్వితులె నానా గోపగోపాలికా
సందోహంబులతో హలాయుధుడు కృష్ణస్వామి క్రీడింతురా
ఇందూ! నందుని మందనుండి కద నీ వేతెంచుటల్ రాకలన్


తిరుపతి వేంకటేశ్వరుల ఉద్యోగ విజయాలలోని ఈ పద్యం-

బావా! ఎప్పుడు వచ్చతీవు? సుఖులే భ్రాతల్ సఖుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమము మై నెసంగుదురె నీ తేజంబు వెల్గించుచున్

వంటి పద్యాలకు సోమరాజు
మార్గదర్శకుడు అంటే అతిశయోక్తి
అత్యుక్తి కాదు

No comments:

Post a Comment