Tuesday, November 29, 2016

నీరు కొలది తామరసుమ్మీ!


నీరు కొలది తామరసుమ్మీ!




సాహితీమిత్రులారా!


ఎదుటివారు ఎంత గ్రహించగలరో అంతే
ఇవ్వటం పరిపాటి ఈ విషయాన్ని తెలిపే
పద్యం కళాపూర్ణోదయంలో కనబడుతుంది-
తుంబురునికి వైకుంఠంలో సంగీత ప్రదర్శన
అవకాశం కలిగినపుడు నారదుడు ఆశ్చర్యపోతాడు
తుంబురునికి అంత పరిజ్ఞానం ఉందాయని
ఆ సందర్భంలోని పద్యం ఇది-

తమ విద్య నెవ్వ రే మా
త్రము గనఁజాలుదురు వారి దండను దన్మా
త్రమ ప్రకటింతురు బుధు లు
త్తముల మహిమ నీరు కొలది తామరసుమ్మీ!

విద్యాసాగరులైన పండితోత్తములు ఎదుటివారు
ఎంత గ్రహించగలరో, అంత మాత్రమే తమ విద్యను
ప్రకటించటం కద్దు. ఆ ఉత్తముల
మహిమ నీరు కొలది తామర సుమ్మీ
 చెరువులో నీరు అధికమైనకొలది
తామర పెరుగట సహజం. పండితులును
ఎదుటివారి లోతు తెలిసి తమ విద్యను ప్రదర్శిస్తారు - అని భావం.

సామాన్య విషయాన్ని విశేషవిషయంతోగాని,
విశేష విషయాన్ని సామాన్యవిషయంతోగాని సమర్థిస్తే
అది  అర్థాంతరన్యాసాలంకారము అవుతుంది.

విద్యాసాగరులైన పండితోత్తములు ఎదుటివారు
ఎంత గ్రహించగలరో, అంత మాత్రమే తమ విద్యను
ప్రకటించటం కద్దు.(ఇది సామాన్య విషయం)
ఆ ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ
(ఇది విశేషవిషయం)
ఈ పద్యంలో జరిగింది కావున
ఇది అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణవుతుంది.

No comments:

Post a Comment